అప్రమత్తంగా ఉండండి!
ద్వేషం వల్ల జరిగే దారుణాలు ఆగుతాయా?—బైబిలు ఏం చెప్తుంది?
విచారకరంగా, ద్వేషం వల్ల జరిగే దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం జాతి, మతం, ప్రాంతం, కులం పేరుతో ప్రజల్ని ద్వేషిస్తూ వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. దానివల్ల ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు, వాళ్ల శరీరాలకు-మనసులకు మానని గాయాలు అవుతున్నాయి, ఆఖరికి కొందరు చనిపోతున్నారు కూడా.
మన కాలంలో “క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు,” “మమకారం లేనివాళ్లు” ఉంటారని బైబిలు ఎప్పుడో చెప్పింది. (2 తిమోతి 3:1-5) మరి, ద్వేషం వల్ల జరిగే దారుణాలు ఎప్పటికైనా ఆగుతాయా? దీని గురించి బైబిలు ఏం చెప్తుంది?
ద్వేషం వల్ల జరిగే దారుణాలు ఎలా ఆగుతాయి?
దేవుడు ఆ దారుణాల్ని ఆపగలడని, ఖచ్చితంగా ఆపుతాడని బైబిలు మాటిస్తుంది.
“చెడ్డవాళ్లు నాశనమౌతారు . . . అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.” (కీర్తన 37:9-11) క్రూరులు ప్రజలకు హాని చేస్తుంటే, దేవుడు చూస్తూ ఊరుకోడు.
“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.” (ప్రకటన 21:4) ప్రజల శరీరాలకు, మనసులకు తగిలిన గాయాల్ని వాటి ఛాయలు కూడా లేకుండా దేవుడు పూర్తిగా మాన్పుతాడు.
“దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.” (అపొస్తలుల కార్యాలు 24:15) ద్వేషానికి బలైనవాళ్లతో సహా, లక్షలమందిని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.
ఇప్పుడు ద్వేషాన్ని ఎలా తీసేసుకోవచ్చు లేదా తట్టుకోవచ్చు?
ముందుముందు రోజుల్లో ద్వేషం ఉండదని చెప్పడమే కాకుండా, ఇప్పుడు ద్వేషాన్ని ఎలా తీసేసుకోవచ్చో లేదా తట్టుకోవచ్చో కూడా బైబిలు చెప్తుంది. కిందున్న ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని తెలుసుకోమని మిమ్మల్ని ప్రేమగా అడుగుతున్నాం:
హింసకు దారితీసే ద్వేషాన్ని తీసేసుకోవడానికి మనం ఇప్పుడు ఏం చేయవచ్చు? “ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం” అనే కావలికోట పత్రికలో బైబిలు ఏం చెప్తుందో చూడండి.
దేవుడు ఇన్ని బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడు? దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు? అనే వీడియో చూసి, బైబిలు ఇచ్చే స్పష్టమైన జవాబేంటో తెలుసుకోండి.