కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూలై పేజీలు 2-7
  • మనం సలహా ఎందుకు తీసుకోవాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం సలహా ఎందుకు తీసుకోవాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాలో ఏ లక్షణాలు ఉండాలి?
  • నాకు మంచి సలహా ఎవరు ఇవ్వగలరు?
  • సలహా కావాలని నిజంగా కోరుకుంటున్నట్టు నేను ఎలా చూపించవచ్చు?
  • నా బదులు నిర్ణయాలు తీసుకోమని వేరేవాళ్లను అడగాలా?
  • సలహాలు తీసుకుంటూనే ఉండండి
  • మనం మంచి సలహా ఎలా ఇవ్వొచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • నమ్మకమైన వాళ్ల చివరి మాటల నుండి నేర్చుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూలై పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 28

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

మనం సలహా ఎందుకు తీసుకోవాలి?

“సలహా కోసం వెదికేవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.”—సామె. 13:10.

ముఖ్యాంశం

మనకు దొరికే సలహా బాగా ఉపయోగపడాలంటే ఏం చేయాలి?

1. సామెతలు 13:10; 15:22 ప్రకారం తెలివైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలన్నా ఏం చేయాలి?

మనందరం తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటాం. అలాగే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటాం. దానికోసం ఏం చేయాలో బైబిలు చెప్తుంది.—సామెతలు 13:10; 15:22 చదవండి.

2. యెహోవా ఏమని మాటిచ్చాడు?

2 మనం అడిగితే తెలివైన సలహా ఇవ్వగలిగేది మన పరలోక తండ్రి యెహోవా మాత్రమే. ఆయన ఇలా మాటిచ్చాడు: “నీ మీద దృష్టి ఉంచి నీకు సలహా చెప్తాను.” (కీర్త. 32:8) దీన్నిబట్టి యెహోవా మనకు సరిగ్గా ఏది అవసరమో ఆ సలహానే చెప్తాడు, దాన్ని పాటించేలా సహాయం కూడా చేస్తాడు.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో ఈ నాలుగు ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని చూస్తాం: (1) మంచి సలహా నాకు ఉపయోగపడాలంటే నాలో ఏ లక్షణాలు ఉండాలి? (2) నాకు మంచి సలహా ఎవరు ఇవ్వగలరు? (3) సలహా కావాలని నిజంగా కోరుకుంటున్నట్టు నేను ఎలా చూపించవచ్చు? (4) నా బదులు నిర్ణయాలు తీసుకోమని వేరేవాళ్లను ఎందుకు అడగకూడదు?

నాలో ఏ లక్షణాలు ఉండాలి?

4. మంచి సలహా మనకు ఉపయోగపడాలంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి?

4 మంచి సలహా మనకు ఉపయోగపడాలంటే మనలో వినయం, అణకువ ఉండాలి. ఆ లక్షణాలు ఉంటే, మనకు తెలివైన నిర్ణయాలు తీసుకునేంత జ్ఞానం గానీ, అనుభవం గానీ లేవని గుర్తిస్తాం. ఒకవేళ ఆ లక్షణాలు లేకపోతే యెహోవా మనకు సహాయం చేయలేడు, అలాగే బైబిలు నుండి మనకు దొరికే ఏ సలహా అయినా, చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. (మీకా 6:8; 1 పేతు. 5:5) కానీ మనకు వినయం, అణకువ ఉంటే బైబిలు ఇచ్చే సలహాను వినడానికి ముందుంటాం, పాటించడానికి సిద్ధంగా ఉంటాం.

5. దావీదు చేసిన ఏయే పనులవల్ల ఆయనలో గర్వం వచ్చే అవకాశం ఉంది?

5 దావీదు రాజు నుండి ఏం నేర్చుకోవచ్చో చూడండి. ఆయన రాజు అవ్వకముందు నుండే, ప్రజల్ని మైమరిపించే సంగీతం వాయించేవాడు. అంతేకాదు, సౌలు రాజు దగ్గర సంగీతం వాయించడానికి ఆయన్ని పిలిపించుకునేవాళ్లు. (1 సమూ. 16:18, 19) సౌలు తర్వాతి రాజుగా యెహోవా దావీదును అభిషేకించి, పవిత్రశక్తితో శక్తిమంతుణ్ణి చేశాడు. (1 సమూ. 16:11-13) గొల్యాతు లాంటి ఫిలిష్తీయునితో సహా, శత్రువులందర్నీ మట్టి కరిపించడం వల్ల, దావీదు పేరు మారుమ్రోగిపోయి ఉంటుంది. (1 సమూ. 17:37, 50; 18:7) సాధారణంగా, ఇన్ని సాధించిన వ్యక్తికి గర్వం కూడా తోడైతే ఇక నేలమీద ఉండరు. ఎవ్వరి మాటా వినాల్సిన అవసరంలేదని అనుకుంటారు. కానీ దావీదు ఎన్ని సాధించినా, రవ్వంత గర్వం కూడా చూపించలేదు.

6. దావీదు ఇతరుల నుండి సలహా తీసుకునేవాడని ఎలా చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 దావీదు రాజైన తర్వాత, తన దగ్గర కొంతమంది సలహాదారుల్ని పెట్టుకున్నాడు. (1 దిన. 27:32-34) రాజవ్వకముందు కూడా ఆయనకు మంచి సలహాలు తీసుకునే అలవాటు ఉండేది. కాబట్టి, ఇప్పుడు సలహాదారుల్ని పెట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఆయన పురుషుల నుండే కాదు అబీగయీలు అనే స్త్రీ నుండి కూడా సలహా తీసుకున్నాడు. దావీదు అబీగయీలు భర్త నాబాలులా కాదు. నాబాలు మంచి-మర్యాదలేని ఓ పొగరుబోతు. కానీ దావీదుకు చాలా వినయం ఉంది. అబీగయీలు ఇచ్చిన మంచి సలహాను తీసుకున్నాడు, ఘోరమైన తప్పు చేయకుండా తప్పించుకున్నాడు.—1 సమూ. 25:2, 3, 21-25, 32-34.

నేలపై కూర్చొని బతిమాలుతున్న అబీగయీలు మాటల్ని రాజైన దావీదు శ్రద్ధగా వింటున్నాడు.

రాజైన దావీదు వినయంగా అబీగయీలు చెప్పిన సలహాను విన్నాడు, పాటించాడు (6వ పేరా చూడండి)


7. దావీదు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (ప్రసంగి 4:13) (చిత్రాలు కూడా చూడండి.)

7 మనం దావీదు నుండి చాలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మనకు కొంచెం అధికారం, దానికితోడు కొంచెం టాలెంట్‌ ఉండొచ్చు. అంతమాత్రాన మనకే అన్నీ తెలుసు, ఎవ్వరి సలహా అవసరంలేదు అనుకోకూడదు. దావీదులాగే మంచి సలహా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎవ్వరు ఇచ్చినా సరే! (ప్రసంగి 4:13 చదవండి.) అప్పుడు, మనం పెద్దపెద్ద తప్పులు చేయం, వేరేవాళ్లను కూడా సమస్యల్లోకి నెట్టేయం.

చిత్రాలు: 1. నలుగురు పెద్దలు కలుసుకున్నారు. ఒక పెద్ద చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. 2. తర్వాత యౌవన పెద్ద తన కారులో కూర్చొని, దురుసుగా మాట్లాడిన పెద్దకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నాడు.

మంచి సలహా ఎవ్వరు ఇచ్చినా సరే, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి (7వ పేరా చూడండి)c


నాకు మంచి సలహా ఎవరు ఇవ్వగలరు?

8. యోనాతాను దావీదుకు మంచి సలహా ఇచ్చే స్థానంలో ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు?

8 దావీదు నుండి మనం ఇంకో విషయం కూడా నేర్చుకోవచ్చు. యెహోవాతో మంచి స్నేహం అలాగే తన పరిస్థితి గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ల దగ్గరే ఆయన సలహా తీసుకున్నాడు. ఉదాహరణకు, ఒక సందర్భంలో దావీదు సౌలు రాజుతో సమాధానపడాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన వెళ్లి, సౌలు కొడుకైన యోనాతానును సలహా అడిగాడు. ఈ పరిస్థితిలో యోనాతానే మంచి సలహా ఇవ్వగలడని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, యోనాతానుకు యెహోవాతో మంచి స్నేహం ఉండడమే కాదు, సౌలు రాజు గురించి కూడా బాగా తెలుసు. (1 సమూ. 20:9-13) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

9. మనం సలహా కోసం ఎవరి దగ్గరికి వెళ్లాలి? వివరించండి. (సామెతలు 13:20)

9 మనకు సలహా కావాలనుకున్నప్పుడు, యెహోవాతో మంచి స్నేహం ఉండి అలాగే మన పరిస్థితి గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లాలి.a (సామెతలు 13:20 చదవండి.) ఉదాహరణకు, ఒక యువ సహోదరుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండవచ్చు. అతను మంచి సలహా కోసం ఎవరి దగ్గరకు వెళ్తే బాగుంటుంది? ఒకవేళ అతను పెళ్లికాని ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్తే, ఆ ఫ్రెండ్‌ బైబిలు ఆధారంగా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, అది మంచి సలహానే అవుతుంది. కానీ తన గురించి బాగా తెలిసి, చాలా ఏళ్లు సంతోషంగా వివాహ జీవితాన్ని గడిపిన పరిణతిగల దంపతుల దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు, ఆ యువ సహోదరునికి సరిగ్గా సరిపోయే, బాగా పనికొచ్చే సలహా దొరకవచ్చు.

10. మనం ఇప్పుడు ఏం చూస్తాం?

10 మనం ఇప్పటివరకు మనలో ఉండాల్సిన రెండు లక్షణాల గురించి చూశాం. అలాగే మంచి సలహా ఎవరు ఇవ్వగలరో చూశాం. అయితే, మనకు సలహా కావాలని నిజంగా కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు? మన బదులు వేరేవాళ్లను నిర్ణయాలు తీసుకోమని అడగవచ్చా? ఇప్పుడు చూద్దాం!

సలహా కావాలని నిజంగా కోరుకుంటున్నట్టు నేను ఎలా చూపించవచ్చు?

11-12. (ఎ) సలహా తీసుకునే విషయంలో కొంతమంది ఏం చేస్తారు? (బి) రాజైన రెహబాము ఏం చేశాడు?

11 అప్పుడప్పుడు కొంతమంది సలహా అడుగుతున్నట్టే కనిపించవచ్చు. కానీ నిజానికి వాళ్లు అప్పటికే తీసేసుకున్న నిర్ణయాలకు ఎవరు వత్తాసు పలుకుతారా అని చూస్తుండవచ్చు. అలాంటివాళ్లు సలహా కావాలని నిజంగా కోరుకోవట్లేదు. వాళ్లు రాజైన రెహబాముకు జరిగిన దానినుండి ఒక గుణపాఠం నేర్చుకోవాలి.

12 రాజైన సొలొమోను చనిపోయిన తర్వాత, ఆయన కొడుకు రెహబాము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అప్పటికే, ప్రజలందరికీ ఏలోటూ లేకుండా అన్నీ ఉండేవి. కానీ సొలొమోను తమతో వెట్టిచాకిరి చేయించాడని ప్రజలు అనుకున్నారు. దాంతో వాళ్లు రెహబాము దగ్గరకు వచ్చి, తమ పని భారాన్ని తగ్గించమని అడిగారు. రెహబాము దీనిగురించి ఆలోచించడానికి సమయం కావాలని వాళ్లకు చెప్పాడు. ముందుగా, రెహబాము సొలొమోనుకు సలహాలు ఇచ్చిన పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి, సలహా అడిగాడు. (1 రాజు. 12:2-7) కానీ వాళ్లిచ్చిన సలహాను అతను పట్టించుకోలేదు. ఎందుకు? అప్పటికే ఏం చేయాలో రెహబాము నిర్ణయించేసుకుని, తనకు ఎవరు వత్తాసు పలుకుతారా అని చూసుంటాడు. అందుకే రెహబాము తనతోపాటు పెరిగిన యువకుల్ని సలహా అడిగాడు. వాళ్లు ఈయన అనుకున్నదే చెప్పారు, అది రెహబాముకు నచ్చింది. (1 రాజు. 12:8-14) ఆయన దాన్నే ప్రజలకు చెప్పాడు, దానివల్ల దేశం చీలిపోయింది. అప్పటినుండి రెహబాముకు తలనొప్పులు మొదలయ్యాయి.—1 రాజు. 12:16-19.

13. మనకు నిజంగా సలహా కావాలని కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

13 రెహబాము నుండి మనకు ఏంటి గుణపాఠం? మనం ముందే ఒక నిర్ణయం తీసేసుకుని, వేరేవాళ్లను సలహా అడగకూడదు. ఒకవేళ అలా చేశామేమో తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను ఎవరినైనా సలహా అడిగిన తర్వాత వాళ్లు చెప్పింది నచ్చకపోతే, వెంటనే కొట్టిపారేస్తున్నానా?’ దీనిగురించి ఒక ఉదాహరణ చూద్దాం.

14. మనం సలహా అడుగుతున్నప్పుడు ఏ విషయం గుర్తుంచుకోవాలి? ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

14 ఉదాహరణకు, ఒక బ్రదర్‌కి మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చిందని అనుకుందాం. కాకపోతే ఉద్యోగరీత్యా ఆయన చాలాసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఉద్యోగం ఒప్పుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఆయన ఒక సంఘపెద్దను సలహా అడిగాడు. ఆ సంఘపెద్ద, కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడమే అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత అని లేఖనాల ఆధారంగా ఆయనకి గుర్తుచేశాడు. (ఎఫె. 6:4; 1 తిమో. 5:8) ఆ సంఘపెద్ద ఇచ్చిన సలహా ఆ సహోదరునికి అస్సలు నచ్చలేదు. కాబట్టి తనకు నచ్చే సలహా దొరికేవరకు ఆయన అందర్నీ అలాగే అడుగుతూ వెళ్తే, ఆయన సలహా కావాలని నిజంగా కోరుకుంటున్నాడని చూపిస్తుందా? లేదా అప్పటికే ఒక నిర్ణయం తీసేసుకుని, దానికి ఎవరు వంతపాడతారా అని చూస్తున్నట్టు అవుతుందా? మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. (యిర్మీ. 17:9) కొన్నిసార్లు మనం అస్సలు వద్దనుకునే సలహానే మనకు బాగా కావాల్సిన సలహా కావచ్చు!

ఒక సిస్టర్‌ చాలామంది బ్రదర్స్‌సిస్టర్స్‌ని సలహా అడుగుతుంది. కానీ వాళ్లిచ్చే సలహా నచ్చక, ఒకళ్ల తర్వాత ఒకళ్ల దగ్గరికి వెళ్తుంది.

మనం నిజంగా సలహా కోసం చూస్తున్నామా లేదా మనకి ఎవరు వంతపాడతారా అని చూస్తున్నామా? (14వ పేరా చూడండి)


నా బదులు నిర్ణయాలు తీసుకోమని వేరేవాళ్లను అడగాలా?

15. మనం ఏం చేయకుండా జాగ్రత్తపడాలి? ఎందుకు?

15 మనం సొంతగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతీఒక్కరికి ఉంది. (గల. 6:4, 5) మనం ఈ ఆర్టికల్‌లో చూసినట్టు, ఒక తెలివైన వ్యక్తి నిర్ణయం తీసుకోవడానికి ముందు సలహా కోసం బైబిల్లో చూస్తాడు. అలాగే పరిణతిగల క్రైస్తవుల్ని అడుగుతాడు. అయితే, మనకోసం వేరేవాళ్లను నిర్ణయాలు తీసుకోమని మనం అడగకూడదు. కొంతమంది తాము బాగా అభిమానించే వాళ్ల దగ్గరకు వెళ్లి “మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు?” అని అడుగుతారు. ఇంకొంతమంది, ఏమీ ఆలోచించకుండా వేరేవాళ్లు ఏం చేస్తే అదే చేస్తారు.

16. విగ్రహాలకు అర్పించిన మాంసం విషయంలో కొరింథు సంఘంలో ఏం జరిగింది? ఆ మాంసాన్ని తినాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? (1 కొరింథీయులు 8:7; 10:25, 26)

16 మొదటి శతాబ్దంలోని కొరింథు సంఘంలో ఏం జరిగిందో చూడండి. ఒక సందర్భంలో, విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తినాలా వద్దా అని వాళ్లు నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఆ క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు: “లోకంలో విగ్రహం వట్టిదని, ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని మనకు తెలుసు.” (1 కొరిం. 8:4) ఈ మాటల్ని మనసులో ఉంచుకుని, కొంతమంది క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని కొట్టులో అమ్మినప్పుడు కొనుక్కొని తినాలని నిర్ణయించుకున్నారు. ఇంకొంతమంది, తమ మనస్సాక్షిని బట్టి ఆ మాంసాన్ని తినొద్దని నిర్ణయించుకున్నారు. (1 కొరింథీయులు 8:7; 10:25, 26 చదవండి.) ఇది ఎవరికి వాళ్లే సొంతగా తీసుకోవాల్సిన నిర్ణయం. కొరింథులో ఉన్నవాళ్లు వేరేవాళ్ల కోసం నిర్ణయాలు తీసుకోవాలని గానీ, వేరేవాళ్ల నిర్ణయాల్ని కాపీ కొట్టాలని గానీ పౌలు ఎప్పుడూ చెప్పలేదు. వాళ్లలో “ప్రతీ ఒక్కరు తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.”—రోమా. 14:10-12.

17. ఒకవేళ వేరేవాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మనం కాపీ కొట్టాలని చూస్తే ఏం అవుతుంది? ఉదాహరణ చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)

17 అలాంటి పరిస్థితే ఇప్పుడు ఎలా రావచ్చు? రక్తంలోని సూక్ష్మభాగాల గురించి ఆలోచించండి. వాటిని తీసుకోవాలో వద్దో ప్రతీ క్రైస్తవుడు సొంతగా నిర్ణయించుకోవాలి.b బహుశా వీటి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ, ఈ విషయంలో ఎవరి నిర్ణయం వాళ్లదే. (రోమా. 14:4) ఒకవేళ వేరేవాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మనం కాపీ కొట్టాలని చూస్తే, మన మనస్సాక్షిని చక్కగా ఉపయోగించినట్టు అవ్వదు. మన మనస్సాక్షి బలంగా ఉండాలంటే మంచి శిక్షణ ఇస్తూ, దాన్ని వాడాలి. (హెబ్రీ. 5:14) కాబట్టి, ఒక పరిణతిగల క్రైస్తవుణ్ణి మనం సలహా ఎప్పుడు అడగాలి? మన పరిస్థితికి సరిపోయే బైబిలు సూత్రాల గురించి పరిశోధన చేసి, ఇంకా అర్థం అవ్వకపోతే అప్పుడు అడగాలి.

చిత్రాలు: 1. ఒక బ్రదర్‌ డిపిఎ కార్డును నింపడానికి బైబిల్ని, “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!​” పుస్తకంలో 39వ పాఠాన్ని అలాగే, “రక్తాన్ని ఉపయోగించే వైద్య విధానాలకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు?” అనే వీడియోను ఉపయోగించి పరిశోధన చేస్తున్నాడు. 2. తర్వాత, ఒక పరిణతిగల బ్రదర్‌ లేఖనాన్ని వివరిస్తుంటే వింటున్నాడు.

మనం సొంతగా పరిశోధన చేసిన తర్వాతే, వేరేవాళ్లను సలహా అడగాలి (17వ పేరా చూడండి)


సలహాలు తీసుకుంటూనే ఉండండి

18. యెహోవా మనకోసం ఏం చేశాడు?

18 మన నిర్ణయాల్ని మనమే తీసుకునేలా అనుమతించాడంటే యెహోవాకు మనమీద ఎంత నమ్మకమో కదా! మనకు సహాయం చేయడానికి ఆయన బైబిల్ని, బైబిలు సూత్రాల్ని అర్థం చేసుకునేలా సహాయం చేసే స్నేహితుల్ని ఇచ్చాడు. ఒక ప్రేమగల తండ్రిలా ఆయన మనల్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు. (సామె. 3:21-23) మరి కృతజ్ఞతగా మనం ఏం చేయవచ్చు?

19. యెహోవా మురిసిపోయేలా మనం ఏం చేయవచ్చు?

19 ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎదిగి సొంతగా ఆలోచిస్తూ, తెలివిగా ఉంటూ, చక్కగా యెహోవా సేవచేస్తే అమ్మానాన్నలు మురిసిపోతారు. అదేవిధంగా, మనం ఆధ్యాత్మికంగా పరిణతి సాధిస్తూ, సలహాలు తీసుకుంటూ, యెహోవాను ఘనపర్చే నిర్ణయాలు తీసుకుంటే, ఆయన కూడా చాలా మురిసిపోతాడు.

మంచి సలహా మనకు ఉపయోగపడాలంటే ఇవి ఎందుకు అవసరం?

  • వినయం, అణకువ ఉండడం

  • సలహా కావాలని నిజంగా కోరుకోవడం

  • మనమే సొంతగా నిర్ణయాలు తీసుకోవడం

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

a మనం అప్పుడప్పుడు డబ్బు, వైద్యం, మరితర విషయాల్లో సలహాల కోసం యెహోవాసాక్షులుకాని వాళ్ల దగ్గరికి వెళ్లడం తప్పుకాదు.

b దీని గురించి మరిన్ని వివరాల కోసం, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 39వ పాఠంలో, 5వ పాయింట్‌ అలాగే “ఇవి కూడా చూడండి” సెక్షన్‌ చూడండి.

c చిత్రాల వివరణ: పెద్దల సభ మీటింగ్‌లో దురుసుగా మాట్లాడిన పెద్దకు తోటి పెద్ద సలహా ఇస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి