బైబిలు బోధిస్తుంది పుస్తకంలో ఉన్న వివిధ అంశాలను చక్కగా ఉపయోగించండి
బైబిలు విద్యార్థులు బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో నేర్చుకుంటూ వాటిని పాటిస్తుండగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అభివృద్ధి అవుతారు. (కీర్త. 1:1-3) బైబిలు బోధిస్తుంది పుస్తకంలో ఉన్న కొన్ని మంచి అంశాలను చక్కగా ఉపయోగిస్తూ మన విద్యార్థి అభివృద్ధికి తోడ్పడవచ్చు.
అధ్యాయం మొదట్లో ఉండే ప్రశ్నలు: ప్రతి అధ్యాయం ప్రశ్నలతో మొదలవుతుంది. వాటికి జవాబులు పాఠంలో వస్తాయి. ఈ ప్రశ్నలను మీరు మామూలుగా అడగవచ్చు. అంటే జవాబులు కోసమని కాకుండా స్టడీ చేయబోయే విషయాలపైన వాళ్ల ఆసక్తిని పెంచడానికి అడగవచ్చు. లేదా విద్యార్థిని చిన్న జవాబు చెప్పమన్నా పర్వాలేదు. ఒకవేళ తప్పు చెప్పినా వెంటనే అప్పుడే సరి చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పే జవాబుల నుండే ఎక్కడెక్కడ సహాయం అవసరమో వేటిని ఎక్కువ వివరించాల్సి ఉంటుందో మీకు తెలుస్తుంది.—సామె. 16:23; 18:13.
అనుబంధం: పేరాల్లో ఉన్న సమాచారాన్ని విద్యార్థి అర్థం చేసుకుని వాటిని ఒప్పుకుంటే, అప్పుడు వాటికి సంబంధించిన అనుబంధంలోని సమాచారాన్ని సొంతగా చదువుకోమనవచ్చు. ఈసారి స్టడీ చేసేటప్పుడు మీరు కొద్ది నిమిషాలు తీసుకుని అవి అతనికి అర్థమయ్యాయో లేదో చూడొచ్చు. కానీ అవి అతనికి ఉపయోగపడతాయంటే మాత్రం స్టడీలో సమయం తీసుకుని వాటిని పరిశీలించాలి లేదా కొన్ని పేరాలు చదివించి మీరు ముందే అనుకున్న ప్రశ్నలు అడగాలి.
అధ్యాయం చివర ఉన్న బాక్సు: బైబిలు ఈ విషయాలను బోధిస్తుంది అన్న బాక్సులో అధ్యాయం మొదట్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. వీటిని ఉపయోగించి విద్యార్థికి అర్థమౌతుందో లేదో తెలుసుకోవచ్చు, ముఖ్యమైన విషయాలను వివరించవచ్చు కూడా. విద్యార్థితో కలిసి ప్రతీ లైను బయటకు చదవండి. పక్కన ఇచ్చిన వచనాలను కూడా చదవండి. తర్వాత ఇచ్చిన వచనాలతో అక్కడున్న విషయం ఎందుకు నిజమో విద్యార్థిని వివరించమనండి.—అపొ. 17:2, 3.