ప్రపంచ పరిశీలన
ప్రచ్ఛన్న యుద్ధం తదుపరి పర్యవసానం
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా కూడ ప్రపంచ సైనిక వ్యయం 1990 లో యింకా 90,000 కోట్ల డాలర్లను మించే యున్నది. వాస్తవంగా 1970 దశాబ్దమందలి ప్రతిసంవత్సర సగటు వ్యయం కంటే 60 శాతం అధికంగా ఉన్నదని భావం, అని వాషింగ్టన్ డి.సి. నందు ప్రపంచ ప్రాధాన్యతలు అనే ఒక గుంపు చేసిన క్రొత్త అధ్యయనములో పేర్కొనబడెను. వరల్డ్ మిలిటరీ అండ్ సోషియల్ ఎక్స్‌పెండిచర్ 1991 వార్షిక నివేదిక కూడ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వలన కల్గిన నష్టాలలో పౌరమరణాల సంఖ్య 1980 దశాబ్దములో 74 శాతం నుండి 1990 లో 90 శాతం వరకు పెరిగిందని కనుగొన్నది. ఆ నివేదిక రచయిత్రి, అర్థశాస్త్రవేత్త అయిన రూత్ లేజర్ సివార్డ్, మరణాంతకమగు ఆయుధాలు అధికమగుతున్నందున పౌరమరణాలు విపరీతంగా పెరిగిపోయినవని ఆరోపించింది. ఆమె యిలా అన్నది: “నేడు సాంప్రదాయ సిద్ధమైన ఆయుధాలని పిలువబడేవి యిప్పుడు చిన్న పరమాణు ఆయుధాల వినాశక శక్తిని కలిగియున్నాయని రూపంలో కన్పిస్తున్నవి.” ప్రపంచ సాయుధ దళాలే భూమిని కలుషితం చేసే వాటిలో అత్యంత పెద్దదని కూడ ఈ అధ్యయనము కనుగొన్నది; అమెరికాలో ఉన్న ఐదు అత్యంత పెద్ద రసాయిన పరిశ్రమలన్నీ కలిపి ప్రతి సంవత్సరము ఉత్పన్నముచేసే విషపదార్థముల కంటె ఆ దేశపు సాయుధ దళాలే ఎక్కువ ఉత్పన్నము చేస్తున్నవి. (g91 11/22)
గర్భస్రావ మరణాలు
“నైజీరియాలో ప్రతి సంవత్సరం గర్భస్రావం మూలంగా దాదాపు 10,000 మంది స్త్రీలు చనిపోతున్నారు, 2,00,000 మంది దాని తీవ్ర పరిణామాల మూలంగా ఆసుపత్రి పాలవుతున్నారు,” అని నైజీరియా సండే కన్‌కార్డ్ నివేదిస్తుంది. వీరిలో యించుమించు 20 శాతం మంది కౌమార దశకు చెందినవారు ఉన్నారు. “అనేకులు తామే గర్భస్రావం చేసికొనడానికి ప్రయత్నిస్తున్నారని” కుటుంబ నియంత్రణ అంతర్జాతీయ సహకారం యొక్క సంచాలకుడైన డా. ఉచా అజియా పేర్కొన్నట్లు నివేదించబడింది. లైంగిక విషయాలను గూర్చి అలక్ష్యత చూపుటే ఆ గర్భస్రావములకు నడిపే గర్భధారణలకు ముఖ్య కారణమని అతడు సూచించాడు. (g91 11/22)
మద్యం మరియు హృద్రోగం
మద్యపానీయాలను తగుమాత్రం సేవిస్తే హృద్రోగమువచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది అని హార్‌వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రజ్ఞులు చెప్పినట్లు లీన్‌సెట్ పత్రిక నివేదించింది. రక్తప్రసరణలో మంచి కొలెస్టెరాల్ అని పిలువబడే రెండు రకాల హెచ్‌డిఎల్ (అధిక సాంద్రతగల క్రొవ్వుమాంసపు కృత్తులు) పరిమాణమును మద్యము వృద్ధిచేయునని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. దమనులలో పేరుకుపోయిన క్రొవ్వును ఈ హెచ్‌డిఎల్ తొలగించి, తద్వారా హృద్రోగములను తగ్గిస్తుంది. అలాగే మద్యం, రక్తములో ఎల్‌డిఎల్ స్థాయిని తగ్గించుట ద్వారా రక్తము గడ్డకట్టకుండా నివారిస్తుంది. గుండెపోటుకు ప్రధాన కారణం ఎల్‌డిఎల్ స్థాయి అధికంగా ఉండడమే. అయితే, మద్య పానీయాలను ఒక వ్యక్తి ఉపయోగిస్తున్నట్లయితే, అతడు ‘తన కడుపు నిమిత్తము కొంచెమే పుచ్చుకుంటే’ మంచిది.—1 తిమోతి 5:23 (g91 12/8)
టివి దుర్వినియోగమునకు చికిత్సచేయు పిల్లల వైద్యులు
“దూరదర్శిని విషయాలల్లో పిల్లల వైద్యులు ప్రముఖపాత్ర వహించుట తప్పనిసరి” అని పీడియాట్రిక్స్ పత్రిక సిఫారసు చేస్తుంది. దానికితోడు, “దూరదర్శినిలో చూపించే దౌర్జన్యకర సంఘటనలు, పిల్లలకు సరిపడని మరి యితర అంశాల హానికర ప్రభావాలను గూర్చి వారు తలిదండ్రులకు ఉపదేశించాలని” చెబుతున్నది. కెనడాలో దూరదర్శిని తిలకించే అలవాటున్న 311 కుటుంబాలపై యిటీవల చేసిన సర్వే ప్రకారం వారిలో ప్రతి ఒక్కరు కనీసం ఒక్క దూరదర్శినినైనా కలిగియున్నారని బయల్పరచింది. మరి 16 శాతం యిండ్లలో అది దినమంతా వేసే ఉంటుంది. “అనేకమంది పిల్లలు తమ తలిదండ్రులచే ఏ విధమైన హద్దులు పెట్టబడకుండ దూరదర్శిని చూస్తున్నారు అందుమూలంగా, దౌర్జన్యకర సన్నివేశాలు మనస్సున నాటుకొనిపోయి వాటిమూలంగా సులభంగా మోసగించబడే వయస్సున వారు చూస్తున్నారు.” దూరదర్శిని దుర్వినియోగము వలన కలిగే నష్టాలను గూర్చి తలిదండ్రులను హెచ్చరించాలని పిల్లల వైద్యులు ప్రోత్సహించబడ్డారు. (g91 12/8)
రక్తమార్పిడి “జీవవరం” కాదు
రక్తమార్పిడిలు నిజంగా ప్రాణాన్ని కాపాడేవేనా? అనేకానేకమంది వైద్యాధికారులకు సందేహాలున్నాయి. ఆస్ట్రేలియా నందలి సిడ్నీ రాయల్ నార్త్ షోర్ హాస్పిటల్‌లో రక్తకణ శాస్త్ర డైరెక్టరు రక్తమార్పిడి క్షేమాన్ని గూర్చిన విషయాలను మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా నందు చర్చిస్తున్నాడు. క్యాన్సర్, అంటువ్యాధి, రక్తమార్పిడుల మధ్య సంబంధములున్నవని అతని నమ్మకం. పేరుగాంచిన ఈ వైద్యుడు యిలా చెప్పాడని బ్రిస్‌బేన్ కొరియర్-మెయిల్ పేర్కొన్నది: “గతంలో రక్తమార్పిడి ఒక జీవవరంగా పరిగణించబడేది, కాని పరిస్థితి తారుమారయ్యింది, యిప్పుడు రక్తం ఎక్కించకుండా శస్త్రచికిత్స చేయుట, రక్తమార్పిడిని మానుకొనుట జీవవరము కాగలదని సర్వసాధారణ నమ్మకమయ్యింది. శస్త్రచికిత్సచేసే సమయంలో రక్తమార్పిడి చేసినందున క్యాన్సరు పునఃప్రాప్తించే అపాయము, శస్త్రచికిత్స అయిన తర్వాత వచ్చే అంటురోగాలు చింతను కలిగిస్తున్నాయి.” (g91 11/22)
ప్రభుత్వ అసమర్థత
దారిద్ర్య నిర్మూలనా పోరాటంలో ప్రభుత్వాల అసమర్థతను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమశాఖ యిటీవల ప్రచురించిన నివేదికలో దుయ్యబట్టింది. ఈ నివేదికను పేర్కొనుచు, ఫ్రెంచి దిన పత్రిక లిమోండి వివరించినదేమంటే కొన్ని అభివృద్ధిచెందుతున్న దేశాలలో “ఆయుధ సామగ్రి కొరకైన వ్యయం, ఆరోగ్యం మరియు విద్యకై చేసే వ్యయం కన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది.” “సైనిక వ్యయం పారిశ్రామిక దేశాలలోకన్నా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడురెట్లు అత్యంత వేగంగా పెరిగిపోయిందని” అది గుర్తించింది. ఆ నివేదిక చెబుతున్నట్లుగా “గల్ఫ్‌యుద్ధంనందు పదిరోజులలో వ్యయం చేసిన డబ్బు రానున్న పది సంవత్సరాలలో ప్రపంచమంతటా ప్రతిపిల్లవానికి రోగనిరోధక టీకాలు వేయడానికి సరిపోతుంది.” (g91 12/8)
ఒక గంట శ్రమకు
ఇటీవల ఒక అధ్యయనము 159 విభిన్న వృత్తులందున్న పనివారి ఆర్జించే సామర్థ్యమును ప్రపంచమంతటానున్న 49 విభిన్న సాంఘిక స్థాయిలతో పోల్చిచూసిందని ఫ్రెంచి వార్తాపత్రిక లిమోండి నివేదించింది. అంతర్జాతీయ శ్రామిక సంస్థచే నిర్వహించబడిన ఈ అధ్యయనము, శ్రామిక కొనుగోలు శక్తి ఒక ప్రదేశమునుండి మరో ప్రదేశానికి ఎంత వ్యత్యాసంగా ఉంటుందో చూపించింది. ఉదాహరణకు, సూడాన్‌లోని చేనేత కార్మికుడు, శ్రీలంకలోని హోటల్ సర్వర్, యుగొస్లేవియాలోని నూలు వడికేవాడు, బంగ్లాదేశ్‌లోని బస్ డ్రైవరు, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని రొట్టెల తయారీ కార్మికుడు కేవలం ఒక కిలో బియ్యం కొరకు మూడు గంటలకంటే ఎక్కువ పనిచేయవలసి ఉంటుంది. అయితే దానికి భిన్నంగా, ఫ్రెంచి పోలినేషియాలోని ఒక ఆఫీసు పనివాడు, లేదా స్వీడన్‌లోని ఒక వడ్రంగివాడు కేవలం ఒక్క గంట పనికి లభించే జీతంతో కనీసం తొమ్మిది కిలోల బియ్యం కొనగలడు. (g91 11/22)
అల్పమైన బంగాళదుంప విలువ
“ఐరోపా విజేతలు అమెరికా చేరుకున్నపుడు, అక్కడున్న సంపద, లోహాలు, విలువైన రాళ్లే అనే తలంపుతో వచ్చారు. బంగాళాదుంపయొక్క ఆర్థిక సంబంధమైన విలువను కనుగొనడానికి, మూడు శతాబ్దాలు పట్టాయి,” అని సెంటర్ ఆఫ్ బారిలోక్ అర్జెంటీనాలో రీజనల్ యూనివర్శిటీ సెంటర్‌కు చెందిన ఎడ్యూర్డో హెచ్. రాపోపోర్ట్, బ్రెజిలియన్ పత్రిక సైనోయహోజి నందు పేర్కొన్నాడు. బంగాళాదుంపలు అత్యంత ప్రాముఖ్యమైన, పోషకాహారములలో ఒకటి, అందులో అనేక విటమిన్లున్నవి. కావున, వాటికి వార్షికంగా కోట్లాది డాలర్లలలో విలువ కట్టబడింది. ఆ నివేదిక యింకా యిలా అంటున్నది: “ఒక సంవత్సరములో, ప్రపంచమంతటా పండిన బంగాళాదుంపల విలువ అమెరికానుండి స్పెయిన్ రాబట్టిన బంగారం, వెండికున్న విలువకన్నా ఎంతో ఎక్కువ.” (g91 11/22)
సంగీత లయబద్ధంగా తినడం
భోజనపు అలవాట్లపై సంగీతముయొక్క ప్రభావాన్ని గూర్చి పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. వివిధ రకాలైన సంగీతములను వింటూ భోజనం చేస్తున్నప్పుడు ప్రజలు ఆహారాన్ని నమిలిన దాన్ని వారు ఒక అధ్యయనములో లెక్కించారు. సంగీత ఆలాపనము లేనప్పుడు భోజనం చేసేవారు “నిమిషానికి సగటున 3.9 సార్లు నమిలేవారు,” మూడవవంతు మంది మరలా ఆహారం వడ్డించమని అడిగేవారు, అని టప్ట్స్ యూనివర్శిటీ డైట్ & న్యూట్రిషన్ లెటర్ నివేదిస్తుంది. “ఉద్రేకపరచే సంగీతం” వినిపించబడినప్పుడు, భోజనంచేసే వ్యక్తులు “నిమిషానికి సగటున 5.1 సార్లు నమలుటకు వేగం పెంచారు.” ఆ నివేదిక యింకా ఏమంటుందంటే, “నిమ్మళపరచు పిల్లనగ్రోవి అయితే ఆ వేగాన్ని నిమిషానికి 3.2 సార్లు నమిలే స్థాయికి తగ్గించింది—కొరికే పరిమాణములు కూడా తగ్గాయి.” ఈ రెండవ స్థాయిలో మరోసారి వడ్డించమని ఎవ్వరూ అడుగలేదు. నిజానికి, అనేకులు ఆహారం చాలా రుచికరంగా ఉందని, తమ కడుపునిండి పోయిందని చెప్పి తమ గిన్నెల్లో ఆహారాన్ని మిగిల్చేసారు. వారికి “జీర్ణసంబంధమైన ఫిర్యాదులు కొద్దిగానే” ఉండెననికూడ నివేదించబడింది. (g91 12/8)
ప్రపంచవ్యాప్త నిరక్షరాస్యత తగ్గుచున్నది
“మునుపెన్నటికంటె మొదటిసారిగా, ప్రపంచములోని నిరక్ష్యరాసుల సంఖ్య యిటీవలి సంవత్సరములలో కొద్దిగా తగ్గుముఖం పట్టింది,” అని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. “ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అందించిన నివేదిక ప్రకారం, 1985 లో అంచనా వేయబడిన 95 కోట్లనుండి 1990 నాటికి 94.8 కోట్లకు నిరక్ష్యరాసుల సంఖ్య తగ్గిందని అంచనా వేయబడింది.” ప్రపంచ జనాబాలో దాదాపు 26.6 శాతం మంది నిరక్ష్యరాసులు, మరి ఈ ప్రస్తుత వైఖరి కొనసాగితే, 2,000 సంవత్సరము నాటికి అది 21.8 శాతం వరకు తగ్గుతుంది, లేదా 93.5 కోట్లవుతుంది. అందుకు తగినట్లుగా, గత సంవత్సరాన్ని (1990) అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరమని పిలిచారు. అక్షరాస్యతను వృద్ధిచేసుకొనడానికి పేద దేశాలు చూపే అత్యంత ఆసక్తికి తోడు, పారిశ్రామిక దేశాల్లో కర్తవ్య నిరక్షరాస్యతను గూర్చి కూడ అత్యంత శ్రద్ధ తీసుకొనబడుతున్నది, ప్రస్తుతము అది 10-20 శాతం మధ్య ఉంటుందని అంచనా. (g91 11/22)