అధ్యయన ఆర్టికల్ 6
బైబిలు దాని రచయిత గురించి ఏం చెప్తుంది?
“నేను నీకు చెప్పే మాటలన్నీ ఒక పుస్తకంలో రాయి.”—యిర్మీ. 30:2.
పాట 96 దేవుడిచ్చిన గ్రంథం ఒక నిధి
ఈ ఆర్టికల్‌లో . . .a
1. బైబిలు ఒక గొప్ప బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
బైబిలు అనే గొప్ప బహుమతిని ఇచ్చినందుకు యెహోవాపట్ల మనకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఈ రోజుల్లో మనకు వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవచ్చో చెప్పే తెలివైన సలహాలు అందులో ఉన్నాయి. మంచి రోజులు వస్తాయనే ఆశను కూడా అది మనలో నింపుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాకు ఉన్న ఎన్నో మంచి లక్షణాల గురించి అది మనకు చెప్తుంది. వాటి గురించి ఆలోచించినప్పుడు ఆయన మీద మనకు ప్రేమ పెరుగుతుంది. ఆయనకు ఇంకా దగ్గరవ్వాలని అనిపిస్తుంది.—కీర్త. 25:14.
2. యెహోవా తన గురించి మనకు ఏయే విధాలుగా చెప్పాడు?
2 ప్రజలు తన గురించి తెలుసుకోవాలని యెహోవా కోరుకున్నాడు. గతంలో కలలు, దర్శనాలు, దేవదూతల ద్వారా ఆయన తన గురించి చెప్పాడు. (సంఖ్యా. 12:6; అపొ. 10:3, 4) అయితే ఈ కలలు, దర్శనాలు, దేవదూతల మాటలు రాసిపెట్టివుంటేనే కదా మనం వాటిని అధ్యయనం చేయగలం. అందుకే, మనం వాటిని తెలుసుకోవడం కోసం, యెహోవా కొంతమంది మనుషులతో వాటిని “ఒక పుస్తకంలో” రాయించాడు. (యిర్మీ. 30:2) “సత్యదేవుని మార్గం పరిపూర్ణమైనది” కాబట్టి మనతో మాట్లాడడానికి యెహోవా ఎంచుకున్న ఈ పద్ధతి సరైనది, మేలైనది అని చెప్పవచ్చు.—కీర్త. 18:30.
3. బైబిలు మన వరకు వచ్చేలా యెహోవా ఎలా చూసుకున్నాడు? (యెషయా 40:8)
3 యెషయా 40:8 చదవండి. వేల సంవత్సరాలుగా దేవుని వాక్యం నమ్మకమైన స్త్రీపురుషులకు తెలివైన సలహాల్ని ఇస్తూ వచ్చింది. దాన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు, అందులోనూ త్వరగా పాడైపోయే కాగితాల మీద రాశారు. అందుకే మొదట్లో రాసిన రాత ప్రతులు ఏవీ ఇప్పుడు లేవు. మరి బైబిలు మన వరకు ఎలా వచ్చింది? ప్రజలు లేఖనాల్ని నకలు లేదా కాపీ చేసేలా యెహోవా చూసుకున్నాడు. ఈ కాపీ రాసేవాళ్లు అపరిపూర్ణులే కానీ ఆ పనిని చాలా జాగ్రత్తగా చేశారు. హీబ్రూ లేఖనాల గురించి ఒక పండితుడు ఏమంటున్నాడంటే: “ప్రాచీన కాలంలో రాయబడిన పుస్తకాలేవీ బైబిలంత ఖచ్చితంగా నకలు రాయబడలేదని చెప్పవచ్చు.” అవును, వేల సంవత్సరాలు గడిచినా, లేఖనాల్ని పాడైపోయే కాగితాల మీద రాసినా, కాపీ రాసేవాళ్లు అపరిపూర్ణులైనా బైబిల్లో యెహోవా ఆలోచనలు ఉన్నాయనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు.
4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
4 “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” యెహోవా ఇస్తాడు. (యాకో. 1:17) యెహోవా మనకు ఇచ్చిన మంచిమంచి బహుమతుల్లో బైబిలు ఒకటి. ఎవరైనా మనకు ఒక బహుమతి ఇచ్చారనుకోండి, దాన్ని ఇచ్చిన వ్యక్తికి మన గురించి, మన అవసరాల గురించి ఎంతవరకు తెలుసో ఆ బహుమతిని బట్టి చెప్పవచ్చు. బైబిలు విషయంలో కూడా అంతే. బైబిలు చదివినప్పుడు ఆ బహుమతిని ఇచ్చిన యెహోవా గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఆయనకు మన గురించి, మన అవసరాల గురించి బాగా తెలుసని కూడా అర్థంచేసుకుంటాం. ఈ ఆర్టికల్‌లో యెహోవాకున్న మూడు లక్షణాల్ని అంటే తెలివిని, న్యాయాన్ని, ప్రేమని బైబిలు ఎలా చూపిస్తుందో తెలుసుకుంటాం. ముందుగా, బైబిలు దేవుని తెలివిని ఎలా చూపిస్తుందో తెలుసుకుందాం.
బైబిలు దేవుని తెలివిని చూపిస్తుంది
5. బైబిలు దేవుని తెలివిని ఎలా చూపిస్తుంది?
5 యెహోవా ఇచ్చే తెలివైన సలహాలు మనకు అవసరం. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టే బైబిలు అనే బహుమతి నిండా తెలివైన సలహాలు రాయించాడు. అవి మనకు మేలు చేస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి. అందుకే బైబిల్లోని మొదటి కొన్ని పుస్తకాల్ని రాస్తున్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో మోషే ఇలా అన్నాడు: “ఇది మీకు వట్టి మాట కాదు, ఇది మీకు జీవం.” (ద్వితీ. 32:47) బైబిలు సలహాల్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు, వాళ్లు చేసే పనికి మంచి ఫలితాలు వస్తాయి. (కీర్త. 1:2, 3) ఎన్ని సంవత్సరాలైనా దేవుని వాక్యానికి ఉన్న శక్తి మాత్రం తగ్గలేదు. అది ఇప్పటికీ ప్రజల జీవితాల్ని మారుస్తుంది. ఉదాహరణకు, jw.orgలో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే ఆర్టికల్ సిరీస్‌లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అవి చూస్తే, బైబిలు లక్షలమంది జీవితాలపై “గొప్ప ప్రభావం చూపిస్తోంది” అని తెలుసుకుంటాం.—1 థెస్స. 2:13.
6. బైబిలు లాంటి పుస్తకం మరొకటి లేదని ఎందుకు చెప్పవచ్చు?
6 బైబిలు లాంటి పుస్తకం మరొకటి లేదు. ఎందుకంటే దాన్ని రాయించిన యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎప్పటినుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. అంతేకాదు, ఆయనకు ఉన్నలాంటి తెలివి ఇంకెవ్వరికీ లేదు. మిగతా పుస్తకాల గురించి ఆలోచిస్తే, వాటి రచయితలు ఏదోకరోజు చనిపోతారు. అంతేకాదు దానిలో ఉన్న సలహాలు కాలంతోపాటు కనుమరుగైపోతాయి. మరోవైపు, బైబిల్లో ఉన్న తెలివైన సలహాలకు కాల పరిమితి లేదు. అవి ఏ తరం వాళ్లకైనా ఉపయోగపడతాయి. బైబిల్ని చదివి, బాగా ఆలోచించినప్పుడు యెహోవా మనకు తన పవిత్రశక్తిని ఇస్తాడు. దాంతో ఆ సలహాల్ని మన జీవితంలో ఎలా పాటించాలో అర్థంచేసుకోగలుగుతాం. (కీర్త. 119:27; మలా. 3:16; హెబ్రీ. 4:12) అవును, ఎప్పటికీ ఉండే బైబిలు రచయిత మీకు సహాయం చేయాలని ఎంతో కోరుకుంటున్నాడు. అది వింటుంటే బైబిల్ని రోజూ చదవాలని మీకు అనిపించట్లేదా?
బైబిలు అప్పుడు, ఇప్పుడు యెహోవా ప్రజల్ని ఎలా ఐక్యం చేసింది? (7-8 పేరాలు చూడండి)
7. గతంలో బైబిలు దేవుని ప్రజల్ని ఎలా ఐక్యం చేసింది?
7 బైబిలు దేవుని తెలివిని చూపిస్తుందని చెప్పడానికి ఇంకో రుజువును పరిశీలిద్దాం. అదేంటంటే, బైబిలు దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్లాక కొందరు చేపలు పట్టేవాళ్లు, కొందరు పశువులు కాసేవాళ్లు, కొందరు పొలం పని చేసుకునేవాళ్లు. అలా వాళ్లు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దాంతో వాళ్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఆ దేశంలో ఉన్న మిగతా ఇశ్రాయేలీయుల్ని పట్టించుకోవడం మానేసే ప్రమాదముంది. కానీ అలా జరగకుండా వాళ్లందరూ ఒకచోట కలుసుకుని, దేవుని వాక్యాన్ని చదువుతుంటే వినాలని యెహోవా చెప్పాడు. (ద్వితీ. 31:10-13; నెహె. 8:2, 8, 18) అందుకే, దేవుడు చెప్పిన మాటకు లోబడే ఇశ్రాయేలీయులు దేశంలో ఏ మూల ఉన్నా ఆరాధన కోసం యెరూషలేముకు వచ్చేవాళ్లు. అలా వచ్చిన లక్షలమంది తోటి ఇశ్రాయేలీయుల్ని చూసినప్పుడు ఒక ఇశ్రాయేలీయునికి ఎలా అనిపించివుంటుందో ఊహించుకోండి. యెహోవా చేసిన ఈ ఏర్పాటు వల్ల ఆయన ప్రజలు ఐక్యంగా ఉండగలిగారు. తర్వాత క్రైస్తవ సంఘం ఏర్పడినప్పుడు కూడా వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లు, గొప్పవాళ్లు-సామాన్యులు, ధనవంతులు-పేదవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ, వాళ్లందరూ బైబిల్ని ప్రేమించేవాళ్లు కాబట్టి సత్య దేవున్ని ఐక్యంగా ఆరాధించారు. వాళ్లు తోటి క్రైస్తవుల సహాయం వల్ల, కూటాల్లో కలుసుకోవడం వల్ల దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగారు.—అపొ. 2:42; 8:30, 31.
8. నేడు బైబిలు దేవుని ప్రజల్ని ఎలా ఐక్యం చేస్తుంది?
8 ఇప్పుడు కూడా తెలివైన మన దేవుడు బైబిలు ద్వారా తన ప్రజలకు బోధిస్తున్నాడు. వాళ్లను ఐక్యం చేస్తున్నాడు. మనం ఎంతో ఆనందించే ఆధ్యాత్మిక ఆహారం అంతటికీ మూలం బైబిలే. మనం మీటింగ్స్‌లో, సమావేశాల్లో క్రమంగా కలుసుకుంటాం. అక్కడ మనకు లేఖనాల్ని చదివి, వివరిస్తారు. వాటిని మనం చర్చించుకుంటాం. ఆ విధంగా యెహోవా కోరుకున్నట్టే తన ప్రజలు ఆయన్ని “ఐక్యంగా” సేవించడానికి బైబిలు ఎంతో సహాయం చేస్తుంది.—జెఫ. 3:9.
9. బైబిల్ని అర్థంచేసుకోవాలంటే మనకు ఏం ఉండాలి? (లూకా 10:21)
9 యెహోవా తెలివికి మరో రుజువును పరిశీలించండి. లేఖనాల్లో ఉన్న చాలా విషయాల్ని కేవలం వినయం ఉంటేనే అర్థంచేసుకునేలా రాయించాడు. (లూకా 10:21 చదవండి.) బైబిల్ని చదివేవాళ్లు అన్నిదేశాల్లో ఉన్నారు. ఒక పండితుడు ఇలా అన్నాడు: “బైబిలు ఎక్కువమంది చదివే పుస్తకమే కాదు. అది జాగ్రత్తగా చదివే పుస్తకం కూడా.” కానీ కేవలం వినయం ఉన్నవాళ్లు మాత్రమే దాన్ని సరిగ్గా అర్థంచేసుకుని పాటిస్తున్నారు.—2 కొరిం. 3:15, 16.
10. బైబిలు యెహోవా తెలివిని చూపిస్తుందని చెప్పడానికి ఇంకో రుజువు ఏంటి?
10 బైబిలు యెహోవా తెలివిని చూపిస్తుందని చెప్పడానికి ఇంకో రుజువును చూద్దాం. బైబిల్ని యెహోవా ప్రజలందరి కోసం రాయించినప్పటికీ అందులో వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడే సలహాలు, ఓదార్పునిచ్చే విషయాలు ఉన్నాయి. బైబిలు చదువుతున్నప్పుడు యెహోవాకు మనమీద ఉన్న శ్రద్ధను గుర్తించగలుగుతాం. (యెష. 30:21) రకరకాల కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని లేఖనాలు మనకు ధైర్యాన్ని ఇచ్చి ఉంటాయి. అవి కేవలం మనకోసమే రాసినట్టు అనిపించి ఉంటాయి. కానీ యెహోవా బైబిల్ని అన్నిరకాల, అన్నికాలాల ప్రజల కోసం రాయించాడు. మరి అది మనకోసమే అన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే దాని రచయిత ఎంతో తెలివైనవాడు.—2 తిమో. 3:16, 17.
బైబిలు దేవుని న్యాయాన్ని చూపిస్తుంది
11. బైబిల్ని రాయించినప్పుడు యెహోవా ఎలా పక్షపాతాన్ని చూపించలేదు?
11 యెహోవాకున్న ఇంకొక లక్షణం న్యాయం. (ద్వితీ. 32:4) న్యాయానికి, పక్షపాతం లేకపోవడానికి చాలా దగ్గరి సంబంధముంది. యెహోవాకు పక్షపాతం లేదు. (అపొ. 10:34, 35; రోమా. 2:11) యెహోవాకున్న ఈ గుణం బైబిల్ని రాయించడానికి ఉపయోగించిన భాషల్లో కనిపిస్తుంది. బైబిల్లోని మొదటి 39 పుస్తకాలు ఎక్కువశాతం హీబ్రూ భాషలో రాయబడ్డాయి. ఆ భాష ఆ కాలంలోని దేవుని ప్రజలకు సులభంగా అర్థమయ్యేది. అయితే క్రీస్తు శకం మొదటి శతాబ్దం కల్లా ఎక్కువశాతం మంది గ్రీకు భాషను మాట్లాడేవాళ్లు. కాబట్టి బైబిల్లోని చివరి 27 పుస్తకాలు ఎక్కువశాతం ఆ భాషలోనే రాయబడ్డాయి. యెహోవా తన వాక్యాన్ని రాయించడానికి కేవలం ఒక్క భాషనే ఉపయోగించాలని అనుకోలేదు. నేడు భూమ్మీదున్న దాదాపు 800 కోట్ల మంది ఎన్నో భాషలు మాట్లాడుతున్నారు. మరి వీళ్లందరూ యెహోవా గురించి ఎలా తెలుసుకుంటారు?
12. దానియేలు 12:4 లో ఉన్న ప్రవచనం ఇప్పుడు ఎలా నెరవేరుతుంది?
12 “అంత్యకాలంలో” బైబిల్లో ఉన్న “నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది” అని యెహోవా దానియేలు ప్రవక్త ద్వారా రాయించాడు. ఆ జ్ఞానాన్ని చాలామంది అర్థంచేసుకుంటారు. (దానియేలు 12:4 చదవండి.) ఎందుకంటే బైబిలు, బైబిలు ప్రచురణలు వేర్వేరు భాషల్లోకి అనువదించబడుతున్నాయి. వాటిని ముద్రించి, విరివిగా పంచిపెడుతున్నారు. ప్రపంచంలో వేరే ఏ పుస్తకం కూడా అన్ని భాషల్లో అనువదించబడట్లేదు, పంచిపెట్టబడట్లేదు. సాధారణంగా, పుస్తకాలు తయారుచేసే కొన్ని కంపెనీలే బైబిలు అనువాదాల్ని తయారు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కానీ యెహోవా ప్రజలు ఇప్పటివరకు బైబిల్ని పూర్తిగా లేదా భాగాలుగా 240 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించారు. ఎవ్వరైనా దాన్ని ఉచితంగా తీసుకోవచ్చు. దానివల్ల అన్నిదేశాల ప్రజలు అంతం రాకముందే “రాజ్య సువార్త” గురించి తెలుసుకుంటున్నారు. (మత్త. 24:14) తన వాక్యాన్ని చదివి, తన గురించి తెలుసుకునే అవకాశం వీలైనంత ఎక్కువమందికి ఇవ్వాలని న్యాయంగల మన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మనందర్నీ ఎంతో ప్రేమిస్తున్నాడు.
బైబిలు దేవుని ప్రేమను చూపిస్తుంది
13. బైబిలు యెహోవా ప్రేమను రుజువు చేస్తుందని ఎందుకు చెప్పవచ్చు? (యోహాను 21:25)
13 యెహోవాకున్న లక్షణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమే అని బైబిలు రుజువు చేస్తుంది. (1 యోహా. 4:8) యెహోవా బైబిల్లో ఏం రాయించాడో, ఏం రాయించలేదో ఒకసారి ఆలోచించండి. మనం తనతో స్నేహం చేయడానికి, ఇప్పుడు సంతోషంగా జీవించడానికి, భవిష్యత్తులో శాశ్వత జీవితం పొందడానికి ఏం అవసరమో అవే రాయించాడు. అవి కాకుండా మనకు అవసరంలేని వేరే విషయాల్ని రాయించకుండా యెహోవా మనమీద ప్రేమ చూపించాడు.—యోహాను 21:25 చదవండి.
14. బైబిలు దేవుని ప్రేమను చూపిస్తుంది అనడానికి మరో రుజువు ఏంటి?
14 యెహోవా ప్రేమకు మరో రుజువును పరిశీలిద్దాం. ఆయన బైబిల్ని రాయించిన విధానం బట్టి మనుషుల్ని గౌరవిస్తున్నాడని తెలుస్తుంది. ఆయన బైబిల్లో మనకు లెక్కలేనన్ని రూల్స్ పెట్టి, ప్రతీది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పట్లేదు. బదులుగా కొంతమంది జీవిత కథల్ని, ఆసక్తికరమైన ప్రవచనాల్ని, ఉపయోగపడే సలహాల్ని రాయించాడు. అలా మనమే సొంతగా ఆలోచించుకుని, మంచి నిర్ణయాలు తీసుకునేలా యెహోవా సహాయం చేస్తున్నాడు. ఏదో తప్పదన్నట్లు కాకుండా మనస్ఫూర్తిగా తనను ప్రేమించి, తనకు లోబడేలా దేవుని వాక్యం మనల్ని కదిలిస్తుంది.
ఒకప్పుడు యెహోవా తన సేవకులతో ఎలా ప్రవర్తించాడో ధ్యానించడం ఎందుకు మంచిది? (ఆది. 39:1, 10-12; 2 రాజు. 5:1-3; లూకా 2:25-38) (15వ పేరా చూడండి)
15. (ఎ) తన వాక్యాన్ని చదివే వాళ్లమీద యెహోవాకు శ్రద్ధ ఉందని ఎలా చూపించాడు? (బి) చిత్రంలో చూపించిన పాప, యువ సహోదరుడు, వృద్ధ సహోదరి బైబిల్లోని ఏ వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు?
15 యెహోవాకు మన మీద చాలా శ్రద్ధ ఉందని బైబిలు చూపిస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? సాధారణంగా, మనుషులకు ఎలా అనిపిస్తుందో తెలిపే ఎంతోమంది ఉదాహరణల్ని ఆయన బైబిల్లో రాయించాడు. వాళ్లకు కూడా “మనలాంటి భావాలు” ఉన్నాయి కాబట్టి మనం వాళ్లనుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. (యాకో. 5:17) అన్నిటికన్నా ముఖ్యంగా, మనలాంటి మనుషులతో ఆయన ఎలా ప్రవర్తించాడో చదివినప్పుడు “యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడని, కరుణామయుడని” ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతాం.—యాకో. 5:11.
16. తప్పుచేసిన వాళ్లగురించి చదివినప్పుడు యెహోవా గురించి ఏం తెలుసుకుంటాం? (యెషయా 55:7)
16 యెహోవాకున్న ప్రేమను ఇంకో విధంగా కూడా బైబిలు చూపిస్తుంది. తప్పులు చేసినంతమాత్రాన యెహోవా మనల్ని విడిచిపెట్టడని బైబిలు భరోసా ఇస్తుంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు వ్యతిరేకంగా పదేపదే పాపం చేశారు. కానీ వాళ్లు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వాళ్లని క్షమించాడు. (యెషయా 55:7 చదవండి.) మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కూడా దేవుని ప్రేమ గురించి తెలుసు. ఘోరమైన పాపం చేసి పశ్చాత్తాపపడిన వ్యక్తిని ‘క్షమించి ఓదార్చమని’ అపొస్తలుడైన పౌలు పవిత్రశక్తి ప్రేరణతో తోటి క్రైస్తవులకు చెప్పాడు. (2 కొరిం. 2:6, 7; 1 కొరిం. 5:1-5) తన ఆరాధకులు పాపం చేసినప్పుడు వాళ్లను వదిలేయకుండా యెహోవా ప్రేమగా సహాయం చేసి, సరిదిద్ది, వాళ్లను మళ్లీ తన స్నేహితులుగా చేసుకున్నాడు. అది వింటుంటే ఎంత బాగుందో కదా! ఇప్పుడు కూడా ఎవరైనా నిజంగా పశ్చాత్తాపపడితే, యెహోవా అదే చేస్తానని మాటిస్తున్నాడు.—యాకో. 4:8-10.
దేవుని వాక్యమనే ‘మంచి బహుమతిని’ విలువైనదిగా చూడండి
17. బైబిలు ఒక గొప్ప బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
17 యెహోవా నిజంగా మనకు ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి ఎంతో గొప్పదని ఎందుకు చెప్పవచ్చు? బైబిలు యెహోవాకున్న తెలివిని, న్యాయాన్ని, ప్రేమను చూపిస్తుందని మనం ఈ ఆర్టికల్‌లో చూశాం. మనం తన గురించి తెలుసుకోవాలనే కోరిక యెహోవాకు ఉందని బైబిలు రుజువు చేస్తుంది. ఆయన మనకు స్నేహితునిగా ఉండాలని కోరుకుంటున్నాడు.
18. “మంచి బహుమతి” అయిన బైబిల్ని విలువైనదిగా ఎంచుతున్నామని మనమెలా చూపించవచ్చు?
18 దేవుని వాక్యమనే ‘మంచి బహుమతిని’ మనం తేలిగ్గా తీసుకోకూడదు. (యాకో. 1:17) మనం దాన్ని ఎప్పుడూ విలువైనదిగా చూస్తూ ఉందాం. దేవుని పవిత్రశక్తి సహాయం కోసం ప్రార్థిస్తూ బైబిలు చదివి, ధ్యానించినప్పుడు మనం అలా చేయవచ్చు. అప్పుడు మనం చేసే ప్రతీ ప్రయత్నాన్ని బైబిలు రచయితయైన యెహోవా దీవిస్తాడని, ఆయన “గురించిన జ్ఞానం” మనకు దొరుకుతుందని నమ్మకంతో ఉండవచ్చు.—సామె. 2:5.
పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు
a యెహోవాకు దగ్గరవ్వడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఈ పవిత్ర పుస్తకం దేవునికున్న తెలివిని, న్యాయాన్ని, ప్రేమని ఎలా చూపిస్తుందో తెలుసుకుంటాం. అది తెలుసుకున్నప్పుడు బైబిలు మీద మనకు కృతజ్ఞత పెరుగుతుంది. అలాగే అది మన పరలోక తండ్రి నుండి వచ్చిన ఒక బహుమతి అని అర్థంచేసుకుంటాం.