యుద్ధాలు, దాడులు జరుగుతున్నా ప్రశాంతంగా ఉండవచ్చు
ఒకప్పుడు మిలిటరీలో పనిచేసిన గ్యారీ ఇలా అంటున్నాడు: “లోకంలో ఎందుకు జాలి, దయ కరువయ్యాయి? ఎందుకు ఇంత అన్యాయం ఉంది? ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి? అనే ప్రశ్నలు బైబిలు స్టడీ తీసుకోకముందు నన్ను వేధించేవి. అయితే, యెహోవా దేవుడు ఈ ప్రపంచ పరిస్థితుల్ని మార్చబోతున్నాడని, అప్పుడు మనుషులు సురక్షితంగా జీవిస్తారని తెలుసుకున్నాను. దాంతో ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.”
అలా మనశ్శాంతిని పొందింది గ్యారీ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బైబిలు వాళ్లందరికి ఎలా సహాయం చేసిందో వాళ్ల మాటల్లోనే తెలుసుకోండి.
బైబిల్లోని మాట: “యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.”—కీర్తన 86:5.
అదెలా సహాయం చేసింది: “యెహోవా కరుణగల దేవుడని ఈ వచనం చదివినప్పుడు నాకు అర్థమైంది. గతంలో, నేను సైనికుడిగా ఉన్నప్పుడు చేసిన వాటన్నిటినీ యెహోవా తప్పకుండా క్షమిస్తాడని నాకు నమ్మకం కుదిరింది.”—విల్‌మర్, కొలంబియా.
బైబిల్లోని మాట: “నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాను; పాత సంగతులు గుర్తుకురావు, అవి హృదయంలో కూడా ఉండవు.”—యెషయా 65:17.
అదెలా సహాయం చేసింది: “నేను మిలిటరీలో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాల వల్ల ఇప్పుడు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నాను. కానీ, త్వరలోనే యెహోవా నా చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తాడని, నేను మోస్తున్న భారాన్ని దించేస్తాడని ఈ వచనం నాకు గుర్తుచేస్తుంది. అప్పుడు ఇక పీడకలలా వెంటాడుతున్న నా గతం మాయమైపోతుంది. అది నిజంగా, ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి!”—జఫీరా, యునైటెడ్ స్టేట్స్.
బైబిల్లోని మాట: “ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకుండా పోయేవరకు శాంతి విస్తరిస్తుంది.”—కీర్తన 72:7.
అదెలా సహాయం చేసింది: “నేనెప్పుడూ ఆ మాటల గురించి ఆలోచిస్తాను. గుండెల్లో గుబులు పుట్టించే యుద్ధాలు త్వరలోనే అంతమౌతాయి. అప్పుడు మనకు, మనవాళ్లకు ఏమౌతుందనే దిగులు ఇక ఉండదు.”—ఒలెక్సాండ్రా, యుక్రెయిన్.
బైబిల్లోని మాట: “చనిపోయిన నీవాళ్లు బ్రతుకుతారు. . . . మట్టిలో నివసిస్తున్న వాళ్లారా, లేవండి, సంతోషంతో అరవండి!”—యెషయా 26:19.
అదెలా సహాయం చేసింది: “టుట్సీ జాతికి చెందిన నా వాళ్లల్లో చాలామంది చనిపోయారు. కానీ వాళ్లందర్నీ మళ్లీ చూస్తాననే నమ్మకాన్ని ఈ వచనం నాలో కలిగిస్తుంది. వాళ్లు బ్రతికిన తర్వాత, మేమంతా కలుసుకున్నప్పుడు ఆనందంతో పెట్టే కేకల్ని వినాలని నేను ఆశగా ఎదురుచూస్తున్నాను!”—మేరీ, రువాండా.
బైబిల్లోని మాట: “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు . . . అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:10, 11.
అదెలా సహాయం చేసింది: “యుద్ధం ముగిసిన తర్వాత కూడా మన చుట్టూ అన్యాయం, చెడుతనం కనిపిస్తుంటుంది. కానీ ఈ వచనాలు నాకు ఎంతో సహాయం చేశాయి. యెహోవా అన్నిటినీ చూస్తాడు, నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు అనే భరోసాను ఈ వచనాలు నాకు ఇచ్చాయి. నేడు జరుగుతున్న వాటన్నిటినీ త్వరలోనే సరిచేస్తానని, బాధలన్నిటినీ మర్చిపోయేలా చేస్తానని ఆయన మాటిస్తున్నాడు.”—డెలర్, తజకిస్థాన్.
నేడు లక్షలమంది యెహోవాసాక్షులు బైబిలు సహాయంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. వాళ్లలో కొందరి గురించి ఈ పత్రికలో చూశాం. వేరే దేశం, జాతి ఇంకా ఇతర కారణాల వల్ల ఎవ్వర్నీ ద్వేషించకూడదని వాళ్లు నేర్చుకున్నారు. (ఎఫెసీయులు 4:31, 32) యెహోవాసాక్షులు రాజకీయాల్లో తలదూర్చరు, హింసకు దూరంగా ఉంటారు.—యోహాను 18:36.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు అందరూ ఒక కుటుంబంగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. (యోహాను 13:35) ఉదాహరణకు మనం ముందు చూసిన ఒలెక్సాండ్రా, యుద్ధం కారణంగా వాళ్ల అక్కతో కలిసి వేరే దేశానికి పారిపోవాల్సి వచ్చింది. ఆమె ఇలా అంటోంది: “మేము సరిహద్దు దాటి, ఆశ్రయం కోసం కొత్త దేశంలో అడుగుపెట్టిన వెంటనే మాకోసం వచ్చిన అక్కడి బ్రదర్స్‌సిస్టర్స్‌ని చూశాం. మేము ఆ ప్రాంతానికి అలవాటుపడేలా వాళ్లు ఎంతో సహాయం చేశారు.”
శాంతిని తెచ్చే బైబిలు సందేశం ఏంటో, దాన్ని ఎలా పాటించవచ్చో తెలుసుకోవడానికి మా మీటింగ్స్‌కి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు దగ్గర్లో మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి లేదా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంతో యెహోవాసాక్షులు చేసే ఉచిత బైబిలు స్టడీ కోసం రిక్వెస్టు చేసుకోవడానికి jw.org వెబ్‌సైట్ చూడండి.