ప్రపంచ పరిశీలన
మరణకరంగాని ఆయుధాలు
ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనే వార్తాపత్రిక ప్రకారం, అమెరికా ప్రభుత్వం, యుద్ధంలో మరణకరంగాని ఆయుధాలను ప్రవేశపెట్టే సంభవాన్నిగూర్చి అన్వేషిస్తున్నది. శత్రు సైన్యాలను చంపకుండానే రాడార్, టెలిఫోనులు, కంప్యూటర్లు, మరితర ప్రాముఖ్యమైన సాధనాలను కార్యహీనం చేసేందుకు, భవిష్యత్‌లో సైనికులు ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ జనరేటర్లను ఉపయోగించగలిగే సాధ్యతను ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం అందించవచ్చు. “చలించే వాహనాల ఇంజన్లను స్తంభింపజేసే ‘దహన నిరోధకాలపై,’ అలాగే ప్రత్యేక రకమైన టైర్లను స్పటికీకరించి, ధ్వంసం చేసే రసాయనాలపై” కూడ ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని ఆ పత్రిక చెబుతున్నది. అయినను, వీటిలో కొన్ని ఆయుధాలు మానవ ప్రాణానికి ముప్పు తెస్తాయి. ఈ జర్నల్ యింకనూ చెప్పేదేమంటే, “శత్రుసైన్యాల టాంకుల అద్దాలను ధ్వంసం చేయుటకు నిర్మించిన శక్తివంతమైన లేజర్స్, సైనికుల కనుగ్రుడ్లను కూడ పేల్చివేయగలవు. అమెరికా ప్రత్యేక దళాలచే క్షేత్ర పరీక్ష చేయబడ్డ తేలికైన మెక్రోవేవ్ ఆయుధాలనేవి శత్రువుల వార్తాసౌకర్యాలను స్తంభింపచేయడమే కాకుండా శరీరంలోని భాగాలను మసిచేయగలవు.” (g93 6/8)
సున్నతి, ఎయిడ్స్
లైంగికంగా సంక్రమించే ఎయిడ్స్‌వంటి సుఖవ్యాధులను అరికట్టడంలో పురుషాంగ సున్నతి ఆచారమనేది ప్రయోజనకరంగా కనబడుతున్నట్లు ఫ్రెంచి పత్రికైన లా రివ్యూ ఫ్రాన్సాజ్ డ్యు లేబొరేట్వార్ చెబుతున్నది. ఎయిడ్స్ వ్యాప్తిని ప్రతిబంధించుటలో పురుషాంగ సున్నతి (శిశ్నము ముందరి చర్మభాగాన్ని తొలగించుట) అనేది ఒక కారకమని ప్రదర్శించే మూడు స్వతంత్ర వైద్య అధ్యయనాలను ఈ పత్రిక ఎత్తివ్రాసింది. పురుషాంగపు ముందరి చర్మభాగంలోని కణజాలం వేరే కణజాలం కంటే ఎక్కువ సంఖ్యలో ఎయిడ్స్ వైరస్‌ద్వారా అంటువ్యాధికి గురౌతుందని ప్రయోగశాలలోని కోతులపై జరిపిన పరిశోధన చూపించింది. ఇంకనూ, సున్నతిని ఆచరించే గుంపులకంటే, దానిని ఆచరించని గుంపులలో ఎయిడ్స్ రోగం హెచ్చుగా సంభవిస్తుందని 140 వేర్వేరు ఆఫ్రికా ప్రాంతాల్లో నిర్వహించిన ఒక కెనేడియన్ అధ్యయనం వెల్లడిచేసింది. సున్నతి పొందిన ద్విలింగ సంయోగులైన పురుషులలో ఈ అంటువ్యాధి తక్కువగా సంభవించినట్లు మరొక అధ్యయనం గుర్తించింది. (g93 6/8)
చదువులేని పిల్లలు
బొలీవియాలోని వేలాదిమంది పిల్లలు సరైన విద్యాభ్యాసం పొందడం లేదు. బొలీవియా వార్తాపత్రికైన ప్రెజెన్సియా ప్రకారం, బొలీవియాలో పాఠశాలకు వెళ్లే వయస్సు వచ్చిన 22,68,605మంది పిల్లలున్నారని, 1992 జనాభాలెక్కలు వెల్లడిచేశాయి. అయినను, అదే సమయంలో జాతీయ పాఠశాలల్లో కేవలం 16,68,791మంది పిల్లలు మాత్రమే ప్రవేశించారని విద్యామంత్రిత్వశాఖ రికార్డులు చూపిస్తున్నాయి. దీని భావమేమనగా, 6,00,000మంది పిల్లలు సరైన విద్యాభ్యాసం పొందలేదు. ప్రెజెన్సియా పత్రిక యింకనూ వివరించేదేమంటే, పాఠశాల్లో ప్రవేశం పొందగల్గిన వారిలో 1,02,652మంది విద్యార్థులు ఆ సంవత్సరం పాఠశాలకు వెళ్లడం మానేశారు. (g93 6/8)
పిల్లలు, పోతపాలు
జపానీయుల పిల్లల్లో దాదాపు 25 శాతంమంది, భుజించుటలో కష్టాలెదుర్కొంటున్నారు. పోతపాలే దీనికి కారణమై యుండవచ్చును. నమలడానికి గట్టిగానున్న ఆహారం విషయంలో కొంతమంది పిల్లలు బాధపడటం నర్సరీ పాఠశాల ఉపాధ్యాయులు గత 20 సంవత్సరాలనుండి గుర్తిస్తున్నారని ఆసాహి ఈవెనింగ్ న్యూస్ నివేదిస్తున్నది. కొంతమంది పిల్లలు ఇలాంటి ఆహారాన్ని మ్రింగే సమస్య కల్గియున్నారు, మరికొందరు దాన్ని బయటకు కక్కుతారు, యింకా మరికొందరు దాన్ని వారి మధ్యాహ్న కునుకు తర్వాత కూడ వారి నోళ్లల్లోనే ఉంచుకుంటారు. ఈ పిల్లల దవడలు బలహీనమని, వారి గడ్డాలు చిన్నవని వైద్యులు పరిశీలించారు. దంతవైద్యుడైన నాఒహెకో ఇనోయుయె, ప్రజాఆరోగ్య నిపుణుడైన రేకో సాకాస్టి, దీనికి కారణం శిశుప్రాయంలో ఉందని కనుగొన్నామని చెప్పి, పోతపాలను నిందించారు. శిశువులు సీసాపాలు త్రాగేటప్పుడు, వారు కేవలం వారి దవడలను కదపకుండా పీల్చవలసి వస్తుంది. అయినప్పటికి, శిశువులు చనుపాలు త్రాగుచున్నప్పుడు, వారు చురుకుగా వారి దవడలను ఉపయోగిస్తు, తర్వాత వారు ఆహారం నమలడానికి అవసరమయ్యే కండరాలను శక్తివంతం చేసుకుంటారు. (g93 5/22)
దేవదారు వృక్షాలు అంతరించే అపాయం
అమెజాను అడవుల్లోని రెండున్నర లక్షల బ్రెజిల్ ఇండియన్లు వారి సాంప్రదాయిక గృహాలను కోల్పోయే ప్రమాదంలోనున్నారు. ప్రభుత్వ ఇండియన్ సర్వీస్ అధికారి ప్రకారం, “అతిపెద్ద అపాయం” అనేది దేవదారు కార్మికులనుండే వస్తుంది. అనధికారంగా దేవదారు వృక్షాలను నరికివేయడమనేది, పారా రాష్ట్ర దక్షిణ ప్రాంతంగుండా చట్టవిరుద్ధంగా కొన్ని 3,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించడానికి దారితీసిందని లండన్ వార్తాపత్రిక ది గార్డియన్ నివేదిస్తున్నది. దేవదారు వృక్షం నరికివేయబడ్డ ప్రతిసారి, దాదాపు 20 వరకూ యితర జాతి వృక్షాలకు హాని కలుగుతుంది. వారు ఆవిధంగా అడవిని నిర్మూలంచేస్తూ, వలసవచ్చినవారికి, బంగారు గనుల్లో పనిచేసేవారికి, అలాగే వేలకొద్ది సామిల్లులకు వీలుకల్పించారు. ప్రస్తుతం వినియోగాన్నిబట్టి చూస్తే మిగిలింది కేవలం 32 సంవత్సరాల సరఫరాను మాత్రమే కల్గియుండటంతో, ఇండియన్ల వలే దేవదారు వృక్షాలు తొందరలోనే ఒక అనిశ్చితమైన భవిష్యత్తును ఎదుర్కొనబోతున్నవి. (g93 6/8)
విషపూరిత వ్యర్థపదార్థాలను ఎగుమతిచేయుట
వ్యర్థపదార్థాలను వినియోగించడమనేది అధిక ఖర్చుతో కూడినది గనుక, “సంపన్న దేశాలు వాటి విషపూరిత వ్యర్థపదార్థాలను బీదదేశాలకు ఎగుమతి చేస్తున్నాయని” ది బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వయిరాన్మెంట్ అండ్ రెన్యూవబుల్ నేచురల్ రిసోర్సెస్‌కు చెందిన సెబాస్టియో పిన్యారో చెబుతున్నారు. వేజా పత్రికలో నివేదించినట్లుగా, “అభివృద్ధిచెందని దేశాలకు వార్షికంగా దాదాపు ఒక పది లక్షల టన్నుల ప్రమాదకర వ్యర్థపదార్థాలు ఎగుమతి చేయబడ్డాయని” ఒక అధ్యయనం తెల్పింది. దిగుమతి చేయబడ్డ ఈ విషపూరిత వ్యర్థపదార్థాలతో చేసినదేమిటి? నూతన విద్యుత్ పవర్ ప్లాంట్స్‌లో ఇంధనం వలే వీటిని కాల్చవచ్చును. పరిసరాలకు సంబంధించిన ఏజన్సీకు సలహాదారుడుగా పనిచేస్తున్న ఒకరు, “ఏవిధంగానైనా ఉద్యోగాలను కల్పించుట అవసరమనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు సంరక్షిస్తాయని” చెప్పారు. అదేసమయంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలనేవి ఉత్పన్నమవుతున్నాయి. లండన్‌లోని ఫైనాన్షియల్ టైమ్స్ యిలా ప్రశ్నిస్తున్నది: “ఎక్కడైతే మానవ జీవితం తక్కువగా పరిగణించబడుతుందో అక్కడ అంచనావేసి కర్మాగారాల స్థలానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలా? వేజా తమాషాగా ఇంకా యిలా అంటున్నది: “జవాబు అవునన్నట్లుగానే ఉంది.” (g93 6/8)
తేనె—స్వస్థపరచేగుణం కలది
పట్టుతేనెకు స్వస్థపరచే లక్షణాలుండటంవల్ల, అది ప్రాచీనకాలంనుండి కూడ ఉపయోగించ బడుతుంది. ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రం ప్రస్తుతం మరలా తేనెయొక్క స్వస్థపరచే సామర్ధ్యాలను కనుగొనడానికి ఆరంభించిందని లా ప్రెస్ మెడికాల్ అనే ఒక ఫ్రెంచి పత్రిక నివేదిస్తున్నది. ఇటీవల ఒక అధ్యయనంలో, కాలిన బొబ్బలు, మరితర శరీర గాయాల చికిత్సకొరకు వైద్యులు స్వచ్ఛమైన సహజ తేనెనుపయోగిస్తూ ప్రయోగాలు చేశారు. తేనెను సూటిగా గాయాలకు పూచి, సూక్ష్మక్రిమినాశక పొడిబట్ట కట్టేవారు. ఈ కట్టు ప్రతి 24 గంటలకు మార్చబడేది. తేనె గాయాన్ని శుభ్రపరచే, స్వస్థపరచే కారకంగా విశేష ప్రభావం చూపుతుందని ఫలితాలు ప్రదర్శించాయి. ఇది సోకిన క్రిములను చాలామట్టుకు నాశనం చేసి, క్రొత్త కణజాల వృద్ధిని పురికొల్పుతుంది. లా ప్రెస్ మెడికాల్ ముగింపులో ఈవిధంగా చెబుతున్నది: “తేనె సహజమైంది, ఖర్చులేనిది కాబట్టి, దీనిని అందరికీ పరిచయం చేసి, సాధారణంగా ఉపయోగించే క్రిమిసంహారక ఉత్పత్తుల జాబితాలో చేర్చాలి.” (g93 5/22)
చురుకుదనంలేని మెదడు మొద్దుబారిపోతుంది
ఎక్కువకాలం పాటు పనిలేకుండా ఉండటం మెదడుకు ప్రయోజనకరమైనదేనా? ఖచ్ఛితంగా కాదు, అని జర్మనీలోని డూసెల్డోర్ఫ్లో జరిగిన వైద్య సిబ్బంది సదస్సులో ప్రొఫెసర్ బెంట్ ఫిషర్ చెప్పాడు. డేర్ స్టిగెర్వాల్ట్ బోటె అనే వార్తాపత్రిక నివేదించినట్లుగా, “కేవలం కొన్ని గంటలు మాత్రమే పూర్తి ప్రేరణ లేకుండానున్న తర్వాత, ఒక వ్యక్తి ఆలోచనాశక్తి లెక్కించదగినంతగా క్షీణించిందని” ఆయన పరిశీలనలు సూచించాయి. ఎవరికైతే విరామంగా ఉండే సెలవుంటుందో అది నిష్క్రియ సోమరితనంతో కూడిన వాటిలో ఒకటని దాన్నిగూర్చి పునఃపరిశీలించాలని ఈ ప్రొఫెసర్ సలహా యిచ్చాడు. “ఎక్కువకాలంపాటు శిక్షణ లేకుండా విరామం తీసుకున్న కండరం వలే, కొన్ని సందర్భాల్లో మెదడు దాని పనులలో పూర్వోక్త స్థాయిని చేరుకోడానికి దాదాపు మూడువారాలు పట్టవచ్చునని” ఈ పత్రిక వ్యాఖ్యానించింది. క్రీడలు, ఆటలు, ఆసక్తిదాయకంగా చదివే పుస్తకాలు సెలవుల్లో మెదడు సహజత్వం కోల్పోకుండా అడ్డుకుంటాయి. (g93 6/8)
సముద్ర తాబేళ్ల సమస్య
సముద్ర తాబేళ్లకు నీళ్లే నివాసమైనప్పటికి, అవి వాటి గ్రుడ్లు పొడిప్రదేశంలోనే పెడతాయి. ప్రపంచ సముద్రాల్లో సుదూర ప్రాంతాల్లో సంచరించిన తర్వాత, సముద్ర తాబేళ్లు పిల్లలు కనడానికి ప్రత్యేక సముద్రతీరాలకు తిరిగి వస్తాయి. సముద్రతీరానికి దగ్గరలో మగదానితో సంపర్కించిన తర్వాత, ఆడ తాబేలు మెల్లగా, వికారంగా ఒడ్డుకు చేరుకుంటుంది—ఒకవేళ అది పుట్టిన ఒడ్డుకే చేరుకుని—జాగ్రత్తగా ఎన్నుకున్న ప్రదేశంలో అది దాని గ్రుడ్లను నిశ్చలంగా పెడుతుంది. ఇలా కొన్ని రోజులపాటు పదేపదే గ్రుడ్లన్నీ పెట్టేవరకూ సాధారణంగా ఒక వెయ్యి గ్రుడ్లను పెట్టి, కనపడకుండా జాగ్రత్తగా కప్పుతుంది. కాని ఆతర్వాత వచ్చేదే సమస్య. మానవుడు తన “అసమాన దురాశ, పరిసరాల యెడల చూపే బుద్ధిపూర్వకమైన అశ్రద్ధనుబట్టి, ఒక క్రమపద్ధతిలో ఈ గూళ్లన్నీ ఖాళీ చేస్తున్నాడు,” అది “తాబేళ్ల పునరోత్పత్తి వ్యవస్థతో గంభీరంగా జోక్యంచేసుకుందని” దక్షిణాఫ్రికా వార్తాపత్రికైన ప్రిస్మా వివరిస్తున్నది. ప్రస్తుతం కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. (g93 5/22)
టెలివిజన్‌ను ముందుగనే అదుపు చేయవచ్చా?
“పిల్లలు తగుమాత్రంగా టివీ చూడటం మంచిది, ప్రాముఖ్యంగా అది హింసాకాండతో కూడినదైతే,” అని ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నందు ప్రచురించిన ఒక అధ్యయనంలో అమెరికాలోని శిశుచికిత్స శిక్షణాకేంద్రం చెబుతున్నది. “శిశువులు 14 నెలల ప్రాయంలోనే బాగా పరిశీలించి, టెలివిజన్‌పై వారు చూసే పద్ధతులను సంగ్రహిస్తారని” ఈ శీర్షిక నివేదించింది. వారు చూసేవాటి సహజత్వం అధికంగా కలహశీలంగా, హింసాకాండతో కూడినదైయుంది. మాతాపిత సంబంధ అధికారాన్ని పునఃస్థాపించే ప్రయత్నంలో, ఆధునిక వైజ్ఞానికశాస్త్రంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ టైమ్ చానెల్ లాక్‌ను టెలివిజన్‌పై అమర్చుటద్వారా ప్రదర్శనా సమయాలను ముందుగనే అదుపు (ప్రీసెట్) చేయవచ్చని ఈ నివేదన సలహాయిస్తున్నది. ఈ పద్ధతిలో, తలిదండ్రులు యింటివద్ద లేనప్పుడు కూడ, వారు వారి పిల్లలు టెలివిజన్‌పై ఏం చూస్తున్నారో, వారు ఎప్పుడు చూస్తున్నారో అనేవాటిని అదుపులో పెట్టగలరు. (g93 5/22)
మీ చేతులు శుభ్రం చేసుకోండి!
ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్ర సాంకేతిక అభివృద్ధులు రోగాలనెదుర్కోవడానికి చాలా కృషి చేస్తున్నప్పటికి, సాధారణ సబ్బుతో, నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోడం, అనేక అంటురోగాలను అడ్డుకొనుటలో యింకనూ అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల పారిశుధ్య అలవాట్లకు సంబంధించి ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో జరిగిన ఒక అధ్యయనంలో, ప్రజా మరుగుదొడ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, పాఠశాలలు, కర్మాగారాల్లో మరామత్తు చేసేవారిగా లేదా శుభ్రంచేసే పనివారుగా పరిశోధకులు నటించారని ఫ్రెంచి వార్తాపత్రికైన లీ ఫ్లేగెరో నివేదిస్తున్నది. నల్గురిలో ఒకరు మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత తన చేతులు శుభ్రం చేసుకోరని, వీరిలో నాల్గవవంతు తమ చేతులు సబ్బు ఉపయోగించకుండానే శుభ్రం చేసుకుంటారని వారు కనిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా రోగాన్ని వ్యాప్తి చేయుటలో, మానవ హస్తమనేది అంత్యంత సాధారణమైన సాధనమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (g93 6/8)
ఖగోళశాస్త్రవేత్తల నిరీక్షణ
ఇతర గ్రహాలపైనున్న తెలివిగల ప్రాణులనుండి రేడియో ప్రసారాలను కనుగొనే ప్రయత్నంలో, అమెరికాలోని జాతీయ వైమానిక, అంతరిక్ష పరిపాలనావ్యవస్థ నిర్వహించిన పది సంవత్సరాల కార్యక్రమంలో, 10కోట్ల డాలర్లను ఖర్చుపెట్టాలని ఖగోళశాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ప్రకారం, వారు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇండియా, రష్యా, ప్యూరిటొ రికొ, అమెరికా దేశాల్లోని రేడియో టెలిస్కోపులవద్ద అనేక లక్షల సూక్ష్మతరంగ (మైక్రోవేవ్) చానల్స్‌ను ఏకకాలంలో తిలకిస్తూ దీన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రధమంగా సాధించినదాన్ని ఆలోచిస్తూ కొందరు శాస్త్రవేత్తలు అన్నీ మన మంచికొరకే అనే భావంతోనుండగా, యితరులు 1960 నుండి నిర్వహించిన 50 విఫలమైన అన్వేషణలను వేలెత్తి చూపిస్తున్నారు. (g93 5/22)