ప్రపంచ పరిశీలన
ఆర్థిక ఇబ్బందులు
“గత 1930లలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు మొదటిసారిగా నిరుద్యోగ సమస్యను ఎడతెగక ఎదుర్కొంటున్నాయి,” అని ఇంటర్‌నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఒ) జనరల్ డైరెక్టర్ మిఖాయెల్ హాన్‌సెన్ అంటున్నాడు. జర్నల్ డా టార్డ్ ప్రకారం, “ప్రపంచంలోని ముప్పైశాతం కార్మికులు అంటే దాదాపు 82 కోట్ల వ్యక్తులు నిరుద్యోగులు, లేదా తాత్కాలిక ఉద్యోగస్థులు.” లాటిన్ అమెరికాను గూర్చిన ఐ.ఎల్.ఒ రిపోర్టు జర్నల్ డు బ్రాసిల్ యిలా వ్యాఖ్యానిస్తుంది: “పంట కోయడం, కాఫీని శుభ్రంచేయడం, చెరుకును కోయడం, ఎగుమతి కొరకైన ప్రత్తిని, పండ్లను, కూరగాయలను కోయడం వంటి పనులు చేసే, ‘అస్థిరులైన’ కార్మికులు అని పిలువబడే తక్కువ వేతనం పొందుతున్న, తాత్కాలికమైన కార్మికుల సంఖ్యలో భయంకరమైన పెరుగుదల ఉంది.” (g94 10/22)
పాఠశాల క్రూరత్వము
జపాన్‌లోని కాబి మున్సిపల్ టెక్నికల్ జూనియర్ కాలేజీనుండి బహిష్కరించబడిన ఒక అబ్బాయి విద్యనభ్యసించే తన హక్కుకొరకు అర్జీపెట్టుకుంటున్నాడు. ఒక యెహోవాసాక్షిగా మతసంబంధమైన తన మనస్సాక్షినిబట్టి శారీరక శిక్షణలో భాగమైన కెండో (జపానీయుల ఆయుధ విద్య) కసరత్తులో పాల్గొనలేదు. అతనికి శారీరక విద్యాభ్యాసంలో తక్కువ మార్కులు వచ్చినా, అతడు అగ్ర-శ్రేణికి చెందిన విద్యార్థియే, అయినప్పటికీ పాఠశాల అతనిని బహిష్కరించింది. “వేరే ఏ సమస్య లేకపోయినా, పాఠశాల పనిని సరిగ్గా చేయనందువల్ల, ఒక ప్రత్యేక విషయంలో ఉత్తీర్ణుడగుటకు కొన్ని మార్కులు తక్కువైనందువల్లే, శిక్షగా ఒక విద్యార్థిని బహిష్కరించడం పాఠశాలయొక్క ‘సామాన్య జ్ఞానానికి’ విరుద్ధమని,” సుకుబా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ టెట్సువో షీమోమ్యురా, యోమియోరి షింబన్ అనే వార్తాపత్రికలో అన్నారు. మార్పు కావాలని కోరుతూ ఆయన యిలా అన్నారు: “ఈ కేసులో కలతపరచేదేమంటే యిప్పటికీ లోతుగా-పాతుకుపోయిన పాఠశాలయొక్క క్రూరమైన ధోరణులే.” (g94 10/22)
చీలికలుగల పాము నాలుక
పాముకు చీలికలుగల నాలుక ఉండడం వలన ఉపయోగం ఏమిటి? ఇంటర్‌నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, శబ్దం వస్తున్న దిశను కనుక్కోడానికి మన రెండు చెవులు ఎలా కలిసి పని చేస్తాయో, అలాగే వాసననుబట్టి వెంటాడడానికి పాము నాలుక సహాయపడుతుంది. పాము తన ఎరను లేదా తన జతను వెంబడిస్తున్నప్పుడు, తన నాలుకను అటు యిటు మళ్ళీ మళ్ళీ కదిలిస్తూ, కొనభాగాలను సాధ్యమైనంత ఎడంగా చాచుతుంది. ఈవిధంగా, తాను వెదికి పట్టుకోవాలని చూస్తున్న జంతువు ఏ దిశలో ఉందో తెలుసుకోగలిగేలా, పాము రెండు ప్రాంతాల నుండి వచ్చే వాసన యొక్క తీవ్రతను పరీక్షిస్తుంది. (g94 11/8)
ఈ 1914లోని తరం
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 47,43,826 మంది అమెరికా ప్రజలలో 2,72,000 మంది మాత్రమే 1984లో బ్రతికి ఉన్నారు. (ఏప్రిల్ 8, 1988 అవేక్!) డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటెరాన్స్ అఫెయర్స్ ప్రకారం, నేడు ఆ సంఖ్య సుమారు 30,000కు తగ్గింది, వారి వయస్సు సరాసరి 95. అయితే, ప్రపంచవ్యాప్తంగా, 1914లో, లేదా అంతకు ముందు పుట్టిన తరానికి చెందినవారిలో 6,14,86,000 మంది 1992నాటికి కూడ జీవిస్తున్నారు. (g94 11/8)
జపానీయుల పారంపర్యం అంతరించిపోతోందా?
జపాన్ ప్రజలు పారంపర్యంగా తమ పెద్దలకు చూపించిన ప్రగాఢమైన గౌరవం తగ్గిపోతున్నట్లుగా కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా వృద్ధులను బాధించడం ఎక్కువవుతుంది. మెయినికీ డెయిలీ న్యూస్ వివరించేదేమంటే ఒక నిపుణుని అభిప్రాయం ప్రకారం, అనేక ఆధునిక కుటుంబాలు తమ వృద్ధ బంధువులను అయిష్టంతో చూసుకుంటున్నామని, ఒత్తిళ్ళను అధిగమించలేక పోతున్నామని తమకు తామే కనుగొంటున్నాయి. వాళ్ళు తరచూ హింసను, అశ్రద్ధను అవలంభిస్తున్నారు. మెయినికీ డెయిలీ న్యూస్ ప్రకారం, ఒక కేసులో ఒక వ్యక్తి, “75 ఏండ్ల అతని తండ్రి తన ఫించను డబ్బు అతనికి యివ్వడానికి నిరాకరించినప్పుడెల్లా, అతనిని చితకబాదడం అలవాటు” చేసుకున్నాడు. ఇతర విలక్షణమైన ఉదాహరణలలో ఒకటి, వృద్ధుడైన తండ్రిని కాళ్ళు చేతులు బంధించి, ఒక గదిలో వేసి మూసి తాళం వేయడం, రెండవది, వృద్ధ తల్లి నోట్లో చింపిగుడ్డలు కుక్కడమూ. (g94 11/8)
చైనాలో కార్లు ఎందుకింత తక్కువగా ఉన్నాయి
లక్ష కోట్లకన్నా ఎక్కువ ప్రజలున్న చైనాలో సొంత వాహనాలు కేవలం 50,000 ఉన్నాయి. అయినప్పటికీ, చైనా టుడే ప్రకారం, యీ సంఖ్య “ఎంతో గొప్ప అభివృద్ధిని“ సూచిస్తుంది. ఈ దేశంలో 1983నందు సొంత కార్లు కేవలం 60 ఉండేవి! కారు యాజమానుల సంఖ్య సమీప భవిష్యత్తులో పెరుగుతుందని నిరీక్షించబడుతుంది. అయినప్పటికీ బావి కొనుగోలుదారుడు లెక్క చూసుకోవలసిందే. చైనాలో వాహనాల ఖరీదును పెంచే వేర్వేరు రకాల పన్నులు 40 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక “కారు చైనాలో 3,00,000 యాన్‌లకు అమ్మబడుతుంది, అయితే దాని వెల యితర దేశాల్లో 10,000 అమెరికా డాలర్లకంటే ఎక్కువ కాదు.” డ్రైవింగ్ నేర్చుకోడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక డ్రైవింగ్ స్కూల్, “సగటు జీతం సంపాదించేవారి వార్షిక ఆదాయానికన్నా రెండురెట్లు” ఎక్కువగా తీసుకుంటుందని చైనా టుడే రాస్తుంది. (g94 11/8)
బెంబేలెత్తించే నేరం మూల్యం
ఆస్ట్రేలియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ యిటీవల బయల్పరచినదేమంటే ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం నేరం మూల్యం 2,600 కోట్ల డాలర్లకు సమానమౌతుంది. ఇది ఆస్ట్రేలియాలోని దాదాపు ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి బిడ్డకు దాదాపు 130 డాలర్లు అని సూచిస్తుంది. సిడ్నీ వార్తాపత్రికయైన సన్‌డే టెలిగ్రాఫ్‌లో చెప్పినట్లు ఒక వ్యాఖ్యాత ఏమని ఉదాహరించాడంటే, అతి ఖరీదైన నేరము మోసం—ప్రతి సంవత్సరం దాదాపు 1,400 కోట్ల డాలర్లకు సమానమయ్యే అవకాశముంది. అంచనా వేయబడిన యితర మూల్యాలు: హత్యకు సంవత్సరానికి 27.5 కోట్ల డాలర్లు; మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలకు 120 కోట్ల డాలర్లు; ఇండ్లదోపిడీలకు 89.3 కోట్ల డాలర్లు; మరి ఆశ్చర్యకరంగా అంగళ్ళ దోపిడీలకు 150 కోట్ల డాలర్లు. నేరం మూల్యం క్రమంగా పెరుగుతుందని వ్యాఖ్యానించడంతో ఆ నివేదిక ముగిసింది. (g94 10/22)
దెబ్బతిన్న ప్రపంచం
జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్ నందలి పొలిటికల్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం 1994 ఆరంభమవుతుండగా, 43 యుద్ధాలు ప్రపంచాన్ని దెబ్బతీశాయి. ఈ నివేదికను గూర్చి వ్యాఖ్యానిస్తూ, ఆసియాలో 22 యుద్ధాలు, ఆఫ్రికాలో 13 యుద్ధాలు, లాటిన్ అమెరికాలో 5 యుద్ధాలు, ఐరోపాలో 3 యుద్ధాలు జరిగాయని ఎక్యూమెనికల్ ప్రెస్ సర్వీస్ రాస్తోంది. గత 1950లలో యుద్ధాల సాంవత్సరిక సరాసరి సంఖ్య 12 ఉండేదని కూడా యీ ఇన్‌స్టిట్యూట్ కనుగొన్నది. అది 1960లలో 22కు పెరిగింది, మరి నేడు దాని సంఖ్య దాదాపు రెండింతలయ్యింది. (g94 10/22)
ఎక్కువ చూడడం—తక్కువ చదవడం
టి.వి.ని ఎక్కువగా చూసే పిల్లలు చదవడంలో ఆసక్తిని కోల్పోతున్నారెందుకని? గత మూడు సంవత్సరాలుగా, పరిశోధకుడైన సి. ఎమ్. కోల్‌స్ట్రా డచ్ ప్రాథమిక పాఠశాలలోని 1,000 మంది పిల్లల ప్రవర్తన గురించి అధ్యయనం చేసిన తర్వాత, రెండు కారణాలను కనుగొన్నాడు. పిల్లలు టి.వి. ఎక్కువగా చూడడం వల్ల చదవడంలోని తమ ఆనందాన్ని కోల్పోయారు, ఏకాగ్రతను నిలిపే వారి సామర్థ్యము తగ్గిపోయింది. నెదర్‌లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీ నుండి విడుదలైన వార్త నివేదించేదేమంటే తరచూ టి.వి. చూసేవారు క్రమేణ తాము చదివేదానిని గ్రహించలేకపోతున్నారు, తమ ముందున్న పేజీపై తమ మనస్సును నిలపలేకపోతున్నారు. వెంటనే తమ పుస్తకాన్ని పక్కకు పెట్టి, టి.వి. రిమోట్ కంట్రోల్ అందుకుంటారు. పరిశోధకుడు యింకా కనుగొన్నదేమంటే ఎలాంటి కార్యక్రమాలైనా తేడా ఏమీ లేదు. పిల్లలు ఎక్కువగా కామెడీని చూసినా, పిల్లల కార్యక్రమాలను చూసినా, నాటకాన్ని చూసినా, లేదా విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను చూసినా, ఫలితం ఒక్కటే: “చదవడం తగ్గిపోయింది.” (g94 10/22)
ఎడారులను మరియు అనారోగ్యాన్ని అధికంచేయడం
టాన్సానియాలోని 85 శాతం గ్రామ ప్రజలు వంట చేసుకోడానికి, చలికాచుకోడానికి, వెలుతురు కోసం కట్టెలు ఇంధనము ఎక్కువ అవసరమున్నప్పటికీ, దేశంలోని పొగాకు పంటను మెరుగుపర్చడానికి, ప్రతి సంవత్సరం 42,000 ఎకరాల అరుదైన అడవులు నరకబడుతున్నాయని కెనాడియన్ సొసైటీ ఫర్ ఇంటర్‌నేషనల్ హెల్త్ నుండి వచ్చిన సినెర్‌జీ అనే సమాచార పత్రం నివేదించింది. టాన్సానియాస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రిసర్చ్‌యొక్క డైరెక్టర్ జనరల్, ప్రొఫెసర్ డబ్ల్యు. ఎల్. కెలామా వ్యాఖ్యానించేదేమంటే, “పొగాకు ఎగుమతి ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని పొందడానికి మన అమూల్యమైన వృక్షాలను నరికివేసి, ఎడారులను తయారు చేయడం నిజంగా విరోధాబాసము.” ఆయన యింకా యిలా అంటున్నాడు, “అలాగే వర్థమాన దేశాలు అనారోగ్యాన్ని అధికంచేసే పొగాకును ఉత్పత్తి చేస్తున్నాయన్నది కూడ విరోధాబాసమే.” (g94 10/22)
లైంగిక సంబంధమైన నేరాలు పెరుగుట
పాశ్చాత్య ప్రాంతాల్లో ఒకప్పుడు సమస్యగా ఎంచబడిన—లైంగిక నేరాలు—అత్యాచారం, వ్యభిచారం, పిల్లలపై అత్యాచారం అనేవి కొన్ని ఆఫ్రికా దేశాల్లో స్పష్టంగా ఎక్కువవుతున్నాయి. ఇటీవలి నెలల్లో, మాధ్యమాల్లో లైంగిక నేరాలు తరచూ చూపించబడుతున్నాయి. టైమ్స్ ఆఫ్ జాంబియా యీ విధంగా నివేదించింది, 37 ఏండ్ల వ్యక్తి 13 ఏండ్ల తన కుమార్తెతో లైంగిక సంబంధం కలిగియున్నందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని, బెత్తంతో ఆరు దెబ్బలు తినాలని ఆజ్ఞ జారీ చేయబడింది. ఒక తగాదా జరిగిన పిదప ఆయన భార్య అతన్ని విడిచిపెట్టిన తర్వాత అతడు తన కూతురుపై అత్యాచారం చేశాడని కనుగొనబడింది. న్యాయవిచారణ జరుగుతుండగా ఆ అమ్మాయి తన తండ్రిని నిరాకరించిందని నివేదించబడింది. (g94 10/22)
పెరుగుతున్న చైనా జనాబా
చైనాలోని ప్రజల సంఖ్య యీ సంవత్సరం 120 కోట్లకు చేరుతుందని చైనా న్యూస్ ఏజన్సీ నివేదించింది. ఒక కుటుంబంలో ఒక బిడ్డే ఉండాలని ప్రోత్సహించే కచ్ఛితమైన కుటుంబ నియంత్రణ పద్ధతి చైనాలో ఉన్నప్పటికీ, జనాబా ప్రణాళికా రచయితలు నిరీక్షించినదానికన్నా ఆరు సంవత్సరాలు ముందుగా జనాబా 120 కోట్లకు పెరుగుతుంది. న్యూస్ ఏజన్సీ యీ పెరుగుదలకు గల రెండు కారణాలను చెప్పింది: మొదటిది, అనేక గ్రామీణ స్త్రీలు ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగితే విధించే జరిమానా చెల్లించడానికి ఇష్టపడడం. రెండవది, గ్రామప్రాంతాలనుండి పట్టణాలకు మకాం మార్చే వలసకార్మికులు, ప్రజలు స్థిరనివాసమేర్పరచుకున్న ప్రదేశాల్లో జననాలను నియంత్రించే కుటుంబ నియంత్రణ ఏర్పాట్లను తప్పించుకోగలగడము. (g94 10/22)