బైబిల్లోని వ్యక్తి
ఓబద్యాలా దేవునికి భయపడండి
ఓబద్యా చెడ్డ రాజైన అహాబు ఇంటిని చూసుకునేవాడు. అహాబు దేశాన్నంతా బయలు ఆరాధనతో నింపేశాడు. కానీ, ఓబద్యా మాత్రం “చిన్నప్పటి నుండే” యెహోవా మీద భయభక్తుల్ని చూపిస్తూ వచ్చాడు. (1 రాజు. 18:1-13) యెజెబెలు రాణి యెహోవా ప్రవక్తలందర్నీ చంపేయాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ ఘోరం జరగకుండా ఓబద్యా ఆపాలనుకున్నాడు. దానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ప్రవక్తను దాచడమే పెద్ద సాహసం. అలాంటిది ఓబద్యా 100 మంది ప్రవక్తల్ని దాచిపెట్టి, తీవ్రమైన కరువులో కూడా వాళ్లకు ఆహారం పెట్టాడు! రాజు, రాణి కిందున్న వందలమంది అబద్ధ ప్రవక్తల కళ్లుగప్పి ఇదంతా చేయడం ఓబద్యాకు ఎంత కష్టమై ఉంటుందో ఆలోచించండి.—1 రాజు. 18:19.
దేవుని మీద భయభక్తులు ఉన్న ఓబద్యా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఓబద్యా అహాబుకు భయపడినా, యెహోవాకు అంతకంటే ఎక్కువ భయపడ్డాడు. యెహోవా మీదున్న భయం వల్లే, ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి సహోదరుల్ని ధైర్యంగా కాపాడాడు. ఒకవేళ మన ప్రాంతంలో సత్యారాధనను నిషేధిస్తే, మనం కూడా ఓబద్యాలాగే దేవుని మీద భయభక్తుల్ని చూపించాలి. ఆ భయం ఉంటే, ఆపదలో ఉన్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయడానికి ముందుకొస్తాం.