మా పాఠకుల నుండి
అసలు వ్యక్తి చెప్పిన వృత్తాంతానికి ప్రతిస్పందన “ఇక ఎంతమాత్రము ఒక రాతిబండ కాదు లేదా ఒక ద్వీపము కాదు,” అనే శీర్షికలో హృదయాన్ని స్పర్శించే లారీ రూబేన్ కథకు కృతజ్ఞతలు. (డిశంబరు 8, 1994) గతంలో కష్టాలననుభవించినవారిని పరిగణనలోకి తీసుకోవడంలో అనేకులు తరచూ విఫలులౌతారు. నాకు నిజంగా విశ్వాసముంటే, నాకు అంత ఆతురత ఉండదని నా స్వంత కుమారుడే నాతో ఒకసారి చెప్పాడు! కాని అందరూ గతాన్ని అలా మర్చిపోలేరు. దయచేసి మానవుని ఇలాంటి అనుభవాలను ప్రచురిస్తూనే ఉండండి. ఇది కొందరి హృదయాలను మృదుతరం చేస్తుందని ప్రార్థిస్తున్నాను.
ఎమ్. ఎల్., బ్రిటన్
నేను కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మాటల కోసం తడబడుతున్నాను. గత కాలంలో అత్యాచారానికి గురై భయపడుతున్నవారిని మనం తరచూ కలుస్తూ ఉంటాము. సంఘంతో కలిసి పనిచేయడానికి యెహోవాతో మంచి సంబంధాన్ని వృద్ధిచేసుకోవడానికి అలాంటివారికి సహాయపడడమనేది కఠినమైన సవాలే. అలాంటివారు ప్రేమించబడుతున్నారని, వారియందు నమ్మకముంచబడుతుందని తెలుసుకోవడం సాధ్యమేనని ఆ శీర్షిక చూపించింది.
జె. డి., కెనడా
నేను ఇప్పటికి 25 సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉన్నాను. నేను నా మెదడుతో దేవునికి నమ్మకంగా సేవ చేశాను, కాని నా హృదయం రాతితో మూయబడినట్లుగా నాకు అనిపించింది. నేను త్రాగుబోతు కుటుంబంలో పెరిగాను, దెబ్బలు తిన్నాను, లైంగిక అత్యాచారానికి, మరితర బాధలకు గురయ్యాను. యెహోవా నా కోసం ఎంతో చేశాడు, కాని నేను ఆయనను ప్రేమించలేకపోతున్నాను. ఒకరోజు నేను కూడా, ఒకవేళ నా గతాన్ని గూర్చి ఏడ్వగలనని, అలాంటి భావాలు కలుగుతాయని లారీ రూబెన్ కథ నాకు చిన్న నిరీక్షణనిచ్చింది. లారీ రూబేన్‌కు ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ, నమ్మకము, సమ్మతము అనే భావాలు నాకు కూడా కలుగవచ్చు.
ఎ.ఎఫ్., అమెరికా
ఇంతకు ముందటి కొన్ని కథలు మానవాతీతుల్లా కనిపించే—భయంలేని, అంతర్ సంఘర్షణలు లేని, బలహీనతలు లేని వారిని గూర్చినవిగా ఉండేవి. లారీ రూబేన్ కథ మరొక కోణం నుండి చెప్పబడింది. అతడు ఎంతో నిష్కల్మషంగా తన భావాలను వెలిబుచ్చాడు. ఇలాంటి జీవిత కథలు మాకు వాస్తవమైనవే. ఎందుకంటే, ఆ విషయాలు మా సొంత జీవితాల్లో జరిగాయి.
ఎఫ్. డి. ఎస్., బ్రెజిల్
ఆర్.హెచ్ కారకము తేజరిల్లు! ఇలాంటి వివాదాస్పదమైన విషయాలను చర్చించడం నిజంగా మెచ్చుకొనదగినది. “ఆర్.హెచ్. కారకము మరియు మీరు” (డిశంబరు 8, 1994) అనే శీర్షిక మతపిచ్చితో తయారు చేయబడలేదు. ఈ విషయం విజ్ఞాన శాస్త్రపరమైన ప్రామాణికతతో, నవీన వైద్యశాస్త్ర పదాలు ఉపయోగించబడి, అయితే స్పష్టమైన, అర్థం చేసుకోగలిగే పదాల్లో చెప్పబడింది. యెహోవాసాక్షులు మానవ జీవితానికి ఏ విలువనివ్వని అంధ విశ్వాసులు అనే ఆరోపణను తప్పని నిరూపిస్తుంది.
ఐ. ఆర్., జర్మనీ
నేను గర్భవతిని, నా బిడ్డ శరీరానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిరక్షకాలను తొలగించేందుకు ఒక ఇంజక్షన్ ఇవ్వవలసి ఉందని వైద్యుడు నాకు చెప్పాడు. నాకు ఆర్.హెచ్. కారకాన్ని గూర్చి ఏమీ తెలియక, అభ్యంతరం చెప్పలేదు. అయితే ఆ ఇంజక్షన్ రక్తం నుండి చేయబడిందని తెలిసినప్పుడు, నేను దేవుని నియమాన్ని ఉల్లంఘించి ఉంటానే అని భయపడ్డాను. ఆ ఇంజక్షన్ తీసుకోవడం మనస్సాక్షికి సంబంధించిన విషయమని మీరు వివరించడం ద్వారా మీ శీర్షిక నాకు సహాయం చేసింది.
సి. డబ్ల్యు., అమెరికా
అవివాహిత తల్లులు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . . అవివాహిత తల్లులు తమ పరిస్థితిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొనగలరు?” (డిశంబరు 8, 1994)కు కృతజ్ఞతలు. తప్పు చేయడం వల్ల గర్భధారణ జరుగుతుందని మీరు తెలియజేశారు. అయితే దాని గురించి ఎక్కువగా చెప్పి, జరిగిపోయిన దానిని గూర్చి తప్పుచేసిన అమ్మాయిలను మరింత బాధపెట్టే బదులు, మీరు ఆచరణయోగ్యమైన, ప్రయోజనకరమైన మార్గదర్శకాలను ఇచ్చారు.
జె. డి., అమెరికా
నేను పది సంవత్సరాల క్రితం ఒంటరి తల్లినయ్యాను. అయితే యెహోవా సహాయంతో, నా క్రైస్తవ తలిదండ్రుల సహాయంతో నేను అన్నీ సరిచేసుకోగలిగాను. నా పాఠశాల విద్య పూర్తి అయిన తరువాత నేను ఆరు సంవత్సరాలు పూర్తికాల సేవ చేసిన తరువాత, ఇప్పుడు సంఘ పెద్దగా సేవచేస్తున్న ఒక క్రైస్తవ పురుషుడ్ని వివాహం చేసుకున్నాను. నేను యెహోవా దయా కృపలవలన ఎంతో ప్రయోజనం పొందాను, ఇతరులకు సహాయపడేందుకు నా అనుభవాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాను.
ఎ. ఎమ్., అమెరికా
నేను ఈ శీర్షికను చదివినప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. మీరు వివరించిన అదే పరిస్థితిని నేను అనుభవించాను. ఇప్పుడు నేను క్రైస్తవురాలిని, నేను నా కూతురిని జ్ఞానపూర్వకంగా పెంచగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను.
సి. ఆర్. ఎస్., బ్రెజిల్
గురకపెట్టడం “మీరు గురక పెడతారా?” (సెప్టెంబరు 8, 1994) అనే శీర్షిక గురక పెట్టడం వల్ల కలిగే ప్రమాదాలను గూర్చి హెచ్చరించింది. మీరు విపరీతంగా గురకపెట్టేటట్లయితే, మీకు స్లీప్ ఆప్నియా ఉందన్నమాట అని సూచించారు. అలాగని ఏమి లేదు. మనం వృద్ధులమౌతున్న కొలది గురక పెట్టాలనే ఉన్ముఖత మనకుంటుంది. సహజమే. అలర్జీ మరియు సైనస్ సమస్యల వల్ల కూడా అలా జరుగవచ్చు. విపరీతంగా గురక పెట్టడంతోపాటు, మధ్య మధ్యలో శ్వాస ఆగుతున్నట్లయితే, ఎగయూపిరి పీల్చుకుంటున్నట్లయితే, ముక్కుతో గాఢంగా శ్వాస వదిలినట్లయితే, పగలు నిద్రమత్తుగా ఉన్నట్లయితే లేదా అలసటగా ఉన్నట్లయితే, స్లీప్ ఆప్నియా ఉన్నట్లే. సాధారణమైన చికిత్స ఏమిటంటే, శస్త్రచికిత్స కాదు గాని, నిద్రపోయే సమయంలో, అణిచి ఉంచబడిన గాలిని ప్రతిబంధకాలు లేకుండా బయటికి వెళ్ళనిచ్చే పద్ధతులను ఉపయోగించడమే.
కె. ఎస్., అమెరికా
మేము ఈ వ్యాఖ్యానాలను మెచ్చుకుంటున్నాము, ఏదైనా అపార్థానికి మా సమాచారం కారణమైతే విచారిస్తున్నాము. అప్పుడప్పుడు గురక పెట్టడం అసాధారణమేమీ కాదు అని వైద్య వర్గం ఒప్పుకుంటుంది. ఇతర అనారోగ్య సమస్యలవలెనే, సరైన చికిత్స కొరకు డాక్టరుకు చూపించుకోవడం చాలా ప్రాముఖ్యం.—సంపాదకుడు.