తరంగాల క్రింద ఉన్న ప్రపంచాన్ని సురక్షితంగా అన్వేషించుట
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి చెప్పినది
చాలా తక్కువమంది ప్రజలు స్వయంగా చూసిన అద్భుతమైన లోకం ఒకటి ఉంది. అది సరిగ్గా సముద్రమట్టానికి అడుగున ఉంటుంది. అది మీరు అన్వేషించడానికి సిద్ధంగావున్న తరంగాల క్రిందవున్న ప్రపంచం. ‘అలాంటి ప్రయాణం సురక్షితమైనదేనా? అని మీరడగవచ్చును. నీటి అడుగునున్న ఈ అద్భుతమైన ప్రపంచాన్ని దర్శించేందుకు నేను గజ ఈతగాడినై ఉండడం అవసరమా? నాకు అసలే ఈత రాకపోతే నేను మినహాయింపబడతానా?’ అని మీరడగవచ్చు.
రెండు విధాలైన అన్వేషణలు
నీటి అడుగునున్న ప్రపంచాన్ని అన్వేషించేందుకు రెండు ప్రాథమిక విధానాలు పేరుగాంచినవి—స్నోర్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్.a
స్నోర్కెల్ అనేది ఈతగాడు తన ముఖం సగం నీటిలోకి ఉంచి నీటిమట్టంపై ఈదుతుండగా అతని నోటిలో సరిగ్గా సరిపోయి నీటిపైకి వచ్చే ఒక వంపుగల ట్యూబు గొట్టం ఉండే పరికరము. గాలి కోసం తన తలను నీటి ఉపరితలం నుండి పైకి ఎత్తకుండానే ఈతగాడు ఊపిరి తీసుకొనేందుకు అది సహాయం చేస్తుంది. అతని కళ్లను ఒక మాస్కు కాపాడుతుంది.
మరోవైపున, స్కూబా అనేది శ్వాసించే పరికరానికి జతచేయబడి సంకోచం చెందిన వాయువుగల స్థూపం లేక స్థూపాలు గల పరికరాన్ని సూచిస్తుంది. కాబట్టి స్కూబా డైవింగ్ అన్నది స్పష్టంగా నీటిమట్టం నుండి చాలా క్రిందికి వెళ్లాలనే ఆసక్తిగలవారి కొరకే, అది చాలా సంక్లిష్టమైనది, ఎంతో ఖర్చుతో కూడినదై ఉండగలదు.
సుళువైన, ఎంతో తక్కువ ఖర్చుతో కూడిన స్నోర్కెలింగ్ అనే సరదాపని మీరు నీటి ఉపరితలం నుండి కూడా నీటి అడుగునున్న ప్రపంచంలోని విశేషమైన ఆనందాలను చూడడానికి మీకు సహాయం చేస్తుంది. ఒక ఉత్సాహవంతమైన స్నోర్కెలర్ తన మొదటి అనుభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: “నేను కేవలం 14 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు, వేలాది చిన్న చిన్న చేపల పెద్ద గుంపు మధ్యన నేను మొదటిసారి స్నోర్కెల్ చేసింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నేను ముందుకు సాగుతుండగా, చేపలు నా చుట్టూ ఒక సజీవమైన సొరంగం తయారు చేస్తున్నట్లు అనిపించింది. అందమైన ఎఫెక్టును కలుగజేస్తూ, వెండిలా మెరుస్తున్న వాటి శరీరాలు సూర్యరశ్మిని ప్రతిబింబించాయి. నేను పరమానంద భరితుడనయ్యాను. అలా స్నోర్కెలింగ్తో జీవితాంతపు ఉల్లాసభరితమైన అభిరుచి మొదలైంది.”
కాని అది నిజంగా సురక్షితమైనదేనా?
ఇరవై సంవత్సరాలకంటే ఎక్కువ కాలం స్నోర్కెలింగ్ను సురక్షితంగా ఆనందించిన ఒక ఉత్సాహవంతుడు, స్నోర్కెలింగ్ కంటే ఒకరు తన కారును సైకతతీరము వెంబడి నడిపించడం మరింత ప్రమాదకరమైనదని సలహా ఇస్తున్నాడు. నీళ్లలో ఉన్నప్పుడు భద్రత అనేది చర్యపై కంటే వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ సమర్థతగల ఈతగాడు కాకపోతే, మీరు నిశ్చలమైన, లోతు తక్కువ ఉన్న నీటిని దాటి వెళ్లకూడదు, మీరు నీటిలో నిలబడగలిగే ప్రాంతాన్ని దాటి క్రిందకు ఎన్నడూ వెళ్లకూడదు. వాస్తవానికి, కేవలం ఒక మీటరు నీళ్లలోతులో కూడా చూసేందుకు ఎంతో ఉంటుంది. మీరు నైపుణ్యాన్ని, స్థయిర్యాన్ని సంపాదించుకున్న తర్వాత, మీరు లోతు నీళ్లలోకి సురక్షితంగా వెళ్లగలుగుతారు, కాని అప్పుడు కూడా ఒక సమర్థుడైన ఈతగాని తోడు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి. తీరం నుండి దూరానికిగాని లేక లోతు నీళ్లలోకిగాని ఒంటరిగా ఎప్పుడూ వెళ్లకూడదని అనుభవంగల ఈతగాళ్లు అనేకులు నిశ్చయించుకుంటారు. భద్రత దృష్ట్యానే కాకుండా, స్నోర్కెలింగ్ అనుభవాన్ని ఒక సహవాసితో కలిసి పంచుకోవడం మరింత ఆహ్లాదకరంగా, ఆనందభరితంగా ఉంటుంది.
మీ ముఖాన్ని నీటి లోపల ఉంచుకొని స్నోర్కెల్ద్వారా ఊపిరి తీసుకోవడానికి కొంత అలవాటు పడడం అవసరమన్నది నిజమే, కాని మీరు పట్టుదలతో ఉంటే, అది నిజంగా కష్టం కాదని తెలుసుకుంటారు. కొంతమంది ప్రారంభికులు ఈత కొలనులో లేక తరంగాలు లేని సముద్ర తీరాలవద్ద లోతులేని స్థలాల్లో అభ్యాసం చేస్తారు. కొందరు స్నానపు తొట్టిలో కూడా అభ్యాసం చేస్తారు.
మీకు అవసరమయ్యే పరికరాలు
స్నోర్కెలింగ్కు అవసరమైన పరికరాలు చాలా సుళువైనవి, అవి ఖరీదైనవి కాదు: ముఖానికి వేసుకునే మాస్కు, రెండు డైవింగ్ ఫిన్‌లు (స్టిప్పర్స్), స్నోర్కెల్. అయితే మీరు శీతాకాలంలో లేక సాధారణ ఈతకు సరిపోయేవాటికంటే చల్లగా ఉన్న నీళ్లలో స్నోర్కెల్ చేసేందుకు పథకం వేసుకుంటే, బహుశా మీకు ఒక వెట్‌సూట్ అవసరం కావచ్చు, ఇది మీ ఖర్చులను చాలావరకు పెంచవచ్చు. మనం మొదలుపెట్టడానికి అవసరమైన మూడు ప్రాథమిక వస్తువులను మాత్రమే పరిశీలిద్దాము.
మాస్కు మీకు సరిగ్గా సరిపోయేలా, నీళ్లు ప్రవేశించకుండా సౌకర్యంగా ఉండాలి. దానికి ఒక ఈక్వలైజర్ కూడా ఉండాలి, అంటే, మాస్కు వెలుపలి నుండి మీ ముక్కును గిల్లుకోవడానికి అనుమతిస్తూ దానికి ఎత్తుపల్లాలు కూడా ఉండాలి. దీనికి కారణం తర్వాత వివరించబడుతుంది. ఆ మాస్కు చక్కగా చూడగలిగేలా ఉండి, దానికి తక్కువ సాంద్రత ఉండాలి అంటే అద్దం మీ ముఖానికి దగ్గరగా ఉండి లోపలున్న గాలి సాంద్రతను తగ్గించాలి. సిలికాన్‌తో చేయబడిన మాస్కులు చాలా సౌకర్యంగా ఉంటాయి. హ్రస్వ దృష్టి ఉన్నవారి కొరకు దృష్టి సరిచేయబడిన మాస్కులు కూడా నేడు లభ్యమౌతున్నాయి.
తర్వాత, ఒక్కొక్క పాదానికి ఒక ఫిన్ ఉంటుంది. అవి సాధారణంగా రబ్బరుతో చేయబడతాయి, తెడ్డు ఆకారంలో ఉండే ఈ పరికరాలు ఈదడంలో వేగం కొరకు పాదాలకు వేసుకునేవి. వాటిలో ఎంపిక చేసుకునేందుకు రెండు రకాలు ఉన్నాయి: పాదానికంతటికీ వేసుకునేవి ఉండేవి, మడిమె భాగం బయటకు కనబడుతూ ఉండేవి. లోతు నీటిని చేరకముందు పైనగట్టిగుల్లగల ఎండ్రిజాతి జలచరములతో కప్పబడివున్న గుట్టలు లేక తక్కువ లోతుగల పగడపు దిబ్బల ఎత్తుపల్లాలలో నడవవలసి వస్తే మీకు మడిమె భాగం బయటకు ఉండేవి అవసరం. మీ పాద రక్షలపైనే మీ స్టిప్పర్లను వేసుకుని స్నోర్కెలింగ్ ప్రారంభించేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది. పాదానికంతటికీ అమరి ఉండే ఫిన్ మీ పాదానికి సరిగ్గా సరిపోతుంది, ఇది స్టిప్పర్లతోపాటు కాకుండా మరే ఇతర పాదరక్షల అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు.
చివరగా, స్నోర్కెల్. ఆంగ్ల భాషలోని జె ఆకారంలో ఉండే స్నోర్కెల్ ప్రాముఖ్యంగా ప్రారంభికులకు మంచిది, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అంశం సుళువుగా శ్వాసించడమే. ఉపయోగించదగిన ఒక సరసమైన ఆ ట్యూబు యొక్క లోపలి వ్యాసం కనీసం 2 సెంటీమీటర్లు, పొడవు 30 నుండి 35 సెంటీమీటర్లు ఉండాలని ఈదడాన్ని గూర్చి తెలియజేసే ఒక పుస్తకం సలహా ఇస్తుంది.
స్నోర్కెల్ను ఉపయోగించేందుకు సహాయకరమైన సూచనలు
ముందే వివరించినట్లుగా, మీ తలను పైకెత్తకుండానే మీరు నీటిమట్టంపై ఈదుతున్నప్పుడు, శ్వాసించేందుకు స్నోర్కెల్ అవకాశం కల్పిస్తుంది. నీటిమట్టం క్రింద ఈదుతున్నప్పటి మాటేమిటి? ఇది కూడా సాధ్యమే, కాని మొదట మీరు పూర్తి, దీర్ఘ శ్వాస తీసుకోవలసి ఉంటుంది. అయితే, అది నీటిమట్టం క్రిందికి వెళ్లినప్పుడు నీళ్ళు స్నోర్కెల్లోకి ప్రవేశిస్తాయి. ఒక ఈతగాడు నీటిమట్టం నుండి పైకి వచ్చినప్పుడు తరచూ అతని స్నోర్కెల్లో నుండి నీళ్ళు పైకి చిమ్మడం మీరు చూసి ఉండవచ్చు. నీటిని తీసివేసుకోవడానికి ఇది బ్లాస్ట్ విధానం అని పిలువబడుతుంది. వాస్తవానికి ఇది నేర్చుకోవడం చాలా సులభమే, కాని దీనికి గాలిని బలంగా తోయడం అవసరం, కాబట్టి మీరు మీ స్నోర్కెల్ను విజయవంతంగా శుభ్రపర్చుకోవాలంటే మీరు మీ ఊపిరితిత్తులలో తగినంత గాలిని ఉంచుకొని పైకి రావలసి ఉంటుంది.
కొందరు స్థానభ్రంశ విధానం బాగుంటుందని భావిస్తారు, కాని దానికి మరికొంత అభ్యాసం అవసరం. ఈ విధానం ఎలా పనిచేస్తుంది? మీరు ఈదిన తర్వాత నీటిమట్టం వద్దకు వచ్చేటప్పుడు సూటిగా పైకి చూడండి. మీ స్నోర్కెల్ కొన ఇప్పుడు కొంచెం క్రిందగా ఉండాలి. మీ తలను అదే స్థితిలో ఉంచుకొని, మీ స్నోర్కెల్లో చేరిన నీటిని తీసివేసేందుకు కొంచెం గాలిని ఊదడం మాత్రం సరిపోతుంది. మీ ముఖం నీటిమట్టాన్ని తగిలే వరకు మీ తలను అదే స్థితిలో ఉంచండి. ఆ సమయంలో, మీ ముఖాన్ని క్రిందికి వంచి శ్వాసించండి. శుభ్రపరచబడిన స్నోర్కెల్ శుభ్రంగా ఉంటుంది, మీరు ప్రయాస లేకుండా ఊపిరి తీసుకోవచ్చు.
మీరు నీటిమట్టం వద్ద ఉన్నప్పటికీ కదలిపోతున్న తరంగంవల్ల మీ స్నోర్కెల్లోకి అప్పుడప్పుడు నీళ్ళు వస్తుంటే కంగారు పడకండి. ఇలా జరిగితే, గాలిని గట్టిగా బయటికి వదలండి, స్నోర్కెల్లో నుండి నీళ్లు పూర్తిగా వెళ్లిపోతాయి.
మీ స్నోర్కెలింగ్ను ఆనందించండి
నీటిమట్టంపై ఉండగానే క్రమంగా శ్వాసించడం అంటే లోతుగా లోపలికి, ఆ తర్వాత గట్టిగా బయటికి ఇలా శ్వాసించడం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీని ప్రయోజనాన్ని మీ ఊపిరితిత్తులు తెలుసుకుంటాయి. ఆనందకరమైన స్నోర్కెలింగ్కు మీరు ఎంత దూరం లేక ఎంత త్వరగా ఈదుతారన్నది కాదుగాని, మీరు ఎంత చూస్తారు, మీరు కొనసాగుతుండగా ఎంత అన్వేషిస్తారన్నదే కీలకమని గుర్తుంచుకోండి. మీరు నీటిమట్టం క్రింద ఈదాలని ఇష్టపడుతున్నప్పుడు, విశ్రాంతిగా ఉండి వీలైనంత ఎక్కువ ప్రాణవాయువును పీల్చుకోండి, అప్పుడు మీరు ఎక్కువసేపు అడుగున ఉండగలుగుతారు. కాని సహనానికి సంబంధించి రికార్డు స్థాపించాలని ప్రయత్నించకండి!
మీరు ముందుకు పాకుతుండగా, మీ చేతులు మీ ప్రక్కలలో మెల్లిగా తేలియాడేలా ఉంచుకోండి. మీ మోకాళ్లను కొద్దిగా వంచి ఉంచుకొని, పొడవైన నిశ్చలమైన తాకిడిలతో కేవలం మీ స్టిప్పర్లను ఉపయోగించండి. మొదట్లో ప్రయాస లేకుండా, చక్కగా చేయడానికి ఏకాగ్రత అవసరం, కాని కొంత సమయం తర్వాత, అది యాంత్రికమైపోతుంది. కాని మీ మాస్కుపై తరచూ మంచు చేరుతుంటే అప్పుడు మీరేం చేయాలి? దీన్ని నివారించేందుకు సుళువైన మార్గం ఏమిటంటే, మాస్కు వేసుకోడానికి ముందు అద్దంపై కొంచెం లాలాజలాన్ని రాయడమే. ఒకటి లేక రెండు క్షణాల తర్వాత ఆ లాలాజలాన్ని తుడిచివేయండి, అప్పుడు అద్దం చాలా ఎక్కువ సమయంవరకు స్పష్టంగా ఉండడాన్ని మీరు కనుగొంటారు.
మునుగుతున్నప్పుడు కొన్నిసార్లు మీకు మీ మధ్య చెవిలో నొప్పి కలగవచ్చు. దీన్ని మధ్యచెవి నొక్కు అంటారు. మీ కర్ణభేరుల వద్ద భేదసూచక ఒత్తిడిని బట్టి ఇది కలుగుతుంది. మీరు ఒకటి నుండి రెండు మీటర్లు క్రిందికి వెళ్లిన తర్వాత సాధారణంగా అది ప్రారంభమౌతుంది. అదే తగ్గుతుందిలే అని అనుకుంటూ, నొప్పిని నిర్లక్ష్యం చేసి క్రిందికి వెళ్లడంలో కొనసాగకండి. మీరు క్రిందికి వెళ్తుంటే అది ఇంకా ఎక్కువవుతుంది, మీ కర్ణభేరి బ్రద్దలు కాగలదు కూడా. పేడీ డైవర్ మాన్యుల్ అనే డైవర్ల కొరకైన పత్రిక, ఏదైనా నొప్పి తెలియక ముందే ప్రతి ఒక మీటరుకు లేక అంతకంటే తక్కువకు ఒత్తిడిని సమతూకం చేస్తూ ఉండాలని సిఫారసు చేస్తుంది. మీ ముక్కును గిల్లడం ద్వారా, మెల్లిగా ఊదడం ద్వారా దీన్ని చేయవచ్చు. అందుకే ఈక్వలైజర్ మాస్కుపై ఉండడం అవసరం, అప్పుడు మాస్కు మీ ముఖంపై ఉండగానే మీరు మీ ముక్కును నొక్కవచ్చు. అనుభవంతో ఈ విధానం చాలా సులభమైపోతుంది, దాదాపు సహజంగా వచ్చినట్లు ఉంటుంది. నొప్పి అనిపిస్తే, నీటిమట్టం వద్దకు రావడం మంచిది, ఎందుకంటే ఒకసారి అసౌకర్యం ప్రారంభమయ్యాక సమతూకం చేయాలనే తదేకమైన ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉండవు.
ఒకరకమైన వినోదంగా, స్నోర్కెలింగ్ మంచిది, విద్యావంతమైనది, ఆనందకరమైనది. ఆచరణాత్మకంగా అన్ని వయస్సులవారికి, ఇది వ్యాయామం, స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి చేరివున్న చక్కని విధానం. నీటి అడుగునుండే సముద్ర జీవుల పేర్లను కొద్ది సంఖ్యలోనైనా తెలుసుకొని, గుర్తించడాన్ని నేర్చుకోవడం అలా చేయాలనే కోరికగలవారికి స్నోర్కెలింగ్ ఆసక్తిదాయకమైనది కాగలదు. అయినప్పటికీ, ఫిజీలో స్నోర్కెలింగ్ చేసి ఈమధ్యనే తిరిగివచ్చిన టోనీ వంటి అనేకులకు, “ఆశ్చర్యజనకమైన రంగులుగల మరో ప్రపంచంలో ఉండడం” యొక్క అసలైన ఆనందమే స్నోర్కెలింగ్ను సంతోషకరమైనదిగా చేస్తుంది. “నా చుట్టూ ఉన్న అందాన్ని చూసి ఎంతగా ఉత్తేజం పొందానంటే నేనెక్కడున్నానో మరచిపోయాను” అని అతని స్నేహితురాలైన లీనా అంగీకరిస్తుంది.
స్కూబా డైవింగ్ మాటేమిటి?
మంచి ఈతగాళ్లయి, లోతునీటి అద్భుతాలచే ఆకర్షించబడిన వారికి లేక నీటి అడుగున దృశ్యచిత్రీకరణ చేయాలనుకునే వారికి, స్కూబా డైవింగ్ తరువాతి మెట్టు వంటిది. మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మీ పరికరాల గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని, ప్రాథమిక సూత్రాలను పాటించగలిగితే, మీరు స్థయిర్యంతో నీళ్ళలోకి ప్రవేశించవచ్చు. అయితే, మీరు మొదట సరైన శిక్షణ తీసుకోకుండా, ఒకవేళ అవసరమైతే, పేరుపొందిన ఉపదేశకుని నుండి లైసెన్సు పొందకుండా స్కూబా డైవింగ్‌కు ఎన్నడూ వెళ్లకూడదు. అప్పుడు కూడా, మీ లైసెన్సు అనుమతించే లోతు పరిధులను మీరు దాటకూడదు. ఎప్పుడూ ఒక సహచరునితో డైవ్ చేయండి. ఆస్ట్రేలియావంటి కొన్ని దేశాల్లో, అలాంటి కోర్సును ప్రారంభించడానికి ముందు, డైవింగ్‌కు సంబంధించిన వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని చట్టం కోరుతుంది.
స్కూబా పరికరాలు చాలా ఖరీదైనవై ఉండగలవు. స్నోర్కెలింగ్కు ఉపయోగించే ప్రాథమిక పరికరాలైన—ముఖానికి వేసుకొనే మాస్కు, ఫిన్స్, స్నోర్కెల్—వంటివాటితోపాటు మీకు బహుశ ఉష్ణమండల నీళ్లైన వెచ్చని నీళ్ళలో తప్ప దాదాపు తప్పకుండా వెట్‌సూట్ అవసరం ఉంటుంది. మీకు ఒక ప్లవనశక్తి నిరోధక పరికరం, ఒక వెయిట్ బెల్ట్, ఒక కత్తి, ఒక శ్వాసించే పరికరం (మీ సహచరుడు గాలి అందక కష్టాలు ఎదుర్కొనవలసి వస్తే అందుబాటులో ఉంచుకొనేందుకు మరొకదానితోపాటు), ఒక స్కూబా టాంకు కూడా మీకు అవసరమౌతాయి. మీకు డైవింగ్ గడియారం, లోతు మాపకం, మీకు ఎంత గాలి మిగిలి ఉందో తెలుసుకోగలిగేలా నీటిలో మునగగల ఒత్తిడి మాపకం వంటి అవసరమైన పరికరాలు కూడా మీకు ఉండాలి. పేరుగాంచిన అనేక డైవింగ్ స్థలాలలో, ఈ పరికరాలను సులభంగా అద్దెకు తీసుకోవచ్చు, మీరు ఎక్కువగా డైవింగ్‌కు వెళ్లకపోతే మీరు మీ స్వంత సూట్‌ను కొనుక్కునే బదులు ఇది తరచూ ఎంతో పొదుపైనదిగా నిరూపించబడుతుంది.
సముద్రం మరియు అందులోని జీవుల ఎడల గౌరవం
“నేను క్వీన్స్లాండ్ సన్‌షైన్ తీరంపై కలుండ్రా దిబ్బవద్ద స్నోర్కెలింగ్ చేస్తూ, దాదాపు రెండు మీటర్ల దూరంనుండి ఒక రంగురంగుల బటర్‌ప్లై చేపను గమనిస్తున్నాను. అప్పుడు, హఠాత్తుగా, ఒక మెరిసే స్టీలు బాణం కనిపించి, దబేల్మన్న ఒక శక్తివంతమైన శబ్దంతో ఆగిపోయింది. చిన్న చేప వ్యర్థంగా ప్రయాసపడింది—అది శ్వాసావయవంగుండా ఒక కొండకు కొట్టబడింది. కేవలం గురి చూడడాన్ని అభ్యాసం చేసేందుకు ఆ అందమైన చేపను తాను చంపానని దానికి కారకుడైన బాలుడు అంగీకరించాడు! అది తినడానికి ఎంతో చిన్నది” అని స్నోర్‌కెలింగ్‌లో ఉత్సాహంగల పీటర్ గుర్తు చేసుకుంటున్నాడు. దుఃఖకరంగా, అలాంటి అనాలోచితమైన పనులు ప్రపంచమంతటా ఎక్కువవుతున్నాయి.
కాలుష్యం కూడా తన ప్రభావాన్ని చూపింది. పేరుగాంచిన స్థలాలు తరచూ ప్లాస్టిక్ సంచులు, వాడేసిన డ్రింక్ క్యాన్లతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. కొన్ని దేశాల్లో నాశనకరమైన రసాయనాల ప్రవాహం కూడా ఒక పెరుగుతున్న సమస్యగా తయారవుతున్నది. చెత్త చెదారం పెరిగిపోతుంటే, చేపలు మరో స్థలానికి వెళ్లిపోతాయి, పగడము చనిపోతుంది.
స్కూబా డైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ గ్లోవ్స్ వేసుకోవడం మంచి అలవాటు. అయినప్పటికీ, మీరు తాకబోయేదాన్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉండడం తగినదే. ఉదాహరణకు, సురక్షితంగాలేని చేతులలోకి ఎప్పుడూ సముద్రంలో ఉండే ముళ్లుగల గుండ్రని చిప్పలో జీవించే సముద్ర జంతువు యొక్క సూదులవంటి ముళ్లు గుచ్చుకుపోగలవు. అందమైన బటర్‌ప్లై కోడ్ చిన్నదే అయినప్పటికీ, తన ఎర్రని తెల్లని పట్టీలను గర్వంగా అటు ఇటు ఆడిస్తూ, ‘దగ్గరికి రావద్దు. ఇది నా ప్రాంతం’ అని హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. దాని కుచ్చుల మధ్య ప్రకాశవంతమైన, విషపూరితమైన శ్లేష్మ ద్రవముతో నిండిన పొడవైన ముళ్లు మోసకరంగా దాగి ఉంటాయి. కేవలం వాటిని తగలడం కూడా నొప్పి కలిగించగలదు.
ఇతర జీవులు కళ్లకు కనిపించడం కష్టం. ఉదాహరణకు, వీడీ సీ డ్రాగన్ మభ్యపెట్టడంలో దిట్ట. అది డైవర్ల కళ్ల చురుకుదనాన్ని సవాలు చేస్తూ, కేవలం ఒక కూరమొక్కలా కనిపిస్తుంది, దానికి భిన్నంగా, సముద్ర నత్త యొక్క విశేషమైన, ప్రకాశవంతమైన రంగులు మీ అవధానాన్ని అలాగే ఆకట్టుకుంటాయి. కాని ఇది శోధించే రుచికరమైన ఆహారం మాత్రమేనా? ఇతర జీవులను చంపి తినే జీవులు అది అలాకాదని త్వరలోనే తెలుసుకుంటాయి ఎందుకంటే అది అసహ్యకరమైన రసాయనాలను ఆయుధాలుగా కలిగివుంది.
ఎన్నో ప్రతిఫలదాయకమైన దృశ్యాలు
వాస్తవానికి స్నోర్కెలర్కు, స్కూబా డైవర్‌కు ఇద్దరికీ ఒకేలా సముద్రం జీవంతో సమృద్ధిగా ఉంది. లెక్కలేనన్ని జీవులూ రంగులు గల పగడపు దిబ్బలు మనోహరమైన దృశ్యాలు. తీరం నుండి కేవలం కొద్ది దూరంలో ఈదుతూ వాటిని చూడగలము. “అన్ని ఆకారాలు, పరిమాణాలు గల రంగు రంగుల చేపలతో చుట్టుముట్టబడి ఉండడం, కొన్ని మీ చేతుల్లో నుండి ఆహారం తీసుకొని తినడం వంటివాటివల్ల వచ్చే ఆనందం ఎనలేనిది. అది ఎంతో కదిలించే అనుభవం” అని ఒక డైవర్ చెప్పాడు. ఇంకా ఆయనిలా జతచేశాడు: “భూమ్యాకర్షణశక్తికి దాదాపు అభుద్యమైనట్లుగా వాటిలో ఒకరై ఉండడం ఎంతో అపురూపమైనది.”
కాబట్టి, స్నోర్కెలింగ్ లేక స్కూబా డైవింగ్‌కు వెళ్లేందుకు మీకు ఎప్పుడైనా అవకాశం లభిస్తే, అనుభవంగల ఈతగాళ్లు సిఫారసు చేసిన సుళువైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడం ద్వారా దాన్ని ఎంతో సురక్షితంగా చేయవచ్చునని గుర్తుంచుకోండి. తరంగాల క్రిందనున్న లోకం యొక్క అందాన్ని అన్వేషించే ఈ సుసంపన్నమైన అనుభవాన్ని బహుశ ఒకరోజు మీరు కూడా పొందవచ్చు.
[అధస్సూచీలు]
a “స్కూబా” అనేది “శ్వాసపీల్చుకొనడానికి ధరించెడి ఉపకరణాల” మొదటి అక్షరాల కూర్పుతో ఏర్పడిన ఎకోనిమ్ వంటిదే. పైన చూపిన విధంగా, స్కూబా ఈతగాళ్ల ఉనికిని గూర్చి హెచ్చరించే ప్రస్తుతపు అంతర్జాతీయ పతాకం శ్వేత-నీలవర్ణ ఆల్ఫా పతాకమే. కొన్ని దేశాలు ఇప్పటికీ తెల్లని చారతోనున్న ఎరుపు వర్ణ పతాకాన్ని ఉపయోగిస్తున్నాయి.
[16వ పేజీలోని చిత్రం]
బటర్‌ప్లై కోడ్
[17వ పేజీలోని చిత్రం]
ఆరెంజ్ ఫ్లెమింగో
[17వ పేజీలోని చిత్రం]
బ్లూ టాంగ్
[17వ పేజీలోని చిత్రం]
పగడంపైనున్న నూడీబ్రాంచ్
[Picture Credit Line on page 15]
By courtesy of Australian International Public Affairs