కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూన్‌ పేజీలు 26-31
  • మహాగొప్ప ఉపదేశకుడు నేర్పిన జీవిత పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మహాగొప్ప ఉపదేశకుడు నేర్పిన జీవిత పాఠాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా అమ్మానాన్నలే నాకు ఆదర్శం
  • పూర్తికాల సేవలో తొలి అడుగు
  • మిషనరీలుగా మా జీవితం
  • యూరప్‌, ఆఫ్రికా
  • మిడిల్‌ ఈస్ట్‌కి
  • తిరిగి ఆఫ్రికాకు
  • నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • యెహోవా సేవలో ఊహించని ఆనందాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూన్‌ పేజీలు 26-31
ఫ్రాంకో డగొస్టిని

జీవిత కథ

మహాగొప్ప ఉపదేశకుడు నేర్పిన జీవిత పాఠాలు

ఫ్రాంకో డగొస్టిని చెప్పినది

పోలీసుల బందోబస్తు, చెక్‌పోస్టులు, భగ్గుమంటున్న బారికేడ్లు, తుఫాన్లు, అంతర్యుద్ధాలు, ఉన్నపళంగా ఇల్లు వదిలి వెళ్లిపోవడాలు. ఇవి మిషనరీ సేవలో నేను, నా భార్య పడ్డ కష్టాల్లో కొన్ని. అయినాసరే, జీవితంలో దేనికోసం యెహోవా సేవను తాకట్టు పెట్టాలనుకోలేదు. ఈ కష్టాలన్నిటిలో యెహోవాయే మాకు తోడు-నీడగా ఉన్నాడు. ఆయన దీవెనల్ని మేము రుచి చూశాం. మహాగొప్ప ఉపదేశకునిగా యెహోవా మాకు మర్చిపోలేని ఎన్నో పాఠాలు నేర్పించాడు.—యోబు 36:22; యెష. 30:20

మా అమ్మానాన్నలే నాకు ఆదర్శం

1950 చివర్లో మా అమ్మానాన్న ఇటలీ నుండి కెనడాలోని సస్కాట్చవన్‌లో ఉన్న కిండెర్స్‌లికి వచ్చేశారు. వచ్చిన కొంతకాలానికే వాళ్లు సత్యం తెలుసుకున్నారు. ఇక అప్పటినుండి జీవితంలో దానికే మొదటిస్థానం ఇస్తూ వచ్చారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలతో కలిసి నేను చాలాసేపు ప్రీచింగ్‌ చేసేవాణ్ణి. అందుకే ఎనిమిదేళ్ల వయసులోనే నేను “సహాయ పయినీరుగా” చేశానని అప్పుడప్పుడు సరదాగా అంటుంటాను.

అమ్మానాన్నలతో అలాగే తోబుట్టువులతో ఉన్న చిన్నప్పటి ఫ్రాంకో.

దాదాపు 1966లో కుటుంబంతో

మా అమ్మానాన్నలు పేదవాళ్లే, కానీ యెహోవా కోసం త్యాగాలు చేయాలంటే మాత్రం ఎప్పుడూ ముందుండేవాళ్లు. ఒకసారి ఏమైందంటే, 1963లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న పసడెనలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి నాన్న మా దగ్గర ఉన్న చాలా వస్తువుల్ని అమ్మేశాడు. 1972లో ఇటాలియన్‌ భాషా ప్రజలకు ప్రకటించడానికి మేము దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనడాలోని, బ్రిటిష్‌ కొలంబియాలో ఉన్న ట్రయల్‌కి మారాం. మా నాన్న ఒక క్లీనర్‌గా పనిచేసేవాడు. ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి టైమ్‌ ఉండేలా ప్రమోషన్‌లు కూడా వద్దనుకున్నాడు.

మా అమ్మానాన్న నాకు, మా అన్నాచెల్లెల్లకు మంచి ఆదర్శం ఉంచారు. దానికోసం వాళ్లకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే. యెహోవా నాకు ఇచ్చిన శిక్షణ కోసం వాళ్ల ఆదర్శం నాకొక మంచి పునాది వేసింది. అందులో నేను జీవితంలో మర్చిపోలేని ఒక పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే, మనం దేవుని రాజ్యాన్ని వెతికే పనిలో ఉంటే, యెహోవా మనల్ని చూసుకునే పనిలో ఉంటాడు.—మత్త. 6:33.

పూర్తికాల సేవలో తొలి అడుగు

1980లో నేను అందం, ఆధ్యాత్మికత కలగలసిన డెబ్బీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మేము కలిసి పూర్తికాల సేవ చేయాలనుకున్నాం. అందుకే మా పెళ్లయిన మూడు నెలలకే డెబ్బీ పయినీరు సేవ మొదలు పెట్టింది. మా పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత, అవసరం ఎక్కువున్న ఒక చిన్న సంఘానికి మేము వెళ్లాం. అక్కడికి వెళ్లాక నేను కూడా పయినీరు సేవ మొదలుపెట్టాను.

ఫ్రాంకో అలాగే డెబ్బీల పెళ్లి రోజు.

1980లో మా పెళ్లి రోజున

కానీ కొంతకాలానికే మేము బాగా డీలాపడిపోయి ఇక తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాం. ముందుగా, మేము ప్రాంతీయ పర్యవేక్షకునితో మాట్లాడాం. ఆయన చాలా ప్రేమగా, నిజాయితీగా మాతో ఇలా అన్నాడు: “సమస్య పెద్దగా అవ్వడానికి ఒక రకంగా మీరు కూడా కారణమే. మీరు మీ పరిస్థితిలో ఉన్న చెడు గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న మంచిని చూడడానికి ప్రయత్నిస్తే అవి మీకు కనిపిస్తాయి.” అది మాకు సరిగ్గా అవసరమైన సలహా. (కీర్త. 141:5) మేము వెంటనే ఆయన ఇచ్చిన సలహాను పాటించాం. ఆ తర్వాత మా పరిస్థితిలో చాలా మంచి విషయాలు కనిపించాయి. సంఘంలో పిల్లలు, యెహోవాసాక్షికాని భర్తలు ఉన్న సిస్టర్స్‌ ఇలా చాలామంది, యెహోవా కోసం చేయగలిగినదంతా చేయాలనే తపనతో ఉన్నారు. ఆ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇచ్చిన సలహా మాకు చాలా పనికొచ్చింది. మేము మా పరిస్థితిలో ఉన్న మంచిని చూస్తూ, మా సమస్యను యెహోవా పరిష్కరించే వరకు ఓపిగ్గా ఉండాలని నేర్చుకున్నాం. (మీకా 7:7) దానివల్ల మా సంతోషం తిరిగి వచ్చింది. మా పరిస్థితులు కూడా కొంచెం బాగయ్యాయి.

మా మొదటి పయినీరు సేవ పాఠశాలకు ఉపదేశకులుగా ఉన్న బ్రదర్స్‌ వేరే దేశాల్లో సేవ చేసి వచ్చారు. వాళ్లు అక్కడి ఫోటోలు చూపిస్తూ, వాళ్లకు వచ్చిన సవాళ్ల గురించి, వాళ్లు అనుభవించిన దీవెనల గురించి చెప్పినప్పుడు మాకు కూడా మిషనరీలుగా సేవ చేయాలనే కోరిక పుట్టింది. ఇక దాంతో మేము మిషనరీలు అవ్వాలని ఫిక్స్‌ అయిపోయాం.

విపరీతమైన మంచుతో కప్పుకున్న రాజ్యమందిరం పార్కింగ్‌ స్థలం.

1983లో బ్రిటిష్‌ కొలంబియాలోని రాజ్యమందిరం

మేము మిషనరీలుగా సేవ చేయగలమో లేదో తెలుసుకోవడానికి 1984లో బ్రిటిష్‌ కొలంబియా నుండి దాదాపు 4000 కన్నా ఎక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబెక్‌కి వెళ్లాం. అక్కడంతా ఫ్రెంచ్‌ భాష మాట్లాడేవాళ్లే ఉన్నారు. అక్కడ భాష, పద్ధతులు అన్నీ మాకు కొత్తే. వీటికి తోడు మా దగ్గర డబ్బులు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. ఒకానొక పరిస్థితిలో కొన్నిరోజుల వరకు పొలంలో మిగిలిపోయిన బంగాళదుంపలు ఏరుకున్నాం. డెబ్బీ బంగాళదుంపలతోనే రకరకాల వంటలు చేయడం నేర్చుకుంది. ఇన్ని సవాళ్లు ఉన్నా, మా ముఖం మీద చిరునవ్వు చెదరలేదు. అలా యెహోవా మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నాడు.—కీర్త. 64:10.

అనుకోకుండా ఒకరోజు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. మమ్మల్ని కెనడా బెతెల్‌కి రమ్మని పిలిచారు. అప్పటికే మేము గిలియడ్‌ పాఠశాల కోసం అప్లికేషన్‌ పెట్టాం. ఇప్పుడు బెతెల్‌ సేవ అవకాశం వచ్చిందని సంతోషపడాలో, గిలియడ్‌ రాలేదని బాధపడాలో మాకు అర్థం కాలేదు. కానీ బెతెల్‌కి వెళ్లడానికి ఒప్పుకున్నాం. బెతెల్‌కి వెళ్లాక బ్రాంచి కమిటీ సభ్యుడైన బ్రదర్‌ కెన్నెత్‌ లిటిల్‌ని ఇలా అడిగాం: “మరి, మమ్మల్ని గిలియడ్‌కు రమ్మంటే అప్పుడేంటి?” అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “వచ్చే కాలం కన్నా వచ్చిన కాలం మిన్న.”

వారం తర్వాత మేము అనుకున్న రోజు రానేవచ్చింది. నాకు, డెబ్బీకి గిలియడ్‌ ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్రదర్‌ లిటిల్‌ మాకు ఇలా చెప్పాడు: “మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏదోక రోజు, ఇది కాకుండా వేరే నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో ఒక నిర్ణయం కంటే ఇంకో నిర్ణయం గొప్పదని చెప్పలేం. యెహోవా దేన్నైనా దీవిస్తాడు.” మేము గిలియడ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. సంవత్సరాలు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే, బ్రదర్‌ లిటిల్‌ మాటలు నిజమని మేము చూశాం. రెండు నియామకాల మధ్య కొట్టుమిట్టాడే వాళ్లకు మేము బ్రదర్‌ లిటిల్‌ మాటల్ని చాలాసార్లు చెప్పాం.

మిషనరీలుగా మా జీవితం

(ఎడమ) యులీసిస్‌ గ్లాస్‌

(కుడి) జాక్‌ రెడ్‌ఫోర్డ్‌

1987, ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్లో జరిగిన 83వ గిలియడ్‌ తరగతికి, 24 మంది విద్యార్థుల్లో మేము ఉన్నప్పుడు మా కళ్లను మేము నమ్మలేకపోయాం. బ్రదర్‌ యులీసిస్‌ గ్లాస్‌ అలాగే జాక్‌ రెడ్‌ఫోర్డ్‌ మా గిలియడ్‌ తరగతికి ఉపదేశకులుగా ఉన్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఐదు నెలలు గడిచిపోయాయి. 1987, సెప్టెంబరు 6న మా గిలియడ్‌ తరగతిని పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మమ్మల్ని జాన్‌ అలాగే మేరి గుడీలతో పాటు హయిటీకి నియమించారు.

హయిటీలో ఒక బీచ్‌ దగ్గర ప్రీచింగ్‌ చేస్తున్న ఫ్రాంకో, డెబ్బీ.

1988లో హయిటీలో

1962లో హయిటీ నుండి మిషనరీలను గెంటేసిన తర్వాత, మళ్లీ మిషనరీలుగా వెళ్లింది మేమే. మా గిలియడ్‌ పూర్తయిన మూడు వారాల తర్వాత నేను, డెబ్బీ హయిటీకి వెళ్లాం. అక్కడ ఎత్తయిన పర్వతాల మధ్య 35 మంది ప్రచారకులు ఉన్న ఒక చిన్న సంఘం ఉండేది. మేమేమో యౌవ్వనులం, అంతగా అనుభవం కూడా లేదు. మిషనరీ హోమ్‌లో ఇద్దరమే బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లం. అక్కడి ప్రజలు విపరీతమైన పేదరికంలో మగ్గుతున్నారు. అక్కడ చాలామందికి చదువు కూడా రాదు. మిషనరీ సేవ మొదలుపెట్టిన తొలి రోజుల్లో అంతర్యుద్ధాల్ని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే నినాధాల్ని, బగ్గుమంటున్న బారికేడ్‌లని, తుఫానులను మా కళ్లతో చూశాం.

హయిటీలో కష్టాల్ని గుండె ధైర్యంతో ఎదుర్కొని సంతోషాన్ని కాపాడుకున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని చూసి మేము చాలా నేర్చుకున్నాం. చాలామంది జీవితం ఒక ముళ్లబాటలా ఉంది. కానీ వాళ్లు యెహోవాను, పరిచర్యను చాలా ఇష్టపడ్డారు. ఒక పెద్దవయసు సిస్టర్‌కి చదువు రాదు, కానీ 150 లేఖనాలు ఆమె నోటి మీద ఉండేవి. మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూశాక, వాటన్నిటికీ దేవుని రాజ్యమే ఒక పరిష్కారం కాబట్టి దానిగురించి అందరికి చెప్పాలని ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నాం. మేము ఒకప్పుడు మొదలుపెట్టిన బైబిలు స్టడీల వాళ్లు క్రమ పయినీర్లుగా, ప్రత్యేక పయినీర్లుగా, సంఘ పెద్దలుగా సేవచేయడం చూస్తుంటే మా ఆనందానికి అవధులు లేవు!

నేను హయిటీలో ఉన్నప్పుడు ట్రెవర్‌ అనే యువకుడిని కలిశాను. ఆయన ఒక మోర్మన్‌ మిషనరీ (ఒక చర్చీ మిషనరీ). చాలాసార్లు ఆయనతో బైబిలు గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. సంవత్సరాల తర్వాత, అనుకోకుండా ఒకరోజు ఆయన నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆయన ఇలా రాశాడు: “రాబోయే ప్రాంతీయ సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. నేను హయిటీకి తిరిగొచ్చి ఏ ప్రాంతంలోనైతే మోర్మన్‌ మిషనరీగా పని చేశానో, అదే ప్రాంతంలో ప్రత్యేక పయినీరుగా సేవ చేయాలనుకుంటున్నాను.” చెప్పినట్టుగానే చాలా సంవత్సరాలపాటు ఆయనా, ఆయన భార్య ప్రత్యేక పయినీర్లుగా సేవచేశారు.

యూరప్‌, ఆఫ్రికా

ఆఫీస్‌లో పనిచేస్తున్న ఫ్రాంకో.

1994లో స్లోవేనియాలో పనిచేస్తున్నప్పుడు

అప్పుడప్పుడే రాజ్య పని చిగురిస్తున్న యూరప్‌లోని ఒక ప్రాంతానికి మమ్మల్ని నియమించారు. 1992లో మేము స్లోవేనియాలోని ల్యుబ్లానాకి వచ్చాం. మా అమ్మానాన్న పుట్టి-పెరిగింది అక్కడే. ఒకప్పటి యుగోస్లేవియా ప్రాంతాల్లో ఇంకా యుద్ధపు సెగలు రగులుకుంటూనే ఉన్నాయి. వియన్నా, ఆస్ట్రియాలో ఉన్న బ్రాంచి అలాగే జగ్రెబ్‌, క్రొయేషియా, బెల్గ్‌రేడ్‌, సెర్బియాలో ఉన్న ఆఫీసులు ఈ ప్రాంతంలో జరిగే పనిని చూసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో తమ సొంత బెతెల్‌ భవనాలు ఉన్నాయి.

ఇక మేము స్లోవేనియన్‌ భాష నేర్చుకోవాలి, వాళ్ల పద్ధతులకు అలవాటుపడాలి. ఇక్కడున్న స్థానికులు మొహం మీదే ఇలా చెప్పేవాళ్లు: “ఈ భాష అందని ద్రాక్ష.” ఆ మాటలు నిజమే. ఈ భాష నేర్చుకోవడం అంతా ఈజీ కాదు. ఇంకోవైపు, ఇక్కడ బ్రదర్స్‌-సిస్టర్స్‌ సంస్థ చేసిన మార్పులకు ఎంత ఇష్టంగా లోబడుతున్నారో చూశాక, వాళ్ల మీద మా గౌరవం అంచెలంచెలుగా పెరిగింది. దానివల్ల యెహోవా వాళ్లని ఎలా దీవించాడో కూడా కళ్లారా చూశాం. యెహోవా ఎప్పుడూ సరైన సమయంలో విషయాల్ని ప్రేమగా సరిదిద్దుతాడని ఇంకోసారి చూడగలిగాను. స్లోవేనియాలో మేము గడిపిన సంవత్సరాల్లో నేర్చుకున్న ఎన్నో పాఠాల్ని నెమరేసుకున్నాం, కొత్త పాఠాల్ని నేర్చుకున్నాం.

కానీ మార్పులు అక్కడితో ఆగలేదు! 2000వ సంవత్సరంలో మమ్మల్ని పడమర ఆఫ్రికాలోని కోటే డి ఐవరీకి నియమించారు. ఆ తర్వాత 2002, నవంబరులో అంతర్యుద్ధం కారణంగా మేము సియర్రా లియోన్‌కి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశంలో 11 సంవత్సరాలుగా రగులుతున్న అంతర్యుద్ధం అప్పుడే చల్లబడింది. కానీ ఉన్నపళంగా కోటే డి ఐవరీని వదిలేసి రావడానికి మాకు మనసు రాలేదు. కానీ మేము మూట కట్టుకున్న పాఠాల వల్ల మా సంతోషాన్ని కాపాడుకోగలిగాం.

ఆ ప్రాంతంలో, సత్యం తెలుసుకోవాలనే తపనతో ఉన్నవాళ్ల మీద, ఏళ్ల తరబడి కష్టాల్ని నమ్మకంగా సహిస్తున్న బ్రదర్‌సిస్టర్స్‌ మీద మేము మనసుపెట్టాం. వాళ్ల దగ్గర డబ్బు తక్కువేమో కానీ, ఇచ్చే గుణం మాత్రం చాలా ఎక్కువ! అక్కడ ఒక సిస్టర్‌ డెబ్బీకి కొన్ని బట్టలు ఇచ్చింది. డెబ్బీ తీసుకోవడానికి మొహమాటపడుతుంటే ఆ సిస్టర్‌ బలవంతం చేస్తూ ఇలా అంది: “యుద్ధమప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్న బ్రదర్స్‌ మాకు సహాయం చేశారు. ఇప్పుడు మా వంతు!” నేనూ, డెబ్బీ అక్కడున్న బ్రదర్స్‌సిస్టర్స్‌లా ఉండాలనుకున్నాం.

కొంతకాలానికి మేము కోటే డి ఐవరీకి తిరిగి వచ్చాం. కానీ రాజకీయ అల్లర్లు బగ్గుమన్నాయి. దాంతో 2004, నవంబరులో మేము హెలికాప్టర్‌లో ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చాం. మాతోపాటు కేవలం 10 కిలోల బరువు ఉన్న చెరో బ్యాగును తెచ్చుకున్నాం. ఆ రోజు రాత్రి మేము ఫ్రెంచ్‌ ఆర్మి క్యాంపులో నేల మీద పడుకున్నాం. మరుసటి రోజు స్విట్జర్లాండ్‌కి వచ్చాం. అక్కడున్న బ్రాంచి కార్యాలయానికి చేరుకునేసరికి మధ్యరాత్రి అయ్యింది. అప్పుడు బ్రాంచి కమిటీ సభ్యులు, పరిచర్య శిక్షణ పాఠశాల ఉపదేశకులు, వాళ్ల భార్యలు మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్లు మాకోసం వేడివేడి భోజనం వండి పెట్టారు, చాలా స్విట్జర్లాండ్‌ చాక్లెట్స్‌ ఇచ్చారు. ఆ ప్రేమ మా మీద చెరగని ముద్ర వేసింది.

కోటే డి ఐవరీలో రాజ్యమందిరంలో ప్రసంగం ఇస్తున్న ఫ్రాంకో.

2005లో కోటే డి ఐవరీలో ఉన్న శరనార్థులతో మాట్లాడుతున్న ఫ్రాంకో

మమ్మల్ని తాత్కాలికంగా ఘానాకు నియమించారు. ఆ తర్వాత కోటే డి ఐవరీలో రాజకీయ అల్లర్లు తగ్గుముఖంపట్టాక తిరిగి అక్కడికి పంపించారు. ఉన్నపళంగా ప్రాంతాల్ని ఖాళీ చేయడం, తాత్కాలిక నియామకాల్ని చేయడం కేవలం బ్రదర్‌సిస్టర్స్‌ చూపించిన దయ వల్లే సాధ్యమైంది. యెహోవా సంస్థలో ఈ ప్రేమ సహజంగానే కనిపించినా డెబ్బీ, నేనూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. నిజానికి, మమ్మల్ని తలకిందులు చేసేలాంటి ఈ పరిస్థితులన్నీ మా శిక్షణలో భాగం.

మిడిల్‌ ఈస్ట్‌కి

మిడిల్‌ ఈస్ట్‌లో ఒకప్పటి భవనాల దగ్గర ఫ్రాంకో అలాగే డెబ్బీ దిగిన ఫోటో.

2007లో మిడిల్‌ ఈస్ట్‌లో

మమ్మల్ని మిడిల్‌ ఈస్ట్‌కి వెళ్లమని 2006లో ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి మాకు ఒక ఉత్తరం వచ్చింది. అంటే మేము మళ్లీ కొత్త భాష, పద్ధతులు నేర్చుకోవాలి. ఊహించని అనుభవాల్ని, సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ప్రాంతంలో రాజకీయపరంగా, మతపరంగా వాతావరణం వాడివేడిగా ఉండేది. దానివల్ల మేము చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాం. బయట ఎలా ఉన్నాసరే, సంఘం లోపల మాత్రం వేర్వేరు భాషలు మాట్లాడే బ్రదర్‌సిస్టర్స్‌ యెహోవా సంస్థ నుండి వచ్చే నిర్దేశాలను పాటించాం కాబట్టే ఐక్యంగా ఉండగలిగాం. అంతేకాదు, అక్కడున్న బ్రదర్‌సిస్టర్స్‌ మాకు చాలా నచ్చారు. ఎందుకంటే వాళ్లు కుటుంబ సభ్యుల నుండి, చుట్టుపక్కలవాళ్ల నుండి, తోటి ఉద్యోగస్థుల నుండి వచ్చే వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ధైర్యం చూపిస్తున్నారు.

2012లో ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవివ్‌లో జరిగిన ప్రత్యేక సమావేశానికి మేము వెళ్లాం. క్రీ.శ. 33 పెంతెకొస్తు తర్వాత, ఇజ్రాయిల్‌లో యెహోవా ప్రజలు అంత పెద్ద సంఖ్యలో కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఆలోచిస్తే ఆ సమావేశం ఇంకా మా కళ్ల ముందే మెదులుతుంది!

ఆ సంవత్సరాల్లో మన పనిని నిషేధించిన దేశానికి మమ్మల్ని పంపించారు. ఎక్కడ చూసినా ఆయుధాలు పట్టుకొని సైనికులు ఉండేవాళ్లు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్ట్‌లు ఉండేవి. మాతోపాటు కొన్ని ప్రచురణలే తెచ్చుకున్నాం. వాటితోనే ప్రీచింగ్‌ చేసేవాళ్లం. చిన్నచిన్న సమావేశాల్ని జరుపుకునేవాళ్లం. అలా మేము పెద్ద గుంపుగా కలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ భయం లేకుండా అవన్నీ చేసేవాళ్లం.

తిరిగి ఆఫ్రికాకు

లాప్‌టాప్‌లో పని చేసుకుంటున్న ఫ్రాంకో.

2014లో కాంగోలో ప్రసంగానికి సిద్ధపడుతున్న ఫ్రాంకో

2013లో కాంగోలోని కిన్‌షాసా బ్రాంచ్‌లో సేవ చేసే నియామకం వచ్చింది. ఆ దేశంలో ఒకవైపు కళ్లు చెదిరే అందాలు ఉంటే, మరోవైపు కంటతడి పెట్టించే పేదరికం ఉంది. వీటికి తోడు చీటికిమాటికి జరిగే యుద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగోకి వెళ్తున్నామని తెలిసిన మొదట్లో ‘మన ఆఫ్రికానేగా, ఇక మేము వెళ్లడానికి రెడీ’ అనుకున్నాం. కానీ ఒళ్లు కుదిపేసే రోడ్డు ప్రయాణాలు చేశాక, అక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. వీటిని పక్కన పెడితే, మేము మనసుపెట్టాల్సిన ఎన్నో మంచి విషయాలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా, అక్కడ బ్రదర్స్‌సిస్టర్స్‌ కడు పేదరికంలో ఉన్నా, వాళ్ల చిరునవ్వు చెదరలేదు, సంతోషానికి కొదవలేదు. ప్రీచింగ్‌ మీద వాళ్లకున్న ఇష్టం, మీటింగ్స్‌కి-సమావేశాలకి వెళ్లాలన్న వాళ్ల పట్టుదల చాలా గొప్పది. కేవలం యెహోవా సహాయంతో, ఆయన దీవెనలతో మాత్రమే ఈ ప్రాంతంలో రాజ్య పని ముందుకెళ్లడం మేము కళ్లారా చూశాం. కాంగో మాకు ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. నిజంగా, పూర్తికాల సేవ అనే మా పుస్తకంలో, కాంగో ఒక మరపురాని పేజీగా మిగిలింది!

ప్రీచింగ్‌లో కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి ఒక పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తున్న ఫ్రాంకో.

2023లో దక్షిణాఫ్రికాలో ప్రీచింగ్‌ చేస్తూ

2017 చివర్లో మమ్మల్ని దక్షిణాఫ్రికాకు నియమించారు. మేము సేవచేసిన బ్రాంచీలన్నిట్లో ఇదే పెద్ద బ్రాంచి. ఇక్కడ మా పని కూడా చాలా కొత్తగా ఉంది. ఇంకోసారి, గతంలో మేము నేర్చుకున్న పాఠాలు మా జీవిత ప్రయాణానికి పట్టాలు అయ్యాయి. ఎన్నో దశాబ్దాలుగా కష్టాల్ని నమ్మకంగా తట్టుకున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ మా మనసును దోచారు. అలాగే వేర్వేరు జాతుల నుండి, పద్ధతుల నుండి వచ్చిన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఒక కుటుంబంలా, ఐక్యంగా ఉండడం చూస్తుంటే చాలా ముచ్చటేసింది. అంతేకాదు, బైబిలు సూత్రాల్ని పాటిస్తూ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం వల్ల వచ్చే శాంతి, యెహోవా ఇచ్చే దీవెనే అనడంలో డౌటే లేదు!

గడిచిన సంవత్సరాల్లో మా నియామకాల్లో ఊహించని మలుపులు, పద్ధతుల్లో మార్పులు, భాషల్లో వైవిధ్యాలు నాకూ డెబ్బీకి మిగిల్చాయి ఎన్నో మధుర క్షణాలు. ఈ ప్రయాణం కష్టమైందే, కానీ సంస్థ అలాగే బ్రదర్స్‌-సిస్టర్స్‌ రూపంలో యెహోవా చూపించిన విశ్వసనీయ ప్రేమ వల్లే ఇది తేలికైనది. (కీర్త. 144:2) పూర్తికాల సేవలో మేము నేర్చుకున్న ఎన్నో పాఠాలు యెహోవా సేవలో మమ్మల్ని కడిగిన ముత్యంలా చేశాయి.

మా అమ్మానాన్నల పెంపకం, నా భార్య డెబ్బీ సహకారం, బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆదర్శం నాకు దొరికిన గొప్ప వరం. భవిష్యత్తు వైపు ఒక్కో అడుగు వేస్తుండగా, మన మహాగొప్ప ఉపదేశకుడు నేర్పే పాఠాల్ని ఇంకా మూట కట్టుకోవడానికి మేము సిద్ధమే!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి