రాజకీయ గందరగోళం—బైబిలు ప్రవచనాన్ని నెరవేరుస్తోంది
నేడు ప్రజలకు రాజకీయ విషయాల్లో వేర్వేరు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్లు వాటిని ఖరాఖండిగా బయటికి చెప్పేస్తున్నారు. అలాగే రోజువారీ జీవితంపై ప్రభావం చూపించే చట్టాలు, రూల్స్ విషయంలో కూడా అందరికీ ఒకే ఆలోచన లేదు. ఇక ప్రభుత్వాల్లోనేమో ఈ చట్టాలు తయారుచేసేవాళ్లు, ఇతర అధికారులు ఒకరి అభిప్రాయాల్ని ఒకరు పట్టించుకోరు, రాజీపడడానికి అస్సలు ముందుకురారు. వీటివల్ల చివరికి రాజకీయ గందరగోళం ఏర్పడి, ప్రభుత్వాలు అనుకున్నవి చేయలేకపోతున్నాయి.
అలాంటి గందరగోళమే అమెరికాలో, బ్రిటన్‌లో కనిపిస్తోంది. దాని గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే భూమ్మీద పరిస్థితుల్ని మార్చడానికి దేవుడు పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని స్థాపించే సమయంలోనే, ఈ రెండు దేశాల్లో రాజకీయపరమైన గందరగోళం ఉంటుందని బైబిలు ముందే చెప్పింది.
“చివరి రోజుల్లో” ఉండే రాజకీయ గందరగోళం
బైబిల్లోని దానియేలు పుస్తకంలో ఒక ఆసక్తికరమైన ప్రవచనం ఉంది. ఆ ప్రవచనంలో దేవుడు ‘చివరి రోజుల్లో ఏం జరగబోతుందో’ చెప్తున్నాడు. దానియేలు తన కాలం గురించి కాదుగానీ, భవిష్యత్తు గురించి, అంటే మనుషుల చరిత్రను మార్చేసే ఒక సమయం గురించి రాశాడు.—దానియేలు 2:28.
దేవుడు ఆ ప్రవచనాన్ని ఒక కలలో బబులోను రాజుకు చూపించాడు. ఆ కలలో, రాజుకు ఒక పెద్ద విగ్రహం లేదా ప్రతిమ కనిపించింది. అది వేర్వేరు లోహాలతో తయారు చేయబడింది. తల నుండి పాదాల వరకు ఆ ప్రతిమలోని భాగాలు, చరిత్రలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత నాశనమైపోయే కొన్ని ప్రపంచాధిపత్యాల్ని సూచిస్తున్నాయని దానియేలు ప్రవక్త చెప్పాడు.a చివరికి, దేవుడు స్థాపించిన ప్రభుత్వానికి సూచనగా ఉన్న ఒక రాయి, ఆ ప్రతిమను ఢీకొని దాన్ని నాశనం చేస్తుంది.—దానియేలు 2:36-45.
ఈ ప్రవచనం ప్రకారం, మానవ ప్రభుత్వాల స్థానంలో దేవుని రాజ్యం వస్తుంది. “నీ రాజ్యం రావాలి” అని యేసు తన అనుచరులకు ప్రార్థించమని నేర్పించినప్పుడు, ఆయన ఈ రాజ్యం గురించే మాట్లాడాడు.—మత్తయి 6:10.
కానీ ఈ ప్రవచనంలో రాజకీయ గందరగోళం గురించి బైబిలు ఎక్కడ మాట్లాడుతుంది? ఆ ప్రతిమ పాదాలు “కొంతభాగం ఇనుపవి, కొంతభాగం బంకమట్టివి” అనే మాటల్ని గమనించండి. (దానియేలు 2:33) ప్రతిమలోని మిగతా భాగాలన్నీ ఒక్కో లోహంతో తయారుచేయబడ్డాయి. కానీ, పాదాలు మాత్రం రెండు వేర్వేరు పదార్థాలతో కలిపి ఉన్నాయి. అలా ఆ ప్రపంచాధిపత్యం మిగతా వాటికన్నా వేరుగా ఉంటుందని అర్థమౌతుంది. ఏ విధంగా? దానియేలు ప్రవచనం ఇలా వివరిస్తుంది:
కాబట్టి ఈ ప్రవచనం ప్రకారం, ప్రతిమ పాదాలకు సూచనగా ఉన్న ప్రపంచాధిపత్యంలో రాజకీయ గందరగోళం ఉంటుంది. దానికి ఉన్న శక్తి, దాని ప్రజల వల్లే నీరుగారిపోతుంది, అదంత బలంగా ఉండదు.
మనకాలంలో దానియేలు ప్రవచనం నెరవేరుతోంది
ఆ ప్రతిమ పాదాలు, మనకాలంలోని శక్తివంతమైన ఒక ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్నాయి. అదే, ఒకరితో ఒకరు చేతులు కలిపిన అమెరికా-బ్రిటన్ ప్రభుత్వాలు. దేన్నిబట్టి అలా చెప్పవచ్చు?
ఆ ప్రతిమలోని పాదాలు ‘కొంతభాగం ఇనుముతో, కొంతభాగం బంకమట్టితో’ తయారుచేయబడ్డాయి. ఈ రెండు పదార్థాలు కలవవు కాబట్టి ఆ పాదాలకు అంతగా బలం ఉండదు. (దానియేలు 2:42) ఇప్పుడు, అమెరికా-బ్రిటన్ దేశాల పరిస్థితి కూడా అలానే ఉంది, ఎందుకంటే అక్కడి ప్రజల్లో ఐక్యత లేదు. ఉదాహరణకు ఈ దేశాల్లోని ప్రజలు, గుంపులుగా ఏర్పడి వాళ్లలో వాళ్లు గొడవపడుతున్నారు. వాళ్లు తమ హక్కుల కోసం పోరాడుతూ, ధర్నాలు చేస్తూ, ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజలు ఎంచుకున్న నాయకులు చాలా విషయాల్లో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇన్ని విభజనలు ఉండేసరికి ఆ రెండు దేశాల ప్రభుత్వాలు తాము చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాయి.
ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుందో దానియేలు 2 అధ్యాయం ముందే చెప్పింది.
దానియేలు ప్రవచనంలోని కొన్ని వివరాల అర్థం ఏంటో, అవి ఇప్పుడు ఎలా నిజమౌతున్నాయో తెలుసుకుందాం:
ప్రవచనం: “ఆ రాజ్యం ఐక్యంగా ఉండదు; కానీ . . . దానిలో ఇనుములోని గట్టిదనం కొంతవరకు ఉంటుంది.”—దానియేలు 2:41.
దానర్థం: అంతర్గతంగా అమెరికా-బ్రిటన్ ప్రభుత్వాల్లో ఎన్ని గొడవలున్నా, వాళ్ల సైనిక బలం చాలా గొప్పది. ఆ బలంతోనే అవి లోకం మీద ఇనుము లాంటి అధికారం చెలాయిస్తున్నాయి.
ఆ ప్రవచనం నెరవేర్పు
2023లో, మిలిటరీ కోసం ఒక్కో దేశం ఎంత ఖర్చుపెట్టిందో తెలిపే లిస్టు తయారుచేశారు. దాని ప్రకారం, అమెరికా-బ్రిటన్ ప్రభుత్వాలు కలిపి ఖర్చుపెట్టిన డబ్బుల్ని చూస్తే, అది ఆ లిస్టులో తర్వాతి స్థానాల్లో ఉన్న 12 దేశాల ఖర్చు అంతటిని కలిపినా దానికంటే చాలా ఎక్కువ అని తెలుస్తుంది.—స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్.
‘మిలిటరీ పరంగా అమెరికా-బ్రిటన్ దేశాల మధ్యున్న పార్ట్‌నర్‌షిప్‌కు వేరే ఏ దేశాలు సాటిరావు. మేము కొత్తకొత్త టెక్నాలజీలను, ఐడియాలను వాడతాం. మేము కలిసి పనిచేస్తాం, కలిసిమెలిసి ఉంటాం, కలిసి పోరాడతాం.’—బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఏప్రిల్ 2024.
ప్రవచనం: “పాదాల వేళ్లు కొంతభాగం ఇనుపవిగా, కొంతభాగం బంకమట్టివిగా ఉన్నట్టే, ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా మరో విషయంలో బలహీనంగా ఉంటుంది.”—దానియేలు 2:42.
దానర్థం: అమెరికా అలాగే బ్రిటన్ ప్రభుత్వాలకు సైనిక బలం చాలా ఉన్నా, వాళ్లది ప్రజాస్వామ్య పరిపాలన (democracy) కాబట్టి ఏం చేయాలనుకున్నా వాళ్లకు తప్పకుండా ప్రజల అనుమతి ఉండాలి. ఏదైనా ఒక విషయంలో ఎక్కువశాతం మంది ఒప్పుకోకపోతే, ఇక ప్రభుత్వం చేతులు కట్టేసినట్టు అవుతుంది.
ఆ ప్రవచనం నెరవేర్పు
‘అమెరికా రాజకీయాల్లోని విభజనల వల్ల ప్రపంచానికి చేస్తానని చెప్పినవి ఆ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఉదాహరణకు, భద్రతా అలాగే బిజినెస్ రంగాల్లో మాటిచ్చినవి నిలబెట్టుకోలేక పోతుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.’—“ద వాల్ స్ట్రీట్ జర్నల్.”
‘రాజకీయపరంగా బ్రిటన్‌లో ముందెన్నడూ లేనంతగా చాలా సమస్యలు తలెత్తడంతో రాజకీయ నాయకుల దృష్టి పక్కకు మళ్లింది. దానివల్ల ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సహాయం అందించలేకపోతుంది.’—ఇన్స్టిట్యూట్ ఫర్ గవర్నమెంట్.
ప్రవచనం: “ఆ రాజ్యంలోని భాగాలు సామాన్యులతో కలిసిపోతాయి; కానీ . . . అవి ఒకదానితో ఒకటి అతకవు.”—దానియేలు 2:43, అధస్సూచి.
దానర్థం: ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొంతవరకు సామాన్య ప్రజల చేతుల్లో ఉంటాయి. కానీ వచ్చిన ఫలితాల వల్ల అటు ప్రజల్లో గానీ ఇటు నాయకుల్లో గానీ పెద్దగా సంతృప్తి లేదు.
ఆ ప్రవచనం నెరవేర్పు
“ప్రస్తుతం చాలామంది అమెరికా ప్రజలకు రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద అస్సలు మంచి అభిప్రాయం లేదు.”—ప్యూ రీసర్చ్ సెంటర్.
‘గత 50 సంవత్సరాల్లో చూస్తే, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మీద, వాటి నాయకుల మీద ప్రజలకు నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది.’—“నేషనల్ సెంటర్ ఫర్ సోషల్ రీసర్చ్.”
దానియేలు ప్రవచనం ప్రకారం భవిష్యత్తు ఎలా ఉంటుంది?
దానియేలు ప్రవచనం ప్రకారం, దేవుని రాజ్యం మనుషుల ప్రభుత్వాల్ని తీసేసే సమయానికి అమెరికా-బ్రిటన్ ప్రభుత్వాలు కలిసి ప్రపంచాధిపత్యంగా పరిపాలిస్తాయి.—దానియేలు 2:44.
ప్రకటన పుస్తకంలోని ఒక ప్రవచనంలో, ఇదే అంశం గురించి బైబిలు ఇలా చెప్తుంది: ‘భూమంతటా ఉన్న రాజులు’ యెహోవాకుb వ్యతిరేకంగా హార్‌మెగిద్దోన్ యుద్ధం కోసం అంటే “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం” పోగౌతారు. (ప్రకటన 16:14, 16; 19:19-21) ఈ యుద్ధంలో యెహోవా మానవ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తాడు. అలా దానియేలు ప్రవచనం చెప్పినట్టు, ప్రపంచాధిపత్యాలను సూచిస్తున్న ప్రతిమ పూర్తిగా నేల కూలిపోతుంది.
ఎక్కువ తెలుసుకోవడానికి, “హార్‌మెగిద్దోన్ యుద్ధం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.
ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు మంచిది?
అమెరికా-బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం ఉంటుందనే బైబిలు ప్రవచనాన్ని తెలుసుకోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు కొత్త కోణంలో చూడగలుగుతారు.
యేసు తన శిష్యుల్ని ఈ లోక రాజకీయాల్లో తలదూర్చవద్దని ఎందుకు అన్నాడో మీరు అర్థం చేసుకుంటారు. (యోహాను 17:16) అంతేకాదు, తన రాజ్యానికి దేవుడు ఎంచుకున్న రాజైన యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” అని ఎందుకు అన్నాడో కూడా మీకు అర్థమౌతుంది.—యోహాను 18:36.
దేవుని రాజ్యం చర్య తీసుకునే సమయం, అలాగే దేవుడు మాటిచ్చినట్టు మనుషుల్ని దీవించే సమయం చాలా దగ్గర్లో ఉన్నాయని తెలుసుకుని మీరు ఊరట పొందుతారు.—ప్రకటన 21:3, 4.
మీరు భవిష్యత్తు విషయంలో ఆశతో ఉంటారు. అంతేకాదు ఈ లోక ప్రభుత్వాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఆందోళన పడకుండా ఉంటారు.—కీర్తన 37:11, 29.
దానియేలు ప్రవచనంలోని ప్రతిమ పాదాల్ని సూచిస్తున్న, అమెరికా-బ్రిటన్ ప్రపంచాధిపత్యమే మనుషుల్ని పరిపాలించే ఆఖరి ప్రపంచాధిపత్యం. దాని తర్వాత, ఏ లోపంలేని ఒక గొప్ప ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది—అదే పరలోకం నుండి పరిపాలించే దేవుని రాజ్యం.
మనుషుల కోసం దేవుని రాజ్యం ఇంకా ఏం చేస్తుందో తెలుసుకోవడానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.
a “దానియేలు ప్రవచనం ఏయే ప్రపంచాధిపత్యాల గురించి చెప్పింది?” అనే బాక్సు చూడండి.
b యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్ చూడండి.