యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను బాప్తిస్మము తీసికొనవలెనా?
పదమూడు-ఏండ్ల సూసానా యెహోవాసాక్షుల సమావేశానికి ఆఖరి సారిగా తాను హాజరయ్యేటప్పటికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ అమ్మాయి అంతిమ ఘడియల్లో వుంది. ఇక పదిరోజులకు తాను మృత్యువాత పడనైయున్నదని తనకు తెలియదు. అయిననూ, తన ప్రియమైన కోరికను తీర్చుకొనుటకు క్యాన్సర్ సహితం ఆపలేక పోయింది: అదే యెహోవా సమర్పిత సాక్షిగాను యేసుక్రీస్తుకు శిష్యురాలిగానుండుటకై బాప్తిస్మము తీసుకొనుటే.
ఇటీవలి కాలములో బాప్తిస్మము పొందే అధిక్యతను ప్రియమైనదిగా ఎంచిన యెహోవాసాక్షులలో వేలాదిమంది యవ్వనస్థులలో సూసానా ఒకతె. అయితే అటువంటి ధైర్యముతోకూడిన స్థానమును చేపట్టుట నీకు భయంకరంగా కనిపించవచ్చును. నీవు నేర్చుకున్న బైబిలు-ఆధారిత సత్యములయందు నీకు విశ్వాసములేదని కాదు. నీవు క్రైస్తవకూటములకు క్రమంగా వస్తూవుండవచ్చును, ఇతరులకు సత్యములను గూర్చితెలిపే సేవలో క్రమంగా పాల్గొంటూ వుండవచ్చును. అయిననూ, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవలసి వచ్చినప్పుడు నీవు వెనుకాడ వచ్చును. మరి బాప్తిస్మమెంత ప్రాముఖ్యమైనది? అనేకమంది యవ్వనస్థులెందుకు దానినుండి వెనుకంజవేస్తున్నారు?
సమర్పణలేని మతము
క్రీస్తుమతసామ్రాజ్యములో యవ్వనస్థుల బాప్తిస్మమును గూర్చిన ప్రశ్నకు తరచు వారి తల్లిదండ్రులే సమాధానం చెపుతూ వుంటారు. కొన్ని శాఖలైతే పసితనములోనే వారిపిల్లలకు బాప్తిస్మమియ్యవచ్చునని తలిదండ్రులను ప్రోత్సహిస్తున్నవి. ఒక వేళ పెద్దవారయ్యేంతవరకు బాప్తిస్మము తీసికొనకపోతే, సాధారణంగా యవ్వనస్థులు ఇక వారిష్టంకాకుండ వారి తల్లిదండ్రుల మతాభీష్టం చొప్పున నడుచుకోవాలని కోరబడతారు.
అయితే ఆసక్తికరమైన విషయమేమంటే, అమెరికాలో చేసిన ఒక సర్వేలో “దేవుడున్నాడని యవనస్థులంతా (96 శాతం) నమ్మినప్పటికీ,” 39 శాతమే తరచూ ప్రార్థించేవారని తేలింది. మరి 52 శాతం ఒక సంస్థీకరించబడిన మతమునందు విశ్వసిస్తున్నట్లు కనబడింది. అందుకే డయాన్ అనే చిన్నది చక్కగా ఇలా అంటుంది: “దేవున్ని నమ్ముతాను, అదంతా వుంది, గానీ బైబిలులోని ప్రతి వాక్యాన్ని చదివే బదులు మంచి వ్యక్తిగా మసలు కొనుటకు ప్రయత్నించడమే నేనెక్కువ నమ్ముతాను.”
అవును, మతాన్ని తమ తలిదండ్రులు యవ్వనస్థుల మీద రుద్దితే, నిజానికి అదొక బలహీనమైన శక్తి కావచ్చును. కాథొలిక్ బాలనేరస్థుల గుంపుతో చేసిన అధ్యయనము దీన్నింకా బలపరుస్తుంది. వారిలో సగం మంది చర్చికి వెళ్లిన వారే. వారిలో చాలా మంది వారి విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతములను ఎరిగియున్నవారే. వారిలో 90 శాతంమంది దొంగతనాన్ని తప్పంటున్నారు. అయిననూ, వారిలో మూడు భాగాలు దొంగలే! అడోలసెంట్ అనే పుస్తకమిలా గమనించింది: “కుర్రాడు మతం విషయంలో నామమాత్రంగానే వుండుట ఒక కారణమైయుండవచ్చును. అందరు కేథొలిక్స్‌గానే జన్మించారు; వాళ్ల తలిదండ్రులే వారికి మతాన్ని నేర్పించారు. వారి మతం వారి సొంతంది కాదు.
బాప్తిస్మం—ఎందుకు ఒక క్రైస్తవ అవసరత
గనుక దేవునికి వ్యక్తిగతంగా సమర్పించుకునేది నీవే గానీ—నీ తలిదండ్రులు కాదని బైబిలు సహేతుకంగా కోరుతుంది.a ‘సరే, మంచిదే, సమర్పణ అనేది నాకు దేవునికి మధ్యవుండే వ్యక్తిగత విషయమైతే ఇక నేనెందుకు బాప్తిస్మము తీసుకోవాలి’ అని నీవనవచ్చును.
ఎందుకంటే బాప్తిస్మములో ‘నీ ఆత్మరక్షణ’ ఇమిడివుంది. (1 పేతురు 1:9) “దేవుని నెరుగని వారికిని ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయు నప్పుడు . . . అట్టివారు నిత్య నాశనమను దండన పొంద” వలెనని దేవుని సంకల్పమైయున్నది. (1 థెస్సలొనీకయులు 1:8, 9) మనకాలములోనే ఈ నాశనము రాబోవుతున్నదని సూచనలన్నియు తెల్పుచున్నవి.b
అయిననూ, “అందరు రక్షణ పొందవలెనని” యే దేవుని చిత్తము. (1 తిమోతి 2:4) నీవు ఈ విధానాంతాన్ని తప్పించుకొని భూ పరదైసులో నిత్యం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (ప్రకటన 21:3, 4) అయితే నీవు సువార్తకు లోబడియున్నావని నిన్ను నేవెలా కనబరచుకోగలవు? నీవు నేర్చుకున్న బైబిలు సత్యాలను నమ్మితే మాత్రం సరిపోదు, లేక తల్లిదండ్రుల వెంట క్రైస్తవ కూటములకు హాజరైతే సరిపోదు. (యాకోబు 2:19 తో పోల్చుము) రక్షణ నపేక్షించువారు తమ్ముతాము దేవునికి సమర్పించుకుని ఆయని చిత్తాన్ని చేయాలి. అపొస్తలుడైన పౌలు రోమా 12:1 లో ఇలా చెబుతున్నాడు: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను (“సమర్పణగా” అని ది న్యూ ఇంగ్లీషు బైబిలులో వుంది) ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”
అయితే సమర్పణ ఖచ్చితంగా స్వవిషయంవలె నిలిచివుండదు. మరి సమర్పించుకున్న, భక్తిగల వ్యక్తి నిజంగా ఎలా రహస్య శిష్యుడైవుంటాడు? (యోహాను 19:38) నీ స్నేహాన్ని రహస్యంగా వుంచాలనుకునే స్నేహితున్ని నీవు నమ్ముతావా? గనుక దేవుడు కోరుకునేదేమంటే అందరూ ‘రక్షణను గూర్చి బహిరంగముగా ఒప్పుకోవాలి.’ (రోమా 10:10) ఇది బాప్తిస్మముతో ప్రారంభమౌతుంది. ఆ సమయంలో, ఒకని విశ్వాసాన్ని నోటితో ప్రకటిస్తాడు తదుపరి నీళ్లలో బాప్తిస్మము తీసుకుంటాడు. (మత్తయి 28:19, 20) అయితే, నీళ్లలో పూర్తిగా ముంచబడుటలో విలువేమిటి?
బాప్తిస్మము కేవలము స్నానంవంటిది కాదు; అదొక సాదృశ్యమగు మరణము. నీవు బాప్తిస్మమిచ్చు నీళ్లలోనికి మునిగినపుడు నీవు నీ పాత జీవితంలో చనిపోయినట్లు నీకు జ్ఞాపకం చేస్తుంది. గతంలో నీకున్న ఆశలు, కోరికలు నీ జీవితంలో ప్రథమ స్థానంవహించెను. అయితే తన శిష్యులు ‘తమను తాము ఉపేక్షించుకొనవలెనని’ యేసు చెప్పాడు. (మార్కు 8:34) గనుక, నీవు నీళ్లలోనుండి బయటికి తీయబడినపుడు దేవుని చిత్తాన్ని చేయుటకు నీవిప్పుడు జీవిస్తున్నావని నీకది జ్ఞాపకం చేస్తుంది. బహిరంగముగా, ధైర్యముగా చేసే ఈ క్రియ, రక్షణకు గుర్తింపబడిన వ్యక్తిగా నీకిది ఒక ప్రాముఖ్యమైన గురుతుగా నిలుస్తుంది.—యెహెజ్కేలు 9:4-6; 1 పేతురు 3:21.
‘నేను బహిష్కరించబడతానేమోనని భయపడుతున్నాను’
బాప్తిస్మము అంత ప్రాముఖ్యమైతే మరి కొందరు యవ్వనస్థులెందుకు తీసుకొనకుండ వెనుకాడుతున్నారు? మేల్కొలుపు! సంపాదకులు అదే ప్రశ్నను అనేకమంది క్రైస్తవ యవ్వనస్థులను అడిగారు. ఒక అమ్మాయి ఇలా అన్నది: “వారు బాప్తిస్మము పొందకపోతే వారికి చాలా స్వేచ్ఛ దొరుకుతుందని చాలమంది అనుకుంటున్నారు. వారు కష్టాల్లో ఇరుక్కుపోతే అంత బాధ్యత వారిపై ఉండదని వారి భావన.” రాబర్ట్ అనే కుర్రాడు ఈ వ్యాఖ్యానాన్ని ప్రతిధ్వనిస్తూ ఇలా అంటున్నాడు: “దానిలోనుండి ఇక వెనక్కురాకుండ అది వారిని కట్టివేసే చివరి మెట్టు కాబట్టి చాలమంది యవ్వనస్థులు బాప్తిస్మం తీసికొనుటకు వెనుకాడుచున్నారని నేననుకుంటున్నాను. ఏదైనా తప్పుచేస్తే వారు సంఘమునుండి వెలివేయబడతారని వారనుకుంటున్నారు.”
నిజమే దేవునికి సమర్పించుకున్న వ్యక్తి వెనక్కి వెళ్లలేడు. (ప్రసంగి 5:4) తనను తాను దేవునికి సమర్పించుకునే వ్యక్తి గంభీరమైన బాధ్యతను తీసుకుంటున్నాడు. అతడుగాని ఆమెగానీ “అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను.” (కొలొస్సయులకు 1:10) గంభీరమైన పాపంలో పడు వ్యక్తి క్రైస్తవ సంఘ బహిష్కరణకు కూడా గురి కావలసివస్తుంది.—1 కొరింథీయులకు 5:11-13.
అయితే, బాప్తిస్మం తీసుకోనంత కాలం ఏదైనా చెల్లుతుందని అనుకోలేడు. ఎందుకంటే, “మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును”—బాప్తిస్మం పొందినా, పొందకపోయిననూ. (యాకోబు 4:17) ఒకడు సంఘ బహిష్కరణ తప్పించుకోవచ్చునేమో గానీ దేవుని తీర్పును తప్పించుకోలేడు. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును,” అని పౌలు హెచ్చరిస్తున్నాడు.—గలతీయులకు 6:7.
బహిష్కరించబడే భయము తరచూ తప్పుచేసే అలవాటుగల రహస్యకోరికను కప్పిపుచ్చునట్లు చేస్తుంది. నటాలీ అనే పేరుగల ఒక యవ్వనస్థురాలు దాచకుండా ఇలా చెప్పింది: “నేను సాతాను లోకములోనే పెరిగాను, అదెలాంటిదో నాకు తెలుసు. అయితే చాలామంది యవ్వనస్థులు అందులోనికి వెళ్లి అక్కడేముందో చూడాలని ఉబలాట పడుతున్నారు.” చెడుకోరికలు నిన్ను బాప్తిస్మం తీసుకొనకుండ అడ్డగించే బదులు—లేదా ఆ కోరికలే చెడుక్రియగా మారుటకనుమతించే బదులు—బహుశా తల్లిదండ్రులతో గాని ఒక క్రైస్తవ పెద్దతోగాని మాట్లాడి సహాయమెందుకు పొందకూడదు?—యాకోబు 1:14, 15.
నిజానికి, సాతానులోకం అందించే స్వేచ్ఛ ఒక ఊహాప్రపంచమే. తన కాలములో మోసగించబడిన వారిని గూర్చి అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగునుగదా.” (2 పేతురు 2:19) ఇతరులు నీ తలంపులను, ప్రవర్తన, నైతికలక్షణాలను నడిపించుట నిజంగా స్వాతంత్ర్యమనబడుతుందా? రోగం, అవమానం, ఆఖరకు మరణమునకు నడిపించే క్రియలు చేయుట నిజంగా స్వాతంత్ర్యమనబడుతుందా?—సామెతలు 5:8-14.
హిటోషి అనే జపాను కుర్రాడు అవే ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. అతడు క్రైస్తవ తలిదండ్రుల దగ్గర పెరిగాడు, ఇలా జ్ఞాపకం చేసుకొంటున్నాడు. “ఇతర పిల్లలు ఆడుకుంటూవుంటే నేను కూటములకు వెళ్లవలసి వచ్చేది. నాకింకా స్వేచ్ఛ కావాలనిపించింది. నేనేదో పోగొట్టుకుంటున్నట్లనిపించింది. అవును, కీర్తన రచయిత ఆసాపువలె ఆ కుర్రాడు చెడుక్రియలుచేసేవారిని చూచి “మత్సర” పడ్డాడు. (కీర్తన 73:2, 3) అయితే దీన్ని గూర్చి ప్రశాంతంగా తలంచిన తర్వాత హిటోషి భావాలు మారిపోయినవి. అతడిట్లనుచున్నాడు: “సత్యములేకుండా నాజీవితమెలా వుంటుందో నేను గుర్తించాను—70 లేక 80 సంవత్సరములు జీవించిన తర్వాత చనిపోతాననే విషయాన్ని నేను గ్రహించగలను. కానీ యెహోవా యొద్ద నిత్యజీవమున్నది.” అట్లు హిటోషి దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం పొందాడు.—కీర్తన 73:19-28 పోల్చుము.
నీవును అలాగే చేయాలనుకుంటున్నావా? డేవిడ్ అను పేరు గల ఒక కుర్రాడు అలాగే చేశాడు. అతడిట్లు జ్ఞాపకము చేసుకుంటున్నాడు: “యవ్వనస్థునిగా బాప్తిస్మం తీసుకొనుట నాకు రక్షణ కవచముగావుంది . . . బాప్తిస్మం తీసుకొనని కుర్రాళ్లు సంఘ పెద్దల అధికారం క్రింద లేకుండా, స్వేచ్ఛగా వున్నారని అనుకొని, చెడు ప్రవర్తనకు దిగారు. కానీ నాజీవితాన్ని నేను దేవునికి సమర్పించుకున్నానని నేనెప్పుడూ జ్ఞాపకముంచుకున్నాను.” నీవును ఆ చర్య తీసికొనుటకు సిద్ధంగా వున్నావో, లేదో బహుశా నీకు ఖచ్చితంగా తెలియక పోవచ్చును. రాబోవు శీర్షికలో నీకు సహాయపడు సమాచారము అందించబడును. (g90 3/22)
[13వ పేజీలోని చిత్రాలు]
దేవునిని ఆరాధించు నిర్ణయం వ్యకిగతముగా చేయవలను. బాప్తిస్మం ద్వారా నీవు యేసుక్రీస్తు యొక్క సమర్పిత శిష్యునిగా గుర్తించును.
[అధస్సూచీలు]
a పసిపిల్లల బాప్తిస్మములోని అజ్ఞానాన్ని గూర్చి “షుడ్ బేబీస్ బి బాప్‌టైజ్డ్” అనే శీర్షిక 1986, మార్చి 15, వాచ్‌టవర్ లో చర్చించబడింది.
b మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు లోని 18 వ అధ్యాయము చూడండి. (దీనిని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ప్రచురించింది)