సత్యమునకున్న పునరుజ్జీవింపజేయు శక్తి
“ఒక దోపిడీ దొంగ, ముందే విడుదలై, ఏడునెలల్లో 500 దోపిడీలు చేశాడు. సాధారణ పది సంవత్సరాల జైలు శిక్షను నాలుగేళ్లకు తగ్గించి విడుదలచేయబడిన అత్యాచారంచేసే ఓ వ్యక్తి ఒక స్త్రీని మానభంగంచేసి హత్యచేశాడు. షరతుపై విడుదల చేయబడిన ఓ హంతకుడు రెండు ఇండ్లను పగులగొట్టి, దూరి ముగ్గురిని చంపాడు.”—రీడర్స్ డైజెస్ట్, నవంబర్, 1990.
“దేశములోని జైళ్లలోనుండి విడుదలచేయబడిన వారిలో 63 శాతం మంది తీవ్రమైన తప్పుచేసినందుకు మూడు సంవత్సరాలు తిరిగేలోపుననే అరెస్టు అవుతున్నారు, అని న్యాయశాఖ యీరోజు విడుదలచేసిన అధ్యయనంలో తెలిపినది.”—ది న్యూయార్క్ టైమ్స్, ఏప్రిల్ 3, 1989.
“నేరస్థులకు జైలు పునరావాస స్థలమనుట సత్యవిదూరం. జైళ్లు ‘నేరానికి పాఠశాలలు’ మరియు ‘గిడ్డంగులు.’”—టొరంటొ సన్డే స్టార్ మార్చి 20, 1988.
న్యూయార్క్ పట్టణములోని జైల్, రైకర్స్ ఐలెండ్ యొక్క వార్డెన్ ఇలా అంటున్నాడు: “పందొమ్మిదేళ్ల కుర్రాడు ఇక్కడికి వస్తాడు. వాడు బయట కాపలా ఉండి దోపిడి దొంగతనంలో పాల్గొన్నందుకు పట్టుబడ్డాడు. వాడిక్కడ నుండి వెళ్లేటప్పుడు ఇక కాపలా వాడుగా వుండడు. అతడు స్వయంగా దొంగతనాలకు పాల్పడి తుపాకి పేల్చుతాడు.—న్యూయార్క్ పత్రిక ఏప్రిల్ 23, 1990.
జైలుగేట్లు తిరిగే తలుపులుగా తయారగుచున్నవి: నేరస్థులలో దాదాపు మూడింట—రెండు వంతులు వారు విడుదలచేయబడిన మూడు సంవత్సరాలలోపుననే మరల అరెస్టు చేయబడుచున్నారు.—టైం పత్రిక, మే 29, 1989.
పైన తెలుపబడినవాటిలో మనకు క్రొత్తదేమిలేదు. అది పాత కథనే. జైళ్లు పునరావాసం కల్పించవు. సత్యం పునరావాసం కల్పిస్తుంది. ఇక్కడొకరి విషయమున్నది: రొన్ ప్రాయర్ అనే ఆయన కథ.
రొన్ తన కుటుంబముతో కలిసి బైబిలునుండి ఒక వాక్యము చదువుతూ ప్రతిదినాన్ని ప్రారంభిస్తాడు. ఆయన వివాహజీవితం ప్రశాంతంగాను ప్రేమపూర్వకంగాను సాగుతుంది. ఇల్లు చక్కగా అమర్చబడి శుభ్రంగా వుంది. ఇద్దరు కుమారులు, మంచి విద్యార్థులు—మాదక ద్రవ్యాలు తీసుకోరు. మత్తుపానీయం సేవించరు, సమస్యలు లేవు. అప్పటికే వారు స్వంతగా బయటికి వెళ్లి క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నారు. రొన్ అతని భార్య ఆర్లిన్ క్రైస్తవులుగా వారి సంఘంలో స్వచ్ఛంద సేవలో నిమగ్నులైయున్నారు. ఇతరులకు సేవచేస్తూ ప్రయోజనకరమగు జీవితాలను గడుపుచున్నారు.
అయిననూ, 1970లో రొన్ ప్రాయర్ హత్యచేసినందుకై తీర్పుకొరకు జైలులో వేచివుండెను. అతడు నేరస్థుడని నిరూపించబడి ఒక రాష్ట్ర జైలునందు కాలం గడుపుతుండెను. దీర్ఘకాల నేరప్రవృత్తికి ఫలితంగా పలుమారులు జైలుకు వెళ్లుటకిది దారితీసింది. అయితే రొన్ తన కథను తానే చెప్పనిద్దాం.
“నేను మొదటిసారిగా ‘బంధించబడినది’ బట్టలు ఆరవేసుకునే త్రాడుతో అని నాకు జ్ఞాపకమున్నది. మూడు లేక నాలుగు సంవత్సరాల వయస్సులోనే తిరుగుబోతుతనము నాలో ఉన్నట్లు కనిపించింది. తిరిగేవాన్ని తప్పిపోయేవాన్ని పోలీసులు పట్టుకొని నన్ను ఇంటికి చేర్చేవారు. చివరికి మా అమ్మ నేనలా తిరగడం మానుకోకపోతే అనాధ శరణాలయం వారిని పిలిపించి వారితో నన్ను పట్టుకొని బంధించే ఏర్పాటుచేస్తానని నాతో చెప్పింది. నేను ఏడుస్తూ వారొస్తారేమోనని కాచుకుని కూర్చున్నాను. వారు రాలేదు, కాని మా అమ్మ నన్ను బట్టలు ఆరవేసుకునే త్రాడుతో కట్టివేసింది.
“నేను పెరిగేకొలది ఎప్పుడూ ఏదోక చిక్కులో ఇరుక్కుపోయేవాన్ని, ప్రతి సమస్యకు హింసే సమాధానంగా తలంచేవాన్ని. నేను తికమకపడి నిరాశతో పనికిరాని వాడినని అనుకునేవాన్ని. తప్పొప్పు తెలిసేది కాదు. నా మనస్సాక్షి కాకుండ నాలోని భావాలను నాకు మార్గదర్శకములుగా చేసుకున్నాను. బడిలో ఒక తరగతి నుండి మరో తరగతికి పాసయి వెళ్లేవాన్ని ఎందుకంటె టీచర్స్ నా పీడ వదలించుకోవడంలో సంతోషించేవారు. ఏడవతరగతిలో చదువు మానేసి ఇంటినుండి పారిపోయాను. నేను చెడు సహవాసులతో చేరిపోయాను, మరి లేఖనములలోని హెచ్చరిక ప్రకారం నిజంగా నేను సమస్యల ఊబిలోనికి చిక్కుకు పోయాను.—1 కొరింథీయులు 15:33.
“కట్టివేయడానికి బదులు సంస్కరణా పాఠశాలలో చేర్చారు. అవి నన్నేమి మార్చలేదు. నేను పారిపోయేవాన్ని మరల పట్టుకునేవారు. వర్జీనియాలోని ఒక స్కూల్‌నుండి పారిపోతూ, దారిన ఒక చిన్న ట్రక్కును దొంగిలించి పట్టుబడ్డాను. ఆటోను దొంగిలించిన నేరానికి జడ్జి జెంకిన్స్ ముందు హాజరై, నేను దొంగిలించినది యీ జడ్జిగారి ట్రక్కేనని గ్రహించాను. నాకు 16 ఏండ్ల వయస్సే గానీ నన్ను మార్చలేరని ఎంచి పెద్దవారికిచ్చే శిక్ష విధించారు. రెండు సంవత్సరాలు నన్ను జైల్లో వేశారు.
“జైలునుండి నన్ను విడుదలచేసిన తర్వాత, 20 సంవత్సరముల వయస్సులో నేను మోటారు సైకిలును సంపాదించాను. అది ఇచ్చే శక్తిని అనుభవించి నేను ముగ్ధుడనయ్యేవాన్ని, గానీ అది చాల్లేదు. నేను ఎప్పుడూ ఏదో కొట్లాటకే పొంచివుండే పేగన్స్ అనే మోటార్ సైకిల్ ముఠాలో చేరిపోయాను. వారు నిత్యం కయ్యానికి కాలుదువ్వే రకం. నేను వారిలో చక్కగా సరిపోయాను.
“ఆ తర్వాతనే ఒక ట్రక్కు డ్రైవర్నయ్యాను, ప్లారిడానుండి సామాన్లు రవాణచేసేవాన్ని. పేగన్స్ మోటారు సైకిల్ ముఠాతో ఇక చురుకుగా పాల్గొనేవాడినికాదు గానీ ఈసారి వర్జీనియా నుండి వస్తూ, 1969లో, ఆ పాత మిత్రులలో కొందరిని కలుసుకున్నాను. మేము త్రాగడం మొదలు పెట్టాము. మాదకద్రవ్యాలను అమితంగా తీసుకున్నాం. ఏదో గందరగోళం చెలరేగింది, పిచ్చెక్కిపోయినట్లయింది. ఆ మత్తులో మాదక ద్రవ్యాల నిషాలో నేనొకన్ని కాల్చి చంపాను. చెడు సాంగత్యములవల్ల ఎంతటి దుష్ఫలితం! ఆ తర్వాత ఇద్దరు నేర పరిశోధకులు నన్ను ప్రశ్నించారు, హత్యచేసినట్లు నేను ఒప్పేసుకున్నాను. ఇది 1970లో జరిగింది.
“నేను తీర్పు కొరకు వేచివుంటూ జైలులోనే వుంటిని, అయినా ఇంకా తిరుగుబాటుచేస్తూ కష్టంకల్గించేవాడిని. ఉదాహరణకు, ఒక రోజు ఉదయాన్నే కాఫీ తీసుకుని ఒక ట్రస్టీ (బాధ్యతలు ఇవ్వబడిన బంధి) వచ్చాడు. సాధారణంగా మరోసారి త్రాగడానికి ఓ కప్పు అదనంగా ఇచ్చేవారు. ఆ రోజు ఉదయం నేను రెండవ కప్పును చూపాను. అయితే అతడు ‘అదనంగా ఏమీలేదు’ అని అన్నాడు. నేననుకున్న దేమంటే అదనపు కాఫీని వేరేవారెవరికైనా ఇవ్వాలనుకున్నాడేమోనని. అప్పుడు నేను, ‘యీరోజు నీదగ్గర అదనంగా కాఫీ లేదంటావా?’ అని అడిగాను. అందుకతడు ‘అవును’ అని అన్నాడు. ‘సరే నాది కూడ తిరిగి తీసుకో’ అని దాన్ని అతని ముఖాని కేసి కొట్టాను. అప్పుడు నన్ను ఒంటరిగదిలో పడేశారు.
“అంచేత నేను ఆ కిటికీలేని 2.5 × 3 మీటర్ల ఇరుకైన ఏకాంత గదిలో ప్రదక్షిణాలు చేస్తూవున్నాను. జీవితంలో మొదటిసారి నేను నిజంగా ఆలోచించసాగాను. ప్రశ్నలు పరంపరలుగా వచ్చినవి. ‘నా జీవిత మెందుకు ఎప్పుడూ అంత గలిబిలితో వున్నది? నేనందుకు మాటిమాటికి జైలుకు వచ్చిపోతున్నాను? నేనెందుకు ఈ ఇరుకైన గదిలో వున్నాను? నేనెందుకు జీవిస్తున్నాను? ఎందుకు, ఎందుకు, ఎందుకు? ఎందుకనే ప్రశ్నేలే వస్తున్నవి గానీ జవాబులు రావడంలేదు. అప్పుడు నాలో నేనిలా అనుకున్నాను: ‘నేను’ దారి చివరిలో వున్నాను. ఇక వెళ్లడానికి మార్గమేలేదు. నన్ను చూడగలిగి, నేను జీవిస్తున్నానని ఎరిగి, నన్ను అర్థంచేసికునే దేవుడే ఉంటే—ఉన్నాడని నేను నిజంగా నమ్మను. దేవా, నీవున్నట్లయితే, నీవు నన్నెరిగివుంటే, నేను చెయ్యగలిగేదేమైనా ఉంటే—నాతో చెప్పు, ఏదోఒకటి, దేనినైన చెప్పు!’
“నా దగ్గర బైబిలు వుండేది. ‘అది ప్రారంభమనుకున్నాను.’ నేను చదువుట కారంభించాను. నేను చదివేది నాకు జ్ఞాపకములేదు. నేను చదివినట్లు జ్ఞాపకముంది, ఏమీ గ్రహించలేదు. ఒక వారం తరువాత బయటికి వచ్చాను. ఒక గది తెరచివుంది గానీ అందులోని రెండు పడకలు ఖాళీగానే వున్నవి. నన్నందులో వేశారు, రెండురోజుల తర్వాత మరో ఖైదీని నాతోపాటు అందులో వేశారు. ఆ సమయంలో నేను బైబిలు చదువుచూ వుంటిని అర్థంచేసుకోవడానికి కష్టపడేవాన్ని. నేను చదివేది చూచి అతడు ‘బైబిలును అర్థంచేసుకోవాలని నీ కిష్టమా?’ అని అడిగాడు. ‘అవునన్నాను!’ ‘నీకు సహాయంచేసే ఓ పుస్తకం నేను నీకు తెచ్చి ఇస్తాను’ అన్నాడు. ఒకనాడు అతనికి స్టడీ యిచ్చిన యెహోవా సాక్షులలో ఒకరిని అతడు కలుసుకొని ఆ వెంటనే నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని ఇచ్చాడు. అది 1970 జూలై నెల.
“నేను దాన్ని చదువుటకారంభించి, మొదటినుండి చివరి దాక చదివాను. నేను దాన్నంతా అర్థం చేసుకోలేక పోయాను గానీ కొంత భావాన్ని గ్రహించాను. యెహోవాసాక్షులు వచ్చి నాతో పఠనముచేసినపుడు ఆ ఇరుకైన ఏకాంతగదిలోనుండి నేనడిగే ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికింది. జీవితంలో మొట్టమొదటి సారిగా ఏది తప్పో, ఏది ఒప్పో గ్రహించగలిగాను. ఈ ఆత్మీయ ఆహారాన్ని ఎంత ఎక్కువ భుజిస్తే, అంత ఎక్కువగా నేను ‘అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్న’ వానివలె అయ్యాను. (హెబ్రీయులు 5:14) నా మనస్సాక్షి ఉత్తేజితమై, ఉజ్జీవం పొందుచుండెను!
“ఇలా అకస్మాత్తుగా బైబిలు జ్ఞానాన్ని పొందుట నా మానసిక స్థితికి నిజమైన మార్పుకలిగింది. ఆ పుస్తకాన్ని 24 గంటల్లో చదివేశాను. రాత్రికిరాత్రే విపరీతమైన మార్పులు చేసుకున్నాను. నేను నేర్చుకుంటున్న సత్యములను నాతోపాటు జైలునందున్న వారు గ్రహించాలని నేను ఆశించాను. నేను అమితానందం పొందినట్లే దాన్నిగూర్చి వారును పొందాలని నేననుకున్నాను. వారలా కాలేదు. ముందు నేను వారికి ఓ సమస్యగా పరిణమించాను, ఇప్పుడింకా ఆగ్రహానికి కారకుడనౌతున్నాను—అలా అవుతుందని వారెవరూ అనుకోలేదు. అయితే ఆ జిల్లా జైలుకు యెహోవాసాక్షులు వచ్చి నాతో పఠనము చేయుచుండగా నేను నా ప్రచారములో యింకా మెలుకువను ప్రదర్శించాను.
“నేనెన్నో మార్పులు చేసుకున్నాను, రెండు మాసాల్లోనే నేను నమ్మకస్థుడనయ్యాను. వారు నన్ను బయటికి వెళ్లనిచ్చేవారు, నా గత చరిత్రనుబట్టి, నేనెందుకు అక్కడికి వచ్చానో దాన్నిబట్టి చూస్తే అటువంటిది ఎన్నడూ జరుగలేదు. బైబిలునుండి నేను నేర్చుకుంటున్న సూత్రములు, వాటి ప్రభావమును బాహాటంగా చూపుచుండెను. దేవుని వాక్యములోని సత్యము యొక్క జలములు, అపొస్తలుల దినములలో వలె శుద్ధీకరించు పనిని చేయుచుండెను. వాటియొక్క పునరుజ్జీవన శక్తులు 1 కొరింథీయుల 6:9-11నందు యీ క్రింది విధముగా బయలు పరచబడుచున్నవి:
“‘అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను, దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారైయుంటిరి, గానీ. . .మీరు కడుగబడితిరి.’
“చివరకు నాకు తీర్పు చెప్పారు. హత్యచేసినందుకు నాకు 20 సంవత్సరముల జైలు శిక్ష విధించారు. 1971లో నన్ను అత్యంత భద్రతవున్న జైలుకు పంపించారు. అక్కడే మరల యెహోవా సాక్షులు నాకు బైబిలు పఠనాన్ని పునరుద్ధరించారు. నా ప్రవర్తనలో గొప్పమార్పు వచ్చింది. ఈ జైల్లో త్వరలోనే నన్ను వారు ఓ బాధ్యతగల వ్యక్తిగా చేశారు, సెలవులు మంజూరు చేసేవారు. అలా ఒకరోజు నేను ఎవరితోపాటు వున్నానో ఆ సాక్షితో ఇలా అడిగాను: ‘బాప్తిస్మం తీసుకొనుటకు నన్ను ఆటంకపరచేదేమిటి?’ ఆయన స్థానిక సంఘంతో సంప్రదించి ఇలా సమాధానమిచ్చాడు: ‘ఏమి లేదు.’ 1973లో ఓరోజు సాయంకాలం దగ్గర్లోవున్న తోటలో, ఆవు నీళ్లుత్రాగే తొట్టిలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. నీళ్లలోకి దిగుతూ ప్రార్థన చేసుకున్నాను, యేసు యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను చేత నీళ్లలో ముంచబడినపుడు ఆయన అలాగే చేశాడుగదా.
“అటుతర్వాత నా ఆత్మీయ పెరుగుదల చాలా త్వరగా జరిగిపోయింది. స్థానిక సంఘంలో నిర్వహించబడే దైవపరిపాలనా పాఠశాలకు వెళ్లకుండానే అందులో పాల్గొనేవాన్ని. పాఠశాలలో ప్రసంగాలు నాకు నిర్దేశించబడెను. నేను ప్రసంగాలను టేపుచేసి పంపిస్తే, సంఘంలో వినేవారు. పాఠశాల నడిపే సహోదరుడు నా అభివృద్ధినిమిత్తం సలహాలు వ్రాసి తిరిగి నాకు పంపించేవాడు. జైలులోనే కూటములు జరిపేవారు, ఇతర ఖైదీలు కూడ హాజరగుటకు ఆహ్వానింపబడేవారు.
“ఈ కూటములనుండి నేర్చుకున్న లేఖనములను నాకున్న బైబిలు జ్ఞానమునకు జతచేసేవాడిని. అవి నన్ను అవినీతి స్థితినుండి దూరంగా పోవుటకు మెట్లుగా పనిచేసినవి. కొలొస్సయులకు 3:9,10 లో అపొస్తలుడైన పౌలు తెల్పిన మార్పును గూర్చి నేను గుణగ్రహించేవరకు నా జీవితంలో అధికభాగం అట్టి అవినీతిలోనే గడిపాను. ‘ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొనుడి.’
“తరువాత 1978లో మూడవసారి పరోల్ అధికారుల ఎదుటికి రావలసివచ్చింది. తీవ్రనేరమునుబట్టి రెండు సార్లు నా విన్నపమును త్రోసిపుచ్చారు. ఈసారి యెహోవాసాక్షుల నుండి ఇతరుల నుండి 300 వరకు ఉత్తరాలు వచ్చినవి. నాలోవచ్చిన మార్పులను గూర్చి అవి సాక్ష్యమిచ్చినవి.
“నేను విడుదలయ్యే అవకాశాలు మెరుగైనట్లు కనబడుచున్నందున, వివాహం చేసుకుందామనే తలంపు కల్గింది. ఇద్దరు పిల్లలు కల్గియున్న ఆర్లిన్ అనే ఆమె ఒక యెహోవాసాక్షి, ఆమె నేను జైల్లో ఉండగా నాకు ఉత్తరాలు వ్రాసేది. ఆమె తన ఇద్దరు కుమారులతోపాటు వచ్చి నన్ను దర్శించేది. నేను ఆమెను ప్రేమించాను, నన్నామె ప్రేమించింది. నేను ఫిబ్రవరి 1, 1978లో విడుదలయ్యాను. మేము ఫిబ్రవరి 25, 1978లో పెండ్లిచేసుకున్నాము. ఇప్పటికి 13 సంవత్సరాల తర్వాతకూడ మా సంసారం సంతోషంగా సాగుతుంది. మా కుమారులలో ఒకరికి వివాహమైంది, యెహోవాసాక్షిగా చురుకుగా వున్నాడు. రెండవ కుమారుడు న్యూయార్క్‌లోని బ్లూక్లిన్‌లో వున్న యెహోవాసాక్షుల ప్రధానకార్యాలయంలో పూర్తికాల సేవకునిగా పనిచేస్తున్నాడు.
“నా ప్రార్థనలు ఆలకించబడినవి. నాకెంతో సహాయం అందించిన సహోదరీ సహోదరులకు నేను కృతజ్ఞుడను. నా ఆనందానికి శ్రీమంతుడగు యెహోవా దేవునికే రుణపడియున్నాను.—1 తిమోతి 1:11.
“అయినను, గతపాపముల విషయంలో నేను విచారం వ్యక్తంచేస్తున్నాను. నీచమైన నా ప్రాచీన ప్రవర్తనను అసహ్యంగా ఎంచుతున్నాను. నన్ను క్షమించుమని నేను యెహోవాకు ఎన్నోసార్లు ప్రార్థించాను. నన్నాయన క్షమించాడని నేననుకుంటున్నాను. గతంలో నేనెవరికి ద్రోహం చేసానో వారు కూడ నన్ను క్షమించగలరని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చంపిన వ్యక్తిని యెహోవా బ్రతికించి, దేవుని పరదైసు భూమిలో నిరంతరం జీవించే తరుణమిస్తాడని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు నా సంతోషం పరిపూర్ణమౌతుంది!”
జైలు కటకటాలు, ఒంటరి జైలుశిక్ష చేయలేనిదాన్ని బైబిలు సత్యం చేసింది. రాన్ ప్రాయర్ తన ప్రాచీన నేర ప్రవృత్తిగల వ్యక్తిత్వమును మార్చుకొని నూతన క్రైస్తవ వ్యక్తిత్వమును ధరించుటకు అది సహాయపడింది. ఎందుకు? ఎందుకనగా “దేవుని వాక్యము సజీవమై బలముగలదైయున్నది,” పునరుజ్జీవింప చేయగల బలముగలదైయున్నది.—హెబ్రీయులు 4:12 (g91 7/22)
[11వ పేజీలోని చిత్రం]
జడ్జి జెంకిన్స్ ట్రక్కునే నేను దొంగిలించినది!
[12వ పేజీలోని చిత్రం]
ఆ ఇరుకుగదిలో ఓ బైబిలుండెను దాన్ని నేను చదువుట కారంభించాను
[12వ పేజీలోని చిత్రం]
హత్య చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు
[13వ పేజీలోని చిత్రం]
ఇప్పుడు, రాన్ ప్రాయర్ అతని భార్య ఆర్లిన్