గుండెల్లో గుబులు పుట్టిస్తున్న యుద్ధాలు
యుద్ధాలు, దాడులు ఎంత భయంకరంగా ఉంటాయో వాటిని స్వయంగా చూసిన వాళ్లే చెప్పగలుగుతారు. యుద్ధం మిగిల్చిన గాయాల గురించి కొంతమంది సైనికులు, సామాన్య ప్రజలు ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే విందాం.
సైనికులు
“యుద్ధంలో మన కళ్లముందే ఎన్నో ప్రాణాలు పోతుంటాయి, ఎంతోమంది తీవ్రమైన గాయాల పాలౌతుంటారు. ఎప్పుడు, ఏమౌతుందో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది.”—గ్యారీ, బ్రిటన్.
“నా వీపుకు, ముఖానికి చాలా బుల్లెట్లు తగిలాయి. పిల్లలు, పెద్దవాళ్లతో సహా చాలామంది చనిపోవడం నా కళ్లారా చూశాను. అలాంటివి చూసే కొద్ది ఎవరికైనా గుండె రాయిలా మారిపోతుంది.”—విల్మర్, కొలంబియా.
“ఒక వ్యక్తిని మీ కళ్లెదుటే చంపేస్తే, అది మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. అతను చనిపోతున్నప్పుడు పడిన బాధ, పెట్టిన కేకలు మీ చెవికి వినిపిస్తూనే ఉంటాయి. ఆ వ్యక్తి ముఖం పదేపదే మీకు కనిపిస్తుంటుంది.”—జఫీరా, యునైటెడ్ స్టేట్స్.
సామాన్య ప్రజలు
“నా సంతోషం పూర్తిగా చెరిగిపోయింది. నాకు ఏమౌతుందనే భయం కన్నా నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఏమౌతుందనే భయమే ఎక్కువగా వేధిస్తుంది.”—ఒలెక్సాండ్రా, యుక్రెయిన్.
“తెల్లవారుజాము 2 గంటల నుండి అర్థరాత్రి 11 గంటల వరకు ఆహారం కోసం లైన్లో నిలబడాలంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసా? ఎటువైపు నుండి ఏ బుల్లెట్ వచ్చి తగులుతుందో తెలీక బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లం.”—డెలర్, తజకిస్థాన్.
“యుద్ధం మా అమ్మానాన్నల్ని పొట్టన పెట్టుకుంది, నన్ను అనాథను చేసింది. నన్ను చూసుకోవడానికి, ఓదార్చడానికి ఎవ్వరూ లేకుండాపోయారు.”—మేరీ, రువాండా.
పైన చెప్పిన వాళ్లందరు యుద్ధాల వల్ల ఎన్నో ఘోరాలు చూడాల్సి వచ్చింది. అయితే యుద్ధాలకు, దాడులకు తెరపడే రోజు త్వరలోనే వస్తుందని వాళ్లు తెలుసుకున్నారు. అందుకే ప్రశాంతంగా ఉంటున్నారు, ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ అదెలా సాధ్యం? ఈ కావలికోట పత్రిక బైబిలు నుండి దానికి జవాబిస్తుంది.