నార్వే ఒలింపిక్ ఆటలు—ఆదర్శాలు మాత్రమే చాలా?
నార్వేలోని తేజరిల్లు! ప్రతినిధి
అంతర్జాతీయ ఒలింపిక్ సమితి (ఐఒసి), వంద సంవత్సరాల పూర్వం స్థాపింపబడినప్పుడు గొప్ప సంగతులు జరుగుతాయని అది కలలుకన్నది. ప్రతి నాల్గవ సంవత్సరం, ప్రపంచంలోని యౌవనులందరూ ఆర్థిక లాభాలు లేకుండా ఆట స్థలంలో కూడేలా చేయడం ద్వారా సహోదరత్వాన్ని మరియు శాంతిని వృద్ధిచేయాలన్నదే ధ్యేయం. నిష్పక్షపాతమైన పోటీ, ప్రజల మధ్య ఐకమత్యాన్ని మరియు సమాధానాన్ని కలుగజేస్తుందని ఆశించబడింది. ఈ విషయంపై ఆధారపడి, పాతకాలం నాటి ఒలింపిక్ ఆటలు, ఆధునిక కాలాల్లో పునరుద్ధరింపబడ్డాయి.
నాటి 1896లో ఏథెన్సు, గ్రీస్నందు తక్కువ స్థాయిలో ప్రారంభించబడిన వేసవి ఆటలు, 170 కంటే ఎక్కువ దేశాలనుండి వచ్చిన 11,000 మంది పాల్పంచుకునేవారి శిఖరాగ్రంతో, ప్రపంచంలోని అతి పెద్ద ఆటల వేడుకగా అభివృద్ధి చెందాయి. మొదటి శీతాకాలపు ఆటలు ఫ్రాన్స్‌లోని చామొనిక్స నందు 1924లో జరిగాయి, అవి ఎప్పుడూ కూడా వేసవి ఆటలకన్నా “తక్కువ ప్రాముఖ్యంగలవిగా” ఉండేవి. అయినప్పటికీ, 1994లో నార్వేలోని లిల్హేమర్నందు ఫిబ్రవరి 12 నుండి 27 వరకు జరిగిన శీతాకాల ఒలింపిక్‌ల కొరకు యించుమించు 70 దేశాలనుండి వచ్చిన 2,000 ఆటగాళ్లు సమకూడారు.a
సహోదరత్వం మరియు స్నేహము యొక్క ఆదర్శం, ప్రఖ్యాతిగాంచిన ఒలింపిక్ వలయాలచే సూచింపబడింది, మరియు “ఆరోగ్యకరమైన శరీరంలో, దృఢమైన మనస్సు” అనే తలంపు మునుపెన్నటికన్నా ఎక్కువ అవసరమైంది. లిల్హేమర్నందలి ఒలింపిక్ ఆటల్లో ఈ ఆదర్శాలు ఏ పాత్ర వహించాయి?
ఒలింపిక్లు మరియు వ్యాపార రంగం
సమాచారాన్ని విస్తృతంగా ప్రసారం చేయడం ఒలింపిక్ క్రీడలపట్ల ప్రజల్లో అపరిమితమైన ఆసక్తిని కలిగించింది. లిల్హేమెర్ నందు, అథ్లెట్లకంటే వార్తా ప్రసార రంగానికి చెందిన వారు నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చారు, ఒక రికార్డు సృష్టించిన సంఖ్యయైన దాదాపు రెండు వందల కోట్లమంది ప్రజలు ఈ శీతాకాలపు ఆటలను దూరదర్శినిలో చూశారు. అలా, శక్తివంతమైన వాణిజ్య ఆసక్తులకు ఒలింపిక్లు లాభదాయకమైన వ్యాపారంగా మారాయి, మరి టివి నెట్వర్క్ కార్యక్రమాలు, వాటిని స్పాన్సర్ చేసేవారు ప్రత్యేక ఆధిక్యతలకు, కాంట్రాక్టులను పొందడానికి ఎంతో పోరాడతారు.
ప్రపంచమంతటి వర్తక మరియు పారిశ్రామిక ప్రతినిధులు లిల్హేమర్లోని ఆటలకు హాజరయ్యారు, ఈ అంతర్జాతీయ సామూహిక సమావేశం, వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి, సదస్సులు మరియు సమావేశాలను ఏర్పాటు చేయడానికి చక్కని అవకాశమని వారిలో అనేకులు దృష్టించారు. చిన్నా, పెద్దా వ్యాపారవేత్తలు పిన్నులు, పోస్ట్‌కార్డులు మొదలుకొని వంట సామగ్రి, బట్టల వరకు, అమ్మబడే లెక్కలేనన్ని రకాలైన వేర్వేరు ఒలింపిక్ ఉత్పత్తుల ద్వారా ఎనలేని సృజనాత్మక కౌశలాలను కనపర్చారు.
సహజంగా, ఆటల సమయంలో స్థానిక ప్రజల పరిస్థితి తలక్రిందులయ్యింది. సాధారణంగా 20,000కు పైగా మాత్రమేవుండు లిల్హేమెర్ జనాబా, ఒలింపిక్ పనివారు, పాల్గొనేవారు, నాయకులందరూ రావడం దాని జనాబాను రెండంతలు చేసింది. దానికితోడు, ప్రతిరోజు 1,00,000 మంది ప్రేక్షకులు “తరలిరావడం” కూడా జరిగేది. ఈ కల్లోలాన్ని తప్పించుకోడానికి ఆ ప్రాంత నివాసుల్లో కొంతమంది సెలవు తీసుకుని వెళ్లారు, వారు హాస్యాస్పదంగా “క్రీడల శరణార్థులు” అని పిలువబడ్డారు.
ఆటలు మరియు ఒలింపిక్ ఆదర్శాల క్రీడా సంబంధమైన దృష్టి ఎలా ఉంది?
కిట్యాస్, ఆల్ట్యిస్, ఫార్ట్యిస్
ఒలింపిక్ ప్రతిజ్ఞలైన కిట్యాస్, ఆల్ట్యిస్, ఫార్ట్యిస్లకు (ఎక్కువ వేగం, ఎక్కువ ఎత్తు, ఎక్కువ శక్తివంతం) అనుగుణంగా ఒలింపిక్ ఆటగాడు రికార్డులు బద్దలుకొట్టడానికి, తనతో పోటీపడే వారిని జయించిడానికి ప్రయత్నిస్తాడు. నేడు దాన్ని సాధించడానికి క్రీడలను కేవలం తీరిక సమయంలో చేసే వాటిగా మాత్రమే ఉంచడం సరిపోదని ఒలింపిక్ ఆటగాళ్లు తెలుసుకున్నారు. ఇది అనేకమంది ఒలింపిక్ ఆటగాళ్లకు పూర్తికాల ఉద్యోగము మరియు జీవనోపాధి, ఎందుకంటే వారు సాధించే ఫలితాలపైనే వారికి లభించే వాణిజ్య ప్రకటనల పారితోషికం ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లాభాలు లేకుండా ఔత్సాహిక ఆటగాళ్లను వృద్ధిచేయాలన్న మొదటి సంకల్పం, డబ్బు మరియు వ్యవసాయ తత్వానికి దారి యివ్వాల్సి వచ్చింది.
బదులుగా, ప్రజలకు కావల్సిన నటన, వినోదం వారికి లభిస్తుంది. ఇటీవలి ఒలింపిక్ల్లో స్థాపింపబడిన అనేక రికార్డులు, కొన్ని దశాబ్దాల పూర్వం వాటిని సాధించడం వీలవుతుందని కూడా ఊహించని వాటిని చూపింది. ఇది అధికశిక్షణ మరియు గొప్ప ప్రత్యేకీకరణ వలననే కాక మేలైన సాధనాలు మరియు మంచి సౌకర్యాల వలన కూడా జరిగింది. ఉదాహరణకు, లిల్హేమెర్ ఆటల్లో, పురుషుల ఐదు స్పీడ్-స్కేటింగ్ యివెంట్స్లో, నాలుగు ప్రపంచ రికార్డులు మరియు ఐదు ఒలింపిక్ రికార్డులు స్థాపించబడ్డాయి. వృత్తిపర స్కేటింగ్‌కు మంచును సరైన రీతిలో ఉంచడానికి శాస్త్రీయమైన ప్రమాణాలు చేపట్టిన క్రొత్త స్కేటింగ్ హాల్‌కు కొంత ఘనత యివ్వబడింది.
దురదృష్టకరంగా, కొద్దిమంది అథ్లెట్లు ఒలింపిక్ ప్రమాణంలో వారు వాగ్దానం చేసినట్లుగా, “క్రీడల మహిమ కొరకు క్రీడాకారునిగా నిజమైన స్ఫూర్తితో” పోటీపడకుండా ఉండి ఇతరులకంటె ఉన్నతంగా ఉంటారు. ఈ సంవత్సరం శీతాకాలపు ఆటల్లో కొద్దిమంది అథ్లెట్లు తాము గెలవనప్పుడు చెడ్డ స్వభావం కనపర్చారు, మరి కొంతమంది అథ్లెట్లు తోటి పోటీదారులను అణగదొక్కడానికి ప్రయత్నించారు. గత సంవత్సరాలలో స్టీరాయిడ్స్ మరియు మాదకద్రవ్యాలకు విరుద్ధంగా పోరాడవలసి వచ్చింది. లిల్హేమెర్ నందు, ఒక క్రీడాకారుడు మత్తుగా ఉండినందువల్ల ప్రారంభ దినంలోనే యింటికి పంపబడ్డాడు. అయితే, క్రీడల సమయంలో మాత్రం పరీక్షింపబడినప్పుడు ఎవ్వరిలో మాదకద్రవ్యాల నిదర్శనం కనిపించలేదు.
లిల్హేమెర్ క్రీడల సంబంధంగా ఒలింపిక్ ఆదర్శాలకు కొన్ని నూతన దృష్టికోణాలు ఉండినవి.
పర్యావరణ పరిరక్షణ, సహాయక పనులు, మరియు శాంతి ప్రయత్నాలు
విస్తృతమైన అభివృద్ధి, బారీ ఎత్తున చెత్తను ఉత్పత్తి చేసే, ఒలింపిక్ వంటి అతి పెద్ద నిర్వహణా పని, “వనరుల ఉపయోగంలో పొదుపుచేయదు, పర్యావరణాన్ని గురించి ఆలోచించదు.” (లిల్హేమర్ ఒలింపిక్లకు వాతావరణ పత్రికైన మిల్యోస్పేస్యెల్) అనేకమంది ప్రజలు యిది ఒలింపిక్ స్ఫూర్తితో సరిపోల్చబడజాలదని, 1994 శీతాకాలపు క్రీడలను పర్యావరణాన్ని ఎక్కువగా ప్రదర్శించాలని సలహా యిచ్చారు. ఈ ఆలోచనను అమలుపర్చారు, లిల్హేమర్ ఆటలు “‘పచ్చని ఆకృతి’గల మొదటి ఒలింపిక్ ఆటలుగా” అంతర్జాతీయంగా అవధానాన్ని ఆకర్షించాయి. అది ఏమి సూచించింది?
పర్యావరణంపై కలుగగల తీవ్రప్రభావాలను తగ్గించడానికి, స్థలం, రూపకల్పన, మరియు క్రొత్త క్రీడా స్థలాల దీర్ఘకాల నిర్వహణ వంటి విషయాలను పరిగణించారు. అన్ని రంగాల్లో, చెక్క, రాయి, మరియు పేపర్బోర్డ్వంటి పర్యావరణానికి హాని కల్గించని మరియు తిరిగి ఉపయోగించగల వస్తువులు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి, మరియు స్పాన్సర్ చేసే వారికి, సరఫరాదారులందరికి అత్యున్నత వాతావరణ ప్రమాణాలను నెలకొల్పారు. క్రీడా స్థలాల్లో పొగత్రాగడం పూర్తిగా నిషేధించబడింది.
ఒలింపిక్ లక్ష్యాలను గురించి అధ్యయనం చేయడం, లిల్హేమెర్ ఒలింపిక్ ఎయిడ్ అనే సహాయక ప్రయత్నాన్ని స్థాపించడానికి దారి తీసింది. మొదట, బోస్నీయా మరియు హెర్జెగొవినాలోని, పూర్వపు ఒలింపిక్ పట్టణమైన సెరజేవోలోని పిల్లలకు సహాయంగా సమకూర్చబడింది, అది తర్వాత ప్రపంచమంతటా ఉన్న యౌవన యుద్ధ బాధితులకు సహాయం చేయడానికి విస్తృతపర్చబడింది. ఒక స్వర్ణ పతక విజేత, ఒక యివెంట్లో తన విజయానికి లభించిన (సుమారు 30,000 డాలర్లు) తన బోనస్ డబ్బును విరాళంగా యివ్వడంతో ఈ సహాయ పనికి బ్రహ్మాండమైన ప్రోత్సాహం లభించింది. భవిష్యత్తులోని ఆటల్లో కూడా యిలా ఒలింపిక్ సహాయం లభించడం కొనసాగుతుందని దాని ప్రారంభకులు అపేక్షిస్తున్నారు.
ఒలింపిక్‌ల ప్రారంభ ఉత్సవంలో ఆచారబద్ధంగా పావురాలను విడువడం, ప్రపంచానికి శాంతి సందేశాన్ని మౌనంగా అందిస్తుంది. ఐఓసి కాటలొనియా దేశ అధ్యక్షుడైన క్వాన్ ఆన్టొన్యో సామారాంక్ భూనివాసులందరికొరకు శాంతిని గూర్చి మళ్లీ మళ్లీ మాట్లాడటంతో, 1994 శీతాకాలపు ఆటల సంబంధంగా శాంతి ఆదర్శం దృష్టిలోనికి మరింత ఎక్కువగా వచ్చింది.
నెరవేరునట్టి ఆదర్శాలు
మానవులందరిలో సంతోషము, నీతి, శాంతి, సహోదరత్వం, శాంతి, యథార్థత, ఆనందము మరియు శారీరక, మానసిక దృఢత్వం కొరకు ఎంతో మిక్కుటంగా ఉన్న కోరికను ఒలింపిక్ ఆదర్శాలు ప్రతిబింబిస్తాయి. ఈ సంవత్సరపు ఒలింపిక్ ఆటలు. ఒలింపిక్ యొక్క మొదటి లక్ష్యాలను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చినందుకు ఈ సంవత్సరపు శీతాకాలపు ఆటలు పొగడబడ్డాయి, అవి “జరిగిన వాటన్నిటిలోకెల్లా మేలైన శీతాకాలపు ఒలింపిక్ ఆటలుగా” సూచించబడ్డాయి. అయినప్పటికీ, ఒలింపిక్ ఉద్యమం మరోసారి తన ఆదర్శాలకు తగినట్లు నిలువలేక పోయింది.
క్రీడల ప్రాథమిక ఆదర్శాలపై ప్రతిష్ఠ మరి వాణిజ్యవిధానం ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. పందెము తరుచుగా, సహోదరత్వం మరియు సమాధానానికి బదులు అహంభావాన్ని, జాతీయతా వాదాన్ని ఉత్పన్నం చేసే తీవ్రమైన పోటీగా మారింది.
ఒలింపిక్ అభిలాషలు నెరవేరడానికి మార్గమేదైన ఉందా? ఒక ఆదర్శవంతమైన లోకాన్ని సాధించడానికి మానవులు చేసే ప్రయత్నాలు విఫలమౌతాయని బైబిలు చూపుతుంది. అయినప్పటికి, దేవుని రాజ్యం త్వరలో భూమిపైకి పరిపూర్ణమైన పరదైసు పరిస్థితులను తీసుకురాడానికి చర్య తీసుకుంటుంది. (యిర్మీయా 10:23; 2 పేతురు 3:13) అలాంటి లోకం అథ్లెటిక్లను వృద్ధిపర్చడంపై లేక ఒలింపిక్ నియమాలకు మరియు ఆచారాలకు యథార్థంగా ఉండడంపై కాదు గానీ సృష్టికర్తకు నిజమైన భక్తిని చూపడంపై ఆధారపడి ఉంది. అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” కాబట్టి, నేడు “దైవభక్తి విషయంలో,” ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో వారు, ఆరోగ్యకరమైన శరీరంలో దృఢమైన మనస్సును నిజంగా పొందే ప్రతిఫలాన్ని పొందగలరు.— 1 తిమోతి 4:7, 8.
[అధస్సూచీలు]
a మరి 1992లో ఒలింపిక్ ఆటలు కూడా ఏర్పాటుచేయబడ్డాయి, కానీ వేసవి మరియు శీతాకాలపు ఆటలు అదే సంవత్సరంలో జరగడం అదే చివరిసారి. ఇప్పటి నుండి అవి ప్రతి రెండవ సంవత్సరంలో జరుగుతాయి.
[26వ పేజీలోని బాక్సు]
మతపరంగా మిళితమైన ఒలింపిక్లు
ఒలింపిక్ ఆటలు గ్రీకు మతంలో వేరుపారి ఉన్నాయి. గ్రీకు దేవతలందరిలో ఉన్నతుడైన జీయస్ను గౌరవించడానికి జరిపే మతపరమైన ఉత్సవంగా అవి ప్రారంభించబడ్డాయి. ఆధునిక ఆటల వివిధ లక్షణాలు మతపరమైన ప్రభావాన్ని కలిగి వున్నాయి: ఒలింపిక్ పతాకానికి పవిత్రమైన ఆచారాలు చేయడం, “పరిశుద్ధ” జ్వాల, మరి ఒలింపిక్ ప్రమాణము వంటివి. క్రీడలను ప్రారంభించేటప్పుడు పాడే, సుమారు 100 సంవత్సరాల పూర్వపు గ్రీకు కీర్తన, లిల్హేమెర్లోని ప్రారంభోత్సవ వేడుక కొరకు నార్వే భాషలోనికి అనువదించబడింది. ఈ ఒలింపిక్ కీర్తన దృఢమైన మతపర శృతులను కలిగి ఉంది. అది జీయస్ కొరకైన కీర్తనగా గ్రహించబడింది. ఆ గేయంలో ఈ క్రింది పలుకులు ఉన్నాయి: “అనాదికాలపు అమర్త్యమైన ఆత్మా,/నిజమైనది, అందమైనది మరియు మంచిదానికి తండ్రి,/దిగివచ్చి, కనిపించి మాపై నీ కాంతిని కుమ్మరించు/ . . . ఆ దివ్యమైన ఆటలకు జీవాన్ని మరియు చైతన్యాన్నివ్వు!/ . . . జాతులన్నీ నిన్ను ఆరాధించడానికి గుంపుగా కూడినవి,/ఓ అనాదికాలపు అమర్త్యమైన ఆత్మ!”
నార్వేలోని లూథరన్ చర్చి తన స్వంత సమితి ద్వారా, విస్తృతమైన సంగీత, మతపర కార్యక్రమాని కొరకు ఏర్పాటుచేసింది. ఒక గొప్ప మిశ్రమవిశ్వాస యోజనలో, ప్రముఖ చర్చి సంస్థలన్నీ సూచించబడ్డాయి. లిల్హేమర్ ఒలింపిక్ గ్రామంలో, అధికారిక ఒలింపిక్ మతగురువు మరియు అంతర్జాతీయ మరియు సర్వసాధారణమైన మతగురువుల గుంపు అందుబాటులో ఉండిరి.
[25,26వ పేజీలోని చిత్రాలు]
పైన: వేగంగా వెళ్లే స్కేటర్, 10,000 మీటర్ల పందెంలో బంగారు పతకం కొరకు ముందుకు సాగుతున్నాడు
మధ్యలో: ఫ్రీస్టయిల్ ఏరియల్లు, ఒక క్రొత్త ఒలింపిక్ యివెంట్ను సూచించాయి
అడుగున: గంటకు 75 మైళ్లకన్నా ఎక్కువ వేగంతో—కొండకు దిగువగా నున్నదానిలో పోటీపడుతున్నారు
[క్రెడిట్ లైను]
Photos: NTB