కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w22 ఆగస్టు పేజీలు 20-25
  • “ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టాల్ని తట్టుకునేలా పౌలు సహోదర సహోదరీలకు సహాయం చేశాడు
  • ఒకరితో ఒకరు శాంతిగా ఎలా ఉండాలో పౌలు సహోదర సహోదరీలకు చూపించాడు
  • పౌలు సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపర్చాడు
  • ‘ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’
  • పెద్దలారా—అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ధైర్యంగా ఉండండి—మీకు సహాయం చేసేది యెహోవాయే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
w22 ఆగస్టు పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 35

“ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”

“ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.”—1 థెస్స. 5:11.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఈ ఆర్టికల్‌లో. . .a

1. మొదటి థెస్సలొనీకయులు 5:11 ప్రకారం, మనందరికీ ఏ గొప్ప నిర్మాణ పనిలో పాల్గొనే అవకాశం ఉంది?

రాజ్యమందిరాన్ని నిర్మించే పనిలో లేదా పెద్దపెద్ద మరమ్మత్తులు చేసే పనిలో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? అలాగైతే, ఆ రాజ్యమందిరంలో జరిగిన మొట్టమొదటి మీటింగ్‌ మీకు ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. మీ హృదయం యెహోవా మీద కృతజ్ఞతతో ఉప్పొంగిపోయి, ప్రారంభ పాట పాడుతున్నప్పుడు మీ కళ్లలో నీళ్లు వచ్చుంటాయి. చక్కగా నిర్మించిన మన రాజ్యమందిరాలు యెహోవాకు మహిమ తీసుకొస్తాయి. అయితే మరో రకమైన నిర్మించే పని, యెహోవాకు ఇంకా ఎక్కువ మహిమను తీసుకొస్తుంది. అది రాజ్యమందిరాల్ని నిర్మించే పనికన్నా గొప్పది. అదేంటంటే, రాజ్యమందిరానికి వచ్చే మన సహోదర సహోదరీల్ని నిర్మించే లేదా బలపర్చే పని. ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనమైన 1 థెస్సలొనీకయులు 5:11 లో పౌలు ఉపయోగించిన, “బలపర్చుకుంటూ” అనే మాటకు “నిర్మించుకుంటూ” అనే అర్థం కూడా ఉంది.—చదవండి.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

2 సహోదర సహోదరీల్ని నిర్మించే లేదా బలపర్చే పనిలో అపొస్తలుడైన పౌలు మంచి ఆదర్శం ఉంచాడు. ఆయన వాళ్ల పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. (1) కష్టాల్ని ఎదుర్కొనే విషయంలో, (2) ఒకరితో ఒకరు శాంతిగా ఉండే విషయంలో, (3) యెహోవా మీద విశ్వాసాన్ని బలపర్చుకునే విషయంలో సహోదర సహోదరీలకు పౌలు ఎలా సహాయం చేశాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఆయనలాగే మనం కూడా సహోదర సహోదరీల్ని ఎలా బలపర్చవచ్చో ఇప్పుడు చూద్దాం.—1 కొరిం. 11:1.

కష్టాల్ని తట్టుకునేలా పౌలు సహోదర సహోదరీలకు సహాయం చేశాడు

3. పని విషయంలో, పరిచర్య విషయంలో పౌలు ఎలా మంచి ఆదర్శం ఉంచాడు?

3 పౌలు తన సహోదర సహోదరీల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన జీవితంలో చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాడు కాబట్టి తోటి సహోదరులు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ల బాధను అర్థం చేసుకుని కనికరం చూపించగలిగాడు. ఒకసారి పౌలు దగ్గర ఖర్చులకు అవసరమైన డబ్బులు లేనప్పుడు తనకోసం, తనతో ఉన్నవాళ్ల కోసం ఆయన పనిచేయాల్సి వచ్చింది. (అపొ. 20:34) ఆయనకు డేరాలు తయారుచేసే పనివచ్చు. ఆయన కొరింథుకు వచ్చిన కొత్తలో, డేరాలు తయారుచేసే అకుల, ప్రిస్కిల్లతో కలిసి పనిచేశాడు. కానీ ఆయన “ప్రతీ విశ్రాంతి రోజున” యూదులకు, గ్రీసు దేశస్థులకు ప్రకటించేవాడు. తర్వాత సీల, తిమోతి అక్కడికి వచ్చినప్పుడు పౌలు “తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు.” (అపొ. 18:2-5) యెహోవా సేవ చేయడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని పౌలు ఎప్పుడూ మర్చిపోలేదు. పరిచర్య విషయంలో, తన అవసరాల కోసం కష్టపడి పనిచేసే విషయంలో పౌలు మంచి ఆదర్శాన్ని ఉంచాడు, కాబట్టి ఆయన సహోదర సహోదరీల్ని ప్రోత్సహించగలిగాడు. జీవిత చింతల్లో, కుటుంబాన్ని పోషించే పనుల్లో మునిగిపోయి ‘ఎక్కువ ప్రాముఖ్యమైన వాటిని,’ అంటే యెహోవా ఆరాధనకు సంబంధించిన వాటిని నిర్లక్ష్యం చేయొద్దని పౌలు వాళ్లకు చెప్పాడు.—ఫిలి. 1:10.

4. హింసను తట్టుకోవడానికి పౌలు, తిమోతి సహోదర సహోదరీలకు ఎలా సహాయం చేశారు?

4 థెస్సలొనీకలో సంఘం స్థాపించబడిన కొన్నిరోజులకే, ఆ ప్రాంతంలోని వాళ్లు కొత్తగా క్రైస్తవులైన సహోదరుల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకులకు పౌలు, సీల కనిపించకపోయేసరికి వాళ్లు కొంతమంది సహోదరుల్ని నగర పాలకుల దగ్గరికి ఈడ్చుకెళ్లి, “వీళ్లందరూ కైసరు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు” అని అరిచారు. (అపొ. 17:6, 7) ఆ సమయంలో, కొత్తగా క్రైస్తవులైన వాళ్లకు ఎంత భయమేసి ఉంటుందో ఊహించండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల ఉత్సాహం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కానీ అలా జరగకుండా పౌలు చూసుకున్నాడు. పౌలు, సీల అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చినా, ఆ కొత్త సంఘాన్ని బలపర్చడానికి ఏర్పాట్లు చేశారు. పౌలు థెస్సలొనీకయులకు ఇలా చెప్పాడు: ‘మన సహోదరుడైన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. మీ విశ్వాసం విషయంలో మిమ్మల్ని స్థిరపర్చడానికి, ఓదార్చడానికి అతన్ని పంపించాం. ఈ శ్రమల వల్ల ఎవ్వరూ విశ్వాసంలో బలహీనపడకూడదని అలా పంపించాం.’ (1 థెస్స. 3:2, 3) తన సొంతూరైన లుస్త్రలో క్రైస్తవులు హింసను ఎదుర్కోవడం బహుశా తిమోతి కళ్లారా చూసి ఉంటాడు. అప్పుడు పౌలు అక్కడున్న సహోదరుల్ని ఎలా బలపర్చాడో తిమోతి చూశాడు. ఆ సందర్భంలో యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో తిమోతికి తెలుసు. కాబట్టి థెస్సలొనీకలో కూడా పరిస్థితులు ముందుముందు చక్కబడతాయని ఆయన వాళ్లకు ధైర్యం చెప్పగలిగాడు.—అపొ. 14:8, 19-22; హెబ్రీ. 12:2.

5. బ్రయంట్‌ అనే సహోదరునికి ఒక సంఘపెద్ద ఎలా సహాయం చేశాడు?

5 సహోదర సహోదరీల్ని పౌలు ఇంకా ఏవిధంగా బలపర్చాడు? పౌలు బర్నబాలు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగెళ్లిన తర్వాత “ఒక్కో సంఘంలో పెద్దల్ని నియమించారు.” (అపొ. 14:21-23) కొత్తగా నియమించబడిన ఆ పెద్దలు సహోదర సహోదరీల్ని ఎంతో ఓదార్చి ఉంటారు. నేడున్న పెద్దలు కూడా అంతే. బ్రయంట్‌ అనే సహోదరుడి అనుభవాన్ని చూడండి. ఆయన ఇలా అంటున్నాడు: “నాకు 15 ఏళ్లు వచ్చినప్పుడు, మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా అమ్మ సంఘం నుండి బహిష్కరించబడింది. అప్పుడు నాకు ఒంటరిగా, నిరుత్సాహంగా అనిపించింది.” ఆ కష్టమైన సమయాన్ని బ్రయంట్‌ ఎలా తట్టుకున్నాడు? ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “టోనీ అనే సంఘపెద్ద మీటింగ్స్‌లో, వేరే సమయాల్లో నాతో మాట్లాడేవాడు. కష్టాల్ని ఎదుర్కొంటున్నా, సంతోషంగా ఉన్నవాళ్ల గురించి ఆయన నాకు చెప్తూ ఉండేవాడు. ఆయన నాకు కీర్తన 27:10 చూపించాడు. అలాగే హిజ్కియా వాళ్ల నాన్న మంచి ఆదర్శం ఉంచకపోయినా, ఆయన యెహోవాను నమ్మకంగా సేవించాడని టోనీ నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు.” దానివల్ల బ్రయంట్‌ ఎలా ప్రయోజనం పొందాడు? ఆయన ఇలా చెప్పాడు: “టోనీ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల, కొంతకాలానికే నేను పూర్తికాల సేవ మొదలుపెట్టి సంతోషంగా ఉంటున్నాను.” పెద్దలారా, బ్రయంట్‌ లాంటివాళ్లు మీ సంఘంలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే, మీ “మంచి మాట” ద్వారా వాళ్లను ప్రోత్సహించండి.—సామె. 12:25.

6. సహోదర సహోదరీల్ని ప్రోత్సహించడానికి పౌలు జీవిత కథల్ని ఎలా ఉపయోగించాడు?

6 యెహోవా సహాయంతో కష్టాల్ని తట్టుకున్న “పెద్ద సాక్షుల సమూహం” గురించి పౌలు సహోదర సహోదరీలకు గుర్తుచేశాడు. (హెబ్రీ. 12:1) ఆ సాక్షులు రకరకాల కష్టాల్ని సహించగలిగారు. వాళ్ల జీవిత కథల్ని పరిశీలిస్తే సహోదర సహోదరీలు ధైర్యాన్ని పొందుతారని, అలాగే “జీవంగల దేవుని నగరం” మీద దృష్టి పెడతారని పౌలు అర్థం చేసుకున్నాడు. (హెబ్రీ. 12:22) మన విషయంలో కూడా అంతే. గిద్యోను, బారాకు, దావీదు, సమూయేలు అలాగే ఇతరులకు యెహోవా ఎలా సహాయం చేశాడో చదివినప్పుడు మనందరం ఖచ్చితంగా ప్రోత్సాహాన్ని, బలాన్ని పొంది ఉంటాం. (హెబ్రీ. 11:32-35) మనకాలంలోని సహోదర సహోదరీల అనుభవాల సంగతేంటి? మనకాలంలోని నమ్మకమైన సేవకుల జీవిత కథల్ని చదివినప్పుడు, తమ విశ్వాసం ఎంతో బలపడిందని చాలామంది సహోదర సహోదరీలు ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు.

ఒకరితో ఒకరు శాంతిగా ఎలా ఉండాలో పౌలు సహోదర సహోదరీలకు చూపించాడు

7. రోమీయులు 14:19-21 లో పౌలు ఇచ్చిన సలహా నుండి మీరేం నేర్చుకోవచ్చు?

7 సహోదర సహోదరీల్ని బలపర్చాలంటే, మన మాటల ద్వారా, పనుల ద్వారా సంఘంలో శాంతిని పెంచాలి. అభిప్రాయభేదాల వల్ల మన మధ్య విభజనలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా విషయం బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేక పోతే, మన మాటే నెగ్గాలని పట్టుబట్టం. ఒక ఉదాహరణ గమనించండి. రోములోని సంఘంలో క్రైస్తవులుగా మారిన యూదులు, అన్యులు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడు, కొన్ని రకాల ఆహారాల్ని తినకూడదనే ఆజ్ఞ కూడా కొట్టివేయబడింది. (మార్కు 7:19) అప్పటినుండి కొంతమంది యూదా క్రైస్తవులు అన్నిరకాల ఆహారాల్ని తినేవాళ్లు. కానీ ఇంకొంతమంది యూదా క్రైస్తవులు అలా తినేవాళ్లు కాదు. ఈ విషయం వల్ల సంఘంలో విభజనలు వచ్చాయి. అప్పుడు, సంఘంలో శాంతి ఉండడం ఎంత ప్రాముఖ్యమో చెప్తూ పౌలు ఇలా అన్నాడు: “మాంసం తినడమైనా, ద్రాక్షారసం తాగడమైనా, నీ సహోదరుణ్ణి విశ్వాసంలో తడబడేలా చేసే ఏ పనైనా చేయకపోవడమే మంచిది.” (రోమీయులు 14:19-21 చదవండి.) అలాంటి వివాదాల వల్ల ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఎలా పాడౌతుందో, సంఘ ఐక్యత ఎలా దెబ్బతింటుందో అర్థం చేసుకునేలా పౌలు వాళ్లకు సహాయం చేశాడు. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని చెప్పడమే కాదు, ఆయన కూడా ఆ సలహాను పాటించాడు. (1 కొరిం. 9:19-22) ఆయనలాగే మనం కూడా మన ఇష్టాయిష్టాల విషయంలో పట్టుబట్టకుండా ఉంటే, ఇతరుల్ని బలపర్చగలం అలాగే శాంతిని కాపాడగలం.

8. ఒక ముఖ్యమైన విషయం వల్ల సంఘంలో శాంతి దెబ్బతినే ప్రమాదం వచ్చినప్పుడు పౌలు ఏం చేశాడు?

8 కొన్నిసార్లు ముఖ్యమైన విషయాల్లో కూడా అభిప్రాయభేదాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో, సంఘ శాంతిని కాపాడే విషయంలో పౌలు మంచి ఆదర్శం ఉంచాడు. ఉదాహరణకు మొదటి శతాబ్దంలో, క్రైస్తవులుగా మారిన అన్యులు సున్నతి చేయించుకోవాలని కొంతమంది పట్టుబట్టారు. అలాచేస్తే, యూదులు వాళ్లను తప్పుబట్టే అవకాశం ఉండదని బహుశా వాళ్లు అనుకొని ఉంటారు. (గల. 6:12) వాళ్లు చెప్పినదానికి పౌలు ఏమాత్రం అంగీకరించకపోయినా, తన మాటే నెగ్గాలని పట్టుబట్టలేదు. బదులుగా ఆయన వినయం చూపిస్తూ యెరూషలేములో ఉన్న అపొస్తలుల, పెద్దల సలహా అడిగాడు. (అపొ. 15:1, 2) అలా చేయడంవల్ల సంఘంలో శాంతిని, సంతోషాన్ని కాపాడాడు.—అపొ. 15:30, 31.

9. పౌలు ఆదర్శాన్ని మనమెలా పాటించవచ్చు?

9 సంఘంలో ఏదైనా పెద్ద వివాదం తలెత్తినప్పుడు, యెహోవా నియమించిన పెద్దల సహాయం తీసుకుంటే సంఘంలో శాంతిని కాపాడవచ్చు. కొన్నిసార్లు బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి సంస్థ ఇచ్చే ప్రచురణల్ని, నిర్దేశాల్ని చూడవచ్చు. మన సొంత అభిప్రాయాల్ని పక్కనపెట్టి, ఆ నిర్దేశాల్ని పాటించినప్పుడు సంఘంలో శాంతిని కాపాడిన వాళ్లమౌతాం.

10. సంఘంలో శాంతిని పెంచడానికి పౌలు ఇంకా ఏం చేశాడు?

10 సహోదర సహోదరీల్లో ఉన్న లోపాల్ని పట్టించుకోకుండా, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడడం ద్వారా పౌలు సంఘంలో శాంతిని పెంచాడు. ఉదాహరణకు పౌలు రోమీయులకు రాసిన ఉత్తరం చివర్లో, సంఘంలోని చాలామంది సహోదర సహోదరీల పేర్లను చెప్తూ వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని, వాళ్ల గురించి మంచి విషయాల్ని రాశాడు. మనం కూడా సహోదర సహోదరీల మంచి లక్షణాల గురించి ఎక్కువగా మాట్లాడడం ద్వారా పౌలు ఆదర్శాన్ని పాటించవచ్చు. అలా చేసినప్పుడు మన మధ్య స్నేహాలు బలపడతాయి, అలాగే సంఘంలో ప్రేమ పెరుగుతుంది.

11. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు శాంతిని ఎలా కాపాడవచ్చు?

11 కొన్నిసార్లు పరిణతిగల క్రైస్తవుల మధ్య కూడా అభిప్రాయభేదాలు రావచ్చు. పౌలు బర్నబాలు మంచి స్నేహితులు. వాళ్ల మధ్య కూడా ఒకసారి అభిప్రాయభేదం వచ్చింది. ఒక మిషనరీ యాత్రకు మార్కును తీసుకెళ్లాలా వద్దా అని మాట్లాడుకుంటున్నప్పుడు, “వాళ్లిద్దరు చాలా కోపంతో గొడవపడి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.” (అపొ. 15:37-39) కానీ తర్వాత పౌలు, బర్నబా, మార్కు ఒకరితోఒకరు సమాధానపడ్డారు. అలా చేయడంవల్ల సంఘంలో శాంతిని, ఐక్యతను విలువైనదిగా ఎంచుతున్నామని చూపించారు. తర్వాత పౌలు తన ఉత్తరాల్లో బర్నబా, మార్కు గురించి మంచిగా మాట్లాడాడు. (1 కొరిం. 9:6; కొలొ. 4:10) మనకు కూడా సంఘంలో ఎవరితోనైనా అభిప్రాయభేదాలు ఉంటే, వాళ్లతో సమాధానపడి వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీదే మనసుపెడుతూ ఉండాలి. అలా మనం సంఘంలో శాంతిని, ఐక్యతను కాపాడవచ్చు.—ఎఫె. 4:3.

పౌలు సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపర్చాడు

12. మన సహోదర సహోదరీలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు?

12 యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకునేలా సహోదర సహోదరీలకు సహాయం చేసినప్పుడు మనం వాళ్లను బలపరుస్తాం. కొంతమంది సహోదరులు సాక్షులుకాని బంధువులు, తోటి ఉద్యోగస్తులు, తోటి విద్యార్థులు నుండి ఎగతాళి ఎదుర్కొంటున్నారు. ఇంకొంతమంది తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నారు లేదా ఇతరుల మాటల వల్ల, పనుల వల్ల బాధపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా సత్యంలో ఉన్న క్రైస్తవులేమో, ఈ లోకం ఎప్పుడు నాశనమౌతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ క్రైస్తవులకు ఒక పరీక్షలా మారవచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఇలాంటి సవాళ్లే ఎదుర్కొన్నారు. మరైతే సహోదర సహోదరీల్ని బలపర్చడానికి పౌలు ఏం చేశాడు?

ఒకతను jw.orgలోని ఒక ఆర్టికల్‌ని వాళ్ల పాపతో చర్చిస్తున్నాడు. ఆ పాప చేతిలో క్రిస్మస్‌ కార్డు ఉంది.

అపొస్తలుడైన పౌలులాగే మనం ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు? (13వ పేరా చూడండి)b

13. తమ నమ్మకాల వల్ల ఎగతాళిని ఎదుర్కొంటున్న వాళ్లకు పౌలు ఎలా సహాయం చేశాడు?

13 సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపర్చడానికి పౌలు లేఖనాల్ని ఉపయోగించాడు. ఉదాహరణకు క్రైస్తవ మతం కన్నా, యూదా మతమే గొప్పదని వాదించే తమ కుటుంబ సభ్యులకు ఎలా జవాబివ్వాలో తెలియక, కొంతమంది యూదా క్రైస్తవులు ఇబ్బందిపడ్డారు. హెబ్రీయులకు పౌలు రాసిన ఉత్తరం వాళ్లను ఎంతో బలపర్చి ఉంటుంది. (హెబ్రీ. 1:5, 6; 2:2, 3; 9:24, 25) పౌలు వివరించిన విధానాన్ని ఉపయోగించి, వాళ్లు తమ కుటుంబ సభ్యులకు చక్కగా జవాబిచ్చి ఉంటారు. నేడు కూడా మన సహోదర సహోదరీలు ఎగతాళిని ఎదుర్కొంటున్నారు. మన ప్రచురణల్ని ఉపయోగించి, తమ నమ్మకాల గురించి ఎలా వివరించవచ్చో మనం వాళ్లకు సహాయం చేయవచ్చు. పండుగలు, పుట్టినరోజులు జరుపుకోనందుకు మన సంఘంలోని పిల్లలు ఎగతాళిని ఎదుర్కొంటున్నారా? అలాగైతే ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 44వ పాఠం ఉపయోగించి, తమ నమ్మకాల గురించి మాట్లాడేలా మనం వాళ్లకు సహాయం చేయవచ్చు.

కార్చిచ్చు వల్ల తగలబడిపోయిన ఊరిలో ఒక తల్లీ కూతురికి సహాయం చేస్తున్న జంట.

అపొస్తలుడైన పౌలులాగే మనం ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు? (14వ పేరా చూడండి)c

14. ప్రకటించే, బోధించే పనిలో బిజీగా ఉన్నా పౌలు ఏం చేశాడు?

14 “మంచిపనులు” చేస్తూ ప్రేమ చూపించమని పౌలు సహోదర సహోదరీల్ని ప్రోత్సహించాడు. (హెబ్రీ. 10:24) తన మాటల ద్వారానే కాదు పనుల ద్వారా కూడా పౌలు సహోదర సహోదరీలకు సహాయం చేశాడు. ఉదాహరణకు యూదయలో పెద్ద కరువు వచ్చినప్పుడు, అక్కడున్న వాళ్లకు అవసరమయ్యే వాటిని సేకరించే పనిలో పౌలు సహాయం చేశాడు. (అపొ. 11:27-30) పౌలు ప్రకటించే, బోధించే పనిలో బిజీగా ఉన్నా, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేసే అవకాశాల కోసం ఎప్పుడూ చూసేవాడు. (గల. 2:10) అలా చేయడంవల్ల యెహోవా తమను పట్టించుకుంటున్నాడనే నమ్మకాన్ని సహోదర సహోదరీల్లో బలపర్చాడు. నేడు మనం కూడా విపత్తు వచ్చినప్పుడు మన సమయాన్ని, శక్తిని, నైపుణ్యాల్ని ఉపయోగించి సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపరుస్తాం. ప్రపంచవ్యాప్త పనికి క్రమంగా విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా అలా చేయవచ్చు. ఇలాంటి ఎన్నో పనుల ద్వారా యెహోవా తమను ఎప్పుడూ విడిచిపెట్టడనే నమ్మకాన్ని మన సహోదర సహోదరీల్లో బలపర్చవచ్చు.

అపొస్తలుడైన పౌలులాగే మనం ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు? (15-16 పేరాలు చూడండి)d

15-16. విశ్వాసం బలహీనపడిన వాళ్లను విడిచిపెట్టకుండా మనం ఎలా సహాయం చేయాలి?

15 పౌలు, విశ్వాసం బలహీనపడిన వాళ్లను విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఆయన కనికరం చూపిస్తూ, వాళ్లను బలపరుస్తూ ప్రేమగా మాట్లాడాడు. (హెబ్రీ. 6:9; 10:39) ఉదాహరణకు, హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో ఆయన “మనం,” “మన” అనే మాటలను చాలాసార్లు ఉపయోగించాడు. అలా తను కూడా ఆ సలహాల్ని పాటించాల్సిన అవసరం ఉందని చూపించాడు. (హెబ్రీ. 2:1, 3) పౌలులాగే మనం కూడా, విశ్వాసం బలహీనపడిన వాళ్లను విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్లమీద నిజమైన శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలా చేస్తే వాళ్లమీద మనకు ప్రేమ ఉందని చూపిస్తాం. మన మాటల్లోనే కాదు, మాట్లాడే తీరులో కూడా ప్రేమ, ఆప్యాయత కనిపించాలి.

16 వాళ్లు చేసిన మంచి పనులు యెహోవాకు తెలుసని పౌలు సహోదర సహోదరీలకు గుర్తుచేశాడు. (హెబ్రీ. 10:32-34) విశ్వాసం బలహీనపడిన సహోదర సహోదరీలకు సహాయం చేస్తున్నప్పుడు మనం కూడా అదే చేయవచ్చు. వాళ్లు సత్యంలోకి ఎలా వచ్చారో లేదా వేర్వేరు సందర్భాల్లో యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో చెప్పమని మనం అడగవచ్చు. వాళ్లు అలా చెప్పినప్పుడు దేవుని సేవలో వాళ్లు చూపించిన ప్రేమను యెహోవా మర్చిపోలేదని, ఆయన వాళ్లను ఎప్పుడూ విడిచిపెట్టడని భరోసా ఇవ్వవచ్చు. (హెబ్రీ. 6:10; 13:5, 6) మనం అలా మాట్లాడినప్పుడు, యెహోవా సేవలో కొనసాగాలనే ప్రోత్సాహాన్ని వాళ్లు పొందవచ్చు.

‘ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’

17. మనం ఏ విషయంలో నైపుణ్యాల్ని పెంచుకుంటూ ఉండాలి?

17 నిర్మాణ పని చేసేవాళ్లు మెల్లమెల్లగా తమ నైపుణ్యాల్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా ఒకరినొకరం ‘నిర్మించే’ లేదా ‘బలపర్చే’ విషయంలో నైపుణ్యాల్ని పెంచుకోవాలి. కష్టాల్ని నమ్మకంగా సహించిన వాళ్ల ఉదాహరణల్ని చెప్పడం ద్వారా తోటి సహోదర సహోదరీల్ని బలపర్చవచ్చు. ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడడం ద్వారా శాంతిని పెంచవచ్చు. అంతేకాదు మనం వివాదాలకు దూరంగా ఉంటూ, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. ముఖ్యమైన బైబిలు సత్యాల్ని పంచుకోవడం ద్వారా, అవసరమైన సహాయం చేయడం ద్వారా, ఆధ్యాత్మికంగా బలహీనపడిన వాళ్లకు మద్దతివ్వడం ద్వారా మన సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండవచ్చు.

18. మీరేం చేయాలని నిర్ణయించుకున్నారు?

18 రాజ్యమందిరాల నిర్మాణ పనిలో పాల్గొనేవాళ్లకు సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. అదేవిధంగా సహోదర సహోదరీల విశ్వాసాన్ని ‘నిర్మించే’ లేదా ‘బలపర్చే’ పనిలో పాల్గొంటే మనకు సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రాజ్యమందిరాలు కొంతకాలానికి పాడైపోవచ్చు. కానీ మనం చేసే ఆధ్యాత్మిక నిర్మాణ పనివల్ల వచ్చే ఫలితాలు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండాలని” బలంగా నిర్ణయించుకుందాం.—1 థెస్స. 5:11.

మీరెలా జవాబిస్తారు?

  • కష్టాల్ని సహించేలా మీరు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు?

  • శాంతిని కాపాడడానికి మీరేం చేస్తారు?

  • విశ్వాసంలో బలహీనపడిన వాళ్లను మీరెలా బలపరుస్తారు?

పాట 100 వాళ్లకు ఆతిథ్యం ఇవ్వండి

a ఈ లోకంలో జీవితం కష్టాల మధ్య సాగుతోంది. మన సహోదర సహోదరీలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్లను ప్రోత్సహించే అవకాశాల కోసం వెతికి, వాళ్లకు సహాయం చేయాలి. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఉంచిన మంచి ఆదర్శాన్ని పరిశీలిస్తాం.

b చిత్రాల వివరణ: క్రిస్మస్‌ ఎందుకు చేసుకోం అనే విషయాన్ని మన ప్రచురణల్ని ఉపయోగించి వేరేవాళ్లకు వివరించేగలిగేలా, ఒక తండ్రి తన కూతురుకి సహాయం చేస్తున్నాడు.

c చిత్రాల వివరణ: విపత్తు వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఒక జంట వేరే ప్రాంతానికి వెళ్లారు.

d చిత్రాల వివరణ: విశ్వాసం బలహీనపడ్డ ఒక సహోదరుని ఇంటికి ఒక పెద్ద వెళ్లాడు. చాలా సంవత్సరాల క్రితం వాళ్లిద్దరు కలిసి హాజరైన పయినీరు సేవా పాఠశాల ఫోటోలను ఆ పెద్ద చూపిస్తున్నాడు. ఫోటోలు చూస్తున్నప్పుడు ఆ సహోదరునికి అప్పటి తీపి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. యెహోవా సేవలో ఉన్న ఆనందాన్ని ఆయన తిరిగి పొందాలని అనుకుంటున్నాడు. కొంతకాలానికే ఆయన సంఘానికి తిరిగొచ్చాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి