బైబిల్లో మీకిది తెలుసా?
బైబిలు కాలాల్లో చేపలు పట్టే వలలు
యేసు శిష్యుల్లో కొంతమంది చేపలు పట్టేవాళ్లు. (మార్కు 1:16-20) వాళ్లు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వలలు ఉపయోగించేవాళ్లు.
నారతో చేసిన దారాన్ని ఒక జాలిలా (Net) అల్లి చేపలు పట్టే వలల్ని తయారుచేసేవాళ్లు. చిన్న చేపల్ని పట్టడానికి చిన్న రంధ్రాలు ఉన్న వలల్ని, పెద్ద చేపల్ని పట్టడానికి పెద్ద రంధ్రాలు ఉన్న వలల్ని వాడేవాళ్లు. చిన్న వలలకు సీసం (Lead) లేదా రాళ్లు లాంటి బరువుల్ని కట్టేవాళ్లు, దాంతో అవి పైకి తేలకుండా ఉండేవి. అదే పెద్ద వలలకైతే కింద బరువులు పెట్టేవాళ్లు. దానితోపాటు, అవి పూర్తిగా మునిగిపోకుండా పైఅంచులకు చెక్క ముక్కలు లేదా బెండు ముక్కలు కట్టేవాళ్లు.
చేపలు పట్టే వలలు బాగా ఖరీదైనవి. అవి సముద్రం అడుగు భాగంలో ఉన్న రాళ్లకు తగలడం వల్ల పాడైపోయేవి, లేదా ఎక్కువ చేపలు పట్టినప్పుడు ఆ బరువుకి చిరిగిపోయేవి. (లూకా 5:6) బైబిలు ఒక సందర్భంలో యాకోబు, యోహాను “తమ వలలు బాగుచేసుకుంటున్నారు” అని చెప్తుంది. బహుశా వాళ్లు దానికోసం ఒక పెద్ద సూదిని, నారతో చేసిన దారాన్ని ఉపయోగించి ఉంటారు. (మత్త. 4:21) వలల్ని వాడిన ప్రతీసారి జాలర్లు వాటిని బాగు చేసుకునేవాళ్లు. వలలకు పట్టిన మట్టిని, చెత్తను తీసేయడానికి జాలర్లు వాటిని కడగడం గురించి లూకా రాశాడు. (లూకా 5:2) బహుశా, అవి పాడవ్వకుండా ఉండడానికి, వాటిని కడిగాక ఆరబెట్టేవాళ్లు.—యెహె. 47:10.
ఈ వలలతో చేపలు పట్టే జాలరుల్ని, “మనుషుల్ని పట్టే జాలరులుగా” అవ్వమని యేసు పిలిచాడు.