అధ్యయనం చేయడానికి ఐడియాలు
లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడం
మీరెప్పుడైనా మీకు ఇష్టమైన లేఖనాల్ని గుర్తుతెచ్చుకోవడానికి కష్టపడ్డారా? బహుశా అవి మీకు ఊరటను ఇచ్చేవి, తప్పుడు ఆలోచనల్ని తీసేసుకోవడానికి సహాయం చేసేవి, లేదా వేరేవాళ్లకు చూపించాలని అనుకునేవి అయ్యుండొచ్చు. (కీర్త. 119:11, 111) అయితే, అలాంటి లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే టిప్స్ చూద్దాం.
JW లైబ్రరీలో టాగ్‌లను వాడండి. “నచ్చిన లేఖనాలు” అని ఒక టాగ్ పెట్టుకోండి. దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలని అనుకునే లేఖనాలన్నీ ఆడ్ చేసుకోండి.
లేఖనాలు కనిపించేలా ఒక దగ్గర అంటించుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాలని అనుకునే లేఖనాన్ని ఒక పేపర్ మీద రాసుకొని, దాన్ని మీరు ఇంట్లో ఎక్కువగా తిరిగే ప్లేస్‌లో అతికించుకోండి. కొంతమందైతే, అద్దం మీద అతికించుకుంటారు. ఇంకొంతమంది, ఫ్రిడ్జ్ డోర్‌కి అతికించుకుంటారు. మరికొందరైతే, లేఖనాల్ని స్క్రీన్ షాట్ తీసి, వాళ్ల ఫోన్‌లలో లేదా కంప్యూటర్లలో వాల్‌పేపర్‌గా పెట్టుకుంటారు.
లేఖనాల్ని ఒక కార్డు మీద రాసుకోండి. కార్డుకు ఒకవైపు, పుస్తకం-అధ్యాయం-వచనం రాసుకోండి. ఇంకోవైపు, ఆ లేఖనంలో ఏముందో రాసుకోండి. ఇప్పుడు, మీరు ఆ కార్డులో కేవలం పుస్తకం-అధ్యాయం-వచనం చూసి, అందులో ఏముందో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత, మీరు గుర్తుతెచ్చుకున్నది కరెక్టో కాదో ఆ కార్డు తిప్పి చూడండి.