బైబిలు ఉద్దేశము
నిజ క్రైస్తవులు దైవిక పరిరక్షణ కొరకు నిరీక్షించవచ్చా?
క్రైస్తవులు తమ తోటి ఆరాధికులకు సహాయ సామాగ్రిని అందజేయడానికి, ప్రార్థన చేసిన తర్వాత, వారు చంపబడే సాధ్యతగల యుద్ధ ప్రాంతం మీదుగా ఒక సహాయార్ధమైన వాహనంలో ప్రయాణించారు. యుద్ధం చేస్తున్న సైన్యాలకు ఆశ్చర్యం కలిగేలా, వాళ్లు క్షేమంగా వెళ్లగలిగారు. దేవుని దూత వారిని కాపాడాడా?
అనేక సంవత్సరాలు పరిచారకులుగా సేవచేసిన ఒక క్రైస్తవ జంట, తాము ఇంటింట సువార్త సేవ చేస్తుండగా విమానం నేలపై కూలడంతో మరణించారు. దేవుని దూత ఆ క్షణంలో, వారినో లేక విమానాన్నో మరో స్థలానికి ఎందుకు నడిపించలేదు?—అపొస్తలుల కార్యములు 8:26 పోల్చండి.
ఈ సంఘటనలను ఒకదానికొకటి పోలుస్తూ, మనమిలా అడుగవచ్చు: ఇతరులు తరచూ ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులలోనూ తప్పించుకొని జీవిస్తుండగా, కొంతమంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని చేస్తుండగా ఎందుకు మరణిస్తారు? ప్రాముఖ్యంగా ఈ క్లిష్టమైన “అంత్యదినములలో,” క్రైస్తవులు దైవిక పరిరక్షణ కొరకు ఎదురు చూడవచ్చా?—2 తిమోతి 3:1.
దైవిక పరిరక్షణ యొక్క ఉద్దేశం
తన ప్రజలను ఆశీర్వదించి, పరిరక్షిస్తానని యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు. (నిర్గమకాండము 19:3-6; యెషయా 54:17) మొదటి శతాబ్దంలో, క్రైస్తవ సంఘం శైశవ దశలో ఉండగా ఆయన విశేషంగా అలా చేశాడు. అన్ని రకాలైన అద్భుతాలు విస్తృతంగా జరిగాయి. యేసు వేలాదిమందికి ఆహారం పెట్టడానికి ఆహారాన్ని ఎక్కువ చేశాడు, ఆయన, ఆయన అనుచరులు ప్రతి విధమైన రోగాన్ని, అస్వస్థతను బాగుచేశారు, దయ్యం పట్టిన వారిలో నుండి మానవాతీత శక్తులను వెళ్లగొట్టారు, మృతులను కూడా తిరిగి లేపారు. దైవిక నడిపింపు క్రింద, లేత సంఘం పెరిగి, స్థిరంగా స్థాపించబడింది. అయితే, దేవుని మద్దతు స్పష్టంగా ఉన్నప్పటికీ, నమ్మకంగల అనేకమంది క్రైస్తవులు అకాల మరణం అని పిలువగల మరణాన్ని పొందారు.—కీర్తన 90:10 పోల్చండి.
జెబెదయి కుమారులైన యాకోబు, యోహానుల విషయం పరిశీలించండి. పేతురుతోపాటు అపొస్తలులుగా ఎన్నుకొనబడిన వీరు కూడా క్రీస్తు సన్నిహిత స్నేహితులే.a కాని సా.శ. 44వ సంవత్సరంలో యాకోబు హత్య చేయబడ్డాడు, అయితే ఆయన సహోదరుడైన యోహాను మొదటి శతాబ్దాంతం వరకు జీవించాడు. ఇద్దరూ దేవుని చిత్తాన్ని చేస్తున్నవారే. యాకోబు మరణించడానికి, యోహాను జీవించడానికి ఎందుకు అనుమతించబడ్డారు?
యాకోబు జీవితాన్ని కాపాడగల సామర్థ్యం సర్వశక్తిగల దేవునికి కచ్చితంగా ఉంది. వాస్తవానికి, యాకోబు హత్య జరిగిన కొంతకాలానికి, యెహోవా దూత ద్వారా పేతురు మరణం నుండి తప్పించబడ్డాడు. యాకోబును దూత ఎందుకు విడిపించలేదు?—అపొస్తలుల కార్యములు 12:1-11.
దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఉపయోగించుకోబడ్డారు
దైవిక పరిరక్షణ ఎందుకివ్వబడిందో అర్థం చేసుకొనేందుకు, కేవలం ఆయా వ్యక్తులు మరికొంత కాలం జీవించి ఉండడానికే కాదుగాని అంతకంటే ఎంతో ప్రాముఖ్యమైనది అంటే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి అలా ఇవ్వబడిందని మనం గ్రహించాలి. ఉదాహరణకు, క్రైస్తవ సంఘం మొత్తంగా కాపాడబడడం గురించి హామీ ఇవ్వబడింది ఎందుకంటే, అది దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంతో సన్నిహిత సంబంధం కలిగివుంది. అయితే, వ్యక్తులుగా వారు తమ విశ్వాసాన్నిబట్టి మరణాన్ని ఎదుర్కొంటారని క్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. యేసు ఇలా చెప్పిన తర్వాత, అద్భుతమైన విడుదల గురించి కాదుగాని ‘అంతం వరకు సహనం కలిగివుండడం’ గురించి నొక్కిచెప్పాడు. (మత్తయి 24:9, 13) కొంతమంది వ్యక్తులు పరిరక్షించబడ్డారు గాని ఇతరులు పరిరక్షించబడలేదన్న వాస్తవం, దేవుడు పక్షపాతి అని సూచించదు. మానవజాతియంతటికీ చివరికి ప్రయోజనం కలుగజేసే తన సంకల్పాన్ని నెరవేర్చడానికి తగిన స్థానంలోవున్న వ్యక్తిని దేవుడు ఉపయోగించుకున్నాడంతే.
దేవుని సేవలో అకాల మరణం వాస్తవంగా సంభవించే అవకాశం ఉంది గనుక క్రైస్తవులు, దేవుని ఆరాధించినందుకు మరణ శిక్ష విధించబడిన ముగ్గురు నమ్మకమైన హెబ్రీయులు కలిగివున్నటువంటి సమతూకమైన దృక్పథాన్ని కలిగివుండాలి. బబులోను రాజుకు వారిలా చెప్పారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.”—దానియేలు 3:17, 18.
తన సంకల్పాన్ని నెరవేర్చడంలో పేతురు, యోహానులకున్న ప్రధాన పాత్రనుబట్టి యెహోవా వారి జీవితాలను కాపాడాడు. కాపరి పని చేయడం ద్వారా సంఘాన్ని ‘స్థిరపరచడానికి’ పేతురు ఉపయోగించుకోబడ్డాడు, అంటే దానిలో బైబిలులోని రెండు ప్రేరేపిత పుస్తకాలను వ్రాయడం చేరివుంది. (లూకా 22:32) యోహాను ఐదు బైబిలు పుస్తకాలను వ్రాశాడు మరియు ఆయన తొలి సంఘంలో ‘స్తంభంగా’ ఉన్నాడు.—గలతీయులు 2:9; యోహాను 21:15-23.
తన సేవకుల జీవితాల్లో యెహోవా కచ్చితంగా ఎప్పుడు మరియు ఏ విధంగా జోక్యం చేసుకుంటాడనేది ఆయన ఎలా నిశ్చయిస్తాడో ముందుగానే చెప్పడం అసాధ్యం. “యుగసమాప్తి వరకు సదాకాలము” తన అనుచరులతోకూడా ఉంటానని క్రీస్తు వాగ్దానం చేశాడన్నది మాత్రమే కచ్చితంగా చెప్పగలం. (మత్తయి 28:20) ప్రాముఖ్యంగా, ప్రకటన పనిలో దేవదూతల నడిపింపు ద్వారా ఆయన ‘మనతో’ ఉంటాడు. (మత్తయి 13:36-43; ప్రకటన 14:6) ఈ సాధారణ సూచనలు తప్ప, దైవిక సహాయం కచ్చితంగా ఎలా ప్రదర్శించబడుతుంది లేక ఎవరు దైవిక పరిరక్షణ పొందగలుగుతారు అనేవి మనం ముందుగా తెలుసుకోలేము. తనకు దేవుని పరిరక్షణ మరియు నడిపింపు ఉన్నాయని ఒక క్రైస్తవుడు భావిస్తే అప్పుడేమిటి? దీన్ని నిష్కర్షగా నిరూపించడం లేదా ఖండించడం కుదరదు గనుక, అట్టి వ్యక్తి యథార్థంగా చెప్పుకొనే విషయాలను ఎవరూ విమర్శించకూడదు.
దేవుడు కఠినుడా?
క్రైస్తవుల మరణాన్ని దేవుడు అనుమతిస్తాడన్న వాస్తవం, ఆయన ఏదో ఒక విధంగా కఠినుడని చూపిస్తుందా? ఎంతమాత్రం కాదు. (ప్రసంగి 9:11) యెహోవా మన జీవితాలను కేవలం కొన్ని సంవత్సరాలు లేక చివరికి కొన్ని దశాబ్దాలు మాత్రమే కాదుగాని నిరంతరం కాపాడడానికి పనిచేస్తున్నాడు. తనను ప్రేమించే లేక తన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తి యొక్క నిత్య సంక్షేమం నిమిత్తం ఆయన తన ఉన్నతమైన దృక్కోణం నుండి, సంఘటనలను నడిపిస్తాడు. (మత్తయి 18:14 పోల్చండి.) ఆయన సంకల్ప నెరవేర్పు అంటే ఈ విధానంలో మనం వేటినుండి బాధను అనుభవించామో వాటన్నిటినీ—చివరికి మరణాన్ని—పూర్తిగా తీసివేయడమని భావం. దేవుని వ్యవహారాలు ఎంత సంక్లిష్టంగా, పరిపూర్ణంగా ఉంటాయంటే, అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పేలా కదిలించబడ్డాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు? ఆయన మార్గములెంతో అగమ్యములు.”—రోమీయులు 11:33.
దేవుని ప్రేమ నుండి మనలను ఏదీ వేరు చేయలేదు గనుక, ‘నాకు దేవుని పరిరక్షణ ఉంటుందా?’ అని కాదుగాని, ‘నాకు యెహోవా ఆశీర్వాదం ఉంటుందా?’ అని ప్రతి క్రైస్తవుడు ప్రశ్నించుకోవాలి. మనమలా చేస్తే, మనకు ఈ విధానంలో ఏమి జరిగినప్పటికీ, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పరిపూర్ణ జీవితం యొక్క నిత్యత్వంతో పోల్చినప్పుడు, ఈ విధానంలోని ఏ బాధయైనా, చివరికి మరణమైనా అది ‘క్షణమాత్రముండేదిగా, తేలికైనదిగా’ కనిపిస్తుంది.—2 కొరింథీయులు 4:17.
[అధస్సూచి]
a పేతురు, యాకోబు, యోహానులు యేసు రూపాంతరాన్ని (మార్కు 9:2) యాయీరు కుమార్తె పునరుత్థానాన్ని (మార్కు 5:22-24, 35-42) చూశారు; యేసు వ్యక్తిగత పరీక్షా సమయంలో వారు గెత్సమనే తోటలో సమీపంలోనే ఉన్నారు (మార్కు 14:32-42); అంద్రెయతోపాటు వారు యెరూషలేము నాశనం గురించి, ఆయన భవిష్యత్ ప్రత్యక్షత గురించి, విధానాంతం గురించి యేసును ప్రశ్నించారు.—మత్తయి 24:3; మార్కు 13:1-3.