మనం బోధించేవాళ్ల హృదయాన్ని దేవుని మాట వినేలా కదిలించాలంటే ఏం చేయాలి?
1. యేసు నేర్పించిన విషయాలు ఆయన బోధిస్తున్నవాళ్ల హృదయాలపై ఎలాంటి ప్రభావం చూపించాయి?
1 యేసుక్రీస్తు తన మాటలు వినేవాళ్ల హృదయాన్ని కదిలించాడు. ఒకసారి యేసు దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించిన తర్వాత శిష్యుల హృదయాలు ‘మండుచున్నట్లు’ అయ్యాయి. (లూకా 24:32) దేవునికి లోబడి ఉండాలనే ఆలోచన హృదయం నుండి రావాలి, కాబట్టి మనం బోధించేవాళ్ల హృదయాన్ని కదిలించి వాళ్ల జీవితంలో మార్పులు చేసుకోవడానికి ఏం చేయవచ్చు?— రోమా. 6:17.
2. హృదయాన్ని కదిలించడానికి తెలివి, వివేచన మనకు ఎలా ఉపయోగపడతాయి?
2 తెలివి, వివేచన ఉపయోగించండి: చాలామందికి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. అంతేకాదు, వాళ్ల మత నమ్మకాలను మార్చేయ్యాలని మనం వచనం తర్వాత వచనం వరుసగా చూపిస్తూ వాళ్ల మీద దాడి చేయకూడదు. వాళ్ల హృదయాన్ని కదిలించాలి అంటే ముందు వాళ్లు ఎందుకలా నమ్ముతున్నారో, ఎందుకలా ఉంటున్నారో తెలుసుకోవాలి. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేలా నేర్పుగా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ల మనసులో ఉన్న విషయాలు చెప్పడానికి ముందుకొస్తారు. (సామె. 20:5) అప్పుడే మనం వాళ్ల హృదయాన్ని కదిలించే సమాచారాన్ని దేవుని వాక్యంలో నుండి చూపించగలుగుతాం. కాబట్టి మనం వాళ్లపై శ్రద్ధను చూపిస్తూ ఓపికగా ఉండాలి. (సామె. 25:15) ఆధ్యాత్మికంగా అభివృద్ధి అందరిలో ఒకే విధంగా ఉండదు. కాబట్టి వాళ్ల ఆలోచనలపై, పనులపై యెహోవా పరిశుద్ధాత్మ పని చేసేలా సమయం ఇవ్వాలి.—మార్కు 4:26-29.
3. మనం బోధించేవాళ్లు మంచి లక్షణాలు చూపించడానికి ఎలా సహాయం చేయవచ్చు?
3 మంచి లక్షణాలు పెంచుకునేలా సహాయం చేయండి: యెహోవా మంచితనం, ప్రేమ గురించి చెప్తున్న బైబిలు భాగాలు మంచి లక్షణాలు పెంచుకోవడానికి మనం బోధించేవాళ్లకు సహాయం చేస్తాయి. యెహోవా మనలో ప్రతీ ఒక్కరిపై ఎంతగా శ్రద్ధ చూపిస్తున్నాడో తెలుసుకోవడానికి కీర్తన 139:1-4, లూకా 12:6, 7 లాంటి వచనాలు చూపించవచ్చు. యెహోవాకున్న అపారమైన దయకు కృతజ్ఞత చూపించడం నేర్చుకున్నప్పుడు, ఆయన మీద వాళ్లకున్న ప్రేమ, భక్తి పెరుగుతుంది. (రోమా. 5:6-8; 1 యోహా. 4:19) అంతేకాదు వాళ్ల ప్రవర్తన యెహోవాను సంతోషపెడుతుంది లేదా బాధపెడుతుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్లు ఆయనకు నచ్చే విధంగా, ఆయనను గౌరవించే విధంగా ప్రవర్తిస్తారు.—కీర్త. 78:40, 41; సామె. 23:15.
4. బోధిస్తున్నప్పుడు ప్రతీఒక్కరికి ఉన్న స్వేచ్ఛను మనం ఎలా గౌరవిస్తాం?
4 ఆయన ఆజ్ఞల్ని పాటించాలని యెహోవా ఎవర్నీ బలవంతం పెట్టడు. కానీ ఆయన మాట వినడం ఎందుకు మంచిదో చూపిస్తాడు. (యెష. 48:17, 18) ఎవరి నిర్ణయం వాళ్లే తీసుకునేలా ప్రజలకు నేర్పించినప్పుడు మనం కూడా యెహోవాను అనుకరిస్తాము. జీవితంలో మార్పులు చేసుకోవాలని ఎవరికి వాళ్లు నిర్ణయించుకున్నప్పుడు ఫలితాలు చిరకాలం ఉంటాయి. (రోమా. 12:2) అంతేకాదు “హృదయ పరిశోధకుడు” యెహోవాకు వాళ్లను ఇంకా దగ్గర చేస్తుంది.—సామె. 17:3.