అధ్యయన ఆర్టికల్ 18
పాట 1 యెహోవా గుణాలు
“భూమంతటికీ న్యాయం తీర్చే” కరుణగల దేవుణ్ణి నమ్మండి!
“భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”—ఆది. 18:25.
ముఖ్యాంశం
అనీతిమంతుల్ని పునరుత్థానం చేసే విషయంలో యెహోవా చూపించే కరుణ, న్యాయం గురించి లోతుగా తెలుసుకుంటాం.
1. యెహోవా అబ్రాహాముకు ఏ ముఖ్యమైన పాఠం నేర్పించాడు?
చాలా సంవత్సరాల క్రితం అబ్రాహాము జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. సొదొమ గొమొర్రాల్ని నామరూపాల్లేకుండా చేస్తానని దేవుడు తన దూత ద్వారా అబ్రాహాముకు చెప్పాడు. అప్పుడు అబ్రాహాము గుండె జల్లుమంది! అతను వెంటనే ఇలా అన్నాడు: “నువ్వు నిజంగా దుష్టులతో పాటు నీతిమంతుల్ని తుడిచిపెడతావా? . . . భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?” అప్పుడు యెహోవా తన చిరకాల స్నేహితుడైన అబ్రాహాముకు ఓపిగ్గా ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాడు. అదేంటంటే, దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడూ నాశనం చేయడు. అది తెలుసుకోవడం మనకు ప్రయోజనాన్ని, ఓదార్పును ఇస్తుంది.—ఆది. 18:23-33.
2. ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు యెహోవా సరైనదే చేస్తాడని, కరుణ చూపిస్తాడని ఎలా చెప్పవచ్చు?
2 ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడు, కరుణ చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రజల ‘హృదయాల్ని చూస్తాడు.’ (1 సమూ. 16:7) నిజానికి “ప్రతీ మనిషి హృదయం” ఆయనకు తెలుసు. (1 రాజు. 8:39; 1 దిన. 28:9) ఇది నిజంగా ఒక అద్భుతమైన వాస్తవం! యెహోవా తీర్పులు ఎప్పుడూ మన ఊహకు అందవు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఆయన తీర్పుల్ని . . . కనుక్కోవడం అసాధ్యం!”—రోమా. 11:33, అధస్సూచి.
3-4. కొన్నిసార్లు మనకు ఏ ప్రశ్నలు రావచ్చు? ఈ ఆర్టికల్లో మనమేం చూస్తాం? (యోహాను 5:28, 29)
3 అయినాసరే, అబ్రాహాముకు వచ్చినలాంటి ప్రశ్నలే మనకూ రావచ్చు. మనకు కొన్నిసార్లు ఇలా అనిపించవచ్చు: ‘యెహోవా తీర్పు తీర్చిన సొదొమ గొమొర్రా లాంటి ప్రజలకు ఏదైనా నిరీక్షణ ఉందా? దేవుడు అనీతిమంతుల్ని తిరిగి బ్రతికించినప్పుడు వాళ్లలో ఎవరైనా వస్తారా?’—అపొ. 24:15.
4 పునరుత్థానం గురించి మనమేమి అర్థంచేసుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. “జీవించడానికి” పునరుత్థానం అవ్వడం గురించి, “తీర్పు పొందడానికి” పునరుత్థానం అవ్వడం గురించి ఈ మధ్యే మరింత స్పష్టమైన అవగాహన వచ్చింది.a (యోహాను 5:28, 29 చదవండి.) దానివల్ల ఇంకొన్ని సవరణలు అవసరమయ్యాయి. ఇప్పుడు వాటి గురించే ఈ ఆర్టికల్లో అలాగే తర్వాతి ఆర్టికల్లో చూస్తాం. అయితే, దేవుని న్యాయమైన తీర్పుల గురించి మనకు ఏం తెలీదో, మనకు ఏం తెలుసో పరిశీలిద్దాం.
మనకు ఏం తెలీదు?
5. యెహోవా నాశనం చేసిన సొదొమ గొమొర్రా లాంటి ప్రజల గురించి గతంలో మన ప్రచురణలు ఏం చెప్పాయి?
5 యెహోవా అనీతిమంతులుగా తీర్పుతీర్చే వాళ్లకు ఏం జరుగుతుందో గతంలో మన ప్రచురణలు చెప్పాయి. ఉదాహరణకు, యెహోవా నాశనం చేసిన సొదొమ గొమొర్రా లాంటి ప్రజలకు పునరుత్థానం ఉండదని చెప్పాం. కానీ ప్రార్థన చేసి, జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత, మనం ఆ విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పలేమని అర్థం చేసుకున్నాం. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
6. అనీతిమంతులైన ప్రజలకు యెహోవా తీర్పుతీర్చిన కొన్ని సందర్భాలు ఏంటి? వాటి గురించి బైబిలు ఏం చెప్పట్లేదు?
6 దానికి సంబంధించి ఇంకొన్ని విషయాల్ని గమనించండి. అనీతిమంతులైన ప్రజలకు యెహోవా ఇచ్చిన తీర్పుల గురించి బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, యెహోవా జలప్రళయం రప్పించినప్పుడు లెక్కలేనంతమంది చనిపోయారు. అలాగే వాగ్దాన దేశంలో ఉన్న ఏడు జనాంగాల్ని నాశనం చేయమని దేవుడు తన ప్రజలకు చెప్పాడు. అంతేకాదు, ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరు సైనికులు యెహోవా పంపిన దూత చేతిలో చనిపోయారు. (ఆది. 7:23; ద్వితీ. 7:1-3; యెష. 37:36, 37) వాళ్లందరూ పునరుత్థాన నిరీక్షణ లేకుండా శాశ్వతంగా నాశనం అవ్వాలని యెహోవా తీర్పుతీర్చేశాడా? అలా చెప్పడానికి తగినన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయా? లేవు! అలాగని ఎందుకు చెప్పొచ్చో చూద్దాం.
7. జలప్రళయంలో అలాగే కనాను దేశంలో నాశనమైన ప్రజల గురించి మనకు ఏం తెలీదు? (చిత్రం చూడండి.)
7 వాళ్లలో ఒక్కొక్కరికి యెహోవా ఎలా తీర్పుతీర్చాడో మనకు తెలీదు. వాళ్లు చనిపోకముందు యెహోవా గురించి నేర్చుకుని, పశ్చాత్తాపపడే అవకాశం వాళ్లకు దొరికిందో లేదో కూడా మనకు తెలీదు. జలప్రళయం వచ్చే సమయాన్నే తీసుకుంటే, నోవహు ‘నీతిని ప్రకటించాడు’ అని బైబిలు చెప్తుంది. (2 పేతు. 2:5) కానీ అతను అంత పెద్ద ఓడ కడుతూనే భూమ్మీదున్న ప్రతీఒక్కరికి ప్రకటించాడని బైబిలు చెప్పట్లేదు. అదేవిధంగా, కనాను దేశంలో నాశనమైన చెడ్డ ప్రజలందరికీ యెహోవా గురించి తెలుసుకుని, తమ తప్పుల్ని సరిచేసుకునే అవకాశం దొరికిందో లేదో కూడా మనకు తెలీదు.
నోవహు, ఆయన కుటుంబం చాలా పెద్ద ఓడను కడుతున్నారు. నోవహు జలప్రళయం రావడానికి ముందు భూమ్మీదున్న ప్రతీఒక్కరికి ప్రకటించాడో లేదో మనకు తెలీదు (7వ పేరా చూడండి)
8. సొదొమ గొమొర్రా ప్రజల గురించి మనకు ఏం తెలీదు?
8 మరి సొదొమ గొమొర్రా ప్రజల సంగతేంటి? అక్కడ నీతిమంతుడైన లోతు జీవించాడు. కానీ లోతు అక్కడున్న వాళ్లందరికీ ప్రకటించాడని మనకు తెలుసా? లేదు. ఆ నగరంలో ఉన్నవాళ్లందరూ చెడ్డవాళ్లే. కానీ వాళ్లలో ప్రతీఒక్కరికి మంచిచెడులు తెలుసా? ఆ నగరంలో కొంతమంది పురుషులు లోతు ఇంటికొచ్చిన అతిథులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకున్నారని గుర్తుతెచ్చుకోండి. వాళ్లలో “పిల్లవాడి నుండి ముసలివాడి వరకు” ఉన్నారని బైబిలు చెప్తుంది. (ఆది. 19:4; 2 పేతు. 2:7) కరుణగల దేవుడైన యెహోవా వాళ్లకు పునరుత్థాన నిరీక్షణ లేకుండా నాశనం చేశాడని మనకు నిజంగా తెలుసా? ఆ నగరంలో కనీసం పదిమంది నీతిమంతులు కూడా లేరని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. (ఆది. 18:32) కాబట్టి వాళ్లందరూ అనీతిమంతులే, వాళ్ల పనుల్ని బట్టి యెహోవా వాళ్లను నాశనం చేయడం కూడా సరైనదే! అలాగని వాళ్లలో ఎవ్వరూ అనీతిమంతుల పునరుత్థానంలో తిరిగి బ్రతకరని మనం చెప్పగలమా? లేదు, మనం అంత ఖచ్చితంగా చెప్పలేం!
9. సొలొమోనుకు సంబంధించి మనకు ఏం తెలీదు?
9 ఇంకోవైపు, ముందు నీతిమంతులుగా ఉండి ఆ తర్వాత అనీతిమంతులైన వాళ్ల గురించి కూడా బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, రాజైన సొలొమోను యెహోవాను ఆరాధించినంతకాలం యెహోవా అతని మీద దీవెనల వర్షం కురిపిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే అతను అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టాడో అప్పుడు యెహోవాకు కోపం వచ్చింది. అతను చేసిన పాపాలకు వందలయేళ్లు ఇశ్రాయేలు దేశం నానా అవస్థలు పడింది. నిజమే సొలొమోను చనిపోయాక, నమ్మకమైన దావీదు లాంటి తన పూర్వీకులతోపాటు పాతిపెట్టబడ్డాడని బైబిలు చెప్తుంది. (1 రాజు. 11:5-9, 43; 2 రాజు. 23:13) అయితే, అతను పాతిపెట్టబడిన విధానాన్ని బట్టి అతను పునరుత్థానం అవుతాడో లేదో చెప్పగలమా? లేదు, బైబిలు దానిగురించి ఏమీ చెప్పట్లేదు. కొంతమంది ఇలా కూడా అనొచ్చు: “చనిపోయిన వ్యక్తి తన పాపం నుండి విడుదల పొందాడు.” (రోమా. 6:7) అది నిజమే, కానీ చనిపోయిన ప్రతీఒక్కరు పునరుత్థానం అవుతారని దానర్థం కాదు. ఎందుకంటే పునరుత్థానం ఒక హక్కు కాదు, అది యెహోవా ప్రేమతో ఇచ్చే ఒక బహుమతి. తనని శాశ్వతకాలం ఆరాధించే అవకాశం ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయన వాళ్లకు ఇస్తాడు. (యోబు 14:13, 14; యోహా. 6:44) మరి ఆ బహుమతిని సొలొమోను పొందుతాడా? జవాబు యెహోవాకే తెలుసు, మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఒకటే, యెహోవా ఏంచేసినా సరైనదే చేస్తాడు!
మనకు ఏం తెలుసు?
10. ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది? (యెహెజ్కేలు 33:11) (చిత్రం కూడా చూడండి.)
10 యెహెజ్కేలు 33:11 చదవండి. ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు తనకు ఎలా అనిపిస్తుందో యెహోవా చెప్పాడు. యెహెజ్కేలు రాసినట్టే యెహోవా గురించి పేతురు కూడా చెప్తూ ఇలా అన్నాడు: “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు.” (2 పేతు. 3:9) దాన్నిబట్టి యెహోవా తొందరపడి ఎవర్నీ శాశ్వతంగా నాశనం చేయడు అని మనకు తెలుసు. యెహోవా కరుణకు మారుపేరు. అందుకే ఆయన కరుణ చూపించడానికి అస్సలు వెనకాడడు.
అనీతిమంతుల పునరుత్థానంలో యెహోవా గురించి తెలుసుకునే అవకాశం రకరకాల ప్రజలకు దొరుకుతుంది (10వ పేరా చూడండి)
11. ఎవరు పునరుత్థానం అవ్వరు? అది మనకు ఎలా తెలుసు?
11 పునరుత్థానం అయ్యే అవకాశం లేని వాళ్ల గురించి మనకు ఏం తెలుసు? వాళ్ల గురించి బైబిల్లో కేవలం కొన్ని ఉదాహరణలే ఉన్నాయి.b ఇస్కరియోతు యూదా పునరుత్థానం అవ్వడని యేసు చెప్పాడు. (మార్కు 14:21; యోహాను 17:12c) ఎందుకంటే యూదా కావాలనే యెహోవాకు, ఆయన కుమారునికి ఎదురుతిరిగాడు. (మార్కు 3:29 అలాగే jw.orgలో ఉన్న “క్షమించరాని పాపం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.) అదేవిధంగా, తనను వ్యతిరేకించిన మతనాయకుల్లో కూడా కొంతమంది పునరుత్థానం అవ్వరని యేసు చెప్పాడు. (మత్త. 23:33) అంతేకాదు, పశ్చాత్తాపపడని మతభ్రష్టులు కూడా పునరుత్థానం అవ్వరని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.—హెబ్రీ. 6:4-8; 10:29.
12. యెహోవా కరుణ గురించి మనకు ఏం తెలుసు? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
12 మరోవైపు, యెహోవా కరుణ గురించి మనకు ఏం తెలుసు? “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు” అని ఎలా చూపించాడు? ఘోరమైన పాపాలు చేసిన కొంతమంది మీద ఆయన ఎలా కరుణ చూపించాడో ఆలోచించండి. రాజైన దావీదు లైంగిక పాపం, హత్య లాంటి ఘోరమైన పాపాలు వెంటవెంటనే చేసినా, అతను పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా కరుణ చూపించి, క్షమించాడు. (2 సమూ. 12:1-13) రాజైన మనష్షే జీవితమంతా పాపాలతో నిండిపోయింది. ఘోరమైన పాపాలు చేసినా, అతను పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా కరుణ చూపించి, క్షమించాడు. (2 దిన. 33:9-16) కరుణ చూపించడానికి కారణాలు ఉన్నప్పుడు యెహోవా దాన్ని చూపిస్తాడని ఈ ఉదాహరణలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని, పశ్చాత్తాపపడతారో వాళ్లను ఆయన పునరుత్థానం చేస్తాడు.
13. (ఎ) నీనెవె ప్రజల మీద యెహోవా ఎందుకు కరుణ చూపించాడు? (బి) వాళ్ల గురించి తర్వాత యేసు ఏం చెప్పాడు?
13 నీనెవె ప్రజల మీద యెహోవా చూపించిన కరుణ గురించి కూడా మనకు తెలుసు. దేవుడు యోనాతో ఇలా అన్నాడు: “వాళ్ల చెడుతనం నా దృష్టికి వచ్చింది.” వాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా దయతో వాళ్లను క్షమించాడు. యోనా కన్నా యెహోవాకు ఎన్నో రెట్లు ఎక్కువ కరుణ ఉంది. యోనా కోపంగా ఉన్నప్పుడు, నీనెవె ప్రజలకు “మంచిచెడులు” తెలియవని దేవుడు అతనికి గుర్తుచేశాడు. (యోనా 1:1, 2; 3:10; 4:9-11) తర్వాత వాళ్ల ఉదాహరణనే యేసు ఉపయోగించి యెహోవాకున్న న్యాయం, కరుణ గురించి ఒక పాఠం నేర్పించాడు. పశ్చాత్తాపం చూపించిన నీనెవె ప్రజలు “తీర్పు సమయంలో” లేస్తారని యేసు చెప్పాడు.—మత్త. 12:41.
14. తీర్పు పునరుత్థానం వల్ల నీనెవె ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
14 నీనెవె ప్రజలు తిరిగి ‘లేచే తీర్పు’ సమయం ఏంటి? యేసు భవిష్యత్తులో జరగబోయే “తీర్పు పునరుత్థానం” గురించి చెప్పాడు. (యోహా. 5:29) ఆయన ఆ సందర్భంలో తన వెయ్యేళ్ల పరిపాలనను సూచిస్తూ మాట్లాడాడు. ఆ సమయంలో ‘నీతిమంతులు, అనీతిమంతులు’ తిరిగి బ్రతికించబడతారు. (అపొ. 24:15) అనీతిమంతులు “తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.” అప్పుడు యెహోవా, యేసు వాళ్లని అలాగే వాళ్ల పనుల్ని గమనిస్తూ, తమ ఉపదేశానికి వాళ్లెలా స్పందిస్తున్నారో కూడా చూస్తారు. పునరుత్థానమైన నీనెవె ప్రజలు తనను ఆరాధించడానికి ఇష్టపడకపోతే యెహోవా వాళ్లనిక ప్రాణాలతో ఉండనివ్వడు. (యెష. 65:20) కానీ ఎవరైతే ఆయన్ని నమ్మకంగా ఆరాధిస్తారో వాళ్లకు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇస్తాడు.—దాని. 12:2.
15. (ఎ) సొదొమ గొమొర్రా ప్రజల్లో ఎవ్వరూ పునరుత్థానం అవ్వరని ఎందుకు చెప్పలేం? (బి) యూదా 7వ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? (“యూదా మాటల అర్థమేంటి?” బాక్స్ చూడండి.)
15 తనను, తన బోధల్ని వ్యతిరేకించిన వాళ్ల పరిస్థితికన్నా “తీర్పు రోజున” సొదొమ గొమొర్రా ప్రజల పరిస్థితి మెరుగ్గా ఉంటుందని యేసు చెప్పాడు. (మత్త. 10:14, 15; 11:23, 24; లూకా 10:12) దానర్థం ఏంటి? ఇక్కడ యేసు అతిశయోక్తిగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపించవచ్చు. కానీ అదేం కాదు. తీర్పు సమయంలో నీనెవె ప్రజలు లేస్తారని యేసు అన్నప్పుడు వాళ్లు నిజంగానే పునరుత్థానం అవుతారని ఆయన చెప్తున్నాడు. అలాగే సొదొమ గొమొర్రా ప్రజల గురించి యేసు చెప్పింది కూడా జరుగుతుందని అర్థమౌతుంది. ఈ రెండు సందర్భాల్లో యేసు ఉపయోగించిన “తీర్పు రోజు” ఒక్కటే. నీనెవె ప్రజల్లాగే సొదొమ గొమొర్రా ప్రజలు కూడా చెడ్డ పనులు చేశారు. కానీ నీనెవె ప్రజలకు పశ్చాత్తాపపడే అవకాశం దొరికింది. దానికితోడు “తీర్పు పొందడానికి” పునరుత్థానమయ్యే విషయం గురించి యేసు ఏం చెప్పాడో గుర్తుతెచ్చుకోండి. అలా పునరుత్థానమయ్యే వాళ్లలో “అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు” కూడా ఉంటారు. (యోహా. 5:29) దీన్నిబట్టి సొదొమ గొమొర్రా ప్రజలు పునరుత్థానమయ్యే అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్లల్లో కొంతమందైనా పునరుత్థానం అవ్వొచ్చు. అప్పుడు వాళ్లకు యెహోవా గురించి, యేసు గురించి చెప్పే అవకాశం మనకు దొరకవచ్చు.
16. యెహోవా ఎవర్ని పునరుత్థానం చేస్తాడనే విషయంలో మనకు ఏం తెలుసు? (యిర్మీయా 17:10)
16 యిర్మీయా 17:10 చదవండి. ఈ వచనంలో మనకు ఏం తెలుసో ఉంది. యెహోవా ఎప్పుడూ ‘హృదయాన్ని పరిశీలిస్తూ, అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు.’ భవిష్యత్తు పునరుత్థానం విషయానికి వస్తే, ఆయన ఎప్పుడూ “ప్రతీ ఒక్కరికి వాళ్ల మార్గాల్ని బట్టి, పనుల్ని బట్టి ప్రతిఫలం” ఇస్తాడు. యెహోవా అవసరమైనప్పుడు నిక్కచ్చిగా ఉంటాడు, అలాగే ఎప్పుడు కరుణ చూపించాలో అప్పుడు చూపిస్తాడు. కాబట్టి ఫలానా వ్యక్తికి పునరుత్థాన నిరీక్షణ లేదు అని బైబిలు చెప్తే తప్ప మనం చెప్పలేం!
“భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది” చేస్తాడు
17. ఇప్పటివరకు చనిపోయిన కోటానుకోట్లమంది సంగతేంటి?
17 ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపి యెహోవాకు ఎదురు తిరిగినప్పటి నుండి ఇప్పటివరకు కోట్లమంది చనిపోయారు. మన ‘శత్రువైన మరణం’ చాలామందిని పొట్టన పెట్టుకుంది. (1 కొరిం. 15:26) మరి వాళ్లందరి సంగతేంటి? క్రీస్తు నమ్మకమైన అనుచరులుగా ఉన్న 1,44,000 మంది పరలోకంలో అమర్త్యమైన జీవితం కోసం పునరుత్థానం అవుతారు. (ప్రక. 14:1) యెహోవాకు నమ్మకంగా ఉన్న లెక్కలేనంతమంది స్త్రీపురుషులు ‘నీతిమంతుల పునరుత్థానంలో’ బ్రతికించబడతారు. వాళ్లు వెయ్యేళ్ల పరిపాలనలో అలాగే చివరి పరీక్షలో నమ్మకంగా ఉంటే ఈ భూమ్మీద శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటారు. (దాని. 12:13; హెబ్రీ. 12:1) అంతేకాదు, వెయ్యేళ్ల పరిపాలనలో “అనీతిమంతులు” తమ తప్పుడు పనులు మానేసి, యెహోవాకు నమ్మకమైన సేవకులుగా మారే అవకాశం దొరుకుతుంది. ఆ అనీతిమంతుల్లో అంతకుముందు యెహోవాను ఎప్పుడూ సేవించనివాళ్లు లేదా “అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు” కూడా ఉంటారు. (లూకా 23:42, 43) కానీ గతంలో కొంతమంది ఎంత చెడ్డగా ప్రవర్తించారంటే, ఎంతగా యెహోవాకు, ఆయన ఇష్టానికి ఎదురుతిరిగారంటే వాళ్లను అస్సలు పునరుత్థానం చేయకూడదని యెహోవా నిర్ణయించుకున్నాడు.—లూకా 12:4, 5.
18-19. (ఎ) చనిపోయినవాళ్లను తిరిగి లేపే విషయంలో యెహోవా నిర్ణయాలు సరైనవని ఎందుకు నమ్మవచ్చు? (యెషయా 55:8, 9) (బి) తర్వాతి ఆర్టికల్లో ఏం చూస్తాం?
18 ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని నమ్మవచ్చా? ఖచ్చితంగా నమ్మవచ్చు! ఎందుకంటే అబ్రాహాము అర్థం చేసుకున్నట్టు “భూమంతటికీ న్యాయం తీర్చే” యెహోవా పరిపూర్ణుడు, తెలివైనవాడు, కరుణ గలవాడు. ఆయన తన కుమారునికి శిక్షణ ఇచ్చి, తీర్పుతీర్చే బాధ్యతను అప్పగించాడు. (యోహా. 5:22) తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రతీఒక్కరి హృదయంలో ఏముందో చదవగలరు. (మత్త. 9:4) కాబట్టి ప్రతీసారి వాళ్లు ‘సరైనదే చేస్తారు!’
19 యెహోవా మీద, ఆయన తీసుకునే నిర్ణయాల మీద నమ్మకం ఉంచుదాం. తీర్పుతీర్చే అర్హత మనకు లేదు, యెహోవాకు మాత్రమే ఉంది! (యెషయా 55:8, 9 చదవండి.) కాబట్టి తీర్పుతీర్చే పనిని ఆయనకు, ఆయన కుమారునికే వదిలేద్దాం! యేసు రాజుగా తన తండ్రిలాగే న్యాయాన్ని, కరుణను చూపిస్తాడు. (యెష. 11:3, 4) మరి మహాశ్రమ సమయంలో యెహోవా, యేసు ప్రజలకు తీర్పుతీర్చే సంగతేంటి? దానిగురించి మనకు ఏం తెలీదు? మనకు ఏం తెలుసు? తర్వాతి ఆర్టికల్లో చూద్దాం.
పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం
a కావలికోట సెప్టెంబరు, 2022 పత్రికలోని 14-19 పేజీలు చూడండి.
b ఆదాముహవ్వలు అలాగే కయీను గురించి కావలికోట జనవరి 1, 2013 పత్రికలోని 12వ పేజీలో ఉన్న అధస్సూచి చూడండి.
c యోహాను 17:12 లో ఉపయోగించిన “నాశనపుత్రుడు” అనే మాట, యూదా చనిపోయాక అతను ఏ నిరీక్షణ లేకుండా శాశ్వతంగా నాశనం అవుతాడని సూచిస్తుంది.