యెహోవాసాక్షులు వాళ్ల నమ్మకాలకు సరిపోయేలా బైబిలును మార్చుకున్నారా?
లేదు. మేము అలా మార్చలేదు. బదులుగా మా నమ్మకాలు బైబిలుకు తగ్గట్టుగా లేనప్పుడు మేము మా నమ్మకాలనే మార్చుకున్నాం.
1950లో పరిశుద్ధ లేఖనాల కొత్త లోక అనువాదం బైబిలును తయారు చేయడం మొదలు పెట్టకముందే మేము బైబిలును జాగ్రత్తగా పరిశీలించాం. అప్పుడున్న బైబిలు అనువాదాల నుండే మేము మా నమ్మకాలు ఏర్పర్చుకున్నాం. ఎంతోకాలం నుండి యెహోవాసాక్షులు నమ్ముతున్న విషయాల్లో కొన్ని చూడండి. అవి బైబిలు ప్రకారం ఉన్నాయో లేదో మీరే నిర్ణయించుకోండి.
మేము ఏం నమ్ముతామంటే: దేవుడు త్రియేక దేవుడు కాదు. జూలై 1882 జాయన్స్ వాచ్ టవర్ ఇలా అంటుంది: “మేము యెహోవాను, యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాము. కానీ ఈ ముగ్గురూ కలిపి ఒకే దేవుడు అన్నా, ఒక దేవుడిలో ముగ్గురు ఉన్నారు అన్నా బైబిలుకు విరుద్ధం కాబట్టి ఆ విషయాన్ని పూర్తిగా తిరస్కరిస్తాము అని మా పాఠకులకు తెలుసు.”
బైబిల్లో ఏముంది: ‘మన దేవుడైన యెహోవా ఒక యెహోవా.’ (ద్వితీయోపదేశకాండం 6:4, రాబర్ట్ యంగ్ అనువదించిన, పరిశుద్ధ బైబిల్) ‘ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన వల్ల సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.’ (1 కొరింథీయులు 8:6, అమెరికన్ బైబిల్ యూనియన్ వర్షన్) యేసే ఇలా అన్నాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు.”—యోహాను 14:28.
మేము ఏం నమ్ముతామంటే: నరకంలో నిత్యయాతన ఉండదు. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో రోమీయులు 6:23ను చూపిస్తూ జాయన్స్ వాచ్ టవర్ జూన్ 1882లో వచ్చిన “పాపము వలన వచ్చు జీతము మరణము” అనే అంశంలో ఇలా ఉంది. “ఇక్కడ ఉన్న ఈ మాటలు ఎంత సూటిగా స్పష్టంగా ఉన్నాయి! కానీ బైబిలు దేవుడు ఇచ్చిన వాక్యం అని నమ్మే చాలామంది ఈ మాటల్ని తప్పు అనడం ఎంత విచిత్రం! వాళ్లు, పాపము వలన వచ్చు జీతము నిత్యం బ్రతికి ఉండి నిత్యయాతన పడడం అని గట్టిగా నమ్ముతాం అంటారు, అదే బైబిలు చెప్తుందని గట్టిగా వాదిస్తారు.”
బైబిల్లో ఏముంది: “ఏ వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు.” (యెహెజ్కేలు 18:4, 20) దేవునికి ఎదురు తిరిగే వాళ్లకి వచ్చే చివరి శిక్ష నిత్యయాతన కాదు గానీ “శాశ్వత నాశనం.”—2 థెస్సలొనీకయులు 1:9.
మేము ఏం నమ్ముతామంటే: దేవుని రాజ్యం నిజంగా పరిపాలించే ప్రభుత్వం, మన హృదయ స్థితి కాదు. దేవుని రాజ్యం గురించి డిసెంబరు 1881, జాయన్స్ వాచ్ టవర్లో ఇలా ఉంది. ‘దేవుని రాజ్యం స్థాపించబడ్డాక, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు పడిపోతాయి.’
బైబిల్లో ఏముంది: “ఆ రాజుల కాలాల్లో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు. అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దానియేలు 2:44.
తమ నమ్మకాలను నిరూపించుకోవడం కోసం యెహోవాసాక్షులు కొత్త లోక అనువాదం బైబిలు మీద ఆధారపడతారా?
లేదు, మేము పరిచర్యలో చాలా రకాల బైబిలు అనువాదాలను ఉపయోగిస్తాం. బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు మేము ఉచితంగా కొత్త లోక అనువాదం బైబిలును ఇస్తాం. కానీ, వేరే బైబిలు అనువాదం ఉపయోగించాలనుకున్న వాళ్లకు కూడా మేము ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా బైబిలు స్టడీ చేస్తాం.