ఆ ఖరీదైన కొమ్ములు గల జంతువు
దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి
అకస్మాత్తుగా, ఖడ్గమృగం శరవేగంతో దూసుకువెళ్ళింది. ఆ మనిషి ఒక వైపుకు దూకి, దగ్గరలో ఉన్న చిన్నచెట్టు వైపుకు పరుగెత్తాడు. కాని ఖడ్గమృగం అతనికి పరుగెత్తుకుని పారిపోయే అవకాశాన్నివ్వకుండా అద్భుతమైన వేగంతో అతనిని గిరగిర తిప్పేసింది. అది అతనిని తన కొమ్ములతో పట్టుకొని, గాలిలోకి విసిరివేయక ముందు అనేకసార్లు అతని వెంట పడింది. పాపం ఆ మనిషి నేలమీదికి పడక ముందు ఖడ్గమృగం భుజాల పైబడి క్రిందికి దభేలున పడ్డాడు. అది తనను త్రొక్కుతుందని, పొడుస్తుందని అనుకుంటూ అతడు అక్కడ పడి ఉన్నాడు. ఖడ్గమృగం ముందుకు అడుగువేయగా, ఆ మనిషి తన కాళ్ళను లేపాడు, కాని ఖడ్గమృగం హుంకరిస్తూ, వడిగా నడిచి వెళ్ళిపోయింది!
ఇది ఆఫ్రికా యొక్క నల్లని ఖడ్గమృగం—జిజ్ఞాస గలది, జగడమాడేది, సులభంగా ఉద్రేకం చెందేది. ఖడ్గమృగం తాను ఆఘ్రాణించగల, వినగల అద్భుతమైన తన ఇంద్రియబోధము (మంచి కనుదృష్టి లేనందువల్ల) తాను చూడలేని దాని వైపుకు వెళ్ళేందుకు అప్రమత్తం చేసినట్లయితే, అది రైలు నుండి సీతాకోకచిలుక వరకు ఏదైనా సరే దాని దగ్గరికి సంతోషంగా పరుగెత్తుతుంది! భుజాల వరకు ఒకటిన్నర మీటర్ల పొడవుండి, దాదాపు 1,000 కిలోల బరువున్నప్పటికీ అది గంటకు దాదాపు 55 కిలోమీటర్ల దూరం పరుగెత్తగలదు, అది ఉన్నట్లుండి, తన అంత పొడవున గిర్రున తిరుగుతుంది!
కొన్నిసార్లు అది కేవలం భయపెట్టేందుకు లేదా తమాషాకు దూసుకువెళ్తుంది. “గాలిలో ఎంత దుమ్ము రేగితే రూఫస్కు అంత సంతోషంగా ఉంటుంది” అని రూఫస్ అనే పేరు గల నల్లని చిన్న ఖడ్గమృగం యొక్క ఒకప్పటి యజమానియైన యూలీన్ కార్నీ చెబుతుంది. పొదల గుండా రూఫస్ “సకిలిస్తూ, గుర్రుపెడ్తూ, ఘీంకారం చేస్తూ” వచ్చి, “తోటంతటా అమిత వేగంలో పరుగెత్తుకుంటూ వచ్చి, అకస్మాత్తుగా వరండాలో ఆగి గంభీరంగా మెట్లెక్కి [తన] మడత కుర్చీ ప్రక్కన పడుకున్న” ఒక సందర్భాన్ని ఆమె మురిపెంగా గుర్తు చేసుకుంటుంది.
నల్లని ఖడ్గమృగాన్ని గూర్చి అధ్యయనం చేసిన అనేకులు దాని ఎడల ఇలాంటి అనురాగాన్ని పెంచుకున్నారు. అయితే, మానవుల్లో ఉన్నట్లే ఖడ్గమృగాల మధ్య విభిన్న వ్యక్తిత్వాలుంటాయని వారందరూ అంగీకరిస్తారు. అయితే నిజంగా కోపిష్టులైన ఖడ్గమృగాలను గూర్చి జాగ్రత్తపడండి! దక్షిణ ఆఫ్రికాలోని జంతువుల ఒక ప్రఖ్యాత గైడ్ హెచ్చరించేదేమంటే, నల్లని ఖడ్గమృగాన్ని “ఎన్నటికీ పూర్తిగా నమ్మకూడదు, దానికి దూరంగా ఉండాలి.” విచారకరంగా, మానవుడు దాన్ని హింసించడమే అది దాడి చేయడానికి కారణం. ఖడ్గమృగానికున్న ఒకే ఒక శత్రువైన మానవుడు తనను తాను అలా చేసుకున్నాడన్న వాస్తవాన్ని గూర్చి మొదట వర్ణించబడిన ఖడ్గమృగాన్ని తప్పించుకున్న ప్రొఫెసర్ రూడల్ఫ్ షెన్కల్ విలపిస్తున్నాడు.
ఆఫ్రికాలోని మరో ఖడ్గమృగమైన తెల్లని దాన్ని గూర్చి ఏమిటి? సాధారణంగా అది తన అల్లరి సోదరికి భిన్నంగా ఎంతో శాంత స్వభావం గలది. అలాగే అది ప్రపంచంలోని మూడవ పెద్ద భూచర జంతువు, అది నల్లని దానికన్నా దాదాపు రెండు రెట్ల పరిమాణంలో ఉంటుంది. దాని పెద్ద తల ఎంత బరువైనదంటే దానిని ఎత్తిపట్టుకోవడానికి నలుగురు మనుష్యులు కావాలి! అయినప్పటికీ, తన నల్లని సహోదరి ఎంత చురుకైనదో అది కూడా అంత చురుకైనదే.
అడవిలో మానవుడు ఎదురైనప్పుడు, తెల్లని ఖడ్గమృగం సాధారణంగా, మానవుని చూడగానే, అతని స్వరం వినగానే, అతని వాసన ఎరుగగానే భయంతో పారిపోతుంది. అయితే, రెనో (ఖడ్గమృగం) అనే తమ పుస్తకంలో డారిల్ మరియు శర్న బాఫ్లర్ దీనిని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. “ఇటీవల సంవత్సరాల్లో, నల్లనివాటికన్నా, తెల్లనివాటి వల్లే ఎక్కువ గాయాలు కలిగాయని” వారు వ్రాస్తున్నారు, ఇది ఒకవేళ మానవునికి దానియెడల “గౌరవం లేనందువల్లేనని” కూడా వారు వ్రాస్తున్నారు.
ఇష్టమైన కాలక్షేపం
ఆఫ్రికా ఖడ్గమృగానికి మరింత ఇష్టమైనదొకటుంది. అదేంటంటే మట్టి, అది మట్టిని పిచ్చిగా ఇష్టపడుతుంది! అనేక ఖడ్గమృగాలు వాటికిష్టమైన మట్టి దగ్గరికి వెళ్ళేటప్పుడు, తమ వేగాన్ని అధికంచేస్తాయి, ముందున్న దానిని గూర్చిన సంతోషంతో గట్టిగా అరుస్తాయి. ఖడ్గమృగం నెమ్మదిగా మట్టిలోకి దిగుతుండగా, “చిన్న నిట్టూర్పు వినబడుతుంది, తృప్తి చెందిన జంతువు కొన్ని నిమిషాలు ఒకవైపుకు పడుకుంటుంది . . . తన శరీరాన్ని శుభ్రంచేసుకునే ముందు, తరచూ వెనక్కి దొర్లి, ఆకాశం వైపుకు కాళ్ళను ఆడిస్తుంది” అని దీనిని తరచూ గమనించిన బాల్ఫర్ దంపతులు చెబుతున్నారు.
రెండు రకాల ఖడ్గమృగాలూ కొన్నిసార్లు ఒకే మట్టిలో పొర్లే కాలక్షేపంలో పడి తమ హుందాతనాన్ని బూడిదపాలు చేస్తాయి. పైన పేర్కొనబడిన చిన్న రూఫస్ తన మట్టి స్నానానికి ఎంత ఉత్సాహపడేదంటే “ఆ స్నానం పూర్తికాక ముందు తోటంతా తిరిగేందుకు కొన్నిసార్లు పైకి వచ్చేది, ఆ సంతోషాన్ని మళ్ళీ అనుభవించేందుకుగాను తిరిగి గుంతలోకి వెళ్ళే ముందు గుర్రాల్లా గాలిలోకి ఎగిరేది.”
అయితే, ఆ మట్టి ఆనందకరమైన కాలక్షేపమే కాక, ఇతర అవసరాలను కూడా తీరుస్తుంది. అది తోటి ఖడ్గమృగాలతోను మట్టిని ఇష్టపడే ఇతర జంతువులతోను కలిసే స్థలంగా ఉంటుంది, చికాకు కలిగించే ఈగల కాటు నుండి కొంత ఉపశమనాన్నిస్తుంది, ఎండ వల్ల వేడెక్కిన వాటి శరీరాలను చల్లబరుస్తుంది. అందువల్ల ఖడ్గమృగాలు కొన్నిసార్లు బురద మట్టిలో అవిరామంగా గంటల కొద్ది ఉండడంలో ఆశ్చర్యం లేదు.
ఏ ఖడ్గమృగం ఏది?
ఏది ఏ ఖడ్గమృగం అని ఒక వ్యక్తి ఎలా చెప్పగలడు? ఒకటి నిజంగా నల్లనిది, మరొకటి తెల్లనిదా? కాదు. అవి రెండూ బూడిద రంగులోనే ఉంటాయి, కాని మీరు ఆ బూడిద రంగుల్లోని వ్యత్యాసాన్ని గ్రహించగలిగినట్లయితే బూడిద ఛాయలు భిన్నంగా కనిపిస్తాయి. నిజానికి మీరు ఏమి చూస్తారంటే, అవి క్రితంసారి మట్టి గుంటలో పొర్లినప్పుడు వాటి చర్మంపై అంటుకొని ఉండే మట్టి రంగునే మీరిప్పుడు చూడగలుగుతారు.
కాని వాటి నోటి రూపం ఏది ఏదో మీకు తెలియజేస్తుంది. నల్లని ఖడ్గమృగం లేత కొమ్మలను ఆకులను తింటుంది కనుక, దాని పెదవి ముందుకు పొడుచుకుని ఉంటుంది, అది చిన్న చెట్ల ఆకులను, కొమ్మలను గుండ్రంగా మెలివేయడానికి లేదా లాగి పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. కనుక కొక్కెములాంటి పెదవులు గల ఖడ్గమృగం అన్నదే దానికి మరింత సరైన పేరు. తెల్లని ఖడ్గమృగం, చిన్న చెట్లను తింటుంది. కనుక, లాన్ మౌలర్లా గడ్డిని కోయగలిగేలా దాని ముక్కు పొడుగ్గా ఉంటుంది. కనుక, చతురస్రాకారపు పెదవుల గల ఖడ్గమృగం అన్నది దానికి మరింత సరైన పేరనడంలో ఆశ్చర్యం లేదు. కొంత వరకు, నల్లని లేదా తెల్లని అన్న భేదం తొలి డచ్ నివాసులు దక్షిణ ఆఫ్రికాలో నివాసమేర్పరచుకున్నప్పుడు మొదలై అలాగే ఉండిపోయింది.
ఆ ఖరీదైన కొమ్ములు
ఖడ్గమృగం అనే పేరు “ముక్కు-కొమ్ము” అనే అర్థం గల రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది. ఖడ్గమృగం కొమ్ములు ఎలా వస్తాయి? అవి మొదలు నుండి చీలిపోయినట్లుగా ఉంటాయి గనుక వెండ్రుకలు అంటుకుపోయి తయారయ్యాయని కొందరు వర్ణిస్తారు. అయితే అవి నిజానికి వెండ్రుకలు కావు కాని “అతి సూక్ష్మంగా చూస్తే, గిట్టలు గల జంతువు యొక్క [డెక్కలు గల జంతువులా] డెక్కల వలె ఉంటాయి” అని దక్షిణ ఆఫ్రికా దేశీయ పార్క్ బోర్డులోని వైజ్ఞానిక సలహాదారుడైన డా. కారె డా క్రాఫె అంటున్నారు.
వేలి గోర్లు పెరిగినట్లే, కొమ్ము పెరుగుతూనే ఉంటుంది. ప్రఖ్యాతి గాంచిన గర్టీ అనే పేరు గల నల్లని ఖడ్గమృగం కొమ్ము 1.4 మీటరు కన్నా పొడవు పెరిగింది, ఒక తెల్లని ఖడ్గమృగం కొమ్ము రెండు మీటర్ల వరకు పెరిగింది! కొన్నిసార్లు జరుగుతున్నట్లు ఒకవేళ కొమ్ము విరిగిపోతే, అది సంవత్సరానికి ఎనిమిది సెంటీమీటర్ల పొడవు చొప్పున పెరిగి యథాస్థితికి వస్తుంది.
ఖడ్గమృగం కొమ్ములు ఎందుకు ఖరీదైనవి? చాలామంది ప్రజలు వాటిని మందులకు ఉపయోగిస్తారు, మరి అనేకులు కటారికి పిడిగా ఖడ్గమృగం కొమ్ములను ఉంచుకోవడం ఒక హోదాగా భావిస్తారు. గిరాకీ ఎంత ఎక్కువ అంటే, వ్యాపారం కూడా చాలా లాభదాయకం కావడం వల్ల లాభం కొరకు అత్యాశపడే వారిచేత వేల కొలది ఖడ్గమృగాలు చంపబడ్డాయి.
ఒకప్పుడు విపరీతంగా అంతరించబోయిన తెల్లని ఖడ్గమృగం పరిస్థితి సంరక్షకుల తీవ్రమైన ప్రయత్నాల వల్ల మెరుగుపడింది. ఇప్పుడు బాగానే కోలుకుంటుంది. కాని దాని నల్లని సహోదరి విషయంలో అలా కాదు. జంతువుల కొమ్ములను తీయడంతో సహా చట్టవిరుద్ధంగా వేటాడడాన్ని నిరోధించేందుకు అనేక పద్ధతులు అమలు చేయబడ్డాయి. కాని ఈ పెద్ద ప్రయత్నం వల్ల పెద్ద ఫలితం లేదని నిరూపించబడింది. ఖడ్గమృగం కొమ్ములు కిలోగ్రాముకి 2,000 డాలర్ల వరకు ఉంది, దీనిని చట్టవిరుద్ధంగా వేటాడేవారు కొమ్మును తీయగా మిగిలిన మొదళ్ళు కూడా లాభాన్నిస్తాయని భావిస్తారు. అయినప్పటికీ, మానవుని పేరాశ సఫలం కాదని నిరీక్షించవచ్చు, తద్వారా బావి తరాలు కూడా ఈ అద్భుతమైన జంతువును గూర్చి ఎక్కువగా తెలుసుకొని సంతోషించగలుగుతాయి.
[26వ పేజీలోని చిత్రం]
నల్లని ఖడ్గమృగం మరియు తెల్లని ఖడ్గమృగం రెండూ బూడిద రంగులోనే ఉంటాయి కదా, మరి మీరు వాటి మధ్య తేడాను ఎలా చెప్పగలరు?
[25వ పేజీలోని చిత్రం]
తెల్లని ఖడ్గమృగం మరియు దాని బిడ్డ
[క్రెడిట్ లైను]
National Parks Board of South Africa