నేను మరణాన్ని సమీపించడంవల్ల వైద్యులు నేర్చుకున్నారు
మే 1991 మధ్య భాగంలో మేము మా నాలుగవ బిడ్డ పుడతాడని ఎదురు చూస్తున్నాం. అప్పట్లో మా చిన్నకొడుకు మీకెల్కు తొమ్మిదేండ్లు, మా కవల కూతుళ్ళు మారియ మరియు సారాలకు 13 ఏండ్లు. మరో బిడ్డ గురించి అనుకోకపోయినప్పటికీ, మరో బిడ్డను కూడా కల్గివుంటామనే ఆలోచనకు మేము త్వరలోనే అలవాటుపడ్డాం.
మూడవ నెలలో ఒక సాయంత్రంవేళ, నాకు ఊపిరితిత్తిలో నొప్పి వచ్చింది. మరుసటి రోజు నేను నడవలేకపోయాను. నాకు న్యుమోనియా ఉందని వైద్యురాలు చెప్పింది, మరి ఆమె నాకు పెన్సిలిన్ ఇచ్చింది. నేను రెండు రోజుల తరువాత కోలుకోవడం మొదలెట్టాను, కాని నేను చాలా నీరసంగా ఉండేదాన్ని. అకస్మాత్తుగా నాకు మరో ఊపిరితిత్తిలో కూడా నొప్పి మొదలయ్యింది, మరి అదే ప్రక్రియ మళ్ళీ చేయబడింది.
తరువాయి రోజుల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నందువల్ల నేను పడుకోలేకపోయాను. మొదటిసారి నొప్పి వచ్చిన వారం తరువాత, నా కాళ్ళు నీలి రంగుకు మారి, వాచాయి. ఈసారి నేను ఆసుపత్రిలో చేర్చబడ్డాను. నాకు ఊపిరితిత్తుల్లో నొప్పి న్యుమోనియా వల్ల కాదు గాని రక్తం గడ్డలు కట్టుకోవడం వల్లనే అని వైద్యురాలు తెలియజేసింది. నా గజ్జలో రక్తం గడ్డ కట్టుకుందని కూడా ఆమె చెప్పింది. స్వీడన్‌లోని గర్భిణుల మరణాలకు గల సాధారణ కారణాల్లో రక్తం గడ్డ కట్టడం ఒకటని నేను తెలుసుకున్నాను. కొన్ని రోజుల తరువాత, నేను స్టాక్‌హోమ్‌లోని కారోలిన్స్క షుకుసెట్ ఆసుపత్రికి తరలించబడ్డాను, అందులో గర్భిణుల సమస్యల కొరకైన ప్రత్యేక ప్రసూతి క్లినిక్ ఉంది.
రక్తాన్ని పలచన చేసేందుకు హెపరిన్ మందును నాకు ఉపయోగించాలని వైద్యులు తీర్మానించారు. ఊపిరితిత్తుల్లో మరోసారి రక్తం గడ్డకట్టుకునే ప్రమాదం కన్నా హెపరిన్‌ను తీసుకోవడం వల్ల రక్తస్రావం కలిగే ప్రమాదం అల్పమైనదే అని వారు నాకు హామీ ఇచ్చారు. రెండు వారాల తరువాత, నేను ఇంటికి తిరిగి వెళ్ళేంతగా కోలుకున్నాను. నాలో పెరుగుతున్న చురుకైన బిడ్డతో నేను బ్రతికి ఉన్నందువల్ల నేను ఎంతో హాయిని పూర్తి సంతోషాన్ని అనుభవించాను.
ప్రసవ సమయం
ప్రసవం జరిగించాలని తీర్మానించబడింది, కాని చర్యలను గైకొనక ముందే నా పొత్తి కడుపు క్రింది భాగంలో నొప్పి మొదలైంది. కనుక నేను ఆసుపత్రికి తీసుకువెళ్ళబడ్డాను. అయితే, వైద్యులు దానిలో లోపమేమీ కనుగొనలేదు.
మరుసటి సాయంత్రం నా పొత్తి కడుపు బాగా ఉబ్బింది, నొప్పి తగ్గనేలేదు. మధ్య రాత్రి, ఒక వైద్యురాలు నన్ను పరిశీలించి, నేను ప్రసవ వేదనలో ఉన్నానని కనుగొనింది. మరుసటి రోజు ఉదయం నా పొత్తి కడుపు మరింత ఉబ్బింది, వేదన భరింపరానిదయ్యింది. వైద్యురాలు కలత చెందినట్లు కనిపించింది, బిడ్డ కదలికలను చివరి సారిగా నేను ఎప్పుడు గమనించాను అని అడిగింది. చాలా కాలంగా ఏ కదలికను గమనించలేదని నేను అకస్మాత్తుగా గ్రహించాను.
నన్ను వెంటనే ప్రసవ వార్డులోకి తరలించారు. ఆ సిబ్బంది దూరంగా మాట్లాడుకోవడాన్ని నేను వినగలిగాను. “ఆమె రక్తం ఎక్కించుకోవడాన్ని నిరాకరిస్తోంది” అని ఒకరు చెప్పారు. అప్పుడు ఒక నర్సు నా దగ్గరగా వంగి, పెద్ద స్వరంలో ఈ విధంగా అన్నది: “నీ బిడ్డ చనిపోయిందని నీకు తెలుసు, తెలియదంటావా?” ఎవరో నా గుండెలో కత్తి దించినట్లు అనిపించింది.—సామెతలు 12:18.
రక్తాన్ని తీసుకోవడాన్ని స్థిరంగా నిరాకరించడం
అకస్మాత్తుగా మా వైద్యుడు వచ్చి నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని నాకు చెప్పాడు. నేను ఇప్పటికీ రక్తమార్పిడిని అంగీకరించకూడదనే తీర్మానంతోనే ఉన్నానా అని ఆయన నన్ను అడిగాడు. నేను అవునని కచ్చితంగా చెప్పాను, ఆ తరువాత నాకేమీ గుర్తు లేదు. అయితే, క్రైస్తవులు ‘రక్తాన్ని విసర్జించాలని’ ఆజ్ఞాపించబడ్డారని, నేను దేవుని నియమానికి విధేయురాలుగా ఉండాలని కోరుకుంటున్నానని మా వైద్యునికి చెప్పాను.—అపొస్తలుల కార్యములు 15:28, 29; 21:25.
ఇంతలో, నిపుణత గల సర్జన్ అయిన బార్బ్రో లార్సన్ అనే మరో వైద్యురాలిని పిలిపించారు. ఆమె వెంటనే వచ్చి, శస్త్రచికిత్స చేసింది. ఆమె నా పొత్తి కడుపును కోసి చూసినప్పుడు అంతర్గత రక్తస్రావం వల్ల నేను మూడు లీటర్ల రక్తాన్ని కోల్పోయానని వారు కనుగొన్నారు. అయితే రక్తాన్ని ఎక్కించుకోవడాన్ని గూర్చిన నా తీర్మానాన్ని డా. లార్సన్ గౌరవించింది.
కొన్ని నిమిషాల్లో నేను చనిపోయి ఉండేదాన్ని అని మరో వైద్యుడు తరువాత చెప్పాడు. “ఆమె ఇప్పుడు బ్రతికి ఉందోలేదో నాకు తెలియదు” అని ఆయన చెప్పినట్లు నివేదించబడింది. రక్తస్రావం ఎక్కడ నుండి జరుగుతుందో వైద్యులు కనుగొనలేకపోయారు కనుక, వారు నా పొత్తి కడుపులో అదిమిపట్టే పరికరాన్ని పెట్టారని తరువాత తెలిసింది. ఏది ఏమైనా నేను బ్రతుకుతానని వైద్యులు గాని, నర్సులు గాని ఏ మాత్రం హామీనివ్వలేదు.
నా పిల్లలు ఆసుపత్రికి వచ్చి, నా పరిస్థితిని తెలుసుకున్నప్పుడు, అర్మగిద్దోను త్వరలోనే వస్తుంది, దాని తరువాత పునరుత్థానంలో వారు నన్ను తిరిగి కలుసుకుంటారని వారిలో ఒకరు చెప్పారు. పునరుత్థానమనేది, ఎంత అద్భుతమైన, సరైన ఏర్పాటో!—యోహాను 5:28, 29; 11:17-44; అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 21:3, 4.
మరణచ్ఛాయలోవున్న జీవితం
నా హెమోగ్లోబిన్ డెసిలీటర్కు 4 గ్రాములకు తగ్గిపోయింది అయితే రక్తస్రావం ఆగిపోయినట్లుంది. నేను నా కేసు రికార్డులో, నవంబరు 22, 1991 తేజరిల్లు! (ఆంగ్లం) ప్రతిని క్రితం ఉంచాను. డా. లార్సన్ దాన్ని కనుగొని “రక్తాన్ని ఎక్కించకుండానే రక్తస్రావాన్ని నివారించడం మరియు అదుపు చేయడం” అనే శీర్షికను చూసింది. నేను బ్రతకడానికి సహాయపడేందుకుగాను తాను ఏమైనా ఉపయోగించగలదా అని ఆమె దాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. ఆమె కళ్ళు “ఎరిత్రోపాయటిన్” అనే పదంపై పడ్డాయి, ఎర్ర రక్త కణాలను శరీరం ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించే మందది. ఇప్పుడు ఆమె దాన్ని ఇచ్చింది. ఈ మందు ఫలితాలనిచ్చేందుకు సమయం పడుతుంది. కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఎరిత్రోపాయటిన్ కావలసినంత త్వరగా పనిచేస్తుందా?
మరుసటి రోజు నా హెమోగ్లోబిన్ స్థాయి 2.9 కి తగ్గింది. నేను మేల్కొన్న వెంటనే, నా ప్రక్కనే మా కుటుంబ సభ్యులనందరిని చూసినప్పుడు, ఏమి జరిగిందా అని నేను ఆశ్చర్యపోయాను. శ్వాసయంత్రం ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. నేను బాధతో స్థాణువై పోయాను కానీ, నేను కనీసం ఏడ్వనైనా ఏడ్వలేకపోయాను. నేను బ్రతకడానికి నా బలాన్ని నేను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు నాతో చెప్పారు.
నా కడుపులో ఉంచబడిన అదిమిపట్టే పరికరం వల్ల నాకు మరుసటి రోజు బాధ కలిగి జ్వరం వచ్చింది. నా హెమోగ్లోబిన్ 2.7 కు తగ్గింది. ఆ పరిస్థితిలో ఎవరికైనా అనష్తీషియా ఇవ్వడం ప్రమాదకరమైనప్పటికి, లోపల ఉన్న అదిమిపట్టే పరికరాన్ని తీసివేయడానికి వారు మళ్ళీ శస్త్ర చికిత్స చేయడం తప్పనిసరైంది అని డా. లార్సన్ వివరించింది.
సర్జరీకి ముందు నన్ను వచ్చి చూడడానికి పిల్లలు అనుమతించబడ్డారు. అది ఇక వీడ్కోలు పలికే సమయమని ప్రతి ఒక్కరు అనుకున్నారు. వైద్య సిబ్బందిలోని చాలా మంది ఏడ్చేశారు. నేను బ్రతుకుతానని వాళ్ళు నమ్మలేదు. మా పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు, అది నన్ను శాంతపరచి, నమ్మకాన్నిచ్చింది.
నాకు కొద్దిపాటి అనష్తీషియానే ఇచ్చినందువల్ల సిబ్బందిలోనివారు ఒకరితోనొకరు మాట్లాడుకున్న విషయాలు అప్పుడప్పుడు వినబడేవి. నేనప్పటికే చనిపోయానన్నట్లు కొందరు మాట్లాడేవారు. శస్త్రచికిత్స సమయంలో నేను విన్న వాటిని తరువాత నేను చెప్పినప్పుడు ఒక నర్సు మన్నించమని నన్ను కోరింది. కాని నేను చనిపోబోతున్నాననే తను నమ్మిందని, అయినా నేను ఎలా బ్రతికానో ఆమెకు అర్థంకావడం లేదని ఆమె చెప్పింది.
మరుసటి రోజు నేను కొంత కోలుకున్నాను. నా హెమోగ్లోబిన్ 2.9 కి చేరుకుంది, రక్తంలోని ఎర్ర రక్త కణాలు 9 శాతానికి చేరుకున్నాయి. నా క్రైస్తవ సహోదర సహోదరీలు మా కుటుంబ సభ్యులకొరకు భోజనాన్ని, కాఫీని తీసుకుని నన్ను సందర్శించడానికి వచ్చారు. వారు చూపించిన ప్రేమానురాగాలకు మేము కృతజ్ఞులము. సాయంకాలానికి నా పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది, అయితే స్థిరంగా ఉంది, మరి నేను మరో వార్డుకు తరలించబడ్డాను.
వైద్యులు నేర్చుకోవడం
వైద్య సిబ్బందిలోని చాలా మంది సభ్యులు నా గురించి జిజ్ఞాస కలిగి ఉన్నారు, వారిలో చాలా మంది నాతో దయగా ఉండేవారు. “నీ దేవుడే నిన్ను రక్షించి ఉంటాడు” అని ఒక నర్సు చెప్పింది. వేరే వార్డులోని మరో వైద్యుడు వచ్చి ఈ విధంగా వ్యాఖ్యానించాడు: “ఇంత తక్కువ హెమోగ్లోబిన్గల మనిషి ఎలా ఉంటుందో చూడడానికని నేను వచ్చాను. నువ్వు ఇంత చురుకుగా ఎలా ఉన్నావో నాకర్థం కావడం లేదు.”
మరుసటి రోజు, తనకు సెలవైనప్పటికీ నా వైద్యురాలు నన్ను చూడడానికి వచ్చింది. జరిగిన దానినిబట్టి తాను తగ్గించబడినట్లు భావించిందని ఆమె నాతో చెప్పింది. నేను పూర్తిగా కోలుకుంటే రోగులకు చికిత్స చేయడంలో రక్తాన్నిచ్చి చేసే చికిత్సకున్న ప్రత్యామ్నాయాలను గూర్చిన క్రొత్త పరిశోధనను వారు ఆరంభించబోతున్నారని ఆమె చెప్పింది.
నేను త్వరగా కోలుకోవడం జరిగింది. విషాదకరమైన నా ప్రసవం జరిగిన రెండున్నర వారాల తరువాత, నా హెమోగ్లోబిన్ స్థాయి 8 కన్నా కొంత ఎక్కువకు చేరుకుంది. అలా నేను ఆసుపత్రి నుండి వచ్చేశాను. మూడు రోజుల తరువాత మాకు యెహోవాసాక్షుల సాంవత్సరిక ప్రాంతీయ సమావేశం జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్ళాను. విషమ స్థితిలో మాకు ఎంతో సహాయపడిన మన క్రైస్తవ సహోదర సహోదరీలనందరిని మళ్ళీ చూడడం ఎంత ప్రోత్సాహకరంగా ఉందో!—సామెతలు 17:17.
డా. లార్సన్ వాగ్దానం చేసినట్లు, నా కేసును గూర్చి “రక్తమార్పిడి బదులు ఎరిత్రోపాయటిన్” అనే శీర్షికతో ఒక నివేదిక స్వీడన్ వైద్య పత్రికయైన లాకర్టిడ్నిన్గన్ అనే పత్రికలో ప్రచురించబడింది. అదిలా చెప్పింది: “యెహోవాసాక్షుల్లో ఒకరైన 35 ఏండ్ల ఒక స్త్రీ ప్రసూతి సంబంధంగా అమిత రక్తస్రావంతో బాధపడింది. ఆమె రక్తాన్ని ఎక్కించుకోవడాన్ని నిరాకరించింది, అయితే ఎరిత్రోపాయటిన్ చికిత్సను స్వీకరించింది. శస్త్రచికిత్స తరువాత ఎక్కువ మోతాదులోని ఎరిత్రోపాయటిన్తో తొమ్మిది రోజుల చికిత్స జరిగిన తరువాత ఎటువంటి చెడు పరిణామాలు లేకుండానే హెమోగ్లోబిన్ డెసిలీటర్కు 2.9 నుండి 8.2 వరకు పెరిగింది.”
“రోగి మొదట్లో చాలా బలహీనంగా ఉండేది, కాని ఆశ్చర్యం కలిగించేంత వేగంగా ఆమె కోలుకుంది. అంతేకాక, శస్త్రచికిత్స తరువాత చికిత్స పూర్తిగా ఇబ్బందులేమీ లేకుండానే జరిగింది. రోగి రెండు వారాల తరువాత ఇంటికి వెళ్ళగలిగింది” అని అంటూ ఆ శీర్షిక ముగించింది.
ఈ అనుభవం మాకు ప్రయాసమైనదిగాను అసంతోషకరమైనదిగాను ఉన్నప్పటికీ దాని ఫలితంగా, రక్తమార్పిడి చేసే చికిత్సకున్న ప్రత్యామ్నాయాలను గూర్చి కొందరు వైద్యులు ఎక్కువ నేర్చుకుని ఉండవచ్చని మేము సంతృప్తిచెందుతున్నాము. ఫలకరమైనవని నిరూపించబడిన పద్ధతుల్లో ప్రయత్నించి చికిత్స చేసి చూడడానికి వారు సిద్ధపడతారని ఆశించవచ్చు.—ఆన్ ఇప్సిమోటిస్ చెప్పినది.
[24వ పేజీలోని చిత్రం]
సహాయకరంగా ఉన్న మా వైద్యురాలితో