మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కెమెరా లేదా ఇంటర్‌కామ్ ద్వారా సాక్ష్యమివ్వడం
ఎందుకు ప్రాముఖ్యం: టెక్నాలజీ అభివృద్ధి చెందడం, నేరాలు పెరిగిపోవడం వల్ల చాలా ఇళ్లలో సెక్యూరిటీ కెమెరాలు, ఇంటర్‌కామ్‌లు సర్వసాధారణం అయిపోయాయి. మన కంటికి కనిపించకుండా, మనల్ని కెమెరాలో గమనిస్తున్న వ్యక్తికి మంచివార్త ప్రకటించడమంటే కాస్త భయంగా అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన కొన్ని సలహాలు పాటిస్తే, మనం కెమెరా లేదా ఇంటర్‌కామ్ ద్వారా మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతాం.
ఎలా చేయాలి:
సానుకూలంగా ఉండండి. కెమెరా లేదా ఇంటర్‌కామ్ ఉన్న చాలామంది ఇంటివ్యక్తులు మనం చెప్పేది వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు
మీరు కాలింగ్ బెల్ కొట్టకముందు నుండే మీరు చేసే ప్రతీ పని కెమెరాల్లో రికార్డు అవుతుందని గుర్తుంచుకోండి; మీరు వాళ్ల ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన క్షణం నుండి ఇంటివ్యక్తి మిమ్మల్ని గమనిస్తుండవచ్చు, మీ మాటల్ని వింటుండవచ్చు
ఇంటివ్యక్తి జవాబిచ్చినప్పుడు, మీరు ఇంటర్‌కామ్ లేదా కెమెరాలోకి చూస్తూ కళ్లెదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లే మాట్లాడండి. మీ చిరునవ్వు, హావభావాలు సహజంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఆ ఇంటివ్యక్తి తలుపు తెరిస్తే ఏం మాట్లాడాలని సిద్ధపడ్డారో, అదే మాట్లాడండి. ఒకవేళ అక్కడ కెమెరా ఉంటే, మీ ముఖాన్ని కెమెరాకు మరీ దగ్గరగా పెట్టకండి. ఇంటివ్యక్తి జవాబివ్వకపోతే, వాయిస్ మెసేజ్ చేయకండి.
ఇంటివ్యక్తితో సంభాషణ పూర్తయ్యాక కూడా, వాళ్లు మిమ్మల్ని ఇంకా గమనిస్తూ ఉండవచ్చు లేదా మీ మాటలు వింటూ ఉండవచ్చు అని మర్చిపోకండి.