“మన అనుదినాహారము”
“మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” ప్రార్థనలలోకెల్ల ప్రసిద్ధమైన—ప్రభువు ప్రార్థన అని పిలువబడు దానిలో అదొక భాగమని మీరు ఆ మాటలను నిస్సందేహముగా గుర్తించగలరు. (మత్తయి 6:9, 11,కింగ్‌జేమ్సు వెర్షన్) పూర్వం యేసు దినాలలో ఇశ్రాయేలు దేశంలో రొట్టె ముఖ్యమైన ఆహారంగా, శరీరపుష్టికి సరైన గుర్తుగా ఉండేది.
ప్రపంచంలో ఈనాడు అనేక ప్రాంతాలలో, ఒకప్పుడున్నట్లుగా భోజన పదార్థముల పట్టికలో ఇప్పుడు రొట్టె ముఖ్యమైన ఆహారంగా లేదు. ఈనాడు మన అక్షరార్థ ప్రతిదిన రొట్టె తరచు భోజనంలో ఒక భాగమే అయినప్పటికి, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలలో రొట్టె ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది.
మెక్సికోలో గృహిణులు టార్టిల్లాస్ అని పిలువబడే పలుచని రొట్టెలను చేస్తారు. ఇతియోపియాలో స్త్రీలు, వేడి పెనం మీద ద్రవరూపంలో పిండిని వలయంగా పోసి సామాన్యమైన రొట్టెలను చేస్తారు. పాశ్చాత్య దేశాలలో రొట్టెలను అత్యాశ్చర్యకరమైనన్ని రకాల ఆకారాలలో మరియు పరిమాణాలలో అధికోత్పత్తి చేస్తారు. ఇంకా ఆ దేశాలలో అనేక మంది గృహిణులు వారివారి ఇళ్లల్లో చేసే రకరకాల రొట్టెలతో తమ కుటుంబాలను సంతృప్తి పరుస్తూనే ఉంటారు.
పొయ్యి నుండి వేడి వేడిగా తీయబడిన రొట్టె ఘుమఘుమ సువాసనకు ఎవరు సమ్మోహితులుకారు? ఆ సువాసన అటుగా వెళుతున్న వారిని రొట్టెల దుకాణంలోకి ఆకర్షిస్తుంది. చాలమందికి అది చిన్ననాటి ఇంటి స్మృతులను, బాల్యపు గోరు ముద్దలను జ్ఞప్తికి తెస్తుంది.
రొట్టెను తయారు చేసే కళను ఎవరు కనిపెట్టారో తెలియదు. ఆదికాండము 3:19 నందు పాపులైన మొదటి మానవులకు ఇలా చెప్పబడింది: “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము (రొట్టె) తిందువు.” స్పష్టంగా, “రొట్టె” అనే పదం ఇక్కడ సాధారణ ఆహారానికి కేవలం గుర్తుగా ఉపయోగింప బడింది. అయితే ఆదికాండము 14:18, 19 నందు యాజకుడైన మెల్కీసెదెకు పూర్వికుడైన అబ్రాహామును ఆశీర్వదించుటకు వచ్చినప్పుడు, అతడు “రొట్టెను ద్రాక్షారసమును తీసికొని వచ్చెను” అని మనం చదువుతాము. పూర్వకాలం ప్రజలకు ముఖ్యమైన ఆహారంగా ఉన్న ఒక రకమైన రొట్టెను ఇది సూచించిందనుటలో సందేహం లేదు. మధ్యప్రాశ్చం యొక్క కొన్ని ప్రాంతాలలో రొట్టె ఇంకా ముఖ్యాహారంగా కొనసాగుతూనే వుంది.
గ్రీసు మరియు రోములలో వలే పురాతన ఐగుప్తులో కూడ కమర్షియల్ బేకర్స్ ఉండేవారు. పంతొమ్మిదవ శతాబ్దాంతానికి, పారిశ్రామిక విప్లవం పూర్తి పట్టులో ఉండింది. అధిక ఉత్పత్తి కొరకు రొట్టెల తయారీ ఇళ్లల్లో నుండి ఫ్యాక్టరీలలోకి మారింది. మిక్సింగ్ మెషీన్లు, చైన్ కన్వేయర్లు, ఆటోమెటిక్ బేకింగ్ ఒవెన్లు, ముక్కలు చేసి పేపరులో చుట్టిపెట్టే మెషీన్లు వంటి నూతన రూపకల్పనలు వాటి ఉత్పత్తి అవసరాలను తీర్చాయి. రొట్టెల తయారీ ఇంటి కళ నుండి వాణిజ్య విజ్ఞానంగా అభివృద్ధి చెందింది.
పారిశ్రామిక దేశాలలో ఈనాడు వినియోగింప బడుతున్న రొట్టె, ఎక్కువ, లేదా అధిక భాగం వాణిజ్య పరంగానే ఉత్పత్తి చేయబడుతుంది. అనేక సంస్కృతుల యొక్క వంట విధానంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తూనే ఉంది. ఇటలీ యొక్క కరకరలాడే రొట్టె లేని సేమియా భోజనం ఏం బాగుంటుంది? రై పిండితో చేసే రొట్టె, కాబేజీ ఊరగాయ లేని జర్మను భోజనాన్ని గూర్చి ఊహించండి! చల్లని శీతాకాలపు ఉదయం పాన్‌కేక్స్ తినాలని ఎవరిష్టపడరు? పాన్ కేక్స్, అంటే పూర్తి గోధుమ పిండి లేక ఒక రకం గోధుమ పిండి, మొక్కజొన్న పిండితో త్వరగా వేయించిన రొట్టెలే.
ఇటాలియన్ పిజ్జాలో వాడే ఒక రకమైన రొట్టె పాశ్చాత్య దేశాలలో ఎక్కువ ప్రచారం పొందింది. దాన్ని తయారు చేసే విధానం కూడ చూడ ముచ్చటగా ఉంటుంది; సర్కసు ప్రదర్శనా నిపుణుని వలె ఒక పిజ్జా బేకర్, పిండిని పల్చని గుండ్రని ఫలకంలా చేసి గాలిలో వేగంగా త్రిప్పడాన్ని పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లల్లా ఆశ్చర్యంగా చూస్తారు.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రొట్టె ఉంటుందా? అవును, తప్పకుండా! అయితే రొట్టెను తిని ఆనందించటానికి ఒక చక్కని మార్గం ఏమిటంటే, స్వంతగా రొట్టెను చేసుకోవడమే. మీ స్వంత చేతులతో చేసుకున్న దాని నుండి పొందగలిగే సంతృప్తికి మీరు ఆశ్చర్యపోతారు. ఒక గృహిణి బట్టలుతకటంలో పొందలేని సృజనాత్మక సంతృప్తిని ఇందులో పొందగలదు.
పాశ్చాత్య దేశాలలో ప్రసిద్ధి చెందిన యీస్టు ద్వారా పొంగే రొట్టెను తయారు చేయుటకు, ఇచ్చట ఇవ్వబడిన వండే విధానం మీకు సహాయ పడుతుంది. పదార్థాలను కొలిసి కలపటం సరదాగా వుంటుంది. పిండి పిసుకుట అన్ని రకాల వత్తిడుల నుండి విడుదలను కలుగ జేస్తుంది. రొట్టె పొంగడం, రొట్టె తయారీలో ఇంకొక రంజింపజేసే అంశము. పులియుట యొక్క ఫలితమే పొంగటం. పిండికి యీస్టు కలిపినప్పుడు కర్బనామ్ల వాయువు గాలి బుడగలు ఏర్పడునట్లు చేయడం ద్వారా పిండిలో రంధ్రాలు ఏర్పడుతాయి. ఇప్పుడు పిండిని గుద్ది ముద్దలుగా చేసి, కాల్చక ముందు రొట్టె ఆకారములలో చేసి మళ్లీ పొంగ నిస్తారు. ఒవెన్‌లోకి ముద్దలు వెళ్లగానే, మీ ఇల్లంతా ఎంత మంచి సువాసనతో నిండి పోతుంది! రుచి చూడడం అన్నిటి కంటె శ్రేష్ఠమైంది. వళ్లీ దుకాణంలోని రొట్టె తినాలంటే మీరు ఇష్టపడరు. ఒకసారి యీ రొట్టె చేసే పద్ధతి తెలుసుకున్నారంటే గోధుమ, బార్లీ, రై, మొక్కజొన్న, వరి, బంగాళ దుంప, లేక సోయా చిక్కుళ్ల వంటి రకరకాల పిండితో ప్రయోగం చేయటానికి మీరు ఇష్టపడతారు.
నిజమే, వాణిజ్యపరంగా ఎన్నో రకాలుగా తయారు చేయబడిన రొట్టెను కొనడం మీకు కేవలం అనుకూలంగా ఉండ వచ్చును. కానీ మీరు దాన్ని తినటానికి ఇష్టపడినా లేక తయారు చేయటానికి ఇష్టపడినా, మీ భోజనంలో అది ముఖ్యమైనదైనా లేక కేవలం అదనపు వంటకమే అయినా, రొట్టె యెడల తక్కువ భావం కలిగి వుండకండి. దేవుడే మనకు “మన అనుదినాహారం” (రొట్టె) ఇచ్చేవాడు! (g92 12/8)
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
రొట్టె చేయు విధానం
వెచ్చని 4 కప్పుల నీటిలో 1 కేకు యీస్టును (లేక 3 పాకెట్ల పొడి యీస్టును) కరిగించండి
(గోధుమ పిండి) 5 కప్పులు (600 గ్రా) దానిలో కలపండి
వెచ్చని స్థలములో దాన్ని రెండంతలుగా పొంగ నివ్వండి
ఉప్పు 2 టీస్పూన్లు, అరకప్పు (100 గ్రా) చక్కెర, అరకప్పు (115 గ్రా) వనస్పతిని చేర్చండి
బాగా కలపండి
పిండి గట్టిపడటానికి షుమారు 4 కప్పుల పిండిని చేర్చడి
పిండిని 15 నిమిషాలు పిసకండి
అది రెండింతలు పొంగేలా దాన్ని నూనె రాసిన పాత్రలో ఉంచండి
మెల్లిగా పిసికి, నాలుగు ముద్దలుగా చేయండి
నూనె రాసిన రొట్టె పెనములలో కొద్ది నిముషాలు పొంగ నివ్వండి
ఒక గంట పాటు 325 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో బేక్ చేయండి.