యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
మరీ తొందరగా పెళ్ళి చేసుకున్నాం—మేము సఫలీకృతులమవ్వగలమా?
“నాకు 16 ఏండ్లున్నప్పటి నుండి మేము డేటింగ్ చేస్తున్నాం. మరి 18 ఏండ్లప్పుడు మేము పెళ్ళి చేసుకున్నాం. అది ఎంతో ఆనందమయంగా ఎప్పటికీ కొనసాగవలసి ఉంది! అయితే నాలుగు నెలల తర్వాత, నేను ఒత్తిళ్ళతో విపరీతంగా కలతచెందాను.”—టాన్యా.a
వివాహం ఏ వయస్సులోనైనా గంభీరమైనదే. బైబిలు ఇలా చెబుతుంది: “వివాహం చేసుకొనువారికి వేదన, బాధ కలుగును.” (1 కొరింథీయులు 7:28, ద న్యూ ఇంగ్లీష్ బైబిలు) కాని ‘ఈడురాకమునుపే’ వివాహ బంధంలోనికి వచ్చినవారికి సహించలేనంతగా బాధలు వేదన కలుగుతున్నట్లు తరచూ కనిపిస్తుంది.—1 కొరింథీయులు 7:36.
ఎందుకిలా అంటే, యౌవనారంభంలోనున్నవారు ఇప్పటికీ ఎదుగుతూనే ఉన్నారు; వారు భార్య లేక భర్త పాత్రను నిర్వహించేందుకు సిద్ధం కాలేదు. డా. జేన్ కె. బర్గెస్స్ అభిప్రాయపడుతున్నదేమంటే: “యౌవనస్థులు వివాహాన్ని గూర్చి విపరీతమైన ఆదర్శాలను కలిగి ఉన్నారు. విజయవంతమైన కుటుంబ జీవితానికి అవసరమైన దైనందిన చర్యను మరియు ప్రయత్నాన్ని గూర్చి ఆలోచించరు.” కాబట్టి వివాహంలోని ఆప్యాయ ఆనందాలు గాక, అందులోని వాస్తవాలను చూసినప్పుడు, చెంపదెబ్బ తిన్నట్లు వారు ఖంగుతింటారు.
యువతియైన కిమ్ ఇలా చెబుతుంది, “ప్రతి ఒక్కటి ఊహాలోకంలో అన్నట్లు గొప్పగా, అద్భుతంగా ఉంటుందని మీరు నిరీక్షిస్తున్నారు. క్రొత్తదనం క్షీణించిపోతుంది. మీ భర్త హాయిగా సోఫాలో కూర్చుని ఉండగా, మీకేమో వంట చేయడం, అంట్లు తోమడం, వంట సరుకులు కొనడం, బట్టలుతకడం వంటి పనులుంటాయి. వాళ్ళ అమ్మ అతనికి అన్నీ చేసి పెట్టేది గనుక, ఎన్నడూ అతనికి ఇలాంటి పనులు చేయవలసిన అవసరం రాలేదు. అలసిపోవడాన్ని గూర్చి, చికాకు కలగడాన్ని గూర్చి డేటింగ్ చేసేటప్పుడు మీరెన్నడూ అనుకోనే లేదు. మీరు గర్భవతి అయినప్పుడు, అది మరింత ఎక్కువవుతుంది!”
తరచూ యౌవనారంభంలోని వారు ఆలోచనారహితంగా తొందరపడి పెళ్ళి చేసుకుంటారు. హెలెన్ ఈ విధంగా గుర్తు చేసుకుంటుంది, “నిజమైన క్రైస్తవుడని నేననుకున్న వ్యక్తిని నేను పెళ్ళి చేసుకున్నాను, నాకు అనుభవ జ్ఞానం లేనందున అతనిని సరిగ్గా తెలుసుకోలేక పోయాను. వివాహం జరిగిన పది నెలల తర్వాత, నేనిక ఏ మాత్రం అతని క్రైస్తవ విరుద్ధ ప్రవర్తనను భరించలేకపోయాను.” హెలెన్ వివాహ విఫలత ఏ మాత్రం అసాధారణమైనది కాదు. అమెరికాలో, యౌవనారంభంలో జరిగిన వివాహాలు చాలా మట్టుకు ఐదు సంవత్సరాల్లోనే విఫలమౌతాయి.
భయంకరమైన గణాంక వివరాలున్నప్పటికీ, ఇంకా యౌవనారంభంలోనే ఉన్న పిల్లలు వివాహజీవితంలోనికి ప్రవేశిస్తున్నారు. బహుశ, మీరు వారిలో ఒకరేమో. అలాగైతే, మీరు ఇప్పటికే వివాహ జీవితంలోని ఒత్తిళ్ళవలన కలతచెంది ఉండవచ్చు.
తప్పించుకునే మార్గమే లేదా?
చిన్నతనంలోనే పెళ్ళి చేసుకోవడం తెలివైన పని కానప్పటికీ, అది పాపమేమీ కాదు. దేవుని దృష్టిలో వివాహమనేది ఘనమైనది. (హెబ్రీయులు 13:4) నిజమే, కొన్ని అరుదైన పరిస్థితులు విడిగా ఉండడాన్ని లేదా విడాకులను సమర్థిస్తాయి. (మత్తయి 19:9; 1 కొరింథీయులు 7:12-15) అయితే, సాధారణంగా దంపతులు కలిసి ఉండాలని దేవుడు అపేక్షిస్తాడు. (మత్తయి 19:6) అది కఠినమైన అపేక్ష అన్నట్లు అనిపించినా, మీరు సఫలులవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడని కూడా దాని భావము.
యౌవనారంభంలోనున్న ఒక భర్త ఈ విధంగా చెబుతున్నాడు: “‘నేను మరీ చిన్నవాడినా? మేమిద్దరం ఒకరికొకరం సరిపోయిన జోడేనా?’ అని ప్రశ్నించుకోవడానికి, రెండవసారి ఆలోచించుకోవడానికి సమయం మించిపోయింది. మీ పెళ్ళి జరిగిపోయింది!” మీ కర్మను గూర్చి ప్రలాపించే బదులు, మీ వివాహం సఫలమయ్యేందుకు ఒక మార్గాన్ని కనుగొనడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు?
ఇక్కడ బాధ్యత ఎవరిది?
దంపతులకు బైబిలు ఇలా చెబుతుంది: “స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. . . . పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు.” (ఎఫెసీయులు 5:22, 23) అయితే, జీవితమంతా తన తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న యువకుడు, కుటుంబ శిరస్సు కావడం అంటే ఓ పెద్ద బాధ్యతే.
యౌవనంలో ఉన్న ఒక భార్య తన భర్తను గురించి ఇలా గుర్తు చేసుకుంటుంది: “నా అంతట నేను ఎక్కడికీ వెళ్ళడాన్ని టామ్ ఇష్టపడలేదు. నేను ఉరిలో చిక్కుకున్నట్లు, బంధించబడినట్లు భావించాను. నేను ప్రశ్నలు అడగడానికి ఎప్పుడు ప్రయత్నించినా, అతని అధికారాన్ని సవాలు చేసినట్లు అతడు భావించేవాడు.” మరొకవైపు, కొందరు భార్యలు యౌవనంలో ఉన్న తమ భర్తలను తమ శిరస్సుగా దృష్టించడం కష్టంగా భావించారు. మరి కొందరు తీర్మానాలు భర్తవేనని ఏ చిన్న సూచన ఉన్నా, తాము సమ్మతించనప్పుడు సహకరించడానికి నిరాకరిస్తూ విసుక్కుంటారు.
మీరు అనుభవంలేని భర్త అయితే ఇది మరింత దుఃఖం కలిగించగలదు. మీ భార్య మీ ఆజ్ఞలన్నింటికీ వెంటనే విధేయత చూపించనంత మాత్రాన మీరు కలత చెందవలసిన అవసరం నిజంగా లేదు. మీ శిరస్సత్వం క్రింద సురక్షితంగా ఉన్నట్లు మీ భార్య భావించేందుకు కొంత కాలం పడుతుంది. అదే సమయంలో, ఆమెను అదుపులో పెట్టడానికి ప్రయత్నించడం ద్వారా కాక, నాయకత్వాన్ని తీసుకుంటూ, సమతుల్యమైన తీర్మానాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఆమె గౌరవాన్ని సంపాదించడానికి కృషి చేయండి.—1 కొరింథీయులు 16:13 పోల్చండి.
బైబిలు ఇంకా ఈ విధంగా ఉద్బోధిస్తుంది: “ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) అవును, మీ ఇష్టాయిష్టాలకన్నా మీ భార్య ఇష్టాయిష్టాలను ముందుంచుతూ ఆమెను గౌరవించండి. (ఫిలిప్పీయులు 2:4) ఆమెను దాసివలె కాక, గౌరవనీయురాలైన భాగస్వామిగా భావిస్తూ ఆమెకు స్వాతంత్ర్యం ఇవ్వండి. (మలాకీ 2:14 చూడండి.) సాధ్యమైనప్పుడెల్లా, పెద్ద తీర్మానాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆమెను సంప్రదించండి. (సామెతలు 13:10) ఇది మీ శిరస్సత్వానికి లోబడడాన్ని ఆమెకు సులభతరం చేస్తుంది.
అయితే, మీరు యౌవన భార్యయైతే ఏమిటి? మీ యౌవన భర్త అనుభవరాహిత్యాన్ని కలవరపెట్టే విధంగా బయల్పడినప్పుడు, లేదా అతడు సరైన తీర్మానం చేయనప్పుడు అతనికి లోబడడం అనేది మీ సహనానికి పరీక్ష కావచ్చు. అయినప్పటికి, ఆయనను మందలించడం లేదా ఎదురు తిరగడం మీ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఏ మాత్రం సహాయపడదు. “ఆమె నన్నెంత ఎక్కువగా తిట్టిందో, నేను అంత నిశ్శబ్దంగా ఉండిపోయాను,” అని ఒక యౌవన భర్త తెలియజేశాడు. అతని అనుభవ శూన్యతను సహిస్తూ గౌరవాన్ని చూపడానికి ప్రయత్నం చేయండి. అతడు మీ అభిప్రాయానికి మరింత గౌరవాన్ని చూపిస్తూ ప్రతిస్పందించవచ్చు. అతడు చేసే తీర్మానం మీకు చికాకు కలిగిస్తున్నప్పటికీ, అది నైతిక ధర్మానికి విరుద్ధం కానట్లయితే, మీరు దానితో ఎందుకు సహకరించకూడదు? “పై నుండి వచ్చు జ్ఞానము . . . సులభముగా లోబడునది.” (యాకోబు 3:17) అతని శిరస్సత్వానికి మద్దతునివ్వడం ద్వారా, అతడు మరింత సమర్థుడు కావడానికి మీరు తోడ్పడగలరు.
ఆర్థిక సమస్యలు
యౌవనంలో ఉన్న దంపతుల మొదటి సమస్య డబ్బేనని కొందరు అంటారు. జీవించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకున్నప్పుడే దంపతులు తరచూ ఖంగుతింటారు. ఉదాహరణకు, రే మరియు లోరా వివాహం చేసుకున్న తర్వాత, “డబ్బూ లేదు, లేదా ఆహారమూ లేదు. నేల మీదే పడుకునే వాళ్ళం,” అని వాళ్ళు చెబుతున్నారు. బ్రాడ్ ఉద్యోగం కోల్పోగా, టాన్యా ఖర్చులు చూసుకోవలసి వచ్చినప్పుడు, బ్రాడ్ మరియు టాన్యాలు కూడా ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ళకు గురయ్యారు.
మంచి జీతం లభించే ఉద్యోగాలను సంపాదించడం యౌవనస్థులకు కష్టమన్నది నిజమే అయినప్పటికీ, డబ్బును సరైన విధంగా ఖర్చు చేయనందువల్లే, కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉదాహరణకు యౌవనంలో ఉన్న ఒక భార్య ఏమి చెబుతుందో పరిశీలించండి: “డబ్బంతా అయిపొయ్యేంత వరకు నేను ఖర్చు చేస్తాను, ఇక నెలాఖరి వారంలో నా దగ్గర డబ్బేమీ ఉండదు.” మరొక జత సరిగ్గా సంభాషించుకోని కారణం వల్ల వారు కూడా ఆర్థిక సమస్యలకు గురౌతున్నారు. జాక్ అనే భర్త ఈ విధంగా ఒప్పుకుంటున్నాడు, “నేను బయటికి వెళ్ళి, ఆమెతో చెప్పకుండానే కారు కొన్నాను.” “నిజానికి మాకు అవసరమైనది ఫర్నీచరు,” అని అతని భార్య బాధపడుతుంది.
ఇది మామూలేనని అనిపిస్తుందా? మీరు డబ్బు విషయంలోకి వచ్చేసరికి, బహుశ, మీరు ‘పిల్ల చేష్టలు’ వదిలిపెట్టకపోయి ఉండవచ్చు. (1 కొరింథీయులు 13:11) మీరు అనాలోచితంగా కొనుగోలు చేస్తారా? అలా అయితే, కొనుక్కోవలసిన వస్తువుల పట్టికను తయారు చేయడం నేర్చుకోండి, దాని ప్రకారం కొనుక్కోండి. పెద్ద కొనుగోలులను గూర్చి చర్చించుకోండి. (సామెతలు 15:22) మీ ఖర్చులను వ్రాసి పెట్టుకోండి, ఒక సహేతుకమైన బడ్జెట్ను తయారు చేసుకోండి.b అలా చేయడం అనేక ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది.
మేము మాట్లాడుకోగలమా?
యౌవనంలోని దంపతుల రెండవ సమస్య సంభాషణ అని కొందరు అంటారు. కొందరు దంపతులు భయంకరమైన మౌనంలో ఉండిపోతారు. మరి కొందరు హింసాత్మకమైన మాటల్లో పడిపోతారు. విడాకులు పొందిన సిల్వియా ఈ విధంగా గుర్తు చేసుకుంటుంది, “అతి చిన్న విషయాలకు మేము పెద్ద వాదనలు పెట్టుకునేవాళ్ళం. తన జోళ్ళను ఇంట్లో అక్కడా ఇక్కడా వేయడం, లేదా నేను తన పళ్ళెం నుండి ఆహారం తీసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలకే.”
అపార్థాలు, అనంగీకారాలు తప్పకుండా తలెత్తుతాయి. అయితే “ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము” అనేవి వివాహ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. (ఎఫెసీయులు 4:31) కొంచెం చికాకే కలిగినప్పటికీ, దానిని గూర్చి చర్చించడం అలవాటు చేసుకోండి. మీరు అలా చేసేటప్పుడు, వ్యక్తి మీద కాదు గాని, ఆ సమస్యపైనే దాడి చేయండి. పరిస్థితులు చేజారనారంభించినట్లయితే, వాదించ పూనకండి. “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును” అని సామెతలు 26:20 చెబుతుంది. తర్వాత, మీరిరువురు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మరొకసారి విషయాలను గూర్చి మాట్లాడడానికి ప్రయత్నించండి.
మరొక సమస్యయైన లైంగిక అసంతృప్తిని పరిష్కరించడానికి కూడ మంచి సంభాషణ కీలకము. కొన్నిసార్లు నవదంపతులు దాంపత్య సాన్నిహిత్యాన్ని అనుభవించలేనంతగా, తమ క్రొత్త దినచర్యలవలన అలసిపోయి ఉండవచ్చు. బిల్డింగ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనే పుస్తకం ఈ విధంగా చెబుతుంది: “భర్తలు, భార్యలు లైంగికత మరియు దాని పాత్రను గూర్చిన తప్పుడు అవగాహనతో వివాహం చేసుకుంటారు.” లోకంలోని ప్రచారాన్ని మనస్సులో ఉంచుకొని చాలా మంది దంపతులు ఈ విషయాన్ని గూర్చిన పూర్తి అవాస్తవమైన అపేక్షలతో ఉంటున్నారు. స్వార్థం మరియు ఆత్మ నిగ్రహం లేకపోవడం కూడా ఒక కారణమౌతుంది. సమయం తీసుకుని ఓపికతోపాటు మనస్సు విప్పి మాట్లాడుకోవడం ప్రాముఖ్యం. ఒకరికొకరు ‘ఎదుటివారికి మేలు చేయచూసినప్పుడు’ లైంగికత అనేది ఒక సమస్యే కాదు.—1 కొరింథీయులు 10:24.
నిజంగా, వివాహమనేది పిల్లల కొరకు కాదు. మీరు ఇప్పటికే, వివాహం చేసుకున్నట్లయితే, మీరు పరాజయానికి అభిశంసించబడలేదు. ఒక వివాహిత మహిళ ఈ విధంగా చెప్పింది, “నా వివాహం జరిగిన మొదటి సంవత్సరం ఎంతో విషమంగా ఉండేది. అయితే, బైబిలు సూత్రాలను అన్వయించడం ద్వారా మేము ఇప్పుడు సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాము.” మీరూ అలా చేయగలరు.
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
b ఏప్రిల్ 22, 1985, తేజరిల్లు! ఆంగ్ల సంచికలోని “మీ డబ్బును బడ్జెట్ చేయడానికి—సులభమైన మార్గం!” అనే శీర్షికలో కొన్ని సహాయకరమైన సలహాలున్నాయి.
[21వ పేజీలోని చిత్రం]
ఒక యౌవనస్థుడు భర్తగా తన పాత్ర నిర్వహించడంలో మద్దతునివ్వడం అతనిలోని మంచి గుణాలను వెలికితీయగలదు.