“పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోండి”
“ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని,” అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు చెప్పాడు.—ఎఫె. 4:2, 3.
“పవిత్రశక్తి” వల్లే, మన మధ్య “ఐక్యత” ఉంది. అంటే దేవుని చురుకైన శక్తే ఆ ఐక్యతను పుట్టించింది. అయితే, ఆ ఐక్యతను కాపాడుకోవాలని పౌలు చెప్పాడు. అది ఎవరు చేయాలి? ఇంకెవరు మనమే. “పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను” కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికీ ఉంది.
దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ గమనించండి. ఎవరైనా మీకు ఒక కొత్త కారు గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం. దాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే కదా. మీరు ఆ కారును సరిగ్గా చూసుకోక అది పాడైతే, ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని నిందించలేం కదా!
అదేవిధంగా, మన మధ్య ఉన్న ఐక్యత దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అయినప్పటికీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనలో ప్రతీ ఒక్కరికీ ఉంది. ఒకవేళ ఒక బ్రదర్‌తో లేదా సిస్టర్‌తో మనకు పడకపోతే ఇలా ప్రశ్నించుకుందాం, ‘మా మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుంటూ, ఐక్యతను కాపాడుకోవడానికి నా వైపు నుండి చేయాల్సింది చేస్తున్నానా?’
ఐక్యతను కాపాడుకోవడానికి ‘పట్టుదలగా ప్రయత్నించండి’
పౌలు చెప్పినట్టు కొన్నిసార్లు మన మధ్య ఉన్న ఐక్యతను కాపాడుకోవడానికి కాస్త కష్టపడాల్సి రావచ్చు. ముఖ్యంగా, మన తోటి బ్రదర్గానీ సిస్టర్గానీ మనల్ని బాధపెట్టినప్పుడు అది ఇంకా కష్టంగా ఉండొచ్చు. అయితే, ఐక్యతను కాపాడుకోవాలంటే, ప్రతీసారి మనల్ని బాధపెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్లి, సమస్య గురించి మాట్లాడాల్సిందేనా? అవసరం లేదు. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను వెళ్లి ఆ సమస్య గురించి మాట్లాడితే, సమస్య పరిష్కారం అవుతుందా లేదా ఇంకా పెద్దదౌతుందా?’ కొన్నిసార్లు ఆ విషయాన్ని చూసీచూడనట్టు వదిలేయడం లేదా క్షమించడమే తెలివైన పని.—సామె. 19:11; మార్కు 11:25.
మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను వెళ్లి ఆ సమస్య గురించి మాట్లాడితే, సమస్య పరిష్కారం అవుతుందా లేదా ఇంకా పెద్దదౌతుందా?’
అపొస్తలుడైన పౌలు రాసినట్లు, మనం “ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ” ఉందాం. (ఎఫె. 4:2) ఈ మాట గురించి ఒక రెఫరెన్స్ పుస్తకం ఇలా చెప్తుంది: మనం ఎదుటివ్యక్తిని వాళ్లను వాళ్లలాగే అంగీకరించాలి. అంటే దానర్థం, మన తోటి బ్రదర్స్‌సిస్టర్స్ మనలాగే పాపులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమే, మనమందరం “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవడానికి చాలా కష్టపడుతున్నాం. (ఎఫె. 4:23, 24) అయితే, ఎవ్వరం ఆ పనిని వందకు వంద శాతం చేయలేం. (రోమా. 3:23) ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకుంటే ఒకరినొకరం భరించుకోవడం, క్షమించుకోవడం, మన మధ్య ఉన్న ఐక్యతను కాపాడుకోవడం ఇంకా తేలికౌతుంది.
మనకు ఎవరితోనైనా పడకపోతే, వాళ్లతో మనకున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆఖరికి అది మన హృదయంలోనైనా సరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే శాంతిని, ఐక్యతను అనుభవిస్తాం. ఎఫెసీయులు 4:3 లో “ఐక్యత” అని అనువదించబడిన గ్రీకు పదానికి, కొలొస్సయులు 2:19 లో “కండరాలు” అనే పదాన్ని ఉపయోగించారు. కండరాలు ఒక ఎముకను ఇంకో ఎముకతో గట్టిగా అతికించి ఉంచడానికి సహాయం చేస్తాయి. అదేవిధంగా, మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో మనకు ఎన్ని ఉన్నా, వాళ్లను అంటిపెట్టుకుని ఉండడానికి శాంతి, ప్రేమ సహాయం చేస్తాయి.
కాబట్టి తోటి బ్రదర్ లేదా సిస్టర్ మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, కోపం తెప్పించినప్పుడు లేదా చిరాకు పెట్టినప్పుడు వాళ్లు చేసే పనుల్ని భూతద్దంలో పెట్టి చూసే బదులు, వాళ్లమీద కనికరం చూపించండి. (కొలొ. 3:12) ఎందుకంటే మనుషులందరూ అపరిపూర్ణులే, బహుశా మీరు కూడా ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకర్ని బాధపెట్టే ఉంటారు. దీన్ని మనసులో ఉంచుకుంటే, “పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి” మీ వంతు ప్రయత్నం మీరు చేసినవాళ్లౌతారు.