కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 7/8 పేజీలు 12-15
  • నోటి దుర్వాసనకు మీరేమి చేయగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నోటి దుర్వాసనకు మీరేమి చేయగలరు?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోటి దుర్వాసన గూర్చిన సమాచారం ఏమిటి?
  • “గుడ్‌ మార్నింగ్‌! మీ నోటి వాసన ఎలా ఉంది?”
  • దుర్వాసనను ఎలా నివారించవచ్చు
  • దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?
    తేజరిల్లు!—2007
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2006
  • సుకుమారమైన పళ్లను కాపాడడం
    తేజరిల్లు!—2001
  • మీకు కట్టుడుపండ్లు అవసరమా?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1995
g95 7/8 పేజీలు 12-15

నోటి దుర్వాసనకు మీరేమి చేయగలరు?

ఒకప్పుడు, కాకపోతే మరొకప్పుడు పెద్దవారిలో 80 శాతంకన్నా ఎక్కువ మందిని బాధించే, ప్రపంచంలోని అతి సాధారణ వ్యాధులలో ఇదొకటని చెప్పబడుతుంది. ఇది వ్యాకులతకు, నిరాశకు, వేదనకు కారణం కాగలదు.

వైద్యరంగమంతటా, ఇది హేలిటోసిస్‌ అని పిలువబడుతుంది, హేలిటస్‌ అనే లాటిన్‌ పదానికి “శ్వాసము” అని భావం, మరి దాని తర్వాతి -ఓసిస్‌ అనే మాట అసాధారణ పరిస్థితిని సూచిస్తుంది. కొందరు దానిని నోటి దుర్గంధం అని కూడా పిలుస్తారు. అయితే చాలా మంది దానిని నోటి దుర్వాసన అని పిలుస్తారు!

మీకు నోటి దుర్వాసన ఉందా? ఇతర ప్రజల నోటి దుర్వాసనను కనిపెట్టడంలో మీకు కష్టమేమీ ఉండదు కాని, మీది మీరు కనిపెట్టడం అసాధ్యం కావచ్చు. సహజంగా మనం మన నోటి దుర్వాసనకు అలవాటుపడుతాము గనుక, “విపరీతంగా నోటి దుర్వాసన గలవారు కూడా వ్యక్తిగతంగా తమ సమస్యను ఎరిగి ఉండకపోవచ్చు” అని అమెరికన్‌ డెంటల్‌ అసోసియేషన్‌వారి జాడా అనే పత్రిక వివరిస్తుంది. గనుక, మన నోటి దుర్వాసన గురించి వేరే ఎవరైన చెప్పినప్పుడు మాత్రమే మనలో చాలామందికి తెలుస్తుంది. అది ఎంత విచారకరమో!

అది సామాన్యమైన సమస్యేనన్న వాస్తవం ఓదార్పునివ్వదు. నోటి దుర్వాసన తరచూ అసహ్యకరమైనదిగాను, అసంతోషకరమైనదిగాను ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, అది ఎంతో మనోవేదనను కలిగించగలదు. ఇశ్రాయేలులోని టెల్‌ అవివ్‌ యూనివర్సిటీలోని లెబోరేటరీ ఆఫ్‌ ఓరల్‌ మైక్రోబయోలజీ అధ్యక్షుడైన డా. మెల్‌ రాసన్‌బగ్‌ ఈ విధంగా వివరిస్తున్నాడు: “నోటి దుర్గంధం నిజంగా ఉన్నా, అది ఉన్నట్లు అనిపించినా, సమూహంలో ఒంటరివారవ్వడానికి, లేక విడాకులకు, ఆత్మహత్యను గూర్చి సహితం తలంచడానికి అది నడిపించగలదు.”

నోటి దుర్వాసన గూర్చిన సమాచారం ఏమిటి?

నోటి దుర్వాసన అనారోగ్యాన్ని సూచిస్తుందని ఎంతో కాలం ముందే ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఆ కారణాన, పురాతన కాలాల నుండే, మానవ నోటి వాసనలను గూర్చి వైద్యులు అధ్యయనం చేశారు.

దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం, ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్‌ కెమిస్ట్‌ ఆంటోయిన్‌-లారెంట్‌ లావోయిసెర్‌ మానవ శ్వాసలోని కారకాంశాలను అధ్యయనం చేసేందుకు బ్రెత్‌ టెస్టర్‌ను కనిపెట్టారు. అప్పటి నుండి శాస్త్రజ్ఞులు మెరుగుపరచబడిన నమూనాలను రూపొందించారు. ఇశ్రాయేల్‌, కెనడా, జపాన్‌ మరియు నెదర్‌లాండ్స్‌లోని లెబోరేటరీలు నోటి దుర్గంధపు పరిమాణాలను కొలిచే హేలీమీటర్‌ను నేడు ఉపయోగిస్తున్నాయి. న్యూజీలాండ్‌లో కృత్రిమ నోర్లు అని కూడా పిలువబడే ప్లేక్‌-గ్రోత్‌ స్టేషన్లను రూపొందించారు. లాలాజలము, పంటిపై గార, బ్యాక్టీరియా మరియు నోటి దుర్వాసనలతో సహా మానవ నోటిలోని వాతావరణాన్ని పోలి ఉంటాయి.a

ఆధునిక సాంకేతికశాస్త్ర సహాయంతో, శాస్త్రజ్ఞులు మన నోటి వాసనను గూర్చి ఎంతో తెలుసుకున్నారు. ఉదాహరణకు, సైంటిఫిక్‌ అమెరికన్‌ వార్తాపత్రిక ప్రకారం “సాధారణ మానవ నోటిలో ఆవిరయ్యే 400 సేంద్రీయ మిశ్రమ పదార్థాలను పరిశోధకులు ఇప్పుడు గుర్తించారు.” అయితే ఈ మిశ్రమ పదార్థాలన్నీ అసహ్యమైన వాసనను పుట్టించవు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ మరియు మిథైల్‌ మెర్‌క్యాప్టన్‌ నోటి దుర్వాసనకు ముఖ్య కారణాలు. ఈ వాయువులే మన శ్వాసకు, స్కంక్స్‌ అనే జంతువుల అపానవాయువు వంటి వాసనను కలిగిస్తాయి.

మానవ నోరు 300 రకాల కన్నా ఎక్కువ బ్యాక్టీరియాలకు పుట్టినిల్లు. టఫ్స్‌ యూనివర్సిటీ డైట్‌ అండ్‌ న్యూట్రిషన్‌ లెటర్‌ ఈ విధంగా వ్రాస్తుంది: “చీకటిగా ఉండి, వెచ్చని, తేమగల నోటి భాగం దుర్గంధ కారణమైన బ్యాక్టీరియా పెరగడానికి తగ్గ వాతావరణం.” అయితే ప్రాముఖ్యంగా నాలుగు రకాల బ్యాక్టీరియాలే నోటి దుర్వాసనకు ముఖ్య కారణాలు. అవి మీ నోటిలోనే నివసిస్తాయి, అయితే మీకు వాటి పేర్లు తెలియకపోవచ్చు. వాటి పేర్లు, వెయిలోనెలా ఆల్కాలెసీన్స్‌, ఫసోబ్యాక్టీరియమ్‌ న్యూక్లియేటమ్‌, బ్యాక్టీరోయిడెస్‌ మెలానీనోజెనికస్‌, మరియు క్లెబ్సీలా న్యూమోనియా. అవి నోట్లో ఉన్న ఆహార తునకలను, చనిపోయిన కణాలను, మరితర పదార్థాలను తింటాయి. ఈ బ్యాక్టీరియా ప్రక్రియల వల్ల చెడువాసనగల వాయువులు ఉత్పన్నమవుతాయి. పనికిరాని పదార్థం కుళ్ళిపోయినప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రక్రియ కూడా అంతే. అలాగే, “చాలా సందర్భాల్లో సూక్ష్మజీవులు కుళ్ళిపోవడం వలన [సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం వలన] హేలీటోసిస్‌ నోట్లోనే మొదలౌతుంది,” అని డెంటల్‌ పత్రికయైన జె పీరియోడంటల్‌ వివరిస్తుంది. దీనిని అరికట్టకపోతే, పళ్ళు పాడైపోవడానికి, చిగుళ్ళ వ్యాధులు రావడానికి అది దారి తీస్తుంది.

“గుడ్‌ మార్నింగ్‌! మీ నోటి వాసన ఎలా ఉంది?”

నోటిలో కుళ్ళిపోయే ఈ ప్రక్రియ నిద్రించే సమయంలో అధికమౌతుంది. ఎందుకని? పగలంతా కావలసినంత ఆమ్లజని మరియు కొంత ఆమ్లముగల లాలాజలంతో, బ్యాక్టీరియా కడిగి వేయబడి నోరు శుభ్రమవుతుంది. అయితే, నిద్రించే సమయంలో లాలాజల ఉత్పాదన ఒక్కో గంటకు సాధారణ రేటు కన్నా దాదాపు 1/50 అనే మామూలు రేటుకు తగ్గిపోతుంది. ఒక పత్రిక చెబుతున్నట్లు, ఎండిన నోరు “1,60,000 కోట్ల కన్నా ఎక్కువ బ్యాక్టీరియాలు ఉన్న నిశ్చలమైన చెరువులా ఉంటూ,” చెడు రుచితో అందరికీ తెలిసిన “ఉదయకాల (పాచి) వాసనను” కలిగిస్తుంది.

ఒత్తిడి వల్ల తగ్గిపోయిన లాలాజల ప్రవాహం కూడా మీరు మేల్కొని ఉన్నప్పుడు మళ్ళీ మొదలవ్వగలదు. ఉదాహరణకు, పిరికి ప్రసంగీకుడు మాట్లాడేటప్పుడు నోరు ఎండిపోవచ్చు, దాని వల్ల హేలీటోసిస్‌ కలుగవచ్చు. నోరు ఎండి పోవడం కూడా ఒక రోగం లేదా అనేక వ్యాధులకు లక్షణము.

నోట్లో సూక్ష్మజీవుల ప్రక్రియవల్ల మాత్రమే ఎప్పుడూ నోటి దుర్వాసన కలుగదు. నిజానికి, నోటి దుర్గంధం అనేది తరచూ అనేక పరిస్థితుల, వ్యాధుల లక్షణం. (పేజీ 22 లోని బాక్స్‌ను చూడండి.) అందువల్ల, కారణం తెలియని ఎడతెగని నోటి దుర్వాసనకు వైద్యం చేయించుకోవడం మంచిది.

చెడు వాసన కడుపులో కూడా మొదలవ్వవచ్చు. అయితే అందరూ నమ్మేదానికి భిన్నంగా, ఇది అరుదుగా జరుగుతుంది. తరచూ, భరించలేని కొన్ని వాసనలు ఊపిరితిత్తుల ద్వారా నోటికి చేరుకుంటాయి. ఎలా? వెల్లుల్లిపాయలు లేదా ఉల్లిపాయలు వంటి పదార్థాలు జీర్ణమైన తరువాత, అవి రక్తంలో కలిసి, ఊపిరితిత్తులకు పంపబడుతాయి. జీర్ణాశయ వ్యవస్థ ద్వారా వాటి వాసనలు మీ నోటిలోకి, ముక్కులోకి ప్రవేశించి బయటికి వస్తాయి. హెల్త్‌ అనే పత్రిక ప్రకారం, “వెల్లుల్లిని అరికాలుపై కేవలం రుద్దినా లేదా నమలకుండా మ్రింగినా ఆ మనుష్యులకు వెల్లుల్లి వాసన వస్తుంది.”

ఆల్కహాల్‌ బివరేజ్‌లను త్రాగడంవల్ల కూడా మీ రక్తంలోను, ఊపిరితిత్తుల్లోను ఆల్కహాల్‌ వాసన కొడుతుంది. అలా జరిగినప్పుడు పరిస్థితి మారేందుకు వేచి ఉండడం తప్ప మీరు చేయగలిగిందేమీ లేదు. మీ శరీరంలో కొన్ని ఆహార పదార్థాల వల్ల కలిగే వాసన 72 గంటల వరకు ఉండిపోతుంది.

దుర్వాసనను ఎలా నివారించవచ్చు

కలకండ వంటి మంచి వాసన కలిగించే వాటిని నమలడం వలన నోటి దుర్వాసన పోదు. నోటిలో బ్యాక్టీరియా ప్రక్రియ వలనే తరచూ నోటి దుర్వాసన కలుగుతుందని గుర్తుంచుకోండి. నోటిలో మిగిలి ఉండే ఆహార పదార్థాల చిన్న చిన్న ముక్కలు కోట్లకొలది బ్యాక్టీరియాలకు విందునిస్తాయని ఒకరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ నోటిని శుభ్రంగా ఉంచుకుని, నోటిలోని బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించుకోవడమే నోటి దుర్వాసనకు వ్యతిరేకంగా పోరాడే ఒక ముఖ్య మార్గము. మీ పళ్ళలో మిగిలి ఉండే ఆహార పదార్థాల తునకలను, పళ్ళ మీది గారను క్రమంగా తీసివేస్తూ ఉండాలి. ఎలా? భోజనం తరువాత, పడుకునే ముందు మీ పళ్ళను బ్రష్‌ చేయడం ప్రాముఖ్యము. బ్రష్‌ చేయడమనేది గైకొనవలసిన చర్యలలో ఒకటి మాత్రమే.

బ్రష్‌కందని పంటి పైభాగాలున్నాయి. రోజుకొక్కసారైన పంటి దారాన్ని ఉపయోగించడం (ఫ్లోసింగ్‌ చేయడం) ముఖ్యం. దాగుకునేందుకు, గ్రుడ్లు పెట్టేందుకు బ్యాక్టీరియాలు ఇష్టపడే నివాస స్థలమైన నాలుకను సున్నితంగా బ్రష్‌ చేయాలని కూడా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవడం, దంత వైద్యునితో పంటిపైనున్న గారను తీయించుకోవడం కూడా అవసరం. ఈ చర్యల్లో దేనినైన వదిలిపెట్టడం నోటి దుర్వాసనకు, కాలక్రమేణ తీవ్రమైన పంటి వ్యాధులకు మరియు చిగుళ్ళ వ్యాధులకు దారితీస్తుంది.

మీ నోటిని శుభ్రం చేసుకోవడానికి గైకొనగల మరికొన్ని తాత్కాలికమైన పద్ధతులు కూడా ఉన్నాయి. మంచి నీళ్ళు త్రాగి, చక్కెర లేని చ్యూయింగ్‌ గమ్‌ను నమలడంలాంటి ఏదైన పనిచేయడం మీ నీటిలోని లాలాజలాన్ని అధికం చేస్తుంది. లాలాజలము బ్యాక్టీరియాను తొలగించి, వాటికి నివాసం యోగ్యం కాని పరిస్థితులను ఏర్పరచే సహజ మౌత్‌వాష్‌ అని జ్ఞాపకముంచుకోండి.

వాణిజ్య మౌత్‌వాష్‌లు (నోరు శుభ్రం చేసుకోవడానికి దుకాణాల్లో లభ్యమయ్యేవి) సహాయపడగలవు, కాని ఇటీవల అధ్యయనాలు తెలిపేదేమంటే, మీరు దుర్వాసనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాటిపైనే పూర్తిగా ఆధారపడకండి. నిజానికి, ఆల్కహాల్‌ గల మౌత్‌వాష్‌లతో తరచూ పుక్కిలించడం నోరు ఎండి పోవడానికి కారణమౌతుంది. వినియోగదారునికి లభ్యమయ్యే నోటిని శుభ్రంచేసే ఎంతో మంచి ఉత్పత్తుల్లో కొన్ని పంటి గారను 28 శాతం వరకు మాత్రమే తొలగిస్తాయి. కాబట్టి మీకిష్టమైన మౌత్‌వాష్‌తో పుక్కిలించిన తర్వాత, మీ నోటిలో మొదట ఉండిన బ్యాక్టీరియాలోని 70 శాతంకన్నా ఎక్కువ బ్యాక్టీరియా అలాగే మిగిలిపోతుంది. మౌత్‌వాష్‌తో “పుక్కిలించిన 10 నిమిషాల్లో లేదా ఒక గంట తరువాత దుర్వాసన మళ్ళీ వస్తుంది,” అని ప్రయోగాల్లో తేలిందని కన్‌స్యూమర్‌ రిపోర్ట్స్‌ వివరిస్తుంది. అనేక దేశాల్లో, వైద్యుడు వ్రాసి ఇస్తే మాత్రమే లభ్యమయ్యే మరింత శక్తివంతమైన మౌత్‌వాష్‌లు కూడా గారను 55 శాతం వరకు మాత్రమే తగ్గిస్తాయి. అలా చేసిన కొన్ని గంటల్లోనే బ్యాక్టీరియాలు మళ్ళీ మునుపటి సంఖ్యకు పెరుగుతాయి.

స్పష్టంగా, దుర్వాసనను నివారించే విషయంలో నిర్లక్ష్య వైఖరిని తప్పనిసరిగా విడనాడాలి. బదులుగా, ఎప్పుడూ శుభ్రంగా ఉంచవలసిన అవసరమున్న అమూల్యమైన పరికరాలుగా మీరు మీ పళ్ళను ఎంచాలి. తుప్పు, చిలుము మరియు మరేదైనా నాశనం నుండి తమ పనిముట్లను కాపాడేందుకు బాధ్యతగల వడ్రంగులు, మెకానిక్‌లు ఒక్కో పని పూర్తయిన తర్వాత తమ పనిముట్లను శుభ్రపరచేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తారు. మీ నోరు, పళ్ళు మానవ నిర్మితమైన మరే పనిముట్ల కన్నా అమూల్యమైనవి. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచి, వాటికి కావలసిన శ్రద్ధనివ్వండి. ఇలా చేయడం ద్వారా, మీరు దుర్వాసనను దానితో పాటు కలిగే నిరాశను, కలతను తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా, మీ నోరు శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంటుంది.

[అధస్సూచీలు]

a గార అనేది పండ్లపై భాగాన ఏర్పడి గట్టిగా అంటుకుని ఉండే పదార్థము. అది ఎక్కువగా బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది, దాని వల్ల మీ పళ్ళకు, చిగుళ్ళకు హాని కలుగగలదు.

[13వ పేజీలోని బాక్సు]

దుర్వాసనకు కారణాలేంటి?

దుర్వాసనకు కారణమయ్యే పరిస్థితులు, వ్యాధులు మరియు అలవాట్లలో కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

శ్వాసనాళముల వాపు

దీర్ఘకాలిక జీర్ణకోశ వాపు

మధుమేహము

ఆల్కహాలిక్‌ బివరేజెస్‌లను త్రాగడం

నోరు ఎండిపోవడం

ఎంపైమా

తేన్పులు (బెల్చెస్‌)

చిగుళ్ళ వ్యాధులు

కడుపు ఉబ్బడం (కడుపు వాపు)

మూత్రపిండ లోపం

కాలేయ వ్యాధి

ఋతుస్రావము

నోటి పుండ్లు

అండోత్పత్తి

నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం

సైనసైటిస్‌

పొగ త్రాగడం

కొన్ని రకాల క్యాన్సర్‌

కొన్ని రకాల మందులు

పన్ను కుళ్ళిపోవుట

క్షయవ్యాధి

పంటి శస్త్ర చికిత్స వలన కలిగే గాయాలు

[15వ పేజీలోని బాక్సు]

మీ నాలుకకు కూడా శ్రద్ధ అవసరం

అతి దగ్గరగా ఉన్న అద్దం దగ్గరకు వెళ్ళి, మీ నాలుకను సరిగ్గా చూసుకోండి. దానిపైన చిన్న చిన్న పగుళ్ళు కనిపిస్తున్నాయా? అది సహజమే. అయితే మీ నాలుకపైని ఆ పగుళ్ళు కోట్లకొలది బ్యాక్టీరియాకు ఆశ్రయాన్నివ్వగలవు. వాటికి ఆటంకం కలిగించకుండా ఉంటే, బ్యాక్టీరియాలు విపరీతమైన దుర్వాసనయనే సమస్యను మరియు అనారోగ్య పరిస్థితులను సృష్టించగలవు. అయినప్పటికీ, ప్రజలు నోటిని శుభ్రం చేసేటప్పుడు, తరచూ నాలుకను నిర్లక్ష్యం చేస్తుంటారు.

హేలీటోసిస్‌కు ఒక పరిష్కారంగా, నాలుక ఉపరితలాన్ని మెత్తని పంటి బ్రెష్‌తో క్రమంగా బ్రెష్‌ చేయాలని దంత వైద్యులు సిఫారసు చేస్తున్నారు. నాలుకను గీకేదాన్ని ఉపయోగించాలని కొందరు నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఇండియాలోని ప్రజలు తరతరాలుగా, దుర్వాసనను నివారించడానికి ఒక మార్గంగా నాలుకను గీచేవాటిని ఉపయోగిస్తున్నారు. సంవత్సరాల క్రితం వాటిని లోహంతో తయారు చేసేవారు, కాని నేడు నాలుక గీచే ప్లాస్టిక్‌వి వాడడం ఎంతో సాధారణం. కొన్ని స్థలాల్లో, నాలుక గీచుకునే దాన్ని పొందేందుకు మీరు దంత వైద్యుని సంప్రదించవలసి ఉండవచ్చు.

[14వ పేజీలోని చిత్రాలు]

నోటి పారిశుద్ధ్యంలో ఫ్లోసింగ్‌ చేయడం, అలాగే పళ్ళను, నాలుకను బ్రష్‌ చేయడం ఇమిడి ఉన్నాయి

[Picture Credit Line on page 12]

Life

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి