కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w21 అక్టోబరు పేజీలు 29-31
  • 1921—వంద సంవత్సరాల క్రితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1921—వంద సంవత్సరాల క్రితం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధైర్యం గల ప్రచారకులు
  • వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ అధ్యయనం
  • ఒక కొత్త పుస్తకం!
  • చేయాల్సిన పని చాలా ఉంది
  • యెహోవా అడిగింది చేస్తే దీవెనలు పొందుతాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • 1922—వంద సంవత్సరాల క్రితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • సంతోషాన్ని తీసుకొచ్చే నిర్ణయాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • అబద్ధమాడనేరని దేవునిచే బలపర్చబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
w21 అక్టోబరు పేజీలు 29-31

1921—వంద సంవత్సరాల క్రితం

“ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని ఏంటి?” అని జనవరి 1, 1921 వాచ్‌ టవర్‌ పత్రిక బైబిలు విద్యార్థుల్ని (అప్పట్లో యెహోవాసాక్షుల్ని అలా పిలిచేవాళ్లు) అడిగింది. ఆ ప్రశ్నకు జవాబిస్తూ యెషయా 61:1, 2 ఉపయోగించింది. ప్రకటించాల్సిన బాధ్యతను ఆ వచనాలు వాళ్లకు గుర్తుచేశాయి: “సాత్వికులకు మంచివార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. . . . యెహోవా అనుగ్రహ సంవత్సరం గురించి, మన దేవుని ప్రతీకార రోజు గురించి ప్రకటించడానికి . . . ఆయన నన్ను పంపాడు.”

ధైర్యం గల ప్రచారకులు

ప్రకటనా పనిలో కొనసాగడానికి బైబిలు విద్యార్థులకు ధైర్యం అవసరమైంది. ఎందుకంటే వాళ్లు సాత్వికులకు “మంచివార్త” ప్రకటించడంతో పాటు, చెడ్డవాళ్లకు “దేవుని ప్రతీకార రోజు” గురించి ప్రకటించాల్సి ఉంది.

కెనడాలో నివసించిన సహోదరుడు జె. హెచ్‌. హాస్కిన్‌, వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా ప్రకటించాడు. ఆయన 1921లో ఒక చర్చి పాస్టరును కలిశాడు. సహోదరుడు హాస్కిన్‌ అతనితో చర్చ మొదలుపెట్టే ముందే ఇలా అన్నాడు: “మనం ప్రశాంతంగా బైబిలు గురించి మాట్లాడుకుందాం. వేటి గురించైనా మన అభిప్రాయాలు కలవకపోతే, శాంతంగా, స్నేహపూర్వకంగా చర్చను ఆపేయవచ్చు.” కానీ అలా జరగలేదు. సహోదరుడు హాస్కిన్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “మా చర్చ మొదలైన కొన్ని నిమిషాలకే ఆ పాస్టరు తలుపును గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా అంటే, ఆ తలుపుకున్న అద్దం పగిలిపోతుందేమో అని నేను భయపడ్డాను.”

“మీరు నాకు చెప్పే బదులు క్రైస్తవులుకాని వాళ్లకు వెళ్లి చెప్పండి” అని ఆ పాస్టరు గట్టిగా అరిచాడు. సహోదరుడు హాస్కిన్‌ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతూ, ‘నేను ఇప్పటిదాకా మాట్లాడింది కూడా క్రైస్తవుడితో కాదు!’ అని తనలో తాను అనుకున్నాడు.

ఆ పాస్టరు తర్వాతి రోజు చర్చిలో సహోదరుడి గురించి చెడుగా మాట్లాడాడు. హాస్కిన్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “అతను నన్ను నిందిస్తూ నేను ఆ పట్టణంలో అడుగుపెట్టిన అతిపెద్ద మోసగాడినని, నన్ను చంపేయాలని తన చర్చి వాళ్లకు చెప్పాడు.” అయినా హాస్కిన్‌ ఏమాత్రం భయపడకుండా, ఆ పట్టణంలో చాలామందికి ప్రకటించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆ పట్టణంలో ప్రకటించడం నాకు చాలా నచ్చింది. కొంతమంది, ‘నువ్వు దేవుని సేవకుడివని మాకు తెలుసు. నీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పు మేము సహాయం చేస్తాం’ అని కూడా అన్నారు.”

వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ అధ్యయనం

ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రిక,a బైబిలు పఠనానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్‌ ప్రచురించింది. ఆ ఆర్టికల్స్‌లో, తల్లిదండ్రులు పిల్లలతో చర్చించడానికి ప్రశ్నలు ఉండేవి. తల్లిదండ్రులు పిల్లల్ని ఆ ప్రశ్నలు అడిగి, వాటికి జవాబుల్ని బైబిల్లో వెతికేలా సహాయం చేసేవాళ్లు. “బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?” లాంటి ప్రశ్నలు, పిల్లలకు ముఖ్యమైన సత్యాల్ని నేర్పించేవి. “నిజ క్రైస్తవులందరికీ హింసలు వస్తాయా?” లాంటి ప్రశ్నలేమో, ధైర్యం గల ప్రచారకులుగా తయారవడానికి పిల్లలకు సహాయం చేసేవి.

ఆ పత్రిక, పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ల కోసం కూడా కొన్ని ఆర్టికల్స్‌ ప్రచురించింది. వాటిలో, స్డడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ మొదటి సంపుటి ఆధారంగా తయారుచేసిన ప్రశ్నలు, వాటికి జవాబులు ఉండేవి. ఎన్నో వేలమంది పాఠకులు ఆ ఆర్టికల్స్‌ నుండి ప్రయోజనం పొందారు. అయితే, ఇకమీదట ఆ రెండు రకాల ఆర్టికల్స్‌ ప్రచురించము అని డిసెంబరు 21, 1921, ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రిక చెప్పింది. ఎందుకు?

ఒక కొత్త పుస్తకం!

దేవుని వీణ పుస్తకం

పుస్తకంలో ఏ పేజీలు చదవాలో చెప్పే కార్డు

ప్రశ్నలు ఉన్న కార్డులు

ముఖ్యమైన బైబిలు సత్యాల్ని కొత్తవాళ్లకు ఒక పద్ధతి ప్రకారం నేర్పించాల్సిన అవసరం ఉందని నాయకత్వం వహిస్తున్న సహోదరులు గుర్తించారు. అందుకోసం వాళ్లు 1921, నవంబరులో దేవుని వీణ (ఇంగ్లీషు) అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం తీసుకున్న ఆసక్తిపరులు, తాము సొంతగా అధ్యయనం చేసుకోగల స్టడీ కోర్సులో కూడా చేరేవాళ్లు. “మనుషులకు శాశ్వత జీవితాన్ని ఇవ్వాలన్న దేవుని ఉద్దేశాన్ని” అర్థం చేసుకునేలా ఆ కోర్సు వాళ్లకు సహాయం చేసింది. ఆ కోర్సు ఎలా ఉండేది?

పుస్తకం కావాలని అడిగిన వ్యక్తికి పుస్తకంతో పాటు, అందులో ఏ పేజీలు చదవాలో చెప్పే ఒక చిన్న కార్డు పంపేవాళ్లు. అప్పుడు అతను ఆ పేజీల్లోని సమాచారం చదివేవాడు. తర్వాతి వారం, ఆ సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్న ఇంకో కార్డు అతనికి పంపేవాళ్లు. ఆ కార్డు చివర్లో, తర్వాతి వారం ఏ పేజీలు చదవాలో ఉండేది.

అలా 12 వారాల పాటు, ప్రతీవారం స్థానిక తరగతి లేదా సంఘం నుండి ఒక కార్డు వచ్చేది. తరచూ ఆ కార్డుల్ని సంఘంలోని వృద్ధులు, ఇంటింటి పరిచర్య చేయలేనివాళ్లు పంపేవాళ్లు. ఉదాహరణకు, అమెరికాకు చెందిన సహోదరి ఆన కె. గార్డ్‌నర్‌ ఇలా గుర్తు చేసుకుంది: “దేవుని వీణ పుస్తకం విడుదలైనప్పుడు, చక్రాల కుర్చీకే పరిమితమైన మా అక్క థేల్‌కు చేతినిండా పని దొరికింది. ఆమె ప్రతీవారం, ప్రశ్నలు ఉండే కార్డుల్ని పంపించేది.” ఆ కోర్సు పూర్తయిన తర్వాత, సంఘం నుండి ఎవరైనా వెళ్లి విద్యార్థికి బైబిలు గురించి ఇంకా ఎక్కువ విషయాల్ని నేర్పించేవాళ్లు.

చక్రాల కుర్చీలో ఉన్న థేల్‌ గార్డ్‌నర్‌

చేయాల్సిన పని చాలా ఉంది

1921 చివర్లో, సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ అన్ని తరగతులకు లేదా సంఘాలకు ఒక ఉత్తరం పంపించాడు. ఆయన ఆ ఉత్తరంలో ఇలా రాశాడు: “ముందటి సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం, రాజ్యం గురించి మరింత ఎక్కువగా, సమర్థవంతంగా సాక్ష్యం ఇవ్వగలిగాం.” తర్వాత ఆయన ఇలా అన్నాడు: “చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. కాబట్టి మనతో కలిసి ఈ అద్భుతమైన పనిలో పాల్గొనమని ఇతరుల్ని ప్రోత్సహించండి.” బైబిలు విద్యార్థులు ఆ సలహాను పాటించారని స్పష్టమైంది. 1922లో వాళ్లు ధైర్యంగా ప్రకటించారు, ఇంకా ఎక్కువగా ప్రకటించారు.

ధైర్యవంతులైన స్నేహితులు

బైబిలు విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సహోదర ప్రేమ చూపించారు. వాళ్లు “కష్టకాలంలో” ధైర్యంగా తమ స్నేహితులకు అండగా నిలబడ్డారని కింది అనుభవం చూపిస్తుంది.—సామె. 17:17.

1921, మే 31, మంగళవారం రోజున అమెరికాలోని ఒక్లహామలో ఉన్న తుల్స నగరంలో, తెల్లజాతి స్త్రీ మీద దాడి చేశాడనే ఆరోపణతో ఒక నల్లజాతి వ్యక్తిని జైల్లో వేశారు. అప్పుడు వెయ్యి కన్నా ఎక్కువమంది తెల్లజాతి వాళ్లు, కొంతమంది నల్లజాతి వాళ్లతో గొడవపడ్డారు. తుల్స నగరం మధ్యలో మొదలైన ఆ గొడవ కాసేపటికే, నల్లజాతి వాళ్లు ఎక్కువగా ఉండే గ్రీన్‌వుడ్‌ ప్రాంతానికి పాకింది. తెల్లజాతి వాళ్లు ఆ ప్రాంతంలో 1,400 కన్నా ఎక్కువ ఇళ్లను, షాపుల్ని దోచుకున్నారు, తగలబెట్టారు. ఆ గొడవలో 36 మంది చనిపోయారని నివేదికలు చెప్పినా, నిజానికి 300 మంది దాకా చనిపోయి ఉంటారు. తర్వాత ఆ దాడిని “తుల్స జాతి ఊచకోత” అని పిలిచారు.

తుల్సలోని గ్రీన్‌వుడ్‌ ప్రాంతానికి చెందిన రిచర్డ్‌ జె. హిల్‌ అనే నల్లజాతి సహోదరుడు ఆ దాడి గురించి ఇలా చెప్పాడు: “ఆ రోజు రాత్రి ఎప్పటిలానే మా కూటం జరిగింది. కూటం తర్వాత నగరం మధ్యలో నుండి కాల్పుల శబ్దాలు వినిపించాయి. రాత్రి చాలాసేపటి వరకు ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.” జూన్‌ 1, బుధవారం ఉదయం కల్లా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “సురక్షితంగా ఉండాలంటే, నగరంలో ఉన్న ప్రభుత్వ భవనానికి వెళ్లాలని కొంతమంది మాకు చెప్పారు.” దాంతో హిల్‌ తన భార్య, ఐదుగురు పిల్లల్ని తీసుకుని ఆ భవనానికి వెళ్లాడు. ఆ భవనంలో దాదాపు 3,000 మంది నల్లజాతి వాళ్లు తలదాచుకున్నారు. గొడవల్ని ఆపడానికి ప్రభుత్వం పంపిన మిలిటరీ వాళ్లలో కొంతమంది ఆ భవనానికి కాపలాగా ఉన్నారు.

ఆ సమయంలో, ఆర్థర్‌ క్లాస్‌ అనే తెల్లజాతి సహోదరుడు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఇలా గుర్తు చేసుకున్నాడు: “అల్లరిమూకలు గ్రీన్‌వుడ్‌లో ఇళ్లను దోచుకుంటూ తగలబెడుతున్నారని తెలియగానే, నా ప్రియ స్నేహితుడైన హిల్‌ ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.”

సహోదరుడు ఆర్థర్‌ క్లాస్‌ దేవుని వీణ పుస్తకంతో 14 మంది పిల్లలకు బైబిలు గురించి నేర్పించాడు

ఆర్థర్‌ కాసేపటికి హిల్‌ ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు అక్కడ ఒక తెల్లజాతి అతను చేతిలో తుపాకి పట్టుకుని ఉన్నాడు. అతను కూడా హిల్‌ స్నేహితుడే, అతను వాళ్ల ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. ఆర్థర్‌ కూడా అల్లరిమూకల్లో ఒకడు అనుకుని, “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని ఆ తెల్లజాతి అతను గట్టిగా అరిచాడు.

ఆర్థర్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “అతనికి నా జవాబు నచ్చకపోతే నన్ను కాల్చేసేవాడే. నేను హిల్‌ స్నేహితుడినని, ఇంతకుముందు ఆయన ఇంటికి చాలాసార్లు వచ్చానని చెప్పాను.” తెల్లజాతి అతను, ఆర్థర్‌ ఇద్దరూ కలిసి దోపిడీదారుల నుండి హిల్‌ ఇంటిని కాపాడారు.

కాసేపటి తర్వాత సహోదరుడు హిల్‌, ఆయన కుటుంబం ప్రభుత్వ భవనంలో ఉన్నారని ఆర్థర్‌కు తెలిసింది. మిలిటరీ ఉన్నత అధికారి అయిన బారెట్‌ అనుమతినిస్తూ సంతకం చేయనిదే, నల్లజాతి వాళ్లు ఎవ్వరూ అక్కడ నుండి బయటికి వెళ్లలేరని కొందరు ఆర్థర్‌కు చెప్పారు. ఆర్థర్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “ఆ ఉన్నత అధికారిని కలవడం చాలా కష్టం. నేను ఆయన్ని కలిసి హిల్‌ కుటుంబాన్ని తీసుకెళ్తానని చెప్పినప్పుడు, ‘నువ్వు ఆ కుటుంబాన్ని, వాళ్ల అవసరాల్ని చూసుకుంటావా?’ అని అడిగాడు. నేను చూసుకుంటాను అని సంతోషంగా చెప్పాను.”

ఆ అనుమతి పత్రం తీసుకున్న వెంటనే ఆర్థర్‌ ప్రభుత్వ భవనానికి వెళ్లి, అక్కడున్న అధికారికి దాన్ని చూపించాడు. అప్పుడు ఆ అధికారి ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు: “నిజంగా బారెట్‌ గారే దీని మీద సంతకం పెట్టారా! నీకు తెలుసా? ఉదయం నుండి, ఇక్కడున్న వాళ్లను తీసుకెళ్లడానికి వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే.” కాసేపటికి ఆర్థర్‌ ఆ పెద్ద భవనంలో హిల్‌ను, ఆయన కుటుంబాన్ని వెతికి కలుసుకున్నాడు. వాళ్లు ఆర్థర్‌ కారులో తమ ఇంటికి వెళ్లారు.

“దేవుని ప్రజల్లో అందరూ సమానమే”

హిల్‌, ఆయన కుటుంబం క్షేమంగా ఉండేలా ఆర్థర్‌ చూసుకున్నాడు. ఆర్థర్‌ చూపించిన ధైర్యం, సహోదర ప్రేమ ఇతరుల్ని ఆకట్టుకున్నాయి. ఆర్థర్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “హిల్‌ ఇంటిని కాపాడడానికి సహాయం చేసిన తెల్లజాతి అతనికి యెహోవాసాక్షుల మీద గౌరవం పెరిగింది. అంతేకాదు, చాలామంది సత్యం పట్ల ఆసక్తి చూపించారు. ఎందుకంటే మన మధ్య జాతి-తెగ లాంటి భేదాలు లేవని, దేవుని ప్రజల్లో అందరూ సమానమే అని వాళ్లు గుర్తించారు.”

a ఆ పత్రిక పేరును 1937లో కన్సోలేషన్‌ అని, 1946లో అవేక్‌! అని మార్చారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి