కమ్యూనిస్ట్ దేశంలో దేవునియందలి విశ్వాసం చేత పరిపాలించబడడం
ఆండ్రే కాడ్లెస్ చెప్పినట్లు
నేను 1966లోని వేసవిలో జెకోస్లోవాకియాలోని నా స్వంత ఊరైన ప్రాగ్లో పర్యాటక బృందాన్ని నడిపిస్తున్నాను. నేను క్రొత్తగా కనుగొన్న విశ్వాసం యెడల ఆసక్తిగలవానినై, మా నగరంలోని ఆకర్షణీయమైన చర్చీలను గుళ్ళను చూపిస్తూ నేను ఆ గుంపుతో దేవున్ని గూర్చి మాట్లాడాను.
“మీరు యెహోవాసాక్షుల్లో ఒకరా?” అని ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన అమెరికా దేశస్థుడు అడిగాడు.
“కాదు. నేను యెహోవాసాక్షులను గూర్చి ఎన్నడూ వినలేదు. నేను రోమన్ కాథోలిక్ను” అని నేను జవాబిచ్చాను.
దైవ విశ్వాసి కావడం
విద్యా వైద్య రాజకీయ రంగాల్లోను ప్రముఖులైన తలిదండ్రులు నన్ను పెంచారు. 1944లో నేను జన్మించిన కొద్ది కాలం తర్వాత, మరుసటి సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నా తండ్రి కమ్యూనిస్ట్ మారాడు. వాస్తవానికి, ఆయన కమ్యూనిస్ట్ సంస్కరణ ఉద్యమ సహసంస్థాపకుడు, మరి ఆయన 1966లో ప్రాగ్లోవున్న యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత, జెకోస్లోవాకియాలో విద్యాశాఖా మంత్రిగా నియమించబడ్డాడు, అప్పటికి అది కమ్యూనిస్ట్ మరియు నాస్తిక దేశం.
అమ్మ నీతీ నిజాయితీగల, సామర్థ్యమున్న స్త్రీ. ఆమె దేశంలో పేరు గడించిన అత్యుత్తమ నేత్ర సర్జన్. అయితే, ఆమె అవసరంలో ఉన్నవారికి ఉచితంగా చికిత్స చేసేది. “ఒకరికి ఏ నైపుణ్యాలున్నా, వాటిని సమాజ మరియు దేశ ప్రయోజనార్థమై ఉపయోగించాలి” అని ఆమె అంటుండేది. క్లినిక్‌లో ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకుగాను నేను పుట్టినప్పుడు కనీసం ప్రసూతి సెలవును కూడా ఆమె తీసుకోలేదు.
విద్యాభ్యాసంలో నేను అత్యత్తముడనవ్వాలని ఆశించబడింది. “ఎవరైనా నీకన్నా బాగా చేస్తున్నారా?” అని మా నాన్న అడిగేవారు. నేను తరచూ విద్యాభ్యాసంలో అగ్రశ్రేణి అవార్డులను గెలిచేవాడిని కనుక, పోటీలో ఆనందించే స్థాయికి చేరుకున్నాను. నేను రష్యా, జర్మన్, ఆంగ్ల భాషలను నేర్చుకుని కమ్యూనిస్ట్ దేశాలను, ఇతర దేశాలను పర్యటించాను. మత తలంపులు నిర్హేతుకమైన అంధవిశ్వాసాలని వాదించడంలో నేను సంతోషించాను. నేను నాస్తికవాదాన్ని పూర్తిగా హత్తుకున్నప్పటికీ, రాజకీయాల్లో అది ఉపయోగించబడిన విధానాన్ని అసహ్యించుకున్నాను.
1965లో నేను ఇంగ్లాండుకు వెళ్ళాను, నాకప్పుడు 21 ఏండ్లే, అది నాపై చాలా ప్రభావం చూపింది. సర్వోన్నతునియందలి తమ విశ్వాసాన్ని గట్టి నమ్మకంతోను, సహేతుకతోను సమర్థించిన ప్రజలను నేను కలిశాను. నేను ప్రాగ్‌కు తిరిగి వచ్చిన తరువాత, నాకు పరిచయమున్న ఒక రోమన్ కాథోలిక్ “క్రైస్తవత్వాన్ని గూర్చి చదవద్దు. బైబిలును చదువు” అని సలహా ఇచ్చాడు. నేనదే చేశాను. దాన్ని ముగించేందుకు నాకు మూడు నెలలు పట్టింది.
బైబిలు రచయితలు తమ సందేశాలను అందించిన విధానమే నన్ను ఆకర్షించింది. వారు నిజాయితీగలవారు మరియు స్వయం విమర్శకులు. వారు చెప్పిన గొప్ప భవిష్యత్తు దృశ్యాన్ని వ్యక్తిగతంగా దేవుడు మాత్రమే చూడగలడు, ఇవ్వగలడు అనే నమ్మకానికి నేను వచ్చాను.
కొన్ని నెలలు వ్యక్తిగతంగా బైబిలును చదివి, ధ్యానించిన తరువాత, తండ్రిని, స్నేహితులను ఎదుర్కోవడానికి నేను సిద్ధమే అని భావించాను. నేను క్రొత్తగా కనుగొన్న సత్యాన్ని వారు సవాలు చేస్తారని నాకు తెలుసు. దాని తరువాత నేను ఉత్సాహంగల మతం మార్చేవాడినయ్యాను. మొదట్లో పేర్కొనబడిన అమెరికా ప్రొఫెసరులా నా దగ్గర ఎవరున్నా సరే, వాళ్ళు నా మత మార్పిడిని ఎదుర్కోవలసిందే. ప్రతివొక్కరికీ నా విశ్వాసాన్ని గూర్చి తెలియజేసేందుకు నేను ఒక సిలువను నా పడకకు పై భాగంలో గోడమీద వ్రేలాడదీశాను.
అయితే, నేను చాలా వరకు ఉత్సుకతగల కమ్యూనిస్టయిన మా తండ్రినిపోలి ఉంటాను కనుక నేను క్రైస్తవునిగా ఉండలేనని మా అమ్మ అభ్యంతరం చెప్పింది. అయితే, నేను పట్టుదలతో ఉన్నాను. నేను బైబిలును రెండవసారి, మూడవసారి చదివాను. నేనింకా అభివృద్ధిని సాధించేందుకు నాకు నడిపింపు అవసరమని అప్పుడు నేను గ్రహించాను.
నా అన్వేషణ ఫలించింది
నేను రోమన్ కాథోలిక్ చర్చిని సంప్రదించాను. యువకుడైన మత గురువు శ్రద్ధ అంతా నాకు చర్చి సిద్ధాంతాలను నేర్పించాలన్నదాని మీదనే, నేను వాటిని పూర్తిగా అంగీకరించాను. తరువాత, 1966లో నేను బాప్తిస్మం పొందాను, అది మా నాన్నకు అవమానకరమైంది. ఆ మతగురువు నాపై నీళ్ళను చల్లిన తరువాత, నేను బైబిలును చదవాలి అని చెప్పాడు, అయితే “పరిణామ సిద్ధాంతాన్ని పోప్ ఇప్పటికే అంగీకరించాడు కనుక, ఏం బాధపడవద్దు; గోధుమలకు కలుపు మొక్కలకు మధ్య తేడాను మనం తెలుసుకోవాలి” అని కూడా చెప్పాడు. నాకు విశ్వాసాన్నిచ్చిన పుస్తకం ప్రశ్నించబడుతుందని నేను ఆశ్చర్యపోయాను.
ఇలా ఉండగా, 1966 శరత్కాలంలో కాథోలిక్ కుటుంబీకుడైన నా స్నేహితునితో మాట్లాడి, అతనితో నా నమ్మకాలను పంచుకున్నాను. అతనికి కూడా బైబిలు పరిచయం ఉంది, మరి అతడు అర్మగిద్దోను గురించి మాట్లాడాడు. (ప్రకటన 16:16) యెహోవాసాక్షులతో అతడు కలుసుకుంటున్నాడని అతడు నాతో చెప్పాడు, నేను మొదట పేర్కొన్నట్లు రెండు నెలల క్రితం పర్యటనా బృందాన్ని నడుపుతుండగా నేను విన్నది వారి గురించే. అయితే, శక్తివంతమైన, సంపన్నమైన, ప్రఖ్యాతిగాంచిన రోమన్ కాథోలిక్ చర్చితో పోలిస్తే వాళ్ళ గుంపు చాలా అల్పమని నేను పరిగణించాను.
తరువాయి చర్చల్లో మేము మూడు ప్రాముఖ్యమైన ప్రాథమిక వివాదాంశాలను పరిశీలించాము. మొదటిది, రోమన్ కాథోలిక్ చర్చి మొదటి శతాబ్దపు క్రైస్తవత్వం యొక్క వారసత్వమా? రెండవది, అంతిమ అధికారిగా పరిగణించవలసింది నా చర్చినా లేక బైబిలునా? మరి మూడవది, సృష్టిని గూర్చిన బైబిలు వృత్తాంతమా లేక పరిణామ సిద్ధాంతమా, ఏది సరైనది?
మా ఇద్దరి విశ్వాసానికి ఆధారం బైబిలే కనుక, కాథోలిక్ చర్చి బోధలు తొలి క్రైస్తవత్వపు బోధలకు చాలా భిన్నమైనవని నన్ను ఒప్పించడంలో నా స్నేహితునికి పెద్ద కష్టమేమీ కాలేదు. ఉదాహరణకు, చర్చి యొక్క ప్రాముఖ్యమైన బోధ యేసుక్రీస్తు మరియు ఆయన అపొస్తలుల బోధలపై ఆధారపడినది కాదని కాథోలిక్ ఆధారాలు కూడా ఒప్పుకుంటున్నాయని నేను గ్రహించాను.
అది దానికి సంబంధించి, మన అంతిమ అధికారియై ఉండవలసింది చర్చియా లేక బైబిలా అనే ప్రశ్నకు మమ్మల్ని నడిపింది. నేను ఆగష్టిన్ అనే పరిశుద్ధుని మాటలను సూచించాను. అవి ఇలా ఉన్నాయి: “రోమా లోకూటా ఎస్ట్; క్యూసా ఫీనీటా ఎస్ట్” అంటే, “రోమ్ నిర్ణయించింది; ఆ విషయం ముగిసిపోయింది.” దేవుని వాక్యమైన బైబిలే మన అత్యున్నత అధికారియై ఉండాలి అని నా స్నేహితుడు అభిప్రాయపడ్డాడు. “ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు” అన్న అపొస్తలుని మాటలతో నేను ఏకీభవించవలసి వచ్చింది.—రోమీయులు 3:4.
చివరికి నా స్నేహితుడు పరిణామం మరియు క్రొత్త లోకం అనే టైప్ చేయబడిన ఒక పాత ప్రతిని నాకిచ్చాడు. తుది 1940లలో జెకోస్లోవాకియాలో యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు కనుక, వారు తమ ప్రచురణల నకలను తీసేవారు, అవి ఎవరికి అందుతాయనే విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. ఈ చిన్న పుస్తకాన్ని చదివిన తరువాత, సత్యం ఇందులో ఉందని నాకు తెలిసింది. నా స్నేహితుడు నాతో బైబిలును పఠించనారంభించాడు. “దేవుడు సత్యవంతుడగును గాక” అనే బైబిలు పఠన సహాయకం నుండి, ప్రతిసారి కొన్ని పేజీలను ఆయన నాకిచ్చేవాడు, మేము ఈ పేజీలను కలిసి పఠించేవాళ్ళం.
మేము ఈ చర్చలను మొదలుపెట్టిన కొద్ది కాలానికి అంటే, 1966 క్రిస్టమస్ కాలంలో పశ్చిమ జర్మనీలోని నా స్నేహితులు నన్ను సందర్శించేందుకు ప్రాగ్‌కు వచ్చారు. మా ఒక చర్చలో క్రైస్తవులు వేషధారులైన యుద్ధవ్యాపారులని వారు ఎగతాళి చేశారు. “మేము నాటో దేశాల సైనికులుగా, కమ్యూనిస్ట్ వార్సా ప్యాక్ట్ దేశంలో క్రైస్తవునిగా చెప్పుకునే మీకు వ్యతిరేకంగా మేము పోరాడగలం” అని వారు చెప్పారు. “వేషధారియై ఉండేదానికన్నా, శంకావాదియై ఉండడమే మిన్న” అనే నిర్ణయానికి వారు వచ్చారు. బహుశ వాళ్ళు చెప్పినది నిజమేనేమో అని నేను భావించాను. కనుక తరువాతి నా బైబిలు పఠనంలో, యుద్ధము మరియు దాని శిక్షణ విషయంలో క్రైస్తవులు ఎలా మెలగాలి అని నేను నా స్నేహితుని అడిగాను.
నేను ఎదుర్కొన్న తీర్మానాలు
నా స్నేహితుడిచ్చిన స్పష్టమైన వివరణనను విని నేను హతాశుడనయ్యాను. అయితే, ‘ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టాలని’ బైబిలు నేర్పిస్తున్న దానికి అనుగుణ్యంగా ఉండడం నా జీవితాన్ని మరియు ఉద్దేశించబడిన వృత్తిని నాటకీయంగా మార్చగలదు. (యెషయా 2:4) ఐదు నెలల్లో నేను మెడికల్ యూనివర్సిటీలో పట్టభద్రుడనవ్వవలసినవాడను, దాని తరువాత, నేను కొంతకాలం తప్పనిసరిగా సైనికసేవలో ఉండవలసి వస్తుంది. నేనేమి చేయాలి? నేను హతాశుడనయ్యాను. కనుక నేను దేవునికి ప్రార్థన చేశాను.
కొన్ని రోజులు బాగా ధ్యానించి ఆలోచించిన తర్వాత, నిజమైన క్రైస్తవులు సమాధానంగల మనుష్యులుగా ఉండాలని కోరబడుతున్న దానికి అనుగుణ్యంగా ఉండకపోవడానికి ఏ సాకును కనుగొనలేకపోయాను. నేను యూనివర్సిటీ నుండి పట్టభద్రుడనైన తరువాత, మనఃపూర్వకంగా ఎదిరించిన వ్యక్తిగా జైలులో వేయబడేంతవరకు నేను ఒక ఆసుపత్రిలో ఒక వైద్యునిగా పదవిని స్వీకరిస్తానని తీర్మానించుకున్నాను. రక్తాన్ని విసర్జించాలనే దానిని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో నేను తర్వాత తెలుసుకున్నాను. నా ఉద్యోగం రక్తాన్ని ఎక్కించే పనిలో నన్ను ఇరికిస్తుందని గ్రహించి, ఆ ఆసుపత్రిలో పని చేయడం మానుకోవాలని తీర్మానించుకున్నాను. (అపొస్తలుల కార్యములు 15:19, 20, 28, 29) ఆ తీర్మానం సమాజంలో నేను తీవ్రమైన అపకీర్తిని పొందడానికి కారణమైంది.
నేను తన రాజకీయ వృత్తిని పాడుచేసేందుకు కావాలని సమస్యలను సృష్టించేవాడను కానని రూఢిచేసుకున్న తరువాత, మా నాన్న జోక్యం చేసుకుని నా తప్పనిసరి సైనిక సేవను ఒక సంవత్సరానికి వాయిదా వేయించాడు. 1967లోని వేసవి నాకు ఎంతో కష్టంగా ఉండింది. నా పరిస్థితిని ఆలోచించండి: నేను క్రొత్త బైబిలు విద్యార్థిని, నా ఉపదేశకుడు ఇప్పటికీ నేను కలుస్తూ ఉండే ఒకేవొక యెహోవాసాక్షి వేసవిలో దగ్గరలో లేడు. “దేవుడు సత్యవంతుడుగా ఉండును గాక” అనే పుస్తకంలోని కొన్ని అధ్యాయాలను మాత్రమే నా వ్యక్తిగత పఠనం కొరకు మిగిల్చాడు. ఇవి మరియు బైబిలు మాత్రమే నాకు ఆత్మీయ నడిపింపుకు ఆధారాలు.
తరువాత నేను ఇతర సాక్షులతో సన్నిహితుడనయ్యాను, 1968, మార్చి 8లో నేను నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు నా సమర్పణను తెలియజేశాను. తరువాతి సంవత్సరం, ఇంగ్లాండులోని ఆక్స్ఫార్డ్ యూనివర్సిటీలో రెండు సంవత్సరాల స్నాతకోత్తర విద్యకు నన్ను ఆహ్వానించారు. నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, సాక్షులకు నిషేధం లేని దేశమైన ఇంగ్లాండుకు వెళ్ళాలని అక్కడ నేను ఆత్మీయంగా అభివృద్ధిని సాధించగలనని కొందరు సలహా ఇచ్చారు. అదే సమయంలో, నేను మంచి వృత్తిపర జీవనానికి సిద్ధపడవచ్చు కూడా. అయినప్పటికీ, నా సేవలు జెకోస్లోవాకియాలో అవసరమైనంతగా ఇంగ్లాండులో అవసరముండవని ఒక క్రైస్తవ పెద్ద చెప్పాడు. కనుక నేను ఉన్నతాభ్యాసం కొరకైన ఆ ఆహ్వానాన్ని కాదని, రహస్యంగా నడుస్తున్న ప్రకటన పనికి సహాయపడేందుకు జెకోస్లోవాకియాలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.
క్రైస్తవ అధ్యక్షులకు ప్రత్యేక ఉపదేశాలు ముఖ్య విషయంగానున్న రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరవ్వమని 1969లో నాకు ఆహ్వానం లభించింది. అదే సంవత్సరం, జెకోస్లోవాకియాలో యువకుడైన మంచి ఔషధ నిర్మాణకునిగా నాకు స్కాలర్షిప్ లభించింది. దాని ఫలితంగా, స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ ఔషధనిర్మాణ సంఘ సమావేశానికి హాజరయ్యాను.
ఒక శాస్త్రజ్ఞుడు తన అభిప్రాయాలను మార్చుకోవడం
నేను 1970లో ఒక ప్రసంగానికి హాజరయ్యాను, ఫ్రాన్టీషక్ వీస్కోచీల్ అనే శాస్త్రజ్ఞుడు సంకీర్ణమైన నాడీ ప్రచోదక వాహకాన్ని వివరించాడు. ఒక ప్రాణిలో అవసరం ఏర్పడినప్పుడెల్లా ఒక విశిష్ట పరిష్కారం ఇవ్వబడింది. “దీన్నెలా చెయ్యాలో ప్రకృతి అనే మాంత్రికురాలికి తెలుసు” అని ఆయన ముగించాడు.
ప్రసంగం తరువాత నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. “ప్రాణుల్లోని ఉన్నతమైన రూపకల్పనకు దేవునికే ఘనత చెందాలని మీరనుకోవడం లేదా?” అని అడిగాను. ఆయన నాస్తికుడు కనుక నా ప్రశ్న ఆయనకు ఆశ్చర్యం కలుగజేసింది. ఆయన మరో రకమైన ప్రశ్నలతో ప్రతిస్పందించాడు. “చెడుతనం ఎక్కడ నుండి వచ్చింది?, చాలా మంది పిల్లలు అనాథలుగా ఉన్నందుకు ఎవరు బాధ్యులు?” అని ఆయన అడిగాడు.
నేను సహేతుకమైన బైబిలు ఆధారిత జవాబులనిచ్చినప్పుడు ఆయనకు ఆసక్తి పెరిగింది. కాని, కణ నిర్మాణాన్ని గురించి విజ్ఞాన శాస్త్రపరంగా ప్రత్యేక సమాచారాన్ని బైబిలు ఎందుకివ్వలేదు, అలాగైతే దాని గ్రంథకర్త సృష్టికర్తేయని ప్రజలు సులభంగా గ్రహించేవారు కదా అని ఆయన అడిగాడు. “ఏది ఎక్కువ కష్టం, వివరించడమా, సృష్టించడమా?” అని అడుగుతూ నేను ప్రతిస్పందించాను. మానవుడు ఇక్కడికి వచ్చింది పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? అనే పుస్తకాన్ని ఆయనకిచ్చాను.
ఫ్రాన్టీషక్ పుస్తకాన్ని పైపైన చదివిన తరువాత, అది మామూలుదని, సరైంది కాదని దానిని తిరస్కరించాడు. బహు భార్యాభర్తలను కలిగివుండడాన్ని గురించి, దావీదు వ్యభిచరించడాన్ని గురించి, నిర్దోషిని దావీదు చంపడాన్ని గురించి బైబిలు చెప్పినవాటిని ఆయన విమర్శించాడు. (ఆదికాండము 29:23-29; 2 సమూయేలు 11:1-25) దేవుని సేవకుల లోపాలను గూర్చి కూడా అలాగే వారి పూర్తి ఉల్లంఘనలను గూర్చి బైబిలు నిజాయితీగా ఒప్పుకుంటోందని తెలియజేస్తూ ఆయన ఆక్షేపణలను ఖండించాను.
చివరికి, ఒకరిది సరైన ఉద్దేశం కానట్లయితే, అతనికి సత్యం ఎడల ప్రేమ లేనట్లయితే, ఏ రకమైన వాదము, తర్కము దేవుని ఉనికిని గూర్చి అతనిని ఒప్పించలేవని మా చర్చలో నేను ఒకసారి ఫ్రాన్టీషక్తో చెప్పాను. నేను అక్కడ నుండి బయలుదేరబోతుండగా, ఆయన నన్ను ఆపి బైబిలు పఠనం కావాలని కోరాడు. మానవుడు ఇక్కడికి వచ్చింది పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? అనే పుస్తకాన్ని తాను మళ్ళీ చదువుతానని, ఈ సారి మనస్సు విప్పి చదువుతానని చెప్పాడు. తరువాత, ఆయన వ్రాసిన ఒక ఉత్తరంలో “అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును” అని ఆయన ఎత్తి వ్రాసిన దాని ద్వారా నిదర్శనమౌతున్నట్లు ఆయన దృక్పథం పూర్తిగా మారింది.—యెషయా 2:17.
ఫ్రాన్టీషక్ మరియు ఆయన భార్య 1973 వేసవిలో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం పొందారు. ప్రస్తుతం, ఆయన ప్రాగ్‌లోని ఒక సంఘంలో పెద్దగా సేవచేస్తున్నాడు.
నిషేధమున్నప్పుడూ ప్రకటించడం
నిషేధమున్నప్పుడు అత్యంత జాగ్రత్తతో మా ప్రాంతీయ పరిచర్యను కొనసాగించాలని మాకు నిర్దేశమివ్వబడింది. ఒకసారి చిన్నావాడైన ఒక సాక్షి, తనతోపాటు ప్రకటన పనికి రమ్మని నన్ను అడుగుతూ ఉండేవాడు. యెహోవాసాక్షుల సంస్థకు నాయకత్వం వహించేవారు నిజానికి పరిచర్యకు బయటికి వెళ్తారా అని సందేహించాడు. మా అనియత పరిచర్యలో మేము అనేక మంచి సంభాషణలను ఆస్వాదించాము. చివరికి మేము ఒక మనిషిని కలిశాం, ఆ సమయంలో నేను ఆయనను గుర్తు పట్టకపోయినప్పటికీ, స్టేట్ సీక్రెట్ పోలీస్ ఆల్బంలోని ఫోటో నుండి నా ముఖాన్ని ఆయన గుర్తుపట్టాడు. నేను అరెస్ట్ చేయబడక పోయినప్పటికీ, అప్పటి నుండి కఠినమైన అధికారిక పరిశోధనకు గురయ్యాను, రహస్యంగా చేసే మా ప్రకటన పనిలో నా సఫలతకు అది అడ్డుగోడయ్యింది.
ముందటి సంవత్సరాల్లోని వాడుకలాగే, 1983 వేసవిలో నేను దేశంలోని పల్లె ప్రాంతాల్లో అనియత సాక్ష్యం ఇచ్చేందుకు కొన్ని రోజులు గడపడానికి ఒక గుంపును సంస్థీకరించాను. జ్ఞానపూర్వకమైన సలహాను పాటించక, నేను నా కారును తీసుకు వెళ్ళాను, ఎందుకంటే ప్రజా రవాణా సౌకర్యం కన్నా అదే మరింత వీలుగా ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్స్టోర్లో కొన్ని వస్తువులను కొనడానికి కొంత సమయాన్ని తీసుకున్నప్పుడు, నేను నా కారును బయట ముందు భాగాన నిలిపాను. నేను డబ్బు చెల్లిస్తుండగా, వృద్ధురాలైన ఒక ఉద్యోగస్థురాలికి యువకులైన దుకాణం అసిస్టెంట్లను చూపిస్తూ, “భవిష్యత్తులో మనమందరం యువకులుగానే ఉంటాం” అని చెప్పాను. ఆ స్త్రీ మందహాసం చేసింది. “అయితే, ఇది మానవ సాధ్యం కాదు, పైనుండి సహాయం అవసరం” అని అంటూ చెప్పడం కొనసాగించాను.
ప్రతిస్పందన ఏమీ లేనందువల్ల నేనక్కడ నుండి వచ్చేశాను. నేను మతాభిప్రాయాలను వృద్ధిచేస్తున్నానని అనుమానించిన ఆ ఉద్యోగస్థురాలు, నేను పొట్లాన్ని కారులో పెడుతుండగా కిటికీలో గుండా నాకు తెలియకుండా నన్ను గమనించింది. తర్వాత ఆమె పోలీసుకు తెలియజేసింది. కొన్ని గంటల తరువాత, ఆ పట్టణంలోని ఇతర భాగాల్లో అనియత సాక్ష్యంలో పాల్గొన్న తరువాత, నేను, నా భాగస్వామి కారు దగ్గరకు తిరిగి వచ్చాము. అకస్మాత్తుగా ఇద్దరు పోలీసులు వచ్చి మమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నారు.
మమ్మల్ని పంపించే ముందు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని చాలా గంటలు ప్రశ్నించారు. ఆ రోజు మాకు లభించిన ఆసక్తిగల వ్యక్తుల చిరునామాలను ఏం చేయాలి అన్నదానిని గూర్చే నా మొదటి ఆలోచన. అలా వాటిని టాయిలెట్లో వేసి నీళ్ళు కొట్టాలని నేను వెళ్ళాను. కాని నేనలా చేయక ముందే, పోలీసు దృఢమైన చెయ్యి నన్ను అడ్డగించింది. ఆయన ఆ కాగితాలను టాయిలెట్ బోల్ నుండి తీసి, వాటిని శుభ్రం చేశాడు. ఇది నాకు మరింత ఒత్తిడిని కలిగించింది, ఎందుకంటే తమ చిరునామాలను నాకిచ్చిన ప్రజలు ఇప్పుడు అపాయంలో ఉన్నారు.
తర్వాత, పోలీసు మమ్మల్నందరినీ రెయిడ్ చేసిన హోటల్ గదికి తీసుకు వెళ్ళారు. అసక్తిగల మిగిలినవారి చిరునామాలను జాగ్రత్తగా ఉంచకపోయినప్పటికీ, మరెవరి చిరునామాలను వారు కనుగొనలేకపోయారు. తరువాత, నాడీ ఔషధ నిర్మాణకునిగా నేను పనిచేసేచోట, చట్టవిరుద్ధమైన పనిలో నేను పాల్గొనడంవల్ల బహిరంగంగా నేను గద్దించబడ్డాను. అలాగే, మేము పరిచర్యలో పాల్గొనేందుకు ప్రయాణం చేసేందుకు నా కారును ఉపయోగించవద్దని హెచ్చరించిన జెకోస్లోవాకియాలోని ప్రకటన పని అధ్యక్షుడు కూడా నన్ను శాసించాడు.
క్రమశిక్షణకు లోబడడం
1976లో జెకోస్లోవాకియాలోని ప్రకటన పనికి అధ్యక్షత వహించే కమిటీలో సేవ చేయడానికి నేను నియమించబడ్డాను. ముందు చెప్పినట్లు, ఇలాంటి విషయాల్లో సరైన తీర్మానం తీసుకోనందువల్ల, రహస్య పోలీసు చేత నా జీవితం సూక్ష్మ పరిశోధనకు గురైనందువల్ల, దేశ కమిటీ నుండి, మరితర విభిన్న ఆధిక్యతల నుండి నన్ను తొలగించారు. ఈ ఆధిక్యతల్లో నేను ప్రత్యేకంగా ఇష్టపడిన ఒకటేంటంటే, ప్రయాణ కాపరులు మరియు పయినీర్లు అని పిలువబడే పూర్తికాల పరిచారకుల పాఠశాలలో బోధించడం.
నాకు లభించిన క్రమశిక్షణను నేను అంగీకరించాను, కాని ఈ సమయంలో అంటే 1980ల మధ్య కాలం నుండి చివరి వరకు నాకు కష్టమైన ఆత్మ పరిశోధనా కాలంగా ఉండేది. నేను మళ్ళీ అవివేకం చూపించకుండా మరింత వివేచనతో పనిచేయడం నేర్చుకుంటానా? 30వ కీర్తన, 5వ వచనం “సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును” అని చెబుతుంది. నవంబరు 1989లో జెకోస్లోవాకియాలో కమ్యూనిస్ట్ పరిపాలన పడిపోయినప్పుడు నాకు ఆ ఉదయం వచ్చింది.
అద్భుతమైన ఆశీర్వాదాలు
మన పరిచర్యలో స్వేచ్ఛగా పాల్గొనడం న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంతో సంభాషణను ఆస్వాదించడం అంటే ఎంతటి మార్పు! త్వరలోనే నేను ప్రయాణ కాపరిగా నియమించబడ్డాను, నేను ఈ పనిని 1990 జనవరిలో మొదలుపెట్టాను.
తర్వాత, 1991లో ఇంగ్లాండులోని మాంచెస్టర్‌లోని మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూల్‌కు హాజరయ్యే ఆధిక్యత లభించింది. రెండు నెలలు పరిపక్వతగల క్రైస్తవ పురుషుల సహవాసాన్ని మరియు వారి ఉపదేశాన్ని ఆస్వాదిస్తూ గడపడం ఎంతటి ఆశీర్వాదమో! ఆ కాలంలో ప్రతి రోజు, విద్యార్థులమైన మాకు పని నియామకాలుండేవి, అవి తీవ్రమైన విద్యా ఉపదేశం నుండి మాకు ఉపశమనాన్నిచ్చాయి. కిటికీలు తుడవడానికి నేను నియమించబడ్డాను.
ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చిన వెంటనే, నేను ఆగస్టు 9 నుండి 11 వరకు ప్రాగ్‌లోని అతి పెద్ద స్ట్రాహోఫ్ స్టేడియమ్లో జరుగనున్న యెహోవాసాక్షుల పెద్ద సమావేశానికి ఏర్పాట్లు చేసేందుకు సహాయపడడం మొదలుపెట్టాను. ఆ సందర్భంలో అనేక దేశాల నుండి 74,587 మంది ప్రజలు మన దేవుడైన యెహోవాను ఆరాధించేందుకు యథేచ్ఛగా హాజరయ్యారు!
తరువాతి సంవత్సరంలో నేను నాడీ ఔషధనిర్మాణకునిగా నా లౌకిక ఉద్యోగాన్ని వదిలి పెట్టుకున్నాను. దాదాపు నాలుగు సంవత్సరాలుగా, నేను ప్రాగ్‌లోని కార్యాలయంలో పని చేస్తున్నాను, నేను అక్కడ మళ్ళీ జెక్ రిపబ్లిక్లో యెహోవాసాక్షుల పనికి అధ్యక్షత వహించే కమిటీలో సేవ చేస్తున్నాను. ఇటీవలే యెహోవాసాక్షులకు విరాళంగా ఇవ్వబడిన క్రొత్త పది అంతస్తుల కట్టడం పునర్నవీకరించబడి, బ్రాంచ్ ఆఫీసుగా ఉపయోగించబడింది. 1994, మే 28న ఈ చక్కని వసతి యెహోవా సేవకు ఉపయోగించబడింది.
నా బంధువులతో సహా ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకోవడం నాకు లభించిన గొప్ప ఆశీర్వాదం. అయితే ఇప్పటికీ, మా అమ్మా నాన్నలు సాక్షులు కాలేదు, కాని నేను చేసే పని ఎడల అనుకూల భావాన్ని కలిగివున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో వారు మన కూటాలకు కొన్నింటికి హాజరయ్యారు. మరింత యథార్థ హృదయులైన లక్షలాది మంది వ్యక్తులతో వారు కూడా దేవుని రాజ్య పరిపాలనకు వినయంగా లోబడి, ఆయనను సేవించడాన్ని ఎంపిక చేసుకున్న వారి కొరకు దేవుడు దాచి ఉంచిన శాశ్వతమైన ఆశీర్వాదాలను ఆస్వాదించాలన్నది నా గొప్ప కోరిక.
(ఈ అర్టికిల్లో సూచించబడిన ప్రచురణలను వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొరేటేడ్ ప్రచురించింది.)
[12వ పేజీలోని చిత్రం]
నేను విశ్వవిద్యాలయ విద్యార్థినైనప్పుడు
[13వ పేజీలోని చిత్రాలు]
జెకొస్లోవాకియాలో విద్యాశాఖ మంత్రియైన మా నాన్న, ప్రముఖ నేత్ర సర్జన్ అయిన మా అమ్మ
[15వ పేజీలోని చిత్రం]
శాస్త్రజ్ఞుడును మరియు ఒకప్పుడు నిరీశ్వరవాదిగా ఉండి, తర్వాత సాక్షియైన ఫ్రాన్టీషక్ వీస్కోచీల్
[16, 17వ పేజీలోని చిత్రం]
కమ్యూనిజం పడిపోయినప్పటి నుండి యెహోవాసాక్షులు తూర్పు యూరప్‌లో అనేక పెద్ద సమావేశాలను జరుపుకున్నారు తూర్పు యూరప్‌లో సమావేశాలు. 1991లో ప్రేగ్లో జరిగిన ఒక సమావేశంలో 74,000 కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు
[18వ పేజీలోని చిత్రం]
ఇంగ్లాండ్‌లో మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూల్‌కు హాజరైనప్పుడు నా పని నియామకంలో
[18వ పేజీలోని చిత్రం]
1994, మే 28లో ప్రేగ్లో ప్రతిష్ఠించబడిన మన బ్రాంచ్ వసతులు