ఆఫ్రికాలో ఎయిడ్స్—క్రైస్తవమత సామ్రాజ్యం ఎంతమేరకు బాధ్యురాలు?
ఆఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఈ ఆర్టికిల్లో ఉపయోగించబడినట్లు, “క్రైస్తవమత సామ్రాజ్యము” అనే మాట బైబిలులోని క్రైస్తవత్వానికి విరుద్ధమైన నామమాత్రపు క్రైస్తవత్వాన్ని సూచిస్తుంది.
క్రైస్తవమత సామ్రాజ్యం
“ప్రపంచంలో తమది క్రైస్తవ విశ్వాసమని చెప్పుకునే చాలామంది నివసించే భూభాగం.”—వెబ్స్టర్స్ న్యూ వర్ల్డ్ డిక్షనరీ.
ఎయిడ్స్
“ప్రతిరోధ వ్యవస్థ కణాలకు రెట్రోవైరసులు సోకడం వల్ల తెచ్చిపెట్టుకున్న ప్రతిరోధక శక్తిలోపం గల స్థితి.”—వెబ్స్టర్స్ న్యూ నైన్త్ న్యూ కొలీజియట్ డిక్షనరీ.
ఎయిడ్స్ అనేది భూగోళవ్యాప్త మహామారి. దాదాపు 1.7 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికే ఎయిడ్స్ కారకమైన హెచ్.ఐ.వి. వైరసు సోకింది. మరి అది అతి వేగంగా వ్యాపిస్తోంది.
ఈ మహామారికి సంబంధించిన వైద్య, రాజకీయ మరియు భావోద్వేగ వివాదాలకు ఎక్కువ శ్రద్ధ ఇవ్వబడుతుండగా, మతాలు ఇమిడివున్నవాటిని గూర్చి ఎక్కువగా చెప్పడం లేదు. ఎయిడ్స్ వ్యాపించడంలో మతం ఇమిడి ఉందన్న తలంపు కొందరు పాఠకులకు అవాస్తవంగా అనిపించవచ్చు. ఆఫ్రికా ఖండంలో వృద్ధియైన పరిస్థితిని మీరు పరిశీలించినట్లయితే అది అసంగతమనిపించదు.
ఎయిడ్స్ ముఖ్యంగా ఆఫ్రికాలో తీవ్రంగా బాధించింది.a లోకంలోని ఎయిడ్స్ కేసుల్లోని 67 శాతానికి ఈ ఖండమే పుట్టినిల్లు అని కొందరు అంటారు. చాద్‌లో గత ఐదు సంవత్సరాలకు పైగా నమోదు చేయబడిన కేసుల సంఖ్య 100 రెట్లు అధికమైంది. అయితే, అన్ని కేసుల్లోను మూడవ వంతు మాత్రమే నమోదుచేయబడ్డాయి అని అంచనా వేయబడింది. ప్రపంచ బ్యాంకు నివేదించిన ప్రకారం, అనేక ఆఫ్రికా నగర కేంద్రాల్లో పెద్దవారి మరణానికి ఎయిడ్స్ అతి సాధారణ కారణమయ్యింది.
మతం—అది ఒక పాత్రను వహించిందా?
యేసు నేర్పించిన క్రైస్తవత్వం అనే మతం నిశ్చయంగా ఈ విపత్తుకు బాధ్యురాలు కానేరదు. అయినప్పటికీ, మొదట తెలుపబడినట్లు, “క్రైస్తవ మత సామ్రాజ్యం” అనే పదంలో తాము క్రైస్తవులమని చెప్పుకునే ప్రజలు నివసించే దేశాలనే భావం ఇమిడి ఉంది. క్రైస్తవ మత సామ్రాజ్యం స్పష్టంగా ఇమిడి ఉంది. ఎయిడ్స్ వైరసును చర్చీలే సృష్టించాయి లేదా నేరుగా వ్యాపింపజేశాయి అని కాదు. కాని ఎయిడ్స్ అనేది ఆఫ్రికాలో వ్యాపించిన దాని ముఖ్య కారణం స్త్రీ పురుష విచక్షణరహిత అక్రమ లైంగిక సంబంధమే.b కనుక, ఎయిడ్స్‌ను ఒక నైతిక సమస్యయని పిలువవచ్చు, ఎందుకంటే అది కొన్ని బాధకరమైన మత సంబంధ ప్రశ్నలను లేవదీస్తుంది. ఆఫ్రికా “క్రైస్తవత్వం” అనేది పాశ్చాత్య దేశాల నుండి నేరుగా విత్తబడినదే. చర్చి నాయకులు ఆఫ్రికా వారిని తమ మతంలోనికి మార్చే పనిని చేపట్టి, పారంపర్య ఆఫ్రికా పద్ధతులకన్నా ఉన్నతమైన జీవిత విధానాన్ని అది వారికి ప్రతిపాదించిందని వాదిస్తారు. క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క ప్రభావం దాని క్రొత్త అనుచరుల నైతికతను నిజంగా మెరుగుపరచిందా? కచ్చితంగా దానికి వ్యతిరేకమైనదే సంభవించిందని ఎయిడ్స్ అనే సంకట పరిస్థితి స్పష్టంగా చూపిస్తుంది.
ఉదాహరణకు, చాద్ దేశీయులను పరిశీలించండి. దాని నాలుగు పెద్ద నగరాల్లోని మూడింట పెద్ద “క్రైస్తవ” జనాభా ఉంది. మరొక దానిలో ఎక్కువగా ముస్లిములే. అయినా ఇప్పుడు ఈ వైరస్ విజృంభిస్తున్నది ఈ మూడు “క్రైస్తవ” నగరాల్లోనే! ఖండమంతా ఇదే మాదిరి పునరావృతమైంది. ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్న ఉత్తర ఆఫ్రికాలో కన్నా క్రైస్తవులమని చెప్పుకునే వారున్న మధ్య మరియు దక్షిణ ఆఫ్రికాలోనే ఈ వ్యాధి రేటు చాలా ఎక్కువగా ఉంది.
ఆఫ్రికా ఎలా “క్రైస్తవ ప్రాంతం” అయ్యింది
క్రీస్తు అనుచరులమని చెప్పుకునే ప్రజల్లోనే ఈ వైరస్ ఇంత వేగంగా ఎందుకు సోకింది? నిజానికి, చాలామంది ఆఫ్రికా దేశస్థులు తమను తాము క్రైస్తవులుగా పిలుచుకున్నప్పటికీ, చాలా కొద్దిమంది మాత్రమే బైబిలులో చెప్పబడిన క్రైస్తవత్వం యొక్క నైతిక ప్రమాణాలను అనుసరిస్తున్నారు. క్రైస్తవ మత సామ్రాజ్యపు మిషనరీలు ఆఫ్రికా జనమును “మార్చే” పనిని చేసిన విధానంవల్ల నేరుగా కలిగిన ఫలితంగా ఇది కనిపిస్తుంది.
18 మరియు 19 శతాబ్దాల్లో, క్రైస్తవ మత సామ్రాజ్యం యొక్క పారంపర్య విశ్వాసాలు దాడి చేయబడ్డాయి. విపరీతమైన విమర్శలు ప్రాచుర్యంలోకి వచ్చి, చాలా మంది దృష్టిలో బైబిలు కేవలం ప్రాచీనకాల సాహిత్యంగా పడిపోయింది. పరిణామ సిద్ధాంతం కూడా మత గురువుల మధ్య సహితం అంగీకారాన్ని సంపాదించడం మొదలుపెట్టింది. సందేహ విత్తనాలు విత్తబడ్డాయి. పరిశుద్ధ లేఖనాల్లో విశ్వాసం ప్రశ్నించబడింది. ఇలాంటి వాతావరణంలో ఆఫ్రికా దేశస్థులను మార్చాలన్న ప్రయత్నంలో క్రైస్తవ మత సామ్రాజ్యం ఎక్కువగా లౌకిక విషయాల్లో శ్రద్ధ కేంద్రీకరించడం ఆశ్చర్యమేమీ కాదు. చర్చి మిషనరీలు మతం మారినవారు బైబిలు యొక్క నైతిక ప్రమాణాలకు అనుగుణ్యంగా మారేందుకు సహాయపడేదానికన్నా మానవహిత పనులను చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సామాజిక సువార్తను ప్రకటించారు. మిషనరీలు బహుశ, తెలియకుండానే ఉన్న నైతిక విలువను బలహీనపరచడానికే నిజానికి సహాయపడ్డారు.
ఉదాహరణకు, ఆఫ్రికాలోని అనేక నాగరికతల్లో ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను లేదా భర్తలను కలిగి ఉండడం ఎంతోకాలం క్రిందటే రివాజుగా ఉండేది. అయినప్పటికీ అక్రమ లైంగిక సంబంధం చాలా అరుదు, ఎందుకంటే దాదాపు అన్ని జాతుల్లోనూ వ్యభిచారానికి సంబంధించిన కఠినమైన నియమాలు ఉండేవి. చర్చి మిషనరీలు రాక మునుపే “వ్యభిచారం దురదృష్టాన్ని తెచ్చిపెట్టిందని తలంచబడింది” అని చాద్‌లో ప్రఖ్యాతిగాంచిన జోసెఫ్ దార్నాస్ అనే పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయుడు తేజరిల్లు!తో చెప్పాడు. దాని ఫలితంగా, “సమాజాన్ని అపాయంలో పడవేసినందుకు నేరస్థులు తీవ్రంగా శిక్షించబడ్డారు—తరచూ వారికి మరణశిక్ష వేయబడేది.” మూఢవిశ్వాసమా? అవును, అయితే అలాంటి విశ్వాసాలు అక్రమ సంబంధాన్ని తగ్గించాయి.
తరువాత క్రైస్తవ మత సామ్రాజ్యపు మిషనరీలు వచ్చారు. ఒకరికన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి వ్యతిరేకంగా వారు బోధించారు, కాని బైబిలు నైతిక ప్రమాణాలను అమలు చేయడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. పశ్చాత్తాపం లేని వ్యభిచారులను జారులను క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించాలని బైబిలు చెబుతున్నప్పటికీ, క్రైస్తవ మత సామ్రాజ్యంలోని చర్చీలు నేరస్థులపై క్రమశిక్షణా చర్యను చాలా అరుదుగా గైకొంటాయి. (1 కొరింథీయులు 5:11-13) ఈ నాటి వరకూ ఆఫ్రికాలోని చాలామంది ప్రముఖ రాజకీయవేత్తలు తమ అనైతిక సంబంధాలకు పేరుమోసారు. అయినప్పటికీ వారు చర్చి సభ్యులుగా మంచి స్థానంలోనే ఉంటున్నారు. ఆఫ్రికాలోని నామమాత్రపు క్రైస్తవుల వివాహ జీవితంలో విశ్వాస్యత అనేది చాలా అరుదైనది.
మతనాయకులు ఉంచిన మాదిరి కూడా చెడ్డ మాదిరియే. కుటుంబంపై కేంద్రీకృతమైయుండే ఈ సంస్క్రతిలో వివాహం చేసుకుని చాలామంది పిల్లలను కలిగి ఉండడం సర్వసాధారణమే. బహుశ, అందుకే కాథోలిక్ మతగురువుల్లోని చాలామంది నిర్మలత మరియు బ్రహ్మచర్యమనే తమ ప్రతిజ్ఞను నిర్లక్ష్యం చేయడం సమర్థనీయమేనని భావిస్తారు. “అనేక ప్రకటనల భాగాల్లో, . . . మతగురువులు మరియు బిషప్పులు బహుభార్యలను కలవారే” అని 1980, మే 3 నాటి ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
సహజంగానే, అలాంటి వివాహాలు నియమప్రకారమైనవి కావు, నిజానికి మరి “భార్యలు” కేవలం ఉంపుడుగత్తెలే. అలాంటి దుష్ప్రవర్తన అల్పమైనదని కొట్టివేయలేము. టైమ్స్ వార్తాపత్రిక ప్రకారం, “ఆఫ్రికా మతగురువు యేసుక్రీస్తు సేవకు కావడానికి బదులు అధికారానికి సంకేతంగా, శక్తికి ప్రతీకగా ఉన్నాడు” అని “ఒక ప్రముఖ కాథోలిక్ మతగురువు” ఒప్పుకున్నాడు. “నేను చెప్పినట్లు చేయండి, కాని నేను చేసినట్లు చేయకండి” అన్నట్లుగా ఉన్నాయి ఈ “అధికార ప్రతీకల” నుండి వచ్చే సందేశాలు.
పాశ్చాత్య వినోద ప్రవాహం
ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్రికాలోకి ప్రవహించిన లైంగిక అనైతిక వినోద ప్రవాహంలోని దేనినీ అలక్ష్యం చేయకూడదు. వ్యక్తుల ఇండ్లలోనూ గారేజ్లలోను తరచూ చీకటి పడ్డాక ప్రాంగణాల్లోనూ అలాంటి వినోదాన్ని అందించే పర్యవేక్షణలేని ప్రజా వీడియో పార్లర్లు చాద్‌లో ప్రతిచోట రూపొందాయి. ఈ ప్రదర్శనలు చౌకైనవి, 25 ఫ్రాంకుల (అమెరికన్ 5 సెంట్లు) అంత విలువే ఉంటుంది. చిన్న పిల్లలు హాజరౌతారు. ఇవి ఎక్కడ నుండి వస్తాయి? వీటిలో అధికమూ అధిక సంఖ్యాకులు క్రైస్తవులని చెప్పుకుంటున్న అమెరికా దేశం నుండే!
పాశ్చాత్య సంస్కృతి యొక్క ఈ ప్రవాహం చూపరులపై నిజంగా ఏదైనా ప్రభావాన్ని చూపిందా? మధ్య ఆఫ్రికాలో 14 సంవత్సరాల అనుభవమున్న యెహోవాసాక్షుల్లోని ఒక సాక్షి ఈ విధంగా చెబుతున్నాడు: “తరచూ స్థానిక ప్రజలకు వీడియో కాసెట్లలో చూసేది కాకుండా, పాశ్చాత్య లోకంతో ఎక్కువ సంబంధం లేదు. ఈ చలనచిత్రాల్లో చూసే పాశ్చాత్యుల్లా ఉండాలని వారు కోరుకుంటారు. దీనిని రుజువు చేసేందుకు లిఖితపూర్వక అధ్యయనాలనేమీ అందించలేను కాని చాలామంది ప్రజలకు ఇలాంటి వినోదం లైంగిక అవినీతిని ప్రోత్సహిస్తుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.”
ఆరోగ్య అధికారులు ప్రాణాంతకమైన లైంగిక సంక్రమణ వ్యాధి వ్యాపించడాన్ని అరికట్టడానికి ఎంతో కష్టపడుతుండగా, క్రైస్తవులని పిలువబడే దేశాలు అనైతికమైన, పెద్ద అపాయాన్ని తెచ్చే ప్రవర్తనను ప్రచారం చేయడం ఎంత విరుద్ధమైనది! చర్చీలు స్వదేశంలోనో విదేశంలోనో ఈ ధోరణిని తీసివేయడానికి ఏమీ చేయకపోగా, చాద్ మరియు కామరూన్ వంటి కొన్ని ఆఫ్రికా ప్రభుత్వాలు అశ్లీల సాహిత్యాలు తమ దేశాల్లోకి రావడాన్ని నిషేధించడానికి, లేదా కనీసం పరిమితం చేయడానికి ప్రయత్నం చేశాయి. అయితే వారి ప్రయత్నాలు తరచూ విఫలమైనట్లు నిరూపించబడ్డాయి.
ఆఫ్రికా “క్రైస్తవుల” మధ్య నైతికత విస్తృతంగా తగ్గడమే వీటన్నింటివల్ల కలిగిన ఫలితం. పేదరికపు పరిస్థితులు కూడా మోసపూరిత ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఉద్యోగాల కొరత కారణంగా, పురుషులు పనిని వెదుక్కుంటూ ఒక్కోసారి నెలల తరబడి తమ కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. అలాంటి పురుషులు స్థానిక వేశ్యలకు సులభంగా ఎరలవుతారు. అయితే, సాధారణంగా వేశ్యలు కూడా బీదరికపు ఎరలే. తలిదండ్రులు అమిత ఓలిని అడగడం కూడా ఒక కారణం. చాలామంది పురుషులు కన్యాశుల్కం చెల్లించేందుకు కావలసినంత డబ్బును సంపాదించలేరు కనుక వివాహం చేసుకోరు. కాబట్టి కొంతమంది చివరికి చట్టవిరుద్ధ సంబంధాలను పెట్టుకుంటారు. అలాంటి నైతిక, ఆర్థిక వాతావరణంలో ఎయిడ్స్ త్వరగా వ్యాపించింది.
సంకటస్థితికి పరిష్కారం
స్పష్టంగా, ఆఫ్రికాలోని ఎయిడ్స్ దుస్థితికి పూర్తిగా క్రైస్తవ మత సామ్రాజ్యమే బాధ్యురాలు కాదు. కాని స్పష్టంగా చాలామట్టుకు అది బాధ్యురాలు అన్నది వేదనకరమైన విషయం. “నిజమైన క్రైస్తవులు” అని యేసు పిలిచిన వారిలో ఒకరై ఉండాలని కోరుకునే వ్యక్తులతో దీనికి గట్టి సంబంధముంది.—యోహాను 4:23.
బాధ్యత ఉన్నప్పటికీ, ఎయిడ్స్ మహామారిని నిలిపివేయడానికి ఏమి చేయవచ్చు? ఆఫ్రికా ప్రభుత్వాలు ఎయిడ్స్ నివారణా కార్యక్రమాలను చేపట్టి, కండోమ్‌ల ఉపయోగాన్ని వృద్ధి చేశాయి. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నైజీరియా ప్రతినిధి డా. సామ్యేల్ బ్రూ గ్రావ్స్ నిష్కపటంగా ఇలా ఒప్పుకుంటున్నారు: “ఒక వ్యక్తి తప్పకుండా ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని స్వీకరించాలి . . . , అయితే కుటుంబం తప్పనిసరిగా . . . అక్రమ లైంగికతను వర్జించాలి.”
ఎయిడ్స్ సాధారణ మాటైపోయిన చాలాకాలం క్రితమే బైబిలు అక్రమ సంబంధాన్ని ఖండించి, నిర్మలతను ఆత్మనిగ్రహాన్ని వివాహ విశ్వాస్యతను ఉద్బోధించింది. (సామెతలు 5:18–20; 1 కొరింథీయులు 6:18) ఈ సూత్రాలను పాటించడం ఎయిడ్స్ నుండి మరితర లైంగిక సంక్రమణ వ్యాధుల నుండి కావలసినంత రక్షణనిస్తుందని ఆఫ్రికాలోని లక్షలాది మంది యెహోవాసాక్షులు స్వయంగా రుజువునిస్తారు. వారు బైబిలు ప్రమాణాలను అనుసరించడం క్రైస్తవ మత సామ్రాజ్యంపై నిజంగా ఒక నేరారోపణే. ఈ నిజ క్రైస్తవులు రానున్న “నీతి నివసించు” క్రొత్తలోకంలో నిరీక్షణను కలిగివున్నారు కూడా. (2 పేతురు 3:13) విశ్వాసులైన పురుషుల విషయంలో ఎయిడ్స్ సంకట పరిస్థితికి ఇదే తుది పరిష్కారం.
[అధస్సూచీలు]
a అదనపు సమాచారం కొరకు ఆగస్టు 8, 1992 ఆంగ్ల సంచికలో “ఆఫ్రికాలో ఎయిడ్స్—ఎలా అంతమౌతుంది?” అనే శీర్షిక పరంపరను చూడండి.
b రక్త మార్పిడి ద్వారా, నరాల్లో మందును ఎక్కించేటప్పుడు ఒకే సిరంజీని ఉపయోగించడం ద్వారా కూడా ఆ వ్యాధి సోకగలదు. కొందరు నిర్దోషులైన క్రైస్తవులకు లైంగిక అవినీతికి పాల్పడిన లేదా మత్తుమందులను ఉపయోగించిన తమ వివాహజతల నుండి కూడా ఈ వ్యాధి అంటుకుంది.
[20వ పేజీలోని చిత్రం]
“అనేక ప్రకటనల్లో, . . . మతగురువులు, బిషప్పులు బహుభార్యలు గలవారే.”—ద న్యూయార్క్ టైమ్స్
[20వ పేజీలోని చిత్రం]
క్రైస్తవమత సామ్రాజ్య మతగురువుల చెడు మాదిరి ఆఫ్రికాలోని లైంగిక అక్రమ మహామారికి ఆజ్యెం పోసింది
[21వ పేజీలోని చిత్రం]
“క్రైస్తవ” దేశాలు ఎగుమతి చేసిన అనైతిక వినోదానికి యౌవనస్థులు గురయ్యారు