కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 7/8 పేజీలు 5-8
  • అంగీకారయోగ్యమైన పరిష్కారాల అన్వేషణలో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంగీకారయోగ్యమైన పరిష్కారాల అన్వేషణలో
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాలుష్యాలపై కోతవేయడం
  • నెమ్మదిగా వెళ్లడం
  • సైకిళ్లను వాడడం
  • రీడిజైన్‌ చేయడం
  • సమస్యలో ఒక భాగం మాత్రమే
  • ఆదర్శవంతమైన పరిష్కారాన్ని కనుగొనడం
    తేజరిల్లు!—1996
  • మోటారు వాహనాలు లేని ప్రపంచమా?
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 7/8 పేజీలు 5-8

అంగీకారయోగ్యమైన పరిష్కారాల అన్వేషణలో

కాలుష్యాన్ని మోటారు వాహనాలు మాత్రమే సృష్టించడం లేదు. గృహాలు, పారిశ్రామిక కర్మాగారాలు, విద్యుత్‌ కేంద్రాలు కూడా బాధ్యతను వహించాలి. అయినా, భౌగోళిక కాలుష్యాన్ని సృష్టించడంలో మోటారు వాహనాలు వహిస్తున్న పాత్ర గణనీయమైనదే.

నిజానికి, గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు అనే పుస్తకం ఇలా చెప్పడానికి సాహసిస్తుంది: “ఒకవేళ ఈ ఖరీదులన్నీ లెక్కవేస్తే—ప్రత్యేకంగా బొగ్గుపులుసు వాయువు వెలువడడంవల్ల మన వాతావరణం చెల్లించే మూల్యం లెక్కవేస్తే—అప్పుడు కార్లు బహుశ ఎప్పటికీ నిర్మించబడేవి కావు.” అయినా, అదిలా సమ్మతిస్తుంది: “అది కారు తయారీదార్లు గాని, రోడ్డు పరిశ్రమ గాని, ప్రభుత్వ ఏజెన్సీలు గాని, నిజానికి ప్రైవేటు రవాణాపై ఎంతో ఎక్కువగా ఆధారపడే సామాన్య ప్రజానీకం గాని ఆలోచించడానికి ఇష్టపడని విషయం.”

మానవున్ని చంద్రునిపైబెట్టిన సాంకేతిక పరిజ్ఞానం కాలుష్యరహిత కారును ఉత్పత్తి చేయకూడదా? చేయడం చెప్పడం అంత సులభమైనదేం కాదు, అందుకని కాలుష్యరహిత కారును అభివృద్ధి చేయడానికి ఉండే ఆటంకాలను అధిగమించే వరకు, అంగీకారయోగ్యమైన ఇతర పరిష్కారాల కొరకైన అన్వేషణ కొనసాగుతుంది.

కాలుష్యాలపై కోతవేయడం

1960లలో కాలుష్యాలు వెదజల్లడాన్ని నిర్బంధించడానికి మోటారు వాహనాలపై నియంత్రణలను స్థాపించడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా ఒక చట్టాన్ని ఆమోదించింది. అప్పటి నుండి ఇతర దేశాలు, ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయి.

హానికరమైన కాలుష్యాలను వడగట్టడానికి సీసంలేని పెట్రోలును ఉపయోగించడానికి అవసరమయ్యే ఉత్ప్రేరక పరివర్తనాలను ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్నారు. 1976, 1980ల మధ్య కాలంలో పెద్ద మొత్తంలో వాహన చోదకులు సీసంలేని పెట్రోలును ఉపయోగించడం ప్రారంభించిన తరువాత, అమెరికన్ల రక్తంలో సీసం మోతాదులో మూడవ వంతు తగ్గిపోయింది. అలా తగ్గిపోవడం మంచిదైంది ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఉన్న సీసం మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి, నేర్చుకునే మన సామర్థ్యాన్ని ఆటంకపరుస్తుంది. అయితే విచారకరంగా, అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో సీసం మోతాదుల్లో తగ్గుదల సంభవించగా, అంతగా అభివృద్ధి చెందని దేశాల విషయంలో అలా చెప్పలేము.

ఉత్ప్రేరక పరివర్తనాల విజయం సంతృప్తికరంగా ఉంది, కానీ వాటి ఉపయోగం వివాదాంశంగానే ఉంది. సీసం ఇక చేర్చకపోవడం ఫలితంగా పనితనం తగ్గినందువలన, పెట్రోలుయొక్క హైడ్రోకార్బన్‌ మిశ్రమాన్ని మార్చివేశారు. ఇది బెంజీన్‌, టోలిన్‌ వంటి ఇతర క్యాన్సర్‌ కారక పదార్థాలు వెలువడడంలో పెరుగుదలకు దారి తీసింది, ఇవి వెలువడే మోతాదుల్ని ఉత్ప్రేరక పరివర్తనాలు తగ్గించలేవు.

అంతేగాక, ఉత్ప్రేరక పరివర్తనాలకు ప్లాటినమ్‌ అవసరమౌతుంది. బ్రిటన్‌లో ఇంపీరియల్‌ కాలేజ్‌లో ఆచార్యుడైన ఇయాన్‌ థార్న్‌టన్‌ ప్రకారం, రోడ్డు ప్రక్కన దుమ్ములో పేరుకుపోయిన ప్లాటినమ్‌లో పెరుగుదల, వాటి సైడ్‌ ఎఫెక్టులలో ఒకటి. “ప్లాటినమ్‌ యొక్క ద్రావ్యతనొందే గుణంగల రకాలు ఆహారపు గొలుసులోకి ప్రవేశించే” సాధ్యత గురించి ఆయన హెచ్చరించాడు.

“ఉత్తర అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా మరికొన్ని యూరోపియన్‌ దేశాలలో ఉత్ప్రేరక పరివర్తకాలు” విజయం సాధించినప్పటికీ, “ప్రపంచవ్యాప్తంగా కార్ల సంఖ్యలలో గణనీయమైన పెరుగుదల గాలి స్వభావానికి గల ప్రయోజనాలను తుడిచిపెట్టేసింది” అని గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు అనే పుస్తకం వాస్తవికంగా అంగీకరిస్తుంది.

నెమ్మదిగా వెళ్లడం

కార్లు కాలుష్యాలను వెదజల్లడాన్ని తగ్గించడానికి మరో మార్గం నెమ్మదిగా నడపడం. కానీ అమెరికాలో, ఈమధ్యే కొన్ని రాష్ట్రాలు వేగ పరిమితిని పెంచాయి. జర్మనీలో ప్రతిబంధకాలు విధించడం అంతగా ప్రజామోదం పొందదు. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ క్రూయిజింగ్‌ వేగాలను సులభంగా అనుమతించే శక్తివంతమైన మోటార్లు నిర్మించగలగడమే అధిక అమ్మకపు అంశంగాగల కారు తయారీదార్లు దీనిని వ్యతిరేకిస్తున్నట్లే, చాలామంది డ్రైవర్లు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే, కేవలం పర్యావరణ కారణాలనుబట్టే గాక సురక్షత రీత్యా కూడా ఇప్పుడు ఎక్కువ మంది జర్మన్లు వేగ ప్రతిబంధకాలను ఇష్టపడుతున్నారు.

కొన్ని దేశాలలో కాలుష్యం అనంగీకృత మోతాదులకు చేరుకుంటే డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని—లేదా బహుశ నడపడమే పూర్తిగా ఆపివేయమని కూడా కోరబడతారు. 1995లో జరిపిన ఒక పోల్‌లో 80 శాతంమంది జర్మన్లు ఒకవేళ ఓజోను స్థాయి మరీ ఎక్కువైతే వేగ పరిమితులు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తారని బయల్పరచింది. ఏథెన్స్‌, రోమ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో డ్రైవింగ్‌ చేయడంపై ఆంక్షలను విధించడానికి ఇప్పటికే చర్యలు గైకొన్నాయి. ఇతర నగరాలు అదే చేయడాన్ని గూర్చి ఆలోచిస్తున్నాయి.

సైకిళ్లను వాడడం

ట్రాఫిక్‌ను తగ్గించడానికి, కొన్ని నగరాలు బస్సు ప్రయాణానికి కొన్ని ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టాయి. ఇతర నగరాలు, తమ కార్లను అందుబాటులో ఉన్న పార్కింగ్‌ స్థలాల్లో పార్కు చేసుకోవడానికి నామకార్థ రుసుమును చెల్లించే డ్రైవర్లకు ఉచిత బస్సు రవాణాను అందిస్తున్నాయి. ఇతర నగరాలు కేవలం బస్సులకు, టాక్సీలకే లేన్లను ప్రత్యేకించాయి.

ఈ సమస్యని ఎదుర్కోవడానికి ఒక వినూత్న పద్ధతి ద యూరోపియన్‌లో చెప్పబడింది: “1960ల మలిభాగంలో నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ప్రచారం ద్వారా పురికొల్పబడిన కుశాగ్రబుద్ధిగల డేన్స్‌వారు, నాలుగు చక్రాల వాహనాలకు బదులు ద్విచక్ర వాహనాలను వాడమని ప్రజలకు నచ్చజెప్పడం ద్వారా వాయు కాలుష్యాన్ని, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు.” కోపెన్‌హాగెన్‌ వీధుల్లో అంతటా వివిధ ప్రదేశాల్లో సైకిళ్లు ఉంచారు. ఒక యంత్రంలోకి ఓ నాణేన్ని వేస్తే, వాడడానికి ఒక సైకిలు బయటకు వస్తుంది. వీలైన ప్రదేశంలో మరలా సైకిలును ఇవ్వడం ద్వారా డిపాజిట్టును తిరిగి పొందవచ్చు. ఈ పథకం ఆచరణయోగ్యంగా ఉంటుందో లేదో, పనిచేస్తుందో లేదో అన్నది సమయమే చెబుతుంది.

కార్ల స్థానంలో సైకిళ్లను వాడడాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని జర్మన్‌ పట్టణాలు ఒన్‌-వే వీధుల్లో అంటే వెళ్లకూడని రహదారిలో కూడా ప్రయాణించడానికి అనుమతిస్తున్నాయి! నగరంలో దాదాపు మూడవ వంతు ప్రయాణాలు, గ్రామాలలో మూడవ వంతు కంటే ఎక్కువ ప్రయాణాలు మూడు కిలోమీటర్ల కన్నా తక్కువ దూరమే ఉంటాయి గనుక అనేక మంది పౌరులు వీటిలో అనేక ప్రయాణాల్ని నడచి గాని, సైకిలుపై గాని సులభంగా చేయగలరు. ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి సహాయపడగలదు; అదే సమయంలో సైకిలు త్రొక్కేవారికి కావాల్సినంత వ్యాయామం దొరుకుతుంది.

రీడిజైన్‌ చేయడం

కాలుష్యరహిత వాహనాల రూపకల్పనపై పని కొనసాగుతుంది. బ్యాటరీలపై నడిచే విద్యుత్‌ కార్లు ఉత్పత్తి చేయబడ్డాయి, కానీ అవి వేగము, పనిచేసే కాలం విషయాలలో పరిమితమై ఉన్నాయి. సౌరశక్తి కార్ల విషయంలో కూడా అదే నిజం.

పరిశోధించబడుతున్న మరొక సాధ్యత ఏమిటంటే ఇంధనముగా హైడ్రోజన్‌ను ఉపయోగించడము. హైడ్రోజను దాదాపు ఏమాత్రం కాలుష్యాలను వెదజల్లకుండా మండుతుంది, కానీ దాని ఖరీదు భరించడం కష్టం.

ఆటోమోబైల్‌ను మరలా కనుగొనవలసిన అవసరతను గ్రహిస్తూ అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ ప్రభుత్వమూ అమెరికా ఆటో పరిశ్రమ భవిష్యత్తు కొరకైన కారును రూపొందించడంలో సహకరిస్తాయని 1993లో ప్రకటించాడు. “మన దేశం ఎన్నడూ చేపట్టనటువంటి సాంకేతిక సాహసకార్యాన్ని మేము చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాము” అని ఆయన చెప్పాడు. ఆయన తెల్పిన “సంపూర్ణంగా సమర్థత కలిగి, ఆవరణ పరంగా స్నేహపూర్వకంగా ఉండే వాహనాన్ని 21వ శతాబ్దం కొరకు సృష్టించడం” సాధ్యమౌతుందా లేదాయన్నది వేచిచూడవలసిందే. ఒక దశాబ్దానికల్లా ఒక నమూనాను సిద్ధం చేయాలని పథకాలు వేస్తున్నారు—కానీ ఎంతో ఖరీదుతో కూడినదే.

కొంతమంది కారు తయారీదార్లు పెట్రోలు, విద్యుత్తుల సమ్మేళనంతో నడిచే మోడల్స్‌పై పనిచేస్తున్నారు. ఇప్పటికే జర్మనీలో దొరుకుతున్న ఖరీదైన విద్యుత్‌ స్పోర్ట్స్‌ కారు తొమ్మిది క్షణాల్లో నిలబడివున్న ప్రదేశంలో నుండి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని, అది వెళ్తుండగా గంటకు 180 కిలోమీటర్ల వేగానికి చేరుకోగలదు. కానీ 200 వందల కిలోమీటర్ల తరువాత శబ్దాలు చేసుకుంటూ ఆగిపోతుంది, కనీసం మూడు గంటలపాటు రీచార్జ్‌ చేసిన తర్వాత గాని మరలా కదలదు. పరిశోధన కొనసాగుతుంది, మరి ముందు ముందు ప్రగతి సాధించబడుతుందని అపేక్షించబడుతుంది.

సమస్యలో ఒక భాగం మాత్రమే

వెదజల్లబడిన విషయుక్త పదార్థాలను వదిలించుకోవడమెలా అన్నది సమస్యలో ఒక భాగం మాత్రమే. కార్లు శబ్ద కాలుష్యాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి, అది కిక్కిరిసిన రోడ్డు దగ్గర నివసించే వారికి ఎవరికైనా చాలా బాగా తెలుసు. ఎప్పుడూ ఉండే ట్రాఫిక్‌ శబ్దం ఆరోగ్యాన్ని గంభీరంగా ప్రభావితం చేయగలదు గనుక, పరిష్కరించాల్సిన అవసరమున్న సమస్యలో ఇది కూడా ప్రాథమిక భాగమే.

ప్రకృతి ప్రేమికులు కూడా మైళ్ల పొడవుండే అసహ్యకరమైన రహదారులు, వాటినానుకుని ఉండే కన్నులకు ఇంపుగా ఉండని వ్యాపార ప్రదేశాలతోపాటు, వ్యాపార ప్రకటన బోర్డుల వలన అనేక గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యం పాడౌతుందని ఎత్తిచూపుతారు. కానీ కార్ల సంఖ్య పెరుగుతూ ఉండగా, మరిన్ని ఎక్కువ రోడ్డుల అవసరం కూడా పెరుగుతుంది.

కొన్ని వాహనాలు, సంవత్సరాల తరబడి తమ యజమానుల సేవలో కాలుష్యాన్ని వెదజల్లిన తరువాత “మరణం తరువాత” కూడా అవి తమ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంటాయి. చూడ్డానికి అసహ్యంగావున్న విడిచిపెట్టబడిన కార్లు, కొన్ని ప్రదేశాలలో గ్రామీణ ప్రాంతాలలో అనుచితంగా కుప్పలు కుప్పలుగా పడవేయబడడాన్ని అరికట్టడానికి చట్టాన్ని చేయాల్సినంత సమస్యగా తయారయ్యాయి. రీసైకిల్‌ చేయడానికి సులభంగా ఉండే పదార్థాలతో చేయబడిన ఆదర్శవంతమైన వాహనం ఎప్పటికైనా నిర్మించబడుతుందా? అటువంటి వాహనం కనుచూపు మేరలో ఎక్కడా లేదు.

“అనేకమంది జర్మన్లు పర్యావరణం ఎడల గొప్పగా చింతిస్తున్నారు” అని ఇటీవలి వార్తాపత్రిక ఒకటి చెబుతూ, “కానీ చాలా కొద్దిమంది మాత్రమే తదనుగుణ్యంగా చర్య తీసుకుంటారు” అని జతచేస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి ఇలా చెప్పినట్లు చెప్పబడింది: “ఎవరూ కూడా తనను తాను అపరాధిగా భావించరు, మరి ఎవరూ కూడా బాధ్యత వహించడానికి ఇష్టపడరు.” అవును, “స్వార్థప్రియులు” “అతిద్వేషులు” అయిన ప్రజలు ఉన్న లోకంలో సమస్యలు పరిష్కరించడానికి చాలా కష్టంగా ఉంటుంది.—2 తిమోతి 3:1-3.

ఇంకా, అంగీకారయోగ్యమైన పరిష్కారలకొరకైన అన్వేషణ కొనసాగుతునే ఉంది. కాలుష్యానికి, వాహనానికి ఆదర్శవంతమైన పరిష్కారం ఎప్పుడైనా దొరుకుతుందా?

[7వ పేజీలోని చిత్రం]

మనం ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకోవడం, కారు ఉమ్మడి యాజమాన్యం, లేక సైకిలు త్రొక్కడం వంటి వాటి ద్వారా కాలుష్యాన్ని తగ్గించగలమా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి