బైబిలు ఉద్దేశ్యము
ఉదారంగా చందాలివ్వడం—క్రైస్తవుని బాధ్యతా?
దాదాపు పది సంవత్సరాల క్రితం, అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ముఖ్యకేంద్రాలను నెలకొల్పిన పిటియల్ (ప్రెయిజ్ ది లార్డ్) క్లబ్, ఒక మతపరమైన ధర్మసంస్థగా చందాలను అర్థించింది. సువార్తను ప్రకటించడానికని డంబంగా చెబుతూ, ఉపగ్రహ టివీ నెట్‌వర్క్‌ను, తపాలా వ్యవస్థలను ఉపయోగిస్తూ, చందాపెట్టెలలో కుమ్మరించిన కోట్లాది డాలర్ల డబ్బును వారు ప్రోగు చేశారు.
పిటియల్ మాజీ అధ్యక్షుడైన జిమ్ బేకర్ తన భార్య టామీతోపాటు, “1986లో జీతం, బోనస్‌లుగా 16లక్షల డాలర్లు పొందారు.” అని అసోసియేటెడ్ ప్రెస్ డిస్పేచ్ చెప్పిన వార్తలను చదివినప్పుడు, పిటియల్‌కు డబ్బు పంపిన వేలాదిమంది ఎలా బాధపడ్డారో ఊహించండి. రిపోర్టు యింకా దానికంటే హీనమైన విషయాన్ని ఇలా చెప్పింది: “పరిచర్య కనీసం 5కోట్ల డాలర్లు అప్పులోనున్నప్పటికి, ఆ జీతాలు యివ్వడం జరిగింది . . . బెకర్‌తోనున్న [లైంగిక] సంబంధం విషయంలో [జెస్సికా] హోన్‌ను నోరు మూయించేందుకు పిటియల్ డబ్బులో కొంత అనగా 2,65,000డాలర్లు కేటాయించబడింది.”
తన అనుచరులను మోసగించినందుకు బెకర్‌కు కారాగార శిక్ష విధించేముందు, న్యాయవాది తన విచారణలో యిలా చెప్పాడు: “మనలో మతమంటూ ఉన్నవారంతా డబ్బు సంపాదించే సువార్తీకులు, మతాధికారులవల్ల ఏదోరకంగా మోసగింపబడి విసుగుచెందాం.”
చందాదారుల భావాలను ఉల్లసింపజేసి, ఆ తర్వాత డబ్బులో ఎక్కువ భాగం జేబుల్లో నింపుకొనేది కేవలం మతం మాత్రమే కాదు. నిధుల అభివృద్ధికి పనిచేసే కొందరు, అర్థించిన చందాలలో 90శాతంకంటే ఎక్కువ భాగం తమ స్వంతం చేసుకోవడం మామూలు విషయమే.
అయితే, అలాంటి ధర్మాదాయ సంస్థలతో ప్రజలు విసుగుచెందారనుటలో ఆశ్చర్యమేమైనా ఉందా? అయినను, క్రైస్తవులేమి చేయవలసి యున్నారు? సంస్థీకరింపబడిన ధర్మాదాయ సంస్థలకు యిచ్చే బాధ్యత కల్గియున్నారా? ఇతరులకు సహాయపడుటలో, నిధులను జ్ఞానయుక్తంగా ఉపయోగించుటకు బైబిలు ఏ సలహాలనిస్తుంది? ఇతరులకు సహాయపడుటలో ఒక మంచి, అత్యంత ఆచరణాత్మకమైన మార్గమేమైయుంది?
ఇచ్చుట—మంచిదే, మంచిదికాదు
ఖచ్చితంగా, ఆపదలోనున్న వారియెడల దయగల్గి, ఉదారంగా వ్యవహరించాలనేదే బైబిలు ఇచ్చే సలహా. ప్రాచీనకాలం నుండికూడ దేవుని ప్రజలు “ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై” యుండవలెనని ప్రోత్సహించబడిరి. (1 తిమోతి 6:18; ద్వితీయోపదేశకాండము 15:7, 10, 11) నిజానికి, 1 యోహాను 3:17లో క్రైస్తవులకు యిలాంటి ఉపదేశమివ్వబడింది: “ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?”
ఔను, ఇవ్వండి; కాని జాగ్రత్త! మనము ఎల్లప్పుడూ ధర్మాదాయ సంస్థలు, మతాలు, వార్షిక సమాజసేవల ప్రచారాల ద్వారా అర్థించబడుతున్నాం; వీటిలో చాలాసంస్థలు బలవంతంగా అర్థిస్తాయి. అయినను, వాటిని పరిశీలించుటలో బైబిలు సామెతను గుర్తుచేసుకొనడం మంచిది: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) వేరే మాటల్లో చెప్పాలంటే, ధర్మాదాయ సంస్థలు చెప్పే మాటలు, చేసే వాగ్దానాలలోని ఆంతర్యాన్ని మదింపు చేసికొనుటలో జాగ్రత్తవహించండి. వసూలు చేసిన డబ్బు వాస్తవంగా ఎలా వినియోగించబడుతుంది? నిధులను సమకూర్చు ఆ సంస్థలకు ఒక క్రైస్తవుడు మద్దతు యివ్వవచ్చా? వారి కార్యకలాపాలు రాజకీయం, జాతీయతావాదం, లేదా అబద్ధమతంతో సంబంధం కల్గియున్నవా? ప్రకటించిన ఉద్దేశ్యం లేఖన నియమాలతో విభేదం లేకుండా, ప్రయోగాత్మకమైనదేనా?
అవసరతలోనున్న ప్రజలకు కొన్ని ధర్మాదాయ సంస్థలు చాలా మంచి చేయగల్గుతున్నాయి. ప్రకృతి విపత్తులు, సమూలంగా రోగాలు సంభవించినప్పుడు, చాలాసార్లు క్రైస్తవులు స్వయంగా అలాంటి ధర్మాదాయ సంస్థలనుండి ప్రయోజనాలు అందుకున్నారు. ఇతర ధర్మాదాయ సంస్థలు అధిక కార్యనిర్వహణా వ్యయం వల్లనూ లేదా నిధులు పెంచుటలో అధిక ఖర్చులు కల్గివున్నందుననూ వసూలు చేసిన డబ్బులో కేవలం కొంతభాగం మాత్రమే నిజానికి ప్రకటించిన ఉద్దేశ రీత్యా వినియోగిస్తున్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని 117 అతిపెద్ద ధర్మాదాయ సంస్థలతోపాటు, స్వలాభార్జనలేని సంస్థలపై జరిపిన సర్వేలో తేలినదేమనగా, వాటిలో నాల్గువంతులకంటే ఎక్కువ సంస్థలు సంవత్సరానికి 2,00,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని వారి ప్రధాన కార్యకర్తలకు అందజేస్తున్నారు. విలాస వస్తువులకు, ఐశ్వర్యవంతమైన జీవిత విధానానికి సొమ్ము చెల్లించటానికి ఖర్చుపెట్టినట్లుగా తరచూ పరిశీలించిన లెక్కలు బయటపెట్టాయి. ధర్మాదాయ సంస్థ పేరేదైననూ, అలాంటి పథకాలకు దానం చేయడం, అవసరతలోనున్న వారికి సహాయం చేయుమని చెప్పిన బైబిలు ఆజ్ఞను నెరవేరుస్తుందనేది వాస్తవం కాదు.
సమతూకమైన దృక్పథం
ఎవరూ కూడ తమ డబ్బును వృధా చేయాలని కోరుకోరు—అయినా, ఆ డబ్బు స్వలాభార్జన చేసే మనుషులను భాగ్యవంతుల్ని చేయడానికి ఉపయోగించబడితే చూడటం యింకా నీచమైంది—యిచ్చే విషయంలో చిరచిరలాడే స్వభావం లేకుండా జాగ్రత్త వహించాలి. కొన్ని ధర్మాదాయ సంస్థల అక్రమం, అసమర్ధతనుబట్టి అవసరతలోనున్న వారిని అలక్ష్యం చేయవద్దు, లేదా కనికరంతో కూడిన భావాలను అణగగొట్టవద్దు. సామెతలు 3:27, 28 యిలా సలహా ఇస్తున్నది: “మేలు చేయుట నీ చేతనైనప్పుడు, దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము. ద్రవ్యము నీయొద్ద నుండగా—రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.” (1 యోహాను 3:18 పోల్చండి.) సంస్థీకరింపబడిన ధర్మాదాయ సంస్థలన్నీ మోసపూరితమని లేదా వ్యర్ధమైనవని ఊహించవద్దు. సత్యాలను పరిశీలించి, అప్పుడు యివ్వాలా, వద్దా యని మీరే స్వయంగా తీర్మానించుకోండి.
చాలామంది అవసరతలోనున్న వ్యక్తులకు, కుటుంబాలకు వ్యక్తిగతంగా, వారికే బహూకరించాలని ఎక్కువగా యిష్టపడతారు. ఆవిధంగా, ఇచ్చేవారు వారి చందాలు ఆచరణాత్మకంగా తక్షణ వినియోగం కాగలవనే నిశ్చయత కల్గివుంటారు. మాటలద్వారా అలాగే క్రియలద్వారా ప్రోత్సహించటానికి, దయను వ్యక్తపరచడానికి కూడ యిది అవకాశాన్నిస్తుంది. వస్తురూపంగా యివ్వడానికి మీకేమీ లేకపోయినప్పటికి, మీరు ఇచ్చుటలో ఆనందం పొందగలరు. అలాంటి నిజమైన అవసరతను గూర్చి మీరు మరొకసారి విన్నప్పుడు, 2 కొరింథీయులు 8:12లో వివరించిన స్ఫూర్తితో మీకు సాధ్యమైంది యివ్వండి: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.”
కొన్నిసమయాల్లో డబ్బుకంటే శ్రేష్ఠమైన పనిచేసేది మరొకటి కలదని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు తన అనుచరులకు యిలా చెప్పాడు, “వెళ్లుడి—పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. . . . ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (మత్తయి 10:7, 8) అదేరకంగా ఈనాడు, రాజ్యమును గూర్చిన సాక్ష్యమిచ్చుటలో ఖర్చుపెట్టిన సమయం, సామర్ధ్యం, డబ్బు అనేవి జీవితాలను మెరుగుపరచి, నిరీక్షణ నిస్తుందని, అదే ఉదారంగా యిచ్చే చందాలలో శ్రేష్ఠమైందని క్రైస్తవులు గుర్తిస్తారు.
అయితే, దయకల్గి, ఉదారంగా, ఆచరణాత్మకంగా ఉండాలనే బైబిలు ఉద్దేశ్యము. తరచు వస్తుసంబంధ సహాయం అవసరమని, ఆ అవసరతను అలక్ష్యం చేయకూడదని అది మనకు జ్ఞాపకం చేస్తున్నది. అదే సమయంలో, మీ డబ్బును అర్థించిన వారెవరైనాసరే, ప్రతి ఒక్కరికీ యివ్వవలసిన బాధ్యత ఉందని భావించవద్దు. దేవుని సంతోషపెట్టడానికి, తోటిమనుష్యులకు, మీ స్వంత కుటుంబానికి అత్యంత ప్రయోగాత్మక సహాయం అందించడానికి మీకున్న డబ్బును ఎలా శ్రేష్ఠమైన పద్ధతిలో ఉపయోగించాలో పరిశీలించండి. (1 తిమోతి 5:8; యాకోబు 2:15, 16) ఆత్మీయంగాను, వస్తుసంబంధంగాను ఇతరుల అవసరతలను గమనించువారిగాను, బాధ్యతాయుతంగాను ఉండుటలో యేసును అనుకరించండి. హెబ్రీయులు 13:16లోని మాటలలో చెప్పినట్లు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (g93 6/8)