మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవచ్చు
“నాకు జ్ఞాపకశక్తి చాలా తక్కువగావుంది.” మీరెప్పుడైనా ఆ మాటన్నారా? అన్నట్లయితే నిరాశపడకండి. కొన్ని సులభమైన చిట్కాలు, కాస్తంత ప్రయత్నం అద్భుతమైన మెరుగుదలను తీసుకు రాగలవు. మీ మెదడును తక్కువ అంచనా వేయకండి. దాని సామర్థ్యాలు ఆశ్చర్యకరమైనవి.
మెదడు విస్మయం కలిగించే కార్యాలను ఎలా నిర్వర్తిస్తుంది? ఇటీవలి సంవత్సరాలలో ఇంతకు మునుపెన్నడూ లేనంతగా మెదడు సూక్ష్మంగా పరిశీలింపబడుతుంది. కానీ అంతర్దృష్టి ఎక్కువవుతుండగా, అది చేసే పనులను మెదడు అసలు ఎలా సాధిస్తుందన్నదాని గురించి మనకు ఇంకా చాలా తక్కువే తెలుసు.
మనం సమాచారాన్ని ఎలా నేర్చుకుంటామో, గుర్తుంచుకుంటామో స్పష్టంగా తెలియదు, కానీ పరిశోధకులు ఈ మర్మాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. నేర్చుకోవడం, గుర్తుంచుకోవడంలో మెదడులోని వెయ్యి కోట్ల నుండి పది వేల కోట్ల నాడీ కణాలు, న్యూరాన్లు ఇమిడివున్నాయని అంచనా వేయబడింది. కానీ న్యూరాన్లమధ్య సుమారు పదివేల రెట్లు ఎక్కువ సంధానాలున్నాయి. ఈ సంధానాలు, లేక సినాప్సిస్‌లు, వాడకం ద్వారా దృఢం చేయబడుతుండగా, నేర్చుకోవడమనే ప్రక్రియ జరుగుతుంది అన్నది ఒక సూత్రము.
మనం వృద్ధులమయ్యే కొలది, మానసిక సామర్థ్యం తగ్గుతుండవచ్చు; మన ప్రతిచర్యల వేగం తగ్గుతుండవచ్చు. మెదడు కణాలు తమంతటతాము పునర్నవీనం చేసుకోవు, వయోజనులు నిజంగానే కొన్నింటిని క్రమంగా కోల్పోతుంటారు. కానీ మనం మన మెదడును ఉపయోగించే స్థాయి మేరకు, మన మానసిక సామర్థ్యాలను దీర్ఘకాలం కాపాడుకో గలుగుతాము.
మన మానసిక దృక్పథం మన మెదడును ప్రభావితం చేస్తుంది. ఏ వయస్సులోనైనా ఒక ఆశావాద, ఆనందిత దృష్టికోణం మెదడు పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది. కొంత ఒత్తిడి ప్రయోజనకరమే కావచ్చు, కానీ దీర్ఘకాలిక, అనవసరమైన ఒత్తిడి మెదడుకున్న సామర్థ్యానికి అవరోధం కలిగిస్తుంది. శారీరక అభ్యాసం మానసిక ఒత్తిడిని తీసివేసుకునేందుకు సహాయపడగలదు.
ఇది ప్రోత్సాహకరంగానే ఉండవచ్చు కానీ అసలు విషయమేమంటే, మన వయస్సు ఎంతైనప్పటికీ మనం ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా మర్చిపోతుండవచ్చు. మనం మెరుగుపర్చుకోగలమా? మనం కలిసే ప్రజల పేర్లను జ్ఞాపకముంచుకోవడమే అనేకమందికి కష్టమనిపిస్తుంది.
ప్రజల పేర్లను జ్ఞాపకముంచుకోవడం
కొన్ని సులభ సూచనలు, పేర్లను ఇంకా చక్కగా జ్ఞాపకముంచుకోవడంలో ఎంతో సహాయం చేయగలవు. వ్యక్తిలో ఆసక్తి చూపడం ఇందుకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తి పేరు ఆయనకు ప్రాముఖ్యం. తరచూ మనం ఆ పేరును జ్ఞాపకం ఉంచుకోలేము ఎందుకంటే మొదట్లో సరిగా వినలేదు. కాబట్టి పరిచయమైనప్పుడు, పేరును సరిగ్గా తెలుసుకోండి. అవసరమైతే ఆ వ్యక్తిని మరల చెప్పమని లేదా నెమ్మదిగా పలకమని అయినా అడగండి. మీ సంభాషణలో అనేక పర్యాయాలు ఆ పేరును ఉపయోగించండి. వెళ్లొస్తానని చెప్పేటప్పుడు, ఆ వ్యక్తి పేరును ఉపయోగించండి. ఈ కొద్ది విషయాలు ఎలా సహాయం చేస్తాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు.
పేర్ల విషయంలో మీ జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ఇంకొక చిట్కా ఏమిటంటే, ఒక వ్యక్తి పేరును మీ మనస్సులో చిత్రించుకోగలిగే దేనితోనైనా దాన్ని జతచేయడం. మీరు చిత్రంలోకి అభినయాన్ని ప్రవేశపెట్టగలిగితే మరీ మంచిది.
ఉదాహరణకు, బహుశ రాజ్‌కుమార్ అనే పేరుగల అంతగా సన్నిహితుడు కాని పరిచయస్తుని మొదటి పేరును జ్ఞాపకముంచుకోవడం కష్టంగా ఉండవచ్చు. మీరా వ్యక్తిని చూసినప్పుడు, “రాజ్‌కుమార్” అనే పదం అర్థమేమిటని ఆలోచించవచ్చు: “రాజు కుమారుడు.” ఈ మనిషి ఒక రాజభవనంలో చుట్టూ ప్రాచీన రాజోద్యోగులు ఉండగా అటుఇటు తిరుగుతుండడం మీరు చిత్రించుకోవచ్చు. ఇది పని చేసే సాధ్యత ఉంది; రాజ్‌కుమార్ అనే పేరు మీ మనస్సులో వెంటనే మెదలవచ్చు.
అనేకమంది పేర్లు మీ కొరకు అర్థం కలిగి ఉండకపోవచ్చు, కాబట్టి ఆ పేరును పోలివుండే ఒక పదాన్ని ప్రత్యామ్నాయంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ప్రత్యామ్నాయ పదం సరిగ్గా పేరు శబ్దం లాగానే ఉండకపోయినా ఫర్వాలేదు. మీ జ్ఞాపకశక్తి సహవాసం ద్వారా, పేరును ఇంకా బాగా జ్ఞప్తికి తెచ్చుకోగలదు. మీ స్వంత మాటలు, చిత్రాలు ఊహించుకుంటే, ప్రభావం ఇంకా బలంగా ఉంటుంది.
ఉదాహరణకు, మీరు శ్రీమతి. రాణీ దేశాయ్ అనే ఆమెకు పరిచయం చేయబడ్డారు. మీరు దేశాయ్‌కి ప్రత్యామ్నాయంగా దేశీయ అనవచ్చు. మీరు ప్రాంతీయ రాణిని మనస్సులో ఊహించుకుంటారు.
మీరు కొంతకాలం దీన్ని బాగా అభ్యాసం చేయాలి, కానీ అది నిజంగా పని చేస్తుంది. హారీ లరేనీ తన పుస్తకం హౌ టు డెవలప్ ఎ సూపర్-పవర్ మెమరీలో ఈ పద్ధతిని వివరిస్తున్నాడు, ఆయన దాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగించాడు. ఆయనిలా అంటున్నాడు: “చాలాసార్లు నేను ఒక వంద, రెండొందలమంది ప్రజలను పదిహేను నిమిషాలలో లేక అంతకు తక్కువ సమయంలో కలవాల్సి వచ్చింది, ఒక్క పేరు కూడా మర్చిపోలేదు!”
జాబితాలను ఎలా జ్ఞాపకముంచుకోవాలి
పొంతనలేని వస్తువుల జాబితాను గుర్తుంచుకునే మీ సామర్థ్యాన్ని మీరు ఎలా మెరుగుపర్చుకోగలరు? ఒక సులభమైన పద్ధతి పేరు జతచేర్చే పద్ధతి. అది పని చేసే విధానం ఇక్కడుంది: జాబితాలోని ఒక్కొక్క వస్తువుకు మీరు ఒక్కొక్క దృశ్యరూపాన్ని కల్పించండి, తరువాత మొదటి వస్తువు కొరకైన రూపాన్ని రెండవ వస్తువు రూపానికి జతచేయండి, అలాగే రెండవ, మూడవ వస్తువుల విషయంలో కూడా చేయండి.
ఉదాహరణకు, మీరొకవేళ ఐదు వస్తువులను సూపర్‌మార్కెట్టు నుండి తేవాలనుకోండి: పాలు, బ్రెడ్డు, ఒక లైట్ బల్బు, ఉల్లిపాయలు, ఐస్ క్రీము. పాలను బ్రెడ్డుతో జతచేయడంతో మొదలుపెట్టండి. ఒక బ్రెడ్డు ముక్కలో నుండి పాలను ధారగా పోస్తున్నట్లు ఊహించండి. ఈ ఊహాచిత్రం చాలా విచిత్రంగా ఉన్నప్పటికిని, మీ జ్ఞాపకశక్తిలో వస్తువులను నాటడానికది సహాయం చేస్తుంది. పాలు పోయడంలో మీరు ఇమిడి ఉండే అభినయాన్ని మనఃఫలకంపై ముద్రించడానికి కూడా ప్రయత్నంచండి.
బ్రెడ్డును పాలతో జతచేర్చిన తరువాత, తరువాతి వస్తువుకు వెళ్లండి, లైట్ బల్బు. మీరు బ్రెడ్డు ముక్కను లైటు సాకెట్‌లోకి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చిత్రించుకుంటూ బ్రెడ్డు ముక్కను బల్బుకు జతచేయవచ్చు. తరువాత మీరు ఒక పెద్ద లైట్ బల్బు తోలు ఒలుస్తున్నట్లు, అలా చేస్తుండగా ఏడుస్తున్నట్లు ఒక దృశ్యాన్ని ఊహించుకుంటూ లైట్ బల్బును ఉల్లిపాయకు జతచేయండి. మీకైమీరే జతచేయడాన్ని తయారు చేసుకుంటే మంచిది. ఆఖరివైన ఉల్లిపాయలు, ఐస్ క్రీములను మీరు జతచేర్చగలరా? బహుశ మీరొక ఉల్లిపాయ ఐస్ క్రీము తింటున్నట్లు ఊహించుకోవచ్చు!
జాబితాను గుర్తుతెచ్చుకోగలరేమో చూడండి. తరువాత మీ స్వంత జాబితాతో మీ జ్ఞాపకశక్తిని పరీక్షించుకోండి. దాన్ని మీకిష్టమైనంత పొడవుగా చేసుకోండి. గుర్తుంచుకోండి, జతచేయడాన్ని మరింత జ్ఞాపకముంచుకోదగినదిగా చేయాలంటే, దాన్ని తమాషాగా లేక అపహాస్యంగా లేక తగిన నిష్పత్తుల్లో లేకుండా కూడా చేయవచ్చు. చిత్రంలోకి అభినయాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి, ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువును పెట్టండి.
ఈ పద్ధతి జాబితాను కంఠస్థం చేసే దానికంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కొంతమంది ఆక్షేపణ తెలుపవచ్చు. అయినా, ఈ పద్ధతి ఉవయోగించడానికన్నా వివరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకసారి మీకు కొంత అలవాటైతే, మీరు జతచేర్చడాన్ని త్వరగా చేస్తారు, మరి గుర్తు తెచ్చుకునే మీ శక్తి, అలాగే నేర్చుకునే వేగం, ఒక పద్ధతి లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించే దానికంటే ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఒక వరుసలో లేని 15 వస్తువులను గుర్తుంచుకోవాలని 15 మంది వ్యక్తులను అడిగినప్పుడు, వారి సగటు స్కోరు 8.5. ఇంకొక జాబితా విషయంలో దృశ్య రూపాలను జతచేర్చే విధానాన్ని ఉపయోగిస్తూ, అదే గుంపు సగటున 14.3 సంపాదించింది. నిజమే, మీరు షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఈ వస్తువుల లిఖిత జాబితాను తీసుకువెళ్లడం గుర్తుంచుకుంటే, అది మీకు 15—100 శాతం స్కోరును ఇస్తుంది.
మీరు చదివేదాన్ని గుర్తుంచుకోవడం
ఈ బహుళోత్పాదక సమాచార యుగంలో, మనలో అనేకులకు ప్రభావవంతంగా పఠించే విషయంలో సహాయమవసరం. పఠనం పాఠశాలలో, వ్యాపారంలో, వ్యక్తిగత అభివృద్ధి కొరకు, మరియు అందరిముందు మాట్లాడడంలో అత్యవసరం. అదనంగా, ఒక క్రైస్తవుడు వ్యక్తిగత బైబిలు పఠనానికి సమయాన్ని వేరుగా కేటాయించాలి.—యోహాను 17:3.
‘కానీ నేను చదివిన దానిని గుర్తుంచుకోవడం నాకు కష్టమనిపిస్తుంది’ అని మీరనవచ్చు. ఏమి చేయగలం? పఠనానికి కేటాయించిన సమయం నుండి అత్యంత ప్రయోజనాన్ని పొందేందుకు నేర్చుకోవడం మీరు చదివేది గుర్తుంచుకోవడానికి సహాయం చేయగలదు. కొన్ని సలహాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు పఠించేటప్పుడు, వ్యక్తిగత సంస్థీకరణ ప్రాముఖ్యం. పుస్తకాలు, వ్రాత పరికరాలు, కాగితము అందుబాటులో ఉంచుకోండి. అతి స్వల్ప ఆటంకాలున్న చోట, సరైన వెలుతురుతో ఆహ్లాదకరంగావున్న చోట పఠించేందుకు ప్రయత్నించండి. రేడియో, దూరదర్శిని కట్టివేయండి.
పఠనానికి క్రమమైన సమయాన్ని కలిగివుండండి. కొంతమందికి, ఒకేసారి ఎక్కువ సమయం వరకు పఠించే కన్నా ప్రతిరోజు తక్కువ సమయం పఠించడం ప్రభావవంతంగా ఉంటుంది. మీ సమయాన్ని భాగాలుగా విభజించడం మంచిది. రెండు గంటలు ఏకధాటిగా పఠించే బదులు, సమయాన్ని మధ్య మధ్య కొన్ని నిమిషాల విరామంతో ఒక్కొక్కటి 25 నుండి 40 నిమిషాల నిడివిగల భాగాలుగా విడగొట్టడం సరైనదిగా ఉండవచ్చు. ఇది ఎక్కువగా గుర్తుంచుకునేందుకు సహాయం చేస్తున్నట్లు పరిశోధన చూపిస్తుంది.
పఠన సమయంలో మీరు ఏ సమాచారాన్ని ఇమడ్చాలని అనుకుంటారో నిర్ధారించుకోండి. ఇది ఏకాగ్రతకు సహాయం చేస్తుంది. ఒక పుస్తకాన్ని మొదలుబెట్టేటప్పుడు, దాన్ని ముందుగా పైనుండి క్రిందికి తిరగవెయ్యడానికి కొద్ది నిమిషాలు తీసుకోండి. దాని పేరు చూడండి. పుస్తక సారాంశాన్ని తెలియజెప్పే విషయసూచికను పరిశీలించండి. తరువాత ముందుమాట లేదా పరిచయవాక్యాన్ని చదవండి. ఇక్కడ రచయిత ఉద్దేశము, దృక్కోణము తెలుపబడి ఉండవచ్చు.
అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టేటప్పుడు, దాన్ని తిరగవెయ్యండి. ఉపశీర్షికలు, చిత్రాలు, చార్టులు, సారాంశాలు, మొదటి మరియు ఆఖరి పేరాగ్రాఫులు చూడండి. ఒక్కొక్క పేరాగ్రాఫు మొదటి లైనును పరిశీలించండి. ఈ వాక్యాలు తరచూ ప్రధాన వాదనలను కలిగి ఉంటాయి. పూర్తి భావాన్ని గ్రహించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: రచయిత ఏమి రుజువు చేయాలనుకున్నాడు? ఈ సమాచారాన్నుండి నేనేమి పొందగలను? ప్రధాన వాదాలేమిటి?
ఏకాగ్రత ముఖ్యం. మీరు పూర్తిగా ఇమిడిపోవాలి. రహస్యమేమంటే మీ పఠనాన్ని వీలైనంత చురుకైనదిగా చేసుకోవాలి. సమాచారానికున్న ఆచరణాత్మక విషయాలను పరిగణించడం ద్వారా ఉత్సాహాన్ని రేకెత్తించండి. దృశ్యాలను ఊహించుకోండి. సమాచారం అనుమతిస్తే వాసన, రుచి, స్పర్శలను ఊహించడానికి జ్ఞానేంద్రియాలను ఉపయోగించండి.
ఒక్కసారి సమాచార తాత్పర్యము తెలిస్తే, మీరు నోట్సు వ్రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ప్రభావవంతంగా నోట్సు వ్రాసుకోవడం మీ అవగాహనను పెంచి, సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి సహాయం చేస్తుంది. నోట్సు అంటే వాక్యాలన్నీ కానక్కరలేదు కానీ ప్రధాన ఆలోచనలను గుర్తుకుతెచ్చుకోవడానికి సహాయం చేయగల మూల పదాలు లేదా పదబంధాలై ఉండొచ్చు.
సమాచారాన్ని అర్థం చేసుకోవడం అంటే భవిష్యత్తులో దానినంతటినీ గుర్తుతెచ్చుకోగలరని అర్థం కానవసరం లేదు. సత్యమేమంటే నేర్చుకున్న 24 గంటలలోగా, సమాచారంలోని దాదాపు 80 శాతం మర్చిపోగలరు, కనీసం తాత్కాలికంగానైనా. అది నిరుత్సాహమే, కానీ ఆ 80 శాతంలో కొంత లేదా చాలామట్టుకు ఆ సమాచారాన్ని పునర్విమర్శ చేయడం ద్వారా మరలా జ్ఞాపకం తెచ్చుకోగలరు. ఒక్కొక్క పఠన భాగం అయిన తరువాత, కొద్ది నిమిషాలు పునర్విమర్శ చేయండి. వీలైతే, ఒక రోజు తరువాత పునర్విమర్శ చేయండి, అటుపై ఒక వారం తరువాత, ఒక నెల తరువాత. ఈ విషయాలను అన్వయించుకోవడం మీరు మీ అమూల్యమైన పఠన సమయం నుండి వీలైనంతగా ప్రయోజనం పొందడానికి, మీరు చదివినదానిని గుర్తుంచుకోవడానికి సహాయం చేయగలవు.
అందువలన మీ మెదడును తక్కువ అంచనా వేయకండి. విషయాలను గుర్తుంచుకునే మీ సామర్థ్యం మెరుగుపర్చుకోవచ్చు. “ఇప్పటివరకు మన విశ్వంలో కనుగొనబడిన వాటిలో అత్యంత సంక్లిష్టమైనది” అని మెదడును గూర్చి ఒక శాస్త్రవేత్త అన్నాడు. దాని సృష్టికర్తయగు యెహోవా యొక్క విస్మయం గొలిపే బుద్ధికి, శక్తికి అదొక ఒక నివాళి.—కీర్తన 139:14.
[26వ పేజీలోని చిత్రం]
జాబితాలను జ్ఞాపకముంచుకోవడానికి, జతచేర్చే పద్ధతి ఉపయోగించండి: ఒక్కొక్క వస్తువుకి ఒక దృశ్య రూపాన్ని కల్పించండి. తరువాత మొదటి వస్తువు రూపాన్ని రెండవ వస్తువు రూపానికి, అలా జతచేరుస్తూ వెళ్లండి
షాపింగ్ జాబితా
1. పాలు 1, 2 జతచేయబడ్డాయి
2. బ్రెడ్డు 2, 3 జతచేయబడ్డాయి
3. లైట్ బల్బు 3, 4 జతచేయబడ్డాయి
4. ఉల్లిపాయలు 4, 5 జతచేయబడ్డాయి
5. ఐస్ క్రీము