కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w22 ఆగస్టు పేజీలు 26-31
  • యెహోవా ప్రజలు నీతిని ప్రేమిస్తారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ప్రజలు నీతిని ప్రేమిస్తారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీతి అంటే ఏంటి?
  • యెహోవా నీతి ప్రమాణాలపై ప్రేమను పెంచుకోండి
  • పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యెహోవా “నీతిని” మొదట వెదుకుతూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా నీతినిబట్టి ఆనందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు ఆయనను సేవించండి
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
w22 ఆగస్టు పేజీలు 26-31

అధ్యయన ఆర్టికల్‌ 36

యెహోవా ప్రజలు నీతిని ప్రేమిస్తారు

“నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్త. 5:6.

పాట 9 యెహోవా మన రాజు!

ఈ ఆర్టికల్‌లో. . .a

1. యోసేపు ఎలాంటి పరీక్షను ఎదుర్కొన్నాడు? అప్పుడు ఆయన ఏం చేశాడు?

యాకోబు కుమారుడైన యోసేపు ఒక కష్టమైన పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆయన పోతీఫరు అనే వ్యక్తి దగ్గర దాసునిగా పని చేస్తున్నాడు. పోతీఫరు భార్య, “నాతో పడుకో” అని అడిగినప్పుడు యోసేపు అలా చేయనని చెప్పాడు. నేడు కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘అసలు యోసేపు ఎందుకు అలా అన్నాడు?’ ఎలాగూ పోతీఫరు ఇంట్లో లేడు, పైగా యోసేపు కేవలం దాసుడు. నిజానికి, ఆయన అలా కాదు అన్నందుకు ఆమె ఆయన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది. అయినాసరే, ఆమె మళ్లీమళ్లీ అడిగినా యోసేపు దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు? ఆయన ఇలా అన్నాడు: “నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”—ఆది. 39:7-12.

2. వ్యభిచారం దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం అని యోసేపుకు ఎలా తెలుసు?

2 దేవుని దృష్టిలో వ్యభిచారం “చాలా చెడ్డపని” అని యోసేపుకు ఎలా తెలుసు? “వ్యభిచారం చేయకూడదు,” అనే స్పష్టమైన ఆజ్ఞ ఉన్న మోషే ధర్మశాస్త్రం అప్పటికింకా లేదు. ఆ ఆజ్ఞ దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఇవ్వబడింది. (నిర్గ. 20:14) అయినాసరే యోసేపుకు యెహోవా ఎంత బాగా తెలుసంటే, ఆయనకు వ్యభిచారం అస్సలు నచ్చదని అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకు దేవుడు వివాహాన్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే ఏర్పాటు చేశాడని యోసేపుకు ఖచ్చితంగా తెలుసు. అలాగే పెళ్లయిన శారాను ఫరో నుండి, అబీమెలెకు నుండి యెహోవా ఎలా కాపాడాడో ఆయన వినుంటాడు. అంతేకాదు ఇస్సాకు భార్య అయిన రిబ్కాను కూడా అలాంటి ప్రమాదం నుండే దేవుడు ఎలా కాపాడాడో ఆయనకు తెలుసు. (ఆది. 2:24; 12:14-20; 20:2-7; 26:6-11) ఇలాంటి విషయాల గురించి ఆలోచించడంవల్ల దేవుని దృష్టిలో ఏది సరైనదో, ఏది తప్పో యోసేపు అర్థం చేసుకోగలిగాడు. యోసేపు యెహోవాను ప్రేమించాడు కాబట్టి, ఆయన పెట్టిన నీతి ప్రమాణాల్ని కూడా ప్రేమిస్తూ, వాటికి తగ్గట్టు జీవించాలని బలంగా నిర్ణయించుకున్నాడు.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

3 ఖచ్చితంగా, మీరు కూడా నీతిగా నడుచుకోవాలని ఎంతో కోరుకుంటుండవచ్చు. కానీ మనందరం అపరిపూర్ణులం. మనం జాగ్రత్తగా లేకపోతే, నీతి గురించి లోకంలోని వాళ్లు ఆలోచించినట్టే మనం కూడా ఆలోచించే ప్రమాదం ఉంది. (యెష. 5:20; రోమా. 12:2) అసలు నీతి అంటే ఏంటో, నీతిని ప్రేమించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. నీతిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తూ ఉండడానికి, మనం ఏ మూడు పనులు చేయాలో కూడా చర్చిస్తాం.

నీతి అంటే ఏంటి?

4. “నీతిమంతులు” అన్నప్పుడు కొంతమందికి ఎలాంటివాళ్లు గుర్తొస్తారు?

4 కొంతమందికి “నీతిమంతులు” అనే మాట వినగానే, గర్వంతో వేరేవాళ్లను తప్పుపడుతూ, తామే అందరికన్నా నీతిమంతులం అని అనుకునేవాళ్లు గుర్తొస్తారు. కానీ దేవునికి అలాంటివాళ్లు అస్సలు ఇష్టం ఉండరు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, నీతి విషయంలో తమ సొంత ప్రమాణాల్ని పెట్టిన మత నాయకుల్ని తీవ్రంగా ఖండించాడు. (ప్రసం. 7:16; లూకా 16:15) యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించేవాళ్లు వేరేవాళ్ల కన్నా తామే గొప్ప అని ఎప్పుడూ అనుకోరు.

5. బైబిలు ప్రకారం నీతి అంటే ఏంటి? ఒక ఉదాహరణ చెప్పండి.

5 నీతిగా ఉండడం చాలా ప్రాముఖ్యం. నీతిగా ఉండడం అంటే, యెహోవా దృష్టిలో సరైనది చేయడం. బైబిల్లో “నీతి” అనే మాటకు, చాలా ఉన్నతమైన ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం, అంటే యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం అనే అర్థం ఉంది. ఉదాహరణకు, వ్యాపారులు “న్యాయమైన తూకంరాళ్లను” ఉపయోగించాలని యెహోవా చెప్పాడు. (ద్వితీ. 25:15) ఇక్కడ “న్యాయమైన” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “నీతిగల” అనే అర్థం కూడా ఉంది. కాబట్టి దేవుని దృష్టిలో నీతిగా నడుచుకునే క్రైస్తవుడు, తను చేసే వ్యాపారంలో నిజాయితీగా, న్యాయంగా ఉంటాడు. నీతిగా నడుచుకునేవాళ్లు న్యాయాన్ని ప్రేమిస్తారు, అన్యాయాన్ని ద్వేషిస్తారు. నీతిగా ఉండాలని నిజంగా కోరుకునేవాళ్లు, ‘[యెహోవాను] పూర్తిగా సంతోషపెట్టాలని’ అనుకుంటారు. కాబట్టి ప్రతీ విషయంలో ఆయన ఆలోచనలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు.—కొలొ. 1:10.

6. మంచి చెడుల విషయంలో యెహోవా నీతి ప్రమాణాల్ని మనం ఎందుకు నమ్మవచ్చు? (యెషయా 55:8, 9)

6 నీతికి మూలం యెహోవా అని బైబిలు చెప్తుంది. అలాగే ఆయన్ని “నీతి నివసించే స్థలం” అని అంటుంది. (యిర్మీ. 50:7) మంచి చెడుల విషయంలో నీతి ప్రమాణాల్ని నిర్ణయించే హక్కు సృష్టికర్తగా యెహోవాకే ఉంది. అంతేకాదు యెహోవా పరిపూర్ణుడు కాబట్టి, మంచి చెడుల విషయంలో ఆయన ఆలోచనలు మన ఆలోచనల కన్నా ఉన్నతమైనవి. మనం పాపులం, అపరిపూర్ణులం కాబట్టి మంచేదో చెడేదో సరిగ్గా చెప్పలేం. (సామె. 14:12; యెషయా 55:8, 9 చదవండి.) కానీ మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి, ఆయన నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం సాధ్యమే. (ఆది. 1:27) అలా జీవించాలని మనమెంతో కోరుకుంటాం. మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన్ని అనుకరించడానికి చేయగలిగినదంతా చేస్తాం.—ఎఫె. 5:1.

7. సరైన, ఖచ్చితమైన ప్రమాణాలు మనకు ఎందుకు అవసరం? ఉదాహరణలతో చెప్పండి.

7 యెహోవా నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం మనకే మంచిది. ఎందుకో అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణల గురించి ఆలోచించండి. డబ్బుకు ఉన్న విలువను నిర్ణయించే విషయంలో, ఒక్కో బ్యాంకు ఒక్కో ప్రమాణాన్ని పాటిస్తే ఎలా ఉంటుంది? లేదా కొలతల విషయంలో, ఒక్కో నిర్మాణ సంస్థ ఒక్కో ప్రమాణాన్ని పాటిస్తే ఎలా ఉంటుంది? అంతా గందరగోళంగా ఉంటుంది కదా. అలాగే డాక్టర్లు మందులు ఇచ్చే విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోతే, రోగులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సరైన, ఖచ్చితమైన ప్రమాణాలు ఉండడం మనకే మంచిది. అదేవిధంగా, మంచి చెడుల్ని తెలియజేసే దేవుని నీతి ప్రమాణాలు మనల్ని కాపాడతాయి.

8. నీతిని ప్రేమించేవాళ్లు భవిష్యత్తులో ఎలాంటి దీవెనల్ని పొందుతారు?

8 తన నీతి ప్రమాణాల ప్రకారం జీవించేవాళ్లను యెహోవా దీవిస్తాడు. ఆయన ఇలా మాటిస్తున్నాడు: “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.” (కీర్త. 37:29) మనుషులందరూ యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించినప్పుడు ఎంత ఐక్యంగా, శాంతిగా, సంతోషంగా ఉంటారో ఊహించండి. మీరు అలాంటి జీవితాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి నీతిని ప్రేమించడానికి మనలో ప్రతీఒక్కరికి సరైన కారణాలు ఉన్నాయి. నీతి మీద మనకున్న ప్రేమను పెంచుకోవడానికి చేయాల్సిన మూడు పనుల్ని ఇప్పుడు చూద్దాం.

యెహోవా నీతి ప్రమాణాలపై ప్రేమను పెంచుకోండి

9. నీతిని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి?

9 (1) నీతి ప్రమాణాల్ని నిర్ణయించిన వ్యక్తిని ప్రేమించండి. నీతిని ప్రేమించాలంటే, నీతి ప్రమాణాల్ని నిర్ణయించిన వ్యక్తి మీద ప్రేమను పెంచుకోవాలి. మనం యెహోవాను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే, ఆయన పెట్టిన నీతి ప్రమాణాల ప్రకారం జీవించాలని అంత ఎక్కువగా కోరుకుంటాం. ఒకసారి దీనిగురించి ఆలోచించండి: ఆదాముహవ్వలు యెహోవాను ప్రేమించి ఉంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను అసలు మీరేవాళ్లే కాదు.—ఆది. 3:1-6, 16-19.

10. యెహోవా ఆలోచనల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అబ్రాహాము ఏం చేశాడు?

10 ఆదాముహవ్వలు చేసిన తప్పును మనం చేయాలనుకోం. మనం వాళ్లలా తయారవ్వకూడదంటే యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన లక్షణాల్ని ఇష్టపడుతూ, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకుంటూ ఉండాలి. అప్పుడు యెహోవా మీద మనకు ఉన్న ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. అబ్రాహాము గురించి ఆలోచించండి. ఆయన యెహోవాను నిజంగా ప్రేమించాడు. యెహోవా నిర్ణయాల్ని అర్థం చేసుకోవడం ఆయనకు కష్టంగా అనిపించినా ఆయన ఎదురుతిరగలేదు. బదులుగా యెహోవాను ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు,” చెడ్డవాళ్లతో పాటు నీతిమంతుల్ని నాశనం చేస్తాడేమోనని అబ్రాహాము మొదట్లో భయపడ్డాడు. యెహోవా అలా చేయడాన్ని అబ్రాహాము ఊహించుకోలేక పోయాడు. అందుకే వినయంగా, యెహోవాను కొన్ని ప్రశ్నలు అడిగాడు. యెహోవా ఆయన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిచ్చాడు. దాంతో యెహోవా ప్రతీ మనిషి హృదయాన్ని పరిశీలిస్తాడని, చెడ్డవాళ్లతో పాటు నిర్దోషుల్ని ఎన్నడూ శిక్షించడని అబ్రాహాము అర్థం చేసుకున్నాడు.—ఆది. 18:20-32.

11. యెహోవా మీద ప్రేమ, నమ్మకం ఉందని అబ్రాహాము ఎలా చూపించాడు?

11 సొదొమ గొమొర్రాల నాశనం గురించి యెహోవాతో మాట్లాడడం అబ్రాహాముకు ఎంతో సహాయం చేసింది. యెహోవా మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, యెహోవా మీద ఉన్న నమ్మకం విషయంలో అబ్రాహాముకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని యెహోవా ఆయన్ని అడిగాడు. అయితే యెహోవా గురించి బాగా తెలుసుకున్నాడు కాబట్టి, ఈసారి ఆయన ఏ ప్రశ్నా అడగలేదు. కేవలం యెహోవా చెప్పింది చేయడం మొదలుపెట్టాడు. అయినాసరే ఇస్సాకును బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఆయన ఎంత వేదనకు గురై ఉంటాడో ఊహించండి. ఆ సమయంలో, యెహోవా గురించి తెలుసుకున్న విషయాలన్నిటినీ అబ్రాహాము బాగా ఆలోచించి ఉంటాడు. యెహోవా ఎప్పుడూ అన్యాయం చేయడని ఆయనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, తన ప్రియ కుమారుడైన ఇస్సాకును యెహోవా పునరుత్థానం చేయగలడని అబ్రాహాము అనుకొనివుంటాడు. (హెబ్రీ. 11:17-19) ఎందుకంటే, అప్పటికి ఇస్సాకుకు ఇంకా పిల్లలు లేరు. కానీ ఇస్సాకు ద్వారా ఒక గొప్ప జనం వస్తుందని యెహోవా మాటిచ్చాడు. అబ్రాహాము యెహోవాను ప్రేమించాడు కాబట్టి, తన పరలోక తండ్రి ఎప్పుడూ సరైనదే చేస్తాడని నమ్మాడు. ఆయనకు కష్టంగా అనిపించినా, విశ్వాసం చూపిస్తూ లోబడ్డాడు.—ఆది. 22:1-12.

12. మనం అబ్రాహాము ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు? (కీర్తన 73:28)

12 మనం అబ్రాహాము ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు? ఆయనలాగే మనం యెహోవా గురించి తెలుసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు ఆయనకు దగ్గరౌతాం, ఆయన్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. (కీర్తన 73:28 చదవండి.) అలాగే యెహోవా ఆలోచనలకు తగ్గట్టు నడుచుకునేలా మన మనస్సాక్షికి శిక్షణ దొరుకుతుంది. (హెబ్రీ. 5:14) అప్పుడు ఎవరైనా మనల్ని తప్పు చేయమని ఒత్తిడి చేసినా మనం దానికి అస్సలు ఒప్పుకోం. మన పరలోక తండ్రిని బాధపెట్టే లేదా ఆయనతో మనకున్న సంబంధాన్ని పాడుచేసే పని చేయాలనే ఆలోచనను కూడా రానివ్వం. మరి నీతిని ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

13. నీతిని అనుసరించాలంటే మనం ఏం చేయాలి? (సామెతలు 15:9)

13 (2) నీతి మీద ప్రేమను రోజురోజుకు పెంచుకోండి. రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయడంవల్ల మన కండరాల్ని బలంగా తయారుచేసుకోవచ్చు. అదేవిధంగా యెహోవా నీతి ప్రమాణాల్ని రోజూ పాటించడం ద్వారా వాటి మీద మన ప్రేమను పెంచుకోవచ్చు. యెహోవా మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి, ఆయన మన నుండి ఎప్పుడూ ఎక్కువ ఆశించడు. (కీర్త. 103:14) “నీతిని అనుసరించే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 15:9 చదవండి.) యెహోవా సేవలో మనం ఏదైనా లక్ష్యం చేరుకోవాలంటే, దానికోసం కృషిచేస్తూ ఉండాలి. నీతిని అనుసరించే విషయంలో కూడా అంతే. సమయం గడుస్తున్నకొద్దీ మనం ప్రగతి సాధిస్తూ, నీతి మీద ప్రేమను పెంచుకునేలా యెహోవా మనకు ఓపిగ్గా సహాయం చేస్తాడు.—కీర్త. 84:5, 7.

14. “నీతి అనే కవచం” అంటే ఏంటి? అది మనకు ఎందుకు అవసరం?

14 నీతిగా నడుచుకోవడం భారంగా ఉండదని యెహోవా మనకు ప్రేమగా గుర్తుచేస్తున్నాడు. (1 యోహా. 5:3) నిజానికి, యెహోవా నీతి ప్రమాణాలు మనల్ని కాపాడతాయి, అవి మనకు ప్రతీరోజు అవసరం. అపొస్తలుడైన పౌలు చెప్పిన సర్వాంగ కవచం గురించి ఆలోచించండి. (ఎఫె. 6:14-18) సైనికుడి గుండెను ఏది కాపాడుతుంది? “ఛాతి కవచం.” అలాగే మన సూచనార్థక గుండెను, అంటే మన ఆలోచనల్ని, కోరికల్ని, భావోద్వేగాల్ని “నీతి అనే కవచం” లేదా యెహోవా నీతి ప్రమాణాలు కాపాడతాయి. కాబట్టి మీ సర్వాంగ కవచంలో, నీతి అనే కవచం కూడా ఉండేలా చూసుకోండి.—సామె. 4:23.

15. మనం నీతి అనే కవచాన్ని ఎలా వేసుకోవచ్చు?

15 మనం నీతి అనే కవచాన్ని ఎలా వేసుకోవచ్చు? మనం ప్రతీరోజు తీసుకునే నిర్ణయాల్లో దేవుని ప్రమాణాల్ని పాటిస్తూ ఉండడం ద్వారా అలా చేయవచ్చు. ఏం మాట్లాడాలో, ఎలాంటి సంగీతం వినాలో, ఎలాంటి వినోదం చూడాలో, ఎలాంటి పుస్తకాలు చదవాలో నిర్ణయించుకునేటప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను నా హృదయాన్ని ఎలాంటి వాటితో నింపుతున్నాను? యెహోవా దీన్ని ఇష్టపడతాడా లేదా యెహోవా అసహ్యించుకునే చెడ్డవి అంటే లైంగిక పాపం, మోసం, హింస, అత్యాశ, స్వార్థం లాంటివి ఇందులో ఉన్నాయా?’ (ఫిలి. 4:8) యెహోవా ఇష్టానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటే, నీతి అనే కవచాన్ని వేసుకున్నట్టే.

ఒక సహోదరి సాయంత్రం పూట సముద్రం ఒడ్డున నడుస్తూ తీరం వైపు వస్తున్న అలల్ని చూస్తోంది.

మీ నీతి “సముద్ర తరంగాల్లా” ఉంటుంది (16-17 పేరాలు చూడండి)

16-17. మనం యెహోవా ప్రమాణాల ప్రకారం ఎప్పుడూ జీవిస్తూ ఉండగలమని, యెషయా 48:18 ఎలా భరోసా ఇస్తుంది?

16 రోజులు గడిచేకొద్దీ, సంవత్సరాలు గడిచేకొద్దీ యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించకుండా తప్పిపోతామేమో అని మీరు ఎప్పుడైనా భయపడ్డారా? యెషయా 48:18 లో యెహోవా చెప్పిన ఉదాహరణ గురించి ఆలోచించండి. (చదవండి.) మన నీతి “సముద్ర తరంగాల్లా ఉంటుంది” అని ఆయన మాటిస్తున్నాడు. మీరు సముద్ర తీరం దగ్గర నిలబడి ఉన్నట్టు, అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నట్టు ఊహించుకోండి. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో, ఉన్నట్టుండి ఏదోకరోజు ఆ అలలు ఆగిపోతాయేమో అని మీరు కంగారుపడతారా? లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా అలలు ఆ తీరాన్ని తాకుతూనే ఉన్నాయని, ఇకముందు కూడా అవి అలా వస్తూనే ఉంటాయని మీకు తెలుసు.

17 మీ నీతి కూడా సముద్ర తరంగాల్లా ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, యెహోవా ఇష్టం ఏంటో ఆలోచించండి. తర్వాత దానికి తగ్గట్టు నడుచుకోండి. అలా చేయడం ఎంత కష్టమైనాసరే, మీ ప్రేమగల పరలోక తండ్రి మీకు ఎప్పుడూ తోడుంటాడని గుర్తుంచుకోండి. మీరు స్థిరంగా ఉంటూ, ప్రతీరోజు తన నీతి ప్రమాణాల ప్రకారం జీవించేలా యెహోవా సహాయం చేస్తాడు.—యెష. 40:29-31.

18. మనం వేరేవాళ్లకు ఎందుకు తీర్పు తీర్చకూడదు?

18 (3) తీర్పు తీర్చడం యెహోవాకు వదిలేయండి. యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం నడుచుకోవడానికి మనం చాలా కష్టపడతాం. అయితే మనల్ని వేరేవాళ్లతో పోల్చుకుంటూ, యెహోవా నీతి ప్రమాణాల్ని పాటిస్తున్నాం కాబట్టి వాళ్లకంటే మనమే గొప్ప అని అనుకోకూడదు. యెహోవా నీతి ప్రమాణాల్ని వేరేవాళ్లు పాటిస్తున్నారా లేదా అని తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. బదులుగా “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు” యెహోవాయే అని గుర్తుంచుకోవాలి. (ఆది. 18:25) తీర్పు తీర్చే పని యెహోవా మనకు ఇవ్వలేదు. నిజానికి యేసు మనకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు.”—మత్త. 7:1.b

19. తీర్పు తీర్చే పని యెహోవాదని యోసేపు ఎలా చూపించాడు?

19 నీతిమంతుడైన యోసేపు ఉదాహరణ గురించి మరోసారి ఆలోచించండి. తనకు హాని చేసినవాళ్లతో సహా ఆయన ఎవ్వరికీ తీర్పు తీర్చలేదు. ఆయన సొంత అన్నలే ఆయన్ని దాసునిగా అమ్మేసి, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆయన చనిపోయాడని వాళ్ల నాన్నను కూడా నమ్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు మళ్లీ వాళ్లను కలిశాడు. కానీ ఆ సమయానికి ఆయన ఐగుప్తు దేశానికి అధిపతి. కావాలనుకుంటే ఆయన వాళ్లకు కఠినంగా తీర్పు తీర్చి పగ తీర్చుకోవచ్చు. కానీ అప్పటికే తాము చేసింది తప్పని యోసేపు అన్నలు గుర్తించి, ఎంతో బాధపడ్డారు. అయినా యోసేపు ఎక్కడ పగ తీర్చుకుంటాడేమో అని వాళ్లు భయపడ్డారు. కానీ యోసేపు వాళ్లకు ఈ భరోసాను ఇచ్చాడు: “భయపడకండి. నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా?” (ఆది. 37:18-20, 27, 28, 31-35; 50:15-21) తీర్పు తీర్చే పనిని యోసేపు వినయంగా యెహోవాకు వదిలేశాడు.

20-21. వేరేవాళ్ల కన్నా మనమే నీతిమంతులం అని అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

20 యోసేపులాగే మనం కూడా తీర్పు తీర్చే పనిని యెహోవాకు వదిలేస్తాం. ఉదాహరణకు మన సహోదర సహోదరీలు ఏదైనా పని చేసినప్పుడు, వాళ్లు ఫలానా కారణంతోనే అలా చేస్తున్నారని మనం అనుకోకూడదు. మనం హృదయాల్ని చదవలేం. యెహోవా మాత్రమే “ఉద్దేశాల్ని పరిశీలిస్తాడు.” (సామె. 16:2) యెహోవా అన్నిరకాల ప్రజల్ని అంటే వేర్వేరు జాతుల, సంస్కృతుల, దేశాల ప్రజల్ని ప్రేమిస్తాడు. మనం కూడా ‘మన హృదయాల్ని విశాలం చేసుకోవాలని’ యెహోవా ప్రోత్సహిస్తున్నాడు. (2 కొరిం. 6:13) మనం సహోదర సహోదరీలకు తీర్పు తీర్చకుండా, అందర్నీ ప్రేమించడానికి ప్రయత్నిస్తాం.

21 సంఘంలోని వాళ్లకే కాదు ఇతరులకు కూడా మనం తీర్పు తీర్చం. (1 తిమో. 2:3, 4) సత్యంలోలేని మీ బంధువు గురించి, మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా: “అతను ఎప్పటికీ సత్యంలోకి రాడు.” అలా అనుకుంటే, మనం అహంకారం చూపిస్తూ వాళ్లకంటే మనమే గొప్ప అని ప్రవర్తిస్తున్నట్టు అవుతుంది. “ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని” యెహోవా ఇప్పటికీ కోరుకుంటున్నాడు. (అపొ. 17:30) ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి: వేరేవాళ్ల కన్నా మనమే ఎక్కువ నీతిగా నడుచుకుంటున్నామని అనుకుంటే, మనం నీతిగా నడుచుకోనట్టే.

22. నీతిని ప్రేమించాలని మీరు ఎందుకు బలంగా నిర్ణయించుకున్నారు?

22 యెహోవా నీతి ప్రమాణాల మీద మనకున్న ప్రేమ మనలో సంతోషాన్ని పెంచుతుంది. అలాగే ఇతరులు మన మంచి ఆదర్శాన్ని చూసి మనల్ని, యెహోవాను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. మనం ఎప్పుడూ “నీతి కోసం ఆకలిదప్పులు” గలవాళ్లుగా ఉందాం. (మత్త. 5:6) యెహోవా మీరు చేస్తున్న కృషిని గమనిస్తున్నాడని, మీరు సాధిస్తున్న ప్రగతిని బట్టి ఎప్పుడూ సంతోషిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఈ లోకంలో నీతి ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోయినా ధైర్యంగా ఉండండి! “యెహోవా నీతిమంతుల్ని ప్రేమిస్తాడు” అని ఎన్నడూ మర్చిపోకండి.—కీర్త. 146:8.

మీరెలా జవాబిస్తారు?

  • నీతి అంటే ఏంటి?

  • యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం ఎందుకు మంచిది?

  • యెహోవా నీతి ప్రమాణాల మీద మనకున్న ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

a ఈ దుష్టలోకంలో నీతిగా నడుచుకునే ప్రజలు చాలా తక్కువ. కానీ నేడు లక్షలమంది అలా ఉండగలుగుతున్నారు. మీరు కూడా వాళ్లలో ఒకరు. యెహోవా నీతిని ప్రేమిస్తాడు, మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు. అందుకే మీరు నీతిగా నడుచుకుంటున్నారు. మనం నీతిని ఇంకా ఎక్కువ ఎలా ప్రేమించవచ్చు? అసలు నీతి అంటే ఏంటో, నీతిని ప్రేమించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. నీతిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండడానికి మనం ఏ పనులు చేయాలో కూడా చర్చిస్తాం.

b ఘోరమైన పాపాలు, పశ్చాత్తాపం వంటి విషయాల్లో, సంఘ పెద్దలు కొన్నిసార్లు వేరేవాళ్లకు తీర్పు తీర్చాల్సి రావచ్చు. (1 కొరిం. 5:11; 6:5; యాకో. 5:14, 15) అయితే తాము యెహోవా కోసం న్యాయం తీరుస్తున్నామని, హృదయాల్ని చదవలేమని పెద్దలు వినయంగా గుర్తుంచుకుంటారు. (2 దినవృత్తాంతాలు 19:6 పోల్చండి.) వాళ్లు దేవుని ప్రేమ, కరుణ, న్యాయానికి తగ్గట్టు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి