కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 12/8 పేజీలు 5-8
  • జాతి అనేది ఎందుకంత వివాదాంశంగా వుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జాతి అనేది ఎందుకంత వివాదాంశంగా వుంది?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాసుల వ్యాపారం, జాతి
  • మతము, జాతి
  • కపట విజ్ఞానశాస్త్రం, జాతి
  • జాత్యహంకార దుష్ఫలితం
  • జాతులన్నీ సమాధానంగా కలిసి జీవించినప్పుడు
    తేజరిల్లు!—1993
  • జాత్యాభిమానం విషయమేమిటి?
    తేజరిల్లు!—1998
  • జాతి అంటే ఏమిటి?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1993
g93 12/8 పేజీలు 5-8

జాతి అనేది ఎందుకంత వివాదాంశంగా వుంది?

లిఖితపూర్వక చరిత్ర ఆరంభమైనప్పటినుండి “వారు,” “మనం” అనే బేధం ప్రజల ఆలోచనపై ప్రభావం చూపింది. తమజాతి వారు మాత్రమే కేవలం ప్రతిదీ సరైన విధంగా చేసే సాధారణ ప్రజలని అనేకమంది గట్టిగా నమ్ముతున్నారు. దీనినే అంటే కేవలం తమ స్వజాతి ప్రజలు, వారి పద్ధతులే ప్రాముఖ్యమైనవి, విలువైనవనే యోచనను, శాస్త్రవేత్తలు జాత్యహంకారం అని పిలుస్తున్నారు.

ఉదాహరణకు, ప్రాచీన గ్రీకులు, గ్రీకులు కాని వారినెవరినైనా సరే “అనాగరికులు” అని సంబోధిస్తూ వాళ్లకు అనుకూలంగా ఉండేవారు కాదు. “అనాగరికుడు” (బార్‌బేరియన్‌) అనే పదం “బర్‌, బర్‌” అనే అజ్ఞానంతో కూడిన ధ్వనుల వంటిదన్నట్లు గ్రీకులు పరభాషను దృష్టించిన రీతినుండి ఉద్భవించింది. గ్రీకులకు ముందున్న ఐగుప్తీయులు, వారి తర్వాత వచ్చిన రోమనులు కూడా తమకు తాము యితర ప్రజలకంటే ఉన్నతమైన వారని భావించారు.

చాలా శతాబ్దాలు చైనీయులు తమ దేశాన్ని డ్రంజ్‌ గూవో లేదా మధ్యరాజ్యము అని పిలిచారు, ఎందుకంటే విశ్వానికి కాకపోయినా ప్రపంచానికి చైనా కేంద్రమని నమ్మారు. తర్వాత, ఎరుపు వెంట్రుకలు, పచ్చని కళ్లు, ఎర్రని వర్చస్సుతో ఐరోపా మిషనరీలు చైనాకు వచ్చినప్పుడు, చైనీయులు వారికి “విదేశీ దయ్యాలు” అని ముద్రవేశారు. అలాగే, తూర్పు దేశస్థులు మొట్టమొదట ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లినప్పుడు, వారి వాలు కన్నులు, వింతైన ఆచారాలు వారిని అనుమానించుటకు, హేళనకు గురిచేశాయి.

అయినను, ది కైండ్స్‌ ఆఫ్‌ మ్యాన్‌కైండ్‌ అనే పుస్తకం చెబుతున్నట్లుగా, ప్రాముఖ్యమైన వాస్తవమొకటి పరిశీలించాల్సివుంది: “ఒకరి [జాతి] ఉన్నత స్థానాన్ని నమ్మడం ఒక ఎత్తు; విజ్ఞానశాస్త్ర అన్వేషణల నుపయోగించి, దానిని నిరూపించుటకు ప్రయత్నిస్తే, అది మరో ఎత్తు.” ఒక జాతికంటే మరొక జాతి గొప్పదని నిరూపించే ప్రయత్నాలు ఇటీవలి కాలం నాటివే. మానవశాస్త్రజ్ఞుడైన ఆష్లే మొంటాగు వ్రాసిందేమంటే, “సహజంగా లేదా జీవశాస్త్రపరంగా మానవజాతిలో మానసికంగా, భౌతికంగా విబేధమున్న వేర్వేరు జాతులున్నాయనే భావన, 18వ శతాబ్దపు చివరి భాగంవరకూ వృద్ధికాలేదు.”

జాత్యహంకారమనేది 18, 19వ శతాబ్దాలలో ఎందుకంత పేరుగాంచిన వివాదాంశమయ్యింది?

దాసుల వ్యాపారం, జాతి

ముఖ్యమైన కారణమేమంటే, లాభాలను చేకూర్చే దాసుల వ్యాపారం ఆ కాలంలో బాగా వృద్ధిచెందింది, వందల వేలుగా ఆఫ్రికా ప్రజలను బలవంతంగా ఐరోపా, అమెరికాలకు తీసుకుపోయి దాసత్వానికి దించారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు ప్రపంచంలో అనేక వేర్వేరు దేశాలకు పంపబడినందున, యిక ఎన్నడూ ఒకరి నొకరు మరలా చూచే అవకాశం లేకపోవడంతో, తరచు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఎక్కువమంది క్రైస్తవులమని చెప్పుకునే యీ దాసుల వర్తకులు, దాసుల యజమానులు అలాంటి మానవ విరుద్ధ కార్యాలను ఎలా సమర్థించగల్గారు?

నల్ల ఆఫ్రికనులంతా సహజంగా నీచస్థాయిలోని వారనే భావనను కట్టుకథగా వ్యాప్తిచేయడం ద్వారానే. “నేను నీగ్రోలనందరినీ, మరి సాధారణంగా యితర మానవ జాతులన్నింటిని, సహజంగా శ్వేతజాతి ప్రజలకంటే తక్కువ స్థాయి వారని తగిన విధంగా అనుమానించుటకే ఇష్టపడతాను,” అని 18వ శతాబ్దపు స్కాటిష్‌ తత్వవేత్త డేవిడ్‌ హూమ్‌ వ్రాశాడు. వాస్తవానికి, “విద్యలో, విజ్ఞానశాస్త్రంలో తెలివైన అన్వేషణలు చేసిన వారెవరూ [నీగ్రోలలో] కనబడరని” హూమ్‌ అన్నాడు.

అయినను, అలా వాదించడం తప్పే. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా (1973) యిలా వ్రాసింది: “కొన్ని వందల సంవత్సరాల క్రితం అత్యంత అభివృద్ధి చెందిన రాజ్యాలు అనేక ఆఫ్రికా దేశాలలో ఉనికిలో ఉన్నాయి. . . . సా.శ. 1200-1600 మధ్యకాలంలో, ఒక నీగ్రో-అరాబిక్‌ యూనివర్సిటీ అనేది పశ్చిమ ఆఫ్రికాలో, టింబుక్టు అనే ప్రాంతంలో వికసించి, స్పెయిన్‌, ఉత్తర అమెరికా, మధ్యపూర్వ ప్రాంతాల్లో పేరుగాంచింది.” అయినప్పటికి, దాసుల వ్యాపారంలో నిమగ్నమైనవారు, నల్లవారు శ్వేతజాతి ప్రజలకంటే తక్కువస్థాయిలో వారని, వాస్తవంగా, ఉపమానవులని చెప్పే హూమ్‌ వంటి తత్వవేత్తల దృకథాలను వెంటనే స్వీకరించారు.

మతము, జాతి

దాసుల వ్యాపారులు తమ జాతివిషయక దృక్పథాలకు మతనాయకులనుండి తగినంత మద్దతును పొందారు. “అన్యులు,” “అవిశ్వాసులు” దాసులుగా ఉండాలని, లోబడాలని తద్వారా “దేవుని రాజ్యం” నిమిత్తం వారి “ఆత్మలు” కాపాడబడతాయని, 1450వ దశాబ్దారంభంలో రోమన్‌ కాథోలిక్కు పోప్‌లు ప్రకటనలు జారీచేశారు. చర్చి ఆశీర్వాదాలు పొందినందువల్ల, తొలి ఐరోపా అన్వేషకులు, దాసుల వ్యాపారులు ప్రాంతీయ ప్రజలతో క్రూరంగా వ్యవహరించడానికి సంకోచించలేదు.

ఆ పిదప “రాబోయే అనేక దశాబ్దాల్లోను, 1760వ దశకంలోను, నల్లవారిని దాసులుగా హింసించడాన్ని కాథోలిక్‌, ఆంగ్లికన్‌, లూథరన్‌, ప్రెస్బిటేరియన్‌, రిఫార్మడ్‌ చర్చి సభ్యులు, వేదాంతులు ఆమోదించారు” అని స్లేవరీ అండ్‌ హ్యూమన్‌ ప్రోగ్రెస్‌ అనే పుస్తకం చెబుతుంది. “ఏ ఆధునిక చర్చిగాని లేదా శాఖగాని దాని సభ్యులను నల్లజాతి వారిని దాసులుగా కొనవద్దు లేదా బానిస వ్యాపారం చేయవద్దని చెప్పడానికి ముందుకుపోలేదు.”

కొన్ని చర్చీలు విశ్వవ్యాప్త క్రైస్తవ సహోదరత్వం గూర్చి మాట్లాడినను, వారు జాతి పోరాటాలను ప్రజ్వరిల్ల చేసిన బోధలను కూడా ప్రోత్సహించారు. ఉదాహరణకు, ఎన్‌సైక్లోపీడియా జుడైకా వివరించేదేమంటే, “కేవలం విరామంలేని పోరాటాలు, క్రైస్తవ మతచర్చలు జరిపిన తర్వాతనే స్పెయిన్‌ దేశస్థులు, అమెరికాలో వారు కనుగొన్న ప్రాంతీయ జాతులను జ్ఞానంగల మనుష్యులుగా గుర్తించారు.”

అటువంటి ప్రాంతీయ ప్రజల “ఆత్మలు” క్రైస్తవత్వానికి మార్చుటద్వారా “రక్షించబడి”నంతవరకు, వారెలా భౌతికంగా వ్యవహరించబడ్డారనేది ప్రాముఖ్యంకాదు అని అర్థం. నల్లవారి విషయానికొస్తే, ఎలాగైనా, వారు దేవునివల్ల శపించబడ్డారని చాలామంది మతనాయకులు వాదించారు. దీనిని నిరూపించడానికి లేఖనాలు తప్పుగా అన్వయించబడేవి. మతాధికారులైన రాబర్ట్‌ జామసన్‌, ఆండ్రూ ఆర్‌. ఫోసెట్‌, డేవిడ్‌ బ్రౌన్‌ అనేవారు తమ బైబిలు వ్యాఖ్యానంలో, యిలా నిశ్చితంగా చెప్పారు: “కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును [ఆదికాండము 9:25]—కనానీయులు నాశనమైనప్పుడు—హాము సంతానమైన ఆఫ్రికన్‌లకు దాసత్వం, ఐగుప్తీయులకు భ్రష్టత సంభవించినప్పుడు, ఈ శాపం నెరవేరింది.”—కామెంటరీ, క్రిటికల్‌ అండ్‌ ఎక్స్‌ప్లేనేటరీ, ఆన్‌ ది హోల్‌ బైబిల్‌.

నల్లజాతి ప్రజల పూర్వీకుడు శపించబడ్డాడనే బోధ బైబిల్లో అసలు బోధించబడలేదు. వాస్తవంగా, నల్లజాతి ప్రజలు కూషు నుండేకాని, కనాను నుండి పుట్టలేదు. జాన్‌ ఊల్‌మేన్‌ 18వ శతాబ్దంలో వాదించిందేమంటే, ఈ బైబిలు శాపాన్ని ఉపయోగించి నల్లజాతి ప్రజలను దాసులుగా చేయడం, వారి సహజ హక్కులను మోసగించి తీసుకోవడమనేది, “ఒక కల్పన, అది మంచి నియమాలను హత్తుకోవాలని కోరుకునే వారెవరైనా మనస్సున అంగీకరించలేనంత పాపం.”

కపట విజ్ఞానశాస్త్రం, జాతి

నల్లజాతి ప్రజలు తక్కువస్థాయి జాతికి చెందిన వారని చెప్పే ఈ సిద్ధాంతానికి మద్దతునిచ్చుటలో కపట విజ్ఞానశాస్త్రం కూడ దాని గొంతును కలిపింది. ఫ్రెంచి రచయిత జోసఫ్‌ డీ గోబినో, ఎస్సే ఆన్‌ ది ఇన్‌ఈక్వాలిటి ఆఫ్‌ రేసెస్‌ అనే పుస్తకంలో అలాంటి అనేక కార్యాలకు పునాదివేశాడు. దానిలో, గోబినో మానవజాతిని వారి శ్రేష్ఠమైన వంశక్రమాలలో మూడు వేర్వేరు జాతులుగా విభజించాడు: శ్వేత, పసుపు, నలుపు. ప్రతి జాతి రక్తంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని, అయితే కులాంతర వివాహం ఫలితంగా భ్రష్టత, శ్రేష్ఠమైన లక్షణాలు కోల్పోవడం జరుగుతుందని చెప్పాడు.

పొడవుగావుండి, సొగసైన వెంట్రుకలు, నీలవర్ణపు కళ్లు గల్గిన శ్రేష్ఠమైన శ్వేతవర్ణపు జాతి ఒకప్పుడు ఉనికిలో ఉండేదని గోబినో వాదించాడు, వారినే ఆయన ఆర్యులని పిలిచాడు. ఇండియాకు నాగరికతను, సంస్కృత భాషను పరిచయం చేసింది ఆర్యులేనని, ప్రాచీన గ్రీసు, రోమ్‌లలో నాగరికతలను స్థాపించింది ఆర్యులేనని వాదించాడు. కాని తక్కువస్థాయిలోని స్థానిక ప్రజలతో కులాంతర వివాహం చేసుకోవడం ద్వారా, ఒకనాడు దివ్యంగానున్న ఈ నాగరికతలు, మేధాశక్తి, శ్రేష్ఠమైన లక్షణాలున్న ఆర్యజాతితోపాటు నాశనమయ్యాయి. శ్రేష్ఠమైన ఆర్యులకు దగ్గర సంబంధముండి యింకా జీవించినవారు, ఉత్తర ఐరోపాలో నోర్డిక్‌ అనే తెగలో ఉన్నారని, వారితో పాటు జర్మనులు కూడా ఉన్నారని గోబినో ఘంటాపథంగా చెప్పాడు.

గోబినో ప్రాథమిక భావనలు—మూడు జాతుల విభజన, రక్త వంశక్రమం, ఆర్యజాతి అనే వాటికి ఎటువంటి వైజ్ఞానిక ఆధారం లేదు, ఈనాటి వైజ్ఞానిక లోకం వాటిని పూర్తిగా త్రోసిపుచ్చుతున్నాయి. అయినను, వాటిని వెంటనే యితరులు అంగీకరించారు. ఇంగ్లీషువాడైన హోస్టన్‌ స్టీవార్ట్‌ చాంబెర్లిన్‌ వారిలో ఒకడు, ఈయన గోబినో యొక్క ఆలోచనలతో బాగా తన్మయుడై, దాంతో ఆయన జర్మనీలో నివాసం పెట్టుకున్నాడు, ఆర్యుల శ్రేష్ఠతను కేవలం జర్మనుల ద్వారానే కాపాడవచ్చనే కారణంతో దానికోసం ప్రచారం చేశాడు. స్పష్టంగా, జర్మనీలో చాంబెర్లియన్‌ రచనలు విస్తృతంగా చదివారు, ఫలితం చాలా అసహ్యంగా తయారయ్యింది.

జాత్యహంకార దుష్ఫలితం

అడాల్ఫ్‌ హిట్లర్‌ మిన్‌ కాంఫ్‌ (నా పోరాటం) అనే తన పుస్తకంలో, ఖండితంగా చెప్పిందేమంటే, జర్మన్‌ జాతి ప్రపంచాన్ని ఏలబోయే గురి కల్గిన ఆర్య అగ్రజాతి. ఆయన చెప్పిన యీ యూదులు జర్మన్‌ ఆర్థిక పరిస్థితి దిగజారిపోడానికి కారకులని, ఈ దివ్యమైన గురిని చేరటానికి వారు ఆటంకంగా ఉన్నారని హిట్లర్‌ భావించాడు. అందుకే ఐరోపాలో యూదులు, మరితర చిన్నవర్గాలు నిర్మూలమయ్యాయి, అది నిర్వివాదంగా మానవ చరిత్ర పుటల్లో ఒక చీకటి అధ్యాయమయ్యింది. గోబినో, చాంబెర్లిన్‌ అనేవారి జాత్యహంకార యోచనల దుష్ఫలితమే యిది.

అయినను, అలాంటి రోత ఐరోపాకు మాత్రమే పరిమితం కాలేదు. నూతన ప్రపంచమని పిలువబడే ఇతర దేశాల్లో అదే రకమైన లేనిపోని ఆలోచనలు, అనేక తరాల అమాయక ప్రజలకు చెప్పరాని వేదనను తెచ్చిపెట్టాయి. అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత ఆఫ్రికన్‌ దాసులు స్వతంత్రులైనప్పటికి, చాలా రాష్ట్రాల్లో ఇతర పౌరులు అనుభవిస్తున్న ఆధిక్యతలను నల్లజాతి ప్రజలు పొందకుండా నిషేధిస్తూ చట్టాలు జారీచేయబడ్డాయి. ఎందుకు? నల్లజాతి ప్రజలకు పురపాలక ఉద్యోగాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయగల్గే మేధాశక్తి లేదని శ్వేతజాతి పౌరులు తలంచారు.

అలాంటి జాత్యహంకార భావనలనేవి ఎంత లోతుగా పాతుకుపోయాయనే విషయం కులాంతర వివాహ విరుద్ధ చట్టానికి సంబంధించిన ఒక కేసు ద్వారా ఉదహరించబడింది. ఈ చట్టం శ్వేతజాతి ప్రజలకు నల్లజాతి ప్రజలకు మధ్య వివాహాన్ని నిషేధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక జంటపై నేరారోపణ చేస్తూ, న్యాయవాది యిలా చెప్పాడు: “సర్వశక్తిమంతుడైన దేవుడు శ్వేత, నలుపు, పసుపు, మలయ, ఎరుపు మొదలైన జాతులను సృష్టించి, ఆయన వేర్వేరు ఖండాల్లో వారినుంచాడు, అయితే, దేవుడు చేసిన ఆ ఏర్పాటుతో జోక్యం కల్గించుకొని, అలాంటి వివాహాలు చేసుకోడానికి ఏ హేతువూ లేదు.”

ఈ న్యాయవాది పైవిధంగా చెప్పింది 19వ శతాబ్దంలో కాదు, అలాగని అనాగరిక ప్రాంతంలోనూ కాదు, కాని 1958లో అమెరికా కాంగ్రెస్‌ భవనానికి షుమారు 100 కిలోమీటర్ల దూరంలోనే! నిజంగా, కేవలం 1967 తర్వాతనే అమెరికా సర్వోన్నత న్యాయస్థానం జాత్యంతర వివాహాలకు విరుద్ధంగా వున్న చట్టాలన్నింటిని ఎత్తివేసింది.

అలాంటి పక్షపాత వైఖరిగల చట్టాలు, మరి పాఠశాలలో, చర్చీలలో, మరితర ప్రజాసంస్థల్లో వారిని ప్రత్యేకంగా ఉంచడం, ఉద్యోగాలను, గృహసదుపాయాలను కల్పించుటలో పక్షపాత వైఖరి చూపడం ప్రజల్లో అలజడి, కలవరపెట్టే ఉరేగింపులు, దౌర్జన్యాలనేవి అమెరికాలోను, మరితర అనేక ప్రదేశాల్లోనూ జీవిత సత్యాలుగా తయారయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసంతో పాటు, దాని ఫలితంగా వచ్చిన క్షోభ, ద్వేషం, వ్యక్తిగత అనుమానాలు, బాధలు అనేవి నాగరక సమాజమని పిలువబడుతున్న సమాజానికి కేవలం సిగ్గు, అవమానాలుగా మాత్రమే పరిగణించాలి.

ఆవిధంగా, జాతీయత అనేది మానవ సమాజాన్ని పట్టిపీడిస్తూ, ఖండాలుగా విభజించగల శక్తుల్లో ఒకటిగా తయారైంది. ఇది ఖచ్చితంగా మనమందరమూ మన హృదయాలను పరిశీలించి మనకై మనం యిలా ప్రశ్నించుకొనేటట్టు చేస్తుంది: ఒక జాతిని మరొక జాతి కంటే ఉన్నతమైందని ప్రకటించే బోధలేవైనాసరే వాటిని నేను వ్యతిరేకిస్తానా? జాత్యహంకార భావాలకు సంబంధించిన అవశేషాలేవైనా ఉన్నట్లైతే వాటిని నాకై నేను తొలగించుకున్నానా?

మనకై మనం ఈ విధంగా కూడ ప్రశ్నించుకోవడం మంచిది: ఈనాడు ఎంతో ప్రబలంగా వున్న జాతి దురభిమానం, ఉద్రిక్తతలనేవి ఎప్పటికైనా నిర్మూలించబడగలవని ఏమైనా నిరీక్షణ ఉందా? వేర్వేరు జాతీయతలు, భాషలు, సంస్కృతులు గల ప్రజలు సమాధానంతో ఐక్యంగా సహజీవనం చేయగలరా?

[7వ పేజీలోని చిత్రం]

అనేకమంది శ్వేతజాతి ప్రజలు నల్లజాతి ప్రజలను నీచమానవులుగా దృష్టిస్తున్నారు

[క్రెడిట్‌ లైను]

Reproduced from DESPOTISM—A Pictorial History of Tyranny

[9వ పేజీలోని చిత్రం]

జాత్యహంకార యోచనల దుష్ఫలితంగా ఏర్పడినవే నాజీ ఎక్స్‌టెర్మినేషన్‌ క్యాంప్స్‌.

[క్రెడిట్‌ లైను]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి