ప్రపంచ పరిశీలన
“భావోద్రేక ప్రాథమిక చికిత్స”
ప్రమాదం జరిగిన స్థలంవద్ద ఇవ్వాల్సిన ప్రాథమిక చికిత్సలో భౌతిక గాయాలపట్ల అవధానం చూపడం కంటే ఎక్కువే ఉండాలి. గాయపడిన వ్యక్తికి భావోద్రేక సహాయం కూడా కావాలని సూడెయిస్టి జెయిటంగ్ అనే జర్మనీ వార్తాపత్రిక నివేదిస్తుంది. ఎలాంటి సహాయం? “భావోద్రేక ప్రాథమిక చికితను” అందజేసేందుకు నాలుగు స్వల్ప చర్యలను జర్మనీ మనస్తత్వ శాస్త్రజ్ఞుల వృత్తి సంబంధ సమాఖ్య సూచించింది. ఆ సూచనలు, ప్రమాదానికి గురైన వారు మరియు ప్రొఫెషనల్స్‌తో జరిపిన ఇంటర్‌వ్యూల ఫలితాలే. అవిలా ఉన్నాయి: “బాధితునికి మీరక్కడ ఉన్నారని చెప్పండి. బాధితున్ని అవరోధాలనుండి కాపాడండి. వారిని స్పృషించండి. మాట్లాడండి అలాగే వినండి.” ఈ విషయాలను వైద్యులు మరియు డ్రైవింగు శిక్షణ పాఠశాలల ద్వారా వృద్ధిచేసి ప్రాథమిక చికిత్స అభ్యాసాల్లో చేర్చాలని ప్రయత్నాలు చేయబడుతున్నాయి.
సోమవారం ఉదయపు సిండ్రోమ్
“సోమవారం ఉదయం పనికి వెళ్లాలన్న ఒత్తిడి, గుండెపోటు ప్రమాదాన్ని 33 శాతానికి పెంచుతుందని” జర్నల్ డో బ్రజిల్ నివేదిస్తుంది. మరి 2,636 కేసులను గురించిన ఒక జర్మను అధ్యయనం, “గుండెపోటు వచ్చే ప్రమాదం వారంలోని దినము, గడియను బట్టి అధికంగా ఉంటుందని వెల్లడి చేసింది.” అయితే, సోమవారాలు ప్రాముఖ్యంగా ప్రమాదకరమైనవని, మరి గుండెపోట్లు దినమంతటికంటే ఉదయం మూడురెట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని కనుగొనబడింది. వృత్తి పని వారు మరియు ఆఫీసుల్లో పని చేసే వాళ్లకంటే కర్మాగారాల్లో పనిచేసే వారు సోమవారం-ఉదయపు సిండ్రోమ్‌వలన ఎక్కువ ప్రభావితులౌతున్నారు. “వారాంతంలో ఉపశమనం పొంది, వెంటనే ఎక్కువ తీవ్రమైన పనికి ఉపక్రమించడం [గుండె] పోట్లకు కారణమని మేము అనుమానిస్తున్నామని,” పరిశోధనను నిర్దేశించిన ప్రొఫెసర్ స్టీఫన్ విల్లీక్ చెబుతున్నారు. హృద్బాధగల ప్రజలు తమ వారపు పనిని నెమ్మదైన పద్ధతిలో ప్రారంభించాలని సలహా ఇవ్వబడింది.
“ప్రపంచంలోని ప్రముఖ జూదమాడే దేశం”
“జపాను ప్రపంచంలోని ప్రముఖ జూదమాడే దేశమయ్యిందని,” ఆసాహి ఈవినింగ్ న్యూస్ చెబుతుంది. ఎక్కువ డబ్బు (65 శాతం), పిన్‌బాల్ మషీన్‌లను ఉపయోగించి ఆడే పాఛిన్‌కో పై జూదానికై పెట్టబడుతుంది. ప్రాంతీయ గుర్రపందాలకు ఇతర దేశాలన్నిటి కంటే జపాను వారు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అమ్మకాలు 1992లో అమెరికాకంటే రెండంతలు ఉన్నాయి, మరి హాంగ్ కాంగ్, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కంటే నాలుగంతలు ఎక్కువగా ఉన్నాయి. అమ్మకాలను పెంచడానికి, ఇప్పుడు యౌవన వనితలను గురిగా పెట్టుకున్నారు. నగోయాలోని ఒక వనిత ఇలా చెబుతుంది: “మా అమ్మానాన్నలు పెద్ద గొడవ చేస్తారు, అయితే ‘జాతీయ మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు వాటిని ఏర్పాటు చేస్తున్నాయి. అవి చెడ్డవెలా అవుతాయి?’ అని నేను వాళ్లకు ఎప్పుడూ చెబుతుంటాను.” వాస్తవానికి, సూత్రపరంగా జపాను వారి చట్టం జూదాన్ని నిషేధించింది, అయితే ప్రజా జూదం “ఆచరణలో మాత్రం అసలు ఆర్థిక రాబడిలా” చెలామణి అవుతుందని పరిశోధకుడైన హీరొషీ టకావూఛీ చెబుతున్నాడు. జూదపు పద్ధతులు ఒక దేశపు స్థూల జాతీయోత్పత్తి యొక్క 4 శాతాన్ని మించిపోతే, అది సాంఘిక సమస్య అవుతుంది. జపానులో ఇప్పుడు 5.7 శాతం ఉన్నాయి.
“ఇండియా యొక్క ‘బరువులు మోసే’ చిన్ని జీవులు”
ఇండియా యొక్క 1.7 కోట్ల నుండి 4.4 కోట్లమంది బాల కార్మికులను టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక అలా పిలిచింది. మరి 2.3 కోట్లమంది బారీ కాయులైన నిరుద్యోగులు ఉన్నప్పటికీ, కర్మాగార యజమానులు చిన్న పిల్లలనే పనిలోకి తీసుకోడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వీరు పెద్దలకిచ్చే జీతానికి సగం ఇచ్చినా ఎదురించరు, మరి తాము చేస్తున్న పనుల వలన వచ్చే ఆరోగ్య ప్రమాదాలను వారెన్నడూ ప్రశ్నించరు. పాశ్చాత్య దేశాలు కొన్ని, పిల్లలు ఉత్పత్తి చేసిన వస్తువులను దిగుమతి చేసుకోడానికి నిరాకరించినప్పుడు కొంతమంది ఉత్పత్తిదారులు పిల్లలకు బదులు పెద్దలను పెట్టుకున్నారు. అలాంటి దురాచారాన్ని మాన్పించి, తలిదండ్రులు తమ పిల్లలకు కనీస విద్యాభ్యాసాన్ని ఇప్పించేలా వారిని ప్రోద్బలం చేసేందుకు ఇంకా ఎక్కువ కట్టుదిట్టమైన చట్టాలను చేస్తామని ఇండియా ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇండియా ప్రెసిడెంట్ డా. శంకర్ దయాల్ శర్మ ఇలా చెబుతున్నారు: “అటు ఆచారము లేక ఆర్థిక అవసరత బాల శ్రామికులు పని చేయడాన్ని న్యాయబద్ధం చేయలేదు మరి అలా పిల్లలను ఉపయోగించుకోవడాన్ని ఆపడం నేటి అతి పెద్ద సవాళ్లలో ఒకటి.” అయితే, కఠిన దారిద్ర్యం ఒక “పచ్చి నిజమని” మరి బాలలు ఆర్జించే డబ్బు కుటుంబానికి ఎంతగానో అవసరమైన మద్దతు అనే విషయం ఆధారంగా అనేకులు దాన్ని వెనకేసుకొస్తారు.
శరణార్థుల్లో చేతబడి
యుద్ధ బాధిత రువాండానుండి వచ్చిన శరణార్థులు, ఉత్తర టాంజానియాలోని నగారా నందలి తమ క్యాంపులలో మరొక సమస్యచేత పీడింపబడుతున్నారు: అదే చేతబడి. రాటర్స్ వార్తా సేవల ప్రకారం, క్యాంపుల్లో చేతబడి “గంభీరమైన సమస్య” అని యు.ఎన్.హెచ్.సీ.ఆర్ (ఐక్యరాజ్య సమితి శరణార్థి హై కమీషన్) ప్రత్యేకంగా సూచిస్తుంది. యు.ఎన్.హెచ్.సీ.ఆర్ ప్రతినిధి క్రిస్ బౌర్స్ ప్రకారం, ప్రతిరాత్రి ఇద్దరు లేక ముగ్గురు మనుష్యులు ఓకల్ట్ ఆచారాల్లో చంపబడుతున్నారు. అతనిలా వివరిస్తున్నారు: “శవాలు ఒక పద్ధతిలోనే అంగ ఛేదనం చేయబడి ఉండటం మేము చూస్తున్నాము గనుక, చేతబడి ఇమిడి ఉందని మాకు తెలుసు.” మరి 1994 చివరకల్లా దాదాపు 5,80,000 మంది ప్రజలు నగారా క్యాంపులో జీవిస్తున్నారు, ప్రతి దినం 2,000 మంది క్రొత్త శరణార్థులు వస్తున్నారు. ఒక యు.ఎన్ మూలం ఇలా చెప్పడాన్ని రాటర్స్ సూచిస్తుంది: “చేతబడి చాలా ఎక్కువ అవుతుంది మరి దానితో ఎలా వ్యవహరించాలో మాకు తెలియటం లేదు.”
రక్తము—ఓ ప్రమాదకరమైన “మందు”
“యెహోవాసాక్షులు రక్త మార్పిడిని నిరాకరించడం ఒకవేళ సరైనదే నంటారా?” అని ఇంగ్లాండ్ యొక్క సండే టెలిగ్రాఫ్ అడుగుతుంది. ఇటీవలి రక్తమార్పిడుల వలన, హెపిటైటెస్ సీ మరియు ఎయిడ్స్ వైరస్ వస్తాయన్న భయం కూడా ఇమిడి ఉంది. “అయితే వృత్తి సంబంధ పత్రికల్లో వర్ణించబడిన అనేక ప్రమాదాల్లో ఇన్‌ఫెక్షన్ కేవలం ఒకటి మాత్రమే” అని టెలిగ్రాఫ్ చెబుతుంది. “రక్తమార్పిడి వలన వచ్చే ప్రతికూల ప్రతిస్పందనలు 20 శాతం వరకూ ఉండగలవని అంచనావేసిన అధ్యయనం వంటివి ప్రజలకు ఎక్కువేమీ తెలియదు. ఉదర లేక పెద్ద ప్రేగు శస్త్రచికిత్సల తర్వాత సరిగ్గా కోలుకోకుండా ఉంటారని అప్పటి రక్తమార్పిడి ముందే చెబుతుందని తెలియజేసిన అధ్యయనాల గురించి కూడా వాళ్లకు ఎక్కువేమి తెలియదు.” అధిక శాతం రక్త మార్పిడులు అనవసరంగా ఇవ్వబడ్డాయని, మరి మార్పిడి చేసే విధానాలు విభిన్నంగా ఉన్నా అవి వైజ్ఞానిక డాటాపై కాక అలవాట్లపై ఆధారపడి ఉన్నాయని కూడా అధ్యయనాలు చూపిస్తున్నాయి. రక్తాన్ని “ఒక శక్తివంతమైన మందు” అని పిలుస్తూ, దాని విషయంలో “అనేకమంది శస్త్రచికిత్సకులు ప్రాముఖ్యమైన వాటినే మర్చిపోతున్నారని” రాయల్ విక్టోరియా ఇన్‌ఫర్మరీ నందలి కన్సల్‌టెంట్ సర్జన్ టామ్ లెనార్డ్ అంటూ ఆయనిలా కూడా వ్యాఖ్యానించారు: “రక్తం ఒక క్రొత్త మందు అయితే దానికి ఉత్పత్తి లైసెన్సు లభించదు.”
ఉపయోగకరమైన పురుగులు
“మరొక ప్లేగు రాకుండా నివారించడానికి వానపాములు ఇండియా యొక్క రహస్యాస్త్రాలు” అని న్యూ సైంటిస్ట్ పత్రిక చెబుతుంది. చెత్త పేరుకుపోతే, మరణకరమైన వ్యాధులను తమలో కలిగుండే ఎలుకలు మరియు ఇతర పురుగులు ఎక్కువవుతాయి. ఇప్పుడు ఒక ప్రాంతీయ జాతికి చెందిన, భూమిలోకి లోతుగా వెళ్లే ఫ్హెరెటీమా ఎలాంగాటా అనే పురుగు చెత్తను ఉపయోగకరమైన ఎరువుగా మార్చడానికి ఉపయోగింపబడుతుంది. చెత్త ఉండే పెట్టెల్లోకి వాటిని పంపినప్పుడు, ఈ పురుగులు చెత్తను తిని త్వరగా లయమైపోయే మెత్తని ఎరువును ఉత్పత్తి చేస్తాయి. బొంబాయిలో ఇప్పటికే ఉపయోగించబడుతున్న ఈ పద్ధతి ఒక దినానికి నాలుగు టన్నుల చెత్తచెదారాన్ని సరి చేస్తుంది. ప్రస్తుతం చెత్తను కాల్చే మరియు పాతిపెట్టే పద్ధతులపై ఆధారపడే ప్రాంతీయ అధికారులు ఈ ఉపయోగకరమైన పురుగులను ఆసక్తితో పరిగణిస్తున్నారు.
ప్రభుత్వం వలన మరణం
పైన చూపబడినది, హవాయ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్. జే. రమ్మల్ వ్రాసిన పుస్తకం యొక్క శీర్షిక. ఎనిమిది సంవత్సరాల కాల నిడివిలో, ఈ శతాబ్దంలో మానవ వధలో ప్రభుత్వాల పాత్ర అనే విషయంపై రమ్మల్ గారు “వేలకొలది మూలాల నుండి” సమాచారాన్ని సేకరించారు. ది హోనోలూలూ అడ్వర్‌టైజర్ ప్రకారం, “దాదాపు 17 కోట్ల పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తుపాకీతో కాల్చి చంపబడ్డారు, కొట్టబడ్డారు, చిత్రవధ చేయబడ్డారు, కత్తితో పొడవబడ్డారు, దహించబడ్డారు, ఆకలికి, చలికి, నలిగి లేక పని చేస్తూ చనిపోయారు; సజీవంగా పాతిపెట్టబడ్డారు, ముంచబడ్డారు, ఉరితీయబడ్డారు, బాంబులు వేసి లేక అస్త్రం లేని, నిస్సహాయ పౌరులు మరియు విదేశీయులు ప్రభుత్వం చేత సాధ్యమైనన్ని అనేక విధాలుగా చంపబడ్డారని” ఆ పుస్తకం చెప్పింది. “మన జాతి ఆధునిక బ్లాక్ ప్లేగ్‌తో నాశనం చేయబడుతుందేమో అన్నట్లు ఉందని” రమ్మల్ కనుగొన్న వాటిని గురించి సూచిస్తూ “అంత ఎక్కువ శాతం మానవ వధను వేరే ఇతర శతాబ్దమేది చూడలేదని” వార్తాపత్రిక నివేదించింది.
ప్రీస్టులకు “ఫోన్‌లు లేవు”
మొబైల్ టెలిఫోన్‌లు సంభాషణలో అత్యంత సులభతరమైన పద్ధతికి ప్రతీకలు, అయితే మంచి వస్తువులను మరీ ఎక్కువగా కలిగుండటం మంచిది కాదని ఫిన్‌లాండ్‌లోని ఒక బిషప్ నిర్ణయించాడు. రాటర్స్ ప్రకారం, “ఒక మొబైల్ ఫోన్ దాన్ని వాడే వారికి సహాయం చేయాలి కానీ దాసున్ని చేయకూడదని” బిషప్ నొక్కి చెప్పాడు మరి చర్చి పని వారు, ప్రచారకులు తమ గాడ్జెట్‌ల ఉపయోగాన్ని తగ్గించాలని ఆజ్ఞాపించాడు. చర్చికి హాజరయ్యే వారి ఫిర్యాదులు బిషప్ చెవినబడినట్టున్నాయి—కొందరు మతోద్యోగులు చర్చి సేవలు జరుగుతున్నప్పుడు ఫోన్ కాల్‌లను అందుకున్నారు. అలాంటి కాల్ ఒకటి సరిగ్గా అంత్యక్రియల సమయంలో వచ్చిందని నివేదించబడింది. అదే విధంగా, ఒక స్త్రీ తన పాపాలను ఒప్పుకుంటుండగా ప్రీస్టు ఫోన్ మోగడం తాను సృష్టంగా విన్నదని ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత వారు తమ తమ ఫోన్‌లను తమతోపాటు కన్ఫెషనల్‌లోకి తీసుకురావద్దని ఇటలీలోని ఒక కాథోలిక్ పత్రిక ప్రీస్టులకు సలహా ఇచ్చింది.