మోటారు వాహనాలు లేని ప్రపంచమా?
మోటారు వాహనాలు లేని ప్రపంచాన్ని మీరు ఊహించగలరా? లేక ప్రజల జీవిత విధానాన్ని, ప్రవర్తనను గత శతాబ్ద కాలంలో అంతగా మార్చివేసిన ఏదైనా ఆవిష్కరణను మీరు పేర్కొనగలరా? వాహనాలు లేకపోతే మోటెళ్లు ఉండవు, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్లు, డ్రైవ్-ఇన్ థియేటర్లు ఉండవు. మరి ప్రాముఖ్యంగా, బస్సులు, టాక్సీలు, కార్లు, లేక ట్రక్కులు లేకుండా మీరు పనికి ఎలా వెళ్తారు? బడికి ఎలా వెళ్తారు? రైతులు, తయారీదార్లు తమ సరుకులను బజారుకి ఎలా తీసుకెళ్తారు?
“అమెరికాలోని ఆరు వ్యాపారాలలో ఒకటి మోటారు వాహనాల తయారీ, పంపిణీ, సర్వీసింగ్, లేక వాటిని ఉపయోగించడంపై ఆధారపడుతుంది” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా అంటోంది. అదింకనూ ఇలా చెబుతుంది: “ఆటోమోటివ్ వ్యాపార సంస్థల అమ్మకాలు, రశీదులు దేశపు టోకు వ్యాపారంలో ఐదవ వంతుకు, చిల్లర వర్తకంలో నాలుగవ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇతర దేశాలకు ఈ అనురూప సామ్యం కొంత తక్కువే కానీ జపాన్, పశ్చిమ యూరప్‌లోని దేశాలు అమెరికా స్థాయిని త్వరితగతిన చేరుకుంటున్నాయి.”
అయినా, మోటారు వాహనాలు లేని ప్రపంచం ఒక శ్రేష్ఠమైన స్థలంగా ఉంటుందని కొంతమంది అంటారు. ఇలా వారు మౌలికంగా రెండు కారణాలవల్ల అంటారు.
ప్రపంచవ్యాప్త గ్రిడ్‌లాక్
వాహనాలు నిలిపే ప్రదేశం కొరకు మీరొకవేళ అంతూపొంతూ లేకుండా వీధులన్నీ తిరిగినట్లయితే, కార్లుండడం మంచిదే గానీ కిక్కిరిసిన ప్రదేశంలో అనేక కార్లు ఉండడం మంచిది కాదని మీకెవరూ చెప్పనక్కర్లేదు. మీరు భయంకరమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే, కదలడానికి రూపొందించబడిన వాహనం కదలకుండా నిర్బంధించబడడం ఎంత ఆశాభంగమో మీకు తెలుసే ఉంటుంది.
1950లో ప్రతి నలుగురికి ఒక కారున్న దేశం అమెరికా ఒక్కటే. 1974 కల్లా బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలు ఆ స్థాయిని అందుకున్నాయి. కానీ అప్పటికే అమెరికాలో దాదాపు ప్రతి ఇద్దరికి ఒక కారు వచ్చేసింది. ఇప్పుడు జర్మనీ, లక్సెంబర్గ్‌లలో ప్రతి ఇద్దరు నివాసులకు ఒక మోటారు వాహనం ఉంది. బెల్జియం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్ ఆ స్థాయికి ఎంతో దూరంలో లేవు.
అనేకమైన పెద్ద నగరాలు—ప్రపంచంలో అవెక్కడున్నా గాని—భారీ పార్కింగ్ స్థలాలుగా అధోగతి పడుతున్నాయి. ఉదాహరణకు, ఇండియాలో 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దాని రాజధాని న్యూ ఢిల్లీలో 11,000 కార్లు, ట్రక్కులు ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంది. 1993 కల్లా ఆ సంఖ్య 22,00,000కి చేరుకుంది! అది ఆకాశాన్నంటే పెరుగుదలే—కానీ టైమ్ పత్రిక ప్రకారం “ఆ సంఖ్య ఈ శతాబ్దాంతానికి రెట్టింపు అవుతుందని నిరీక్షించబడుతుంది.”
ఈలోగా పశ్చిమ యూరప్‌లో తలసరి వాహనాలలో నాలుగవ వంతు మాత్రమే తూర్పు యూరప్‌లో ఉన్నప్పటికీ, దాదాపు 40 కోట్లమంది భావి కొనుగోలుదారులు ఉన్నారు. ఇప్పటివరకు 40 కోట్ల సైకిళ్లు ఉన్నాయని పేరుగాంచిన చైనాలో పరిస్థితి కొద్ది సంవత్సరాల్లోనే మారిపోతుంది. 1994లో నివేదించబడినట్లు, ఈ శతాబ్దాంతానికల్లా సంవత్సరానికి 13 లక్షల కార్ల నుండి 30 లక్షల కార్ల వరకు “వాహనాల ఉత్పత్తిలో శీఘ్రమైన పెరుగుదలకు ప్రభుత్వం ప్రణాళికలను వేస్తోంది.”
కాలుష్య భయం
“బ్రిటన్‌లో స్వచ్ఛమైన గాలి లేకుండాపోయింది” అని అక్టోబరు 28, 1994 నాటి ద డైలీ టెలిగ్రాఫ్ తెలియజేసింది. ఇది బహుశా అతిశయోక్తి అయ్యుండవచ్చు అయినా గాని చింతను కలుగజేయడానికి నిజానికిది చాలు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలోని ఆచార్యుడు స్టూవర్ట్ పెన్‌కెట్ ఇలా హెచ్చరించాడు: “మోటారు కార్లు మన సహజ వాతావరణం యొక్క రసాయనిక మిశ్రమాన్ని మార్చి వేస్తున్నాయి.”
గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు (ఆంగ్లం) అనే పుస్తకం, గాఢ కార్బన్ మోనాక్సైడ్ అధికంగావున్న కాలుష్యం “శరీరానికి ప్రాణవాయువు అందకుండా చేస్తుంది, గ్రహణ శక్తిని బలహీనపరుస్తుంది, ప్రతిక్రియలను మందం చేస్తుంది, మగతను కలుగజేస్తుంది” అని అంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, “యూరప్ మరియు ఉత్తర అమెరికాల్లోని దాదాపు సగం మంది నగరవాసులు అంగీకారయోగ్యంకాని ఎక్కువ మోతాదుల్లో కార్బన్ మోనాక్సైడ్ బారినపడుతున్నారు” అని అంటుంది.
కొన్ని ప్రాంతాలలో, వాహనాల నుండి వెలువడే కారకాలు ప్రతిసంవత్సరం వందల కోట్ల డాలర్ల పర్యావరణ నష్టాన్ని కలుగజేస్తూ, అనేకమంది ప్రజలు చనిపోవడానికి కారణమౌతున్నాయి అని అంచనా వేయబడింది. 1995, జూలైలో ఒక టెలివిజన్ వార్తా నివేదిక, కార్ల నుండి వెలువడిన కాలుష్యంవల్ల దాదాపు 11,000 మంది బ్రిటన్ దేశీయులు ప్రతి సంవత్సరం చనిపోతున్నారని చెప్పింది.
1995లో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు బెర్లిన్‌లో జరిగింది. 116 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఏదో ఒకటి చేయవలసిన అవసరత ఉందని అంగీకరించారు. కానీ అనేకమందికి నిరాశను కలిగిస్తూ, ప్రత్యేక లక్ష్యాలను అవలంబించి, నిర్దిష్ట నియమాలను స్థాపించాలనే లేక కచ్చితమైన కార్యక్రమాలను రూపొందించాలనే కార్యభారాన్ని వారు వాయిదా వేశారు.
వెనుకటికి 1990లో గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు అనే పుస్తకం చెప్పినదాని వెలుగులో, అభివృద్ధిలో ఈ లోపం ఉండే సాధ్యత ఎదురుచూడబడుతుంది. “పర్యావరణ నాశనాన్ని ఎదుర్కోవడానికైన ఉపాయాలు, ఆర్థిక వ్యవస్థ కార్యాల్లో జోక్యం చేసుకోకపోతే మాత్రమే అంగీకారయోగ్యమైనవి అని ఆధునిక పారిశ్రామిక సమాజంలోని రాజకీయ, ఆర్థిక శక్తుల స్వభావం నిర్ధారిస్తుంది” అని అది చూపుతుంది.
అందువలన, టైమ్ ఇటీవల “బొగ్గుపులుసు వాయువు, మరితర హరితగృహ వాయువులు వాతావరణంలో ఏర్పడడం క్రమేణ గ్రహాన్ని వేడెక్కించే సాధ్యతను” గురించి హెచ్చరించింది. “అనేకమంది శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారంగా, ఫలితమేమంటే అనావృష్టి, కరుగుతున్న ఐస్ క్యాప్‌లు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, తీరప్రాంతాలు ముంపుకు గురవ్వడం, గొప్ప తుపానులు మరితర వాతావరణ విపత్తులై ఉండవచ్చు.”
కాలుష్య సమస్య తీవ్రత ఏదో ఒకటి చేయబడాలని కోరుతుంది. కానీ ఏమి చెయ్యాలి?