పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం —ఇంటివాళ్ల మీద శ్రద్ధ చూపించండి
ఎందుకు ప్రాముఖ్యం? యేసు ఒక్కొక్కరి మీద ప్రేమపూర్వక శ్రద్ధ చూపించాడు. ఉదాహరణకు, ఓ చెవిటివాణ్ణి బాగుచేస్తున్నప్పుడు అతను భయపడుతున్నాడని యేసు బహుశా గ్రహించివుంటాడు. అందుకే, అందరి మధ్య కాకుండా పక్కకు తీసుకెళ్లి బాగుచేశాడు. (మార్కు 7:31-35) తన శిష్యుల పరిమితులను అర్థం చేసుకొని మరీ ఎక్కువ విషయాలు చెప్పకుండా వాళ్ల పట్ల శ్రద్ధ చూపించాడు. (యోహా. 16:12) యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా అలాంటి శ్రద్ధనే చూపిస్తున్నాడు. (2 తిమో. 4:17) క్రీస్తు అనుచరులముగా మనం కూడా ఆయనలాగే ప్రేమ చూపించాలనుకుంటాం. (1 పేతు. 2:21; 1 యోహా. 3:16, 18) అంతేకాకుండా, ఇంటివాళ్ల పట్ల శ్రద్ధ చూపిస్తూ వాళ్ల పరిస్థితులను, అవసరాలను, చింతలను గుర్తించినప్పుడు పరిచర్యను మరింత సమర్థవంతంగా చేయగలుగుతాం. మనం కేవలం సువార్త చెప్పడానికో సాహిత్యం ఇవ్వడానికో కాదుగానీ వాళ్లమీద శ్రద్ధతో వచ్చామని అనిపించినప్పుడు, వినడానికి వాళ్లు మరింత సుముఖంగా ఉంటారు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
కుటుంబ ఆరాధనలో లేదా పరిచర్య చేస్తున్నప్పుడు దీన్ని ప్రాక్టీసు చేయండి: ఇంటివాళ్లు చెప్పిన దాన్ని బట్టి ప్రచారకుడు తన అందింపును మార్చుకోవాల్సి వస్తే ఎలా మార్చుకుంటాడు.
క్షేత్రసేవా కూటం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు, దాన్ని నిర్వహించే సహోదరుడు పరిచర్యలో ఇంటివాళ్ల మీద శ్రద్ధ చూపించే విధానాల గురించి చర్చించవచ్చు లేదా ప్రదర్శనలు చేయించవచ్చు.
మీరు పయినీరు సేవ చేయగలరా?
1 ‘ఇది కాకుండా వేరే పని చేస్తున్నట్లు ఊహించుకోలేను. నాకు తెలిసి, వేరే ఏ పనీ ఇంత ఆనందాన్ని ఇవ్వలేదు.’ ఎంతో సంతోషాన్నిచ్చే పూర్తికాల పరిచర్యను చేపట్టిన లక్షలాది యెహోవాసాక్షుల్లో ఒకరు ఆ మాటలు అన్నారు. ‘నేను పయినీరు సేవ చేయగలనా?’ అని మీరెప్పుడైనా జాగ్రత్తగా ఆలోచించారా? యెహోవాకు పూర్తిగా సమర్పించుకున్నాం కాబట్టి రాజ్య సువార్తను ప్రకటించే పనిని ఇంకా ఎక్కువగా చేయగలమేమో తప్పకుండా ఆలోచించాలి. అందుకోసం, పయినీరు సేవ గురించి చాలామందికి వచ్చే ప్రశ్నల్లో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రశ్న 1: “అందరూ పయినీరు సేవ చేయలేరని కొంతమంది అంటారు. మరి, నేను చేయగలనో లేదో నాకెలా తెలుస్తుంది?”
2 మీరు చేయగలరా లేదా అనేది మీ పరిస్థితుల మీద, లేఖనాల ప్రకారం మీకున్న బాధ్యతల మీద ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం లేదా ఇతర పరిస్థితుల వల్ల, ప్రతీనెల 70 గంటలు పరిచర్య చేయడం చాలామందికి వీలుకావడం లేదు. వాళ్లు, తమకు వీలైనన్నిసార్లు పరిచర్యకు వెళ్తుంటారు. కుదిరితే, ప్రతీ సంవత్సరం ఒకట్రెండు నెలలు సహాయ పయినీరు సేవ చేస్తారు. అలా, ఎక్కువ సేవ చేయడం వల్ల వచ్చే ఆనందాన్ని పొందుతారు. (గల. 6:9) వాళ్లు ఇప్పుడు పూర్తికాల సేవ చేయలేకపోయినా, ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తూ పయినీరు సేవ చేయాలనే ప్రేరణనిస్తూ సంఘానికి ఆశీర్వాదంగా ఉన్నారు.
3 తక్కువ బాధ్యతలున్న చాలామంది సహోదరసహోదరీలు, ఏ విషయాలు ప్రాముఖ్యమైనవో గ్రహించి, తగిన సర్దుబాట్లు చేసుకొని పయినీరు సేవ చేయగలుగుతున్నారు. మరి మీ విషయమేమిటి? మీరు పాఠశాల విద్య పూర్తిచేసుకున్న యౌవనులు కావచ్చు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని గృహిణి కావచ్చు, పిల్లల్ని పెంచే బాధ్యతలేని దంపతులు కావచ్చు, ఉద్యోగ విరమణ పొందివుండవచ్చు. పయినీరు సేవ చేయాలా, లేదా అనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. ఇంతకీ మీరు పయినీరు సేవ చేయగలరా?
4 సాతాను, లోకంలోని విషయాలను ఉపయోగించి మన ధ్యాస మళ్లించడానికి, మనం మనకోసమే జీవించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం లోకానికి వేరుగా ఉండాలని నిశ్చయించుకుంటే, రాజ్యాన్ని మొదట వెదకడానికి; మనకు అందుబాటులో ఉన్న అన్ని సేవావకాశాల కోసం అర్హతలు సంపాదించడానికి; వాటిని చేపట్టడానికి యెహోవా సహాయం చేస్తాడు. కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే మీరు పయినీరు సేవ చేయగలరా? అలాగైతే ఇంకేమీ ఆలోచించకండి.
ప్రశ్న 2: “పూర్తికాల సేవ మొదలుపెట్టాక డబ్బులేక ఇబ్బందిపడాల్సి వస్తే . . . ”
5 చాలా దేశాల్లో, కనీస అవసరాల కోసం రానురాను ఎక్కువ గంటలు కష్టపడాల్సి వస్తోంది. అయినా చాలామంది ఎన్నో ఏళ్లపాటు పయినీరు సేవ చేశారు, యెహోవా ఇప్పటికీ వాళ్ల బాగోగులు చూసుకుంటున్నాడు. పయినీరు సేవలో కొనసాగాలంటే విశ్వాసం ఉండాలి, కొన్నిటిని త్యాగం చేయాలి. (మత్త. 17:20) “యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు” అని కీర్తన 34:10 హామీ ఇస్తుంది. పయినీరు సేవ మొదలుపెట్టే వాళ్లకు యెహోవా తమను చూసుకుంటాడనే పూర్తి నమ్మకం ఉండాలి. పయినీరు సేవ చేస్తున్న వాళ్లందర్నీ ఇప్పటికే ఆయన అలా చూసుకుంటున్నాడు. (కీర్త. 37:25) అయితే, 2 థెస్సలొనీకయులు 3:8, 10; 1 తిమోతి 5:8 చెప్తున్న ప్రకారం, పయినీర్లు ఇతరుల నుండి డబ్బు సాయం ఆశించరు.
6 ఎవరైనా పయినీరు సేవ గురించి ఆలోచిస్తుంటే, వాళ్లు యేసు చెప్పినట్లు ‘మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోవాలి.’ (లూకా 14:28) అది తెలివైన పని. చాలా సంవత్సరాలు పయినీరు సేవ చేసినవాళ్లతో మాట్లాడండి. వాళ్లను యెహోవా ఎలా చూసుకున్నాడో అడగండి. మీ ప్రాంతీయ పర్యవేక్షకునికి కూడా పయినీరు సేవలో చాలా అనుభవం ఉంటుంది కాబట్టి ఎన్నో విలువైన సలహాలు ఇవ్వగలడు.
7 మన చుట్టూ ఉన్న ప్రజలు వస్తువుల కోసం పరుగులు తీస్తున్నారు. మనం కూడా వాళ్లలాగే చేయాలనే ఒత్తిడి అంతకంతకూ ఎక్కువౌతోంది. అయినా మనకు వినయం, పూర్తికాల సేవపట్ల కృతజ్ఞత ఉంటే ఉన్నవాటితో తృప్తిపడతాం. (1 తిమో. 6:7, 8) పయినీర్లు జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే, ఎక్కువగా సేవ చేయగలుగుతారు. దానివల్ల ఇతరులకు బైబిలు సత్యాలు నేర్పిస్తూ ఎక్కువ సంతోషాన్ని పొందుతారు, యెహోవాకు మరింత దగ్గరౌతారు. వాళ్లు అసలు వస్తువులే కొనుక్కోరని కాదు, కానీ డబ్బు విషయంలో సరైన ఆలోచన కలిగివుంటారు. దానివల్ల, పయినీరు సేవలోని ఆశీర్వాదాలను పొందగలుగుతున్నారు.
8 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని, ఈ దుష్టలోక అంతం రోజురోజుకూ దగ్గరపడుతోందని మీరు స్పష్టంగా గుర్తించారా? అలాగైతే, అవకాశం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటించగలిగేలా త్యాగాలు చేయడానికి మీరు ముందుంటారు. ఇప్పుడు మీ ఆర్థిక స్థితి ఎలా ఉందో పరిశీలించుకొని, ఆ విషయాన్ని యెహోవాకు అప్పగించండి. బహుశా మీరు పూర్తికాల సేవ చేయగలరని మీకే అర్థమౌతుంది. అందుకోసం మీరు కొన్ని కోరికలు పక్కనపెట్టాల్సి వచ్చినా, యెహోవా తప్పకుండా మిమ్మల్ని మెండుగా దీవిస్తాడు.—కీర్త. 145:16.
ప్రశ్న 3: “నేను టీనేజర్ని, పయినీరు సేవ గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి?”
9 పాఠశాల విద్య ముగిసే సమయంలో మీలాగే అందరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మీ జీవితం సురక్షితంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని మీరు కోరుకుంటారు. పాఠశాల సలహాదారులు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నించమని పురికొల్పుతారు. అందుకోసం చాలా సంవత్సరాలు కాలేజీలో చదువుకోవాల్సి ఉంటుంది. బైబిలు సూత్రాల ప్రకారం చక్కగా మలచుకున్న మీ మనస్సాక్షి, వీలైనంత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికి సిద్ధపడమని మీకు చెప్తుంది. (ప్రసం. 12:1, 2) కొంతకాలం తర్వాత, పెళ్లి చేసుకోవడం గురించి కూడా మీరు ఆలోచిస్తుండవచ్చు. మరి మీరు దేన్ని ఎంచుకుంటారు?
10 ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షి అయితే, పూర్ణాత్మతో ఇప్పటికే మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నారు. (హెబ్రీ. 10:7) ముందుగా, ఒకనెల లేదా వీలైనన్ని నెలలు సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల, క్రమ పయినీరు సేవలోని సంతోషాన్ని, బాధ్యతల్ని రుచి చూడగలుగుతారు. అలాగే, మీ జీవితాన్ని దేనికి ఉపయోగించాలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. ప్రాథమిక విద్య పూర్తైన తర్వాత దొరికే సమయంలో పూర్తికాల ఉద్యోగం చేసే బదులు క్రమ పయినీరు సేవ మొదలుపెట్టవచ్చు. ఆలస్యంగా పయినీరు సేవ మొదలుపెట్టిన కొందరు, తాము ముందే అలా చేసివుంటే బావుండేదని అనుకుంటున్నారు.
11 యౌవనులారా, ఒంటరిగా ఉండే అవకాశాన్ని ఉపయోగించుకోండి. పూర్తికాల పరిచర్య చేస్తున్నప్పుడు దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఏదోక రోజు పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నా, ముందుగా క్రమ పయినీరు సేవ చేస్తే, మీ వివాహానికి చక్కని పునాది ఏర్పడుతుంది. మీరు క్రైస్తవులుగా ఎదుగుతూ, యెహోవాకు ఇంకా దగ్గరౌతూ ఉంటే మీలాంటి లక్ష్యాలున్న వ్యక్తిని పెళ్లాడి ఎప్పటికీ పయినీరు సేవలో కొనసాగాలని నిర్ణయించుకోవచ్చు. అలా కలిసి పయినీరు సేవ చేసిన దంపతులు ఆ తర్వాత ప్రయాణ పనిలో లేదా మిషనరీ సేవలో కొనసాగారు. అదెంత సంతృప్తినిచ్చే జీవితం!
12 మీరు ఎంతకాలం నుండి పయినీరు సేవచేస్తున్నా, దానివల్ల మీ విద్య సంపూర్ణమౌతుంది. భూమ్మీదున్న మరే పనీ ఇవ్వలేని చక్కని తర్ఫీదును మీరు పొందుతారు. క్రమశిక్షణ, అన్నీ క్రమపద్ధతిలో చేయడం, ఇతరులతో మెలగడం, యెహోవా మీద ఆధారపడడం, ఓర్పు-దయ వంటి లక్షణాలు నేర్చుకుంటారు. దానివల్ల, ఇంకా పెద్ద బాధ్యతలు చేపట్టడానికి అర్హులౌతారు.
13 ముందెన్నటికన్నా ఇప్పుడు పరిస్థితులు మరింత అస్థిరంగా తయారయ్యాయి, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. యెహోవా వాగ్దానం చేసినవి కాక, ఇంకొన్ని మాత్రమే ఎప్పటికీ ఉంటాయి. మీ ముందు చాలా ఎంపికలు ఉన్నాయి. రానున్న సంవత్సరాల్లో మీ జీవితాన్ని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకోటి లేదు. పయినీరు సేవ ఒక గొప్ప అవకాశం, దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. దాన్ని ఎంచుకున్నందుకు మీరు ఎప్పటికీ బాధపడరు.
ప్రశ్న 4: “గంటలు పూర్తి చేయాలనే ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది కదా? ఒకవేళ నేను వెనకబడితే . . . ”
14 మీరు క్రమ పయినీరు దరఖాస్తు నింపుతున్నప్పుడు, దానిమీద ఈ ప్రశ్న ఉంటుంది: “సంవత్సరానికి 840 గంటలు చేయడానికి వీలుగా మీ వ్యక్తిగత పనులన్నీ వ్యవస్థీకరించుకున్నారా?” అందుకోసం మీరు సగటున రోజుకు రెండున్నర గంటలు సేవ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చక్కని పట్టిక వేసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని పాటించాలి. పయినీరు సేవ మొదలుపెట్టిన చాలామంది కొన్ని నెలల్లోనే తమకు సరిపోయే చక్కని పట్టిక వేసుకొని, దానికి అలవాటుపడిపోతారు.
15 అయితే, ప్రసంగి 9:11 చెబుతున్నట్లు “కాలవశము చేత,” అనూహ్యంగా జరిగే సంఘటనలు అందరికీ ఎదురౌతాయి. తీవ్రమైన అనారోగ్యం లేదా అనుకోని పరిస్థితుల వల్ల పయినీర్లు చేయాల్సిన గంటల్లో వెనకబడవచ్చు. ఆ సమస్య ఎక్కువకాలం ఉండేది కాకపోతే, అది సేవా సంవత్సరం మొదట్లో తలెత్తితే, రోజుకు ఎక్కువ గంటలు చేసేలా మంచి పట్టిక వేసుకుంటే సరిపోతుంది. కానీ సమస్య పెద్దదైతే, పైగా అది సేవా సంవత్సరం చివరి నెలల్లో వస్తే అప్పుడేమిటి?
16 మీరు కొంతకాలం జబ్బుపడడం వల్ల లేదా వేరే అత్యవసర పని వల్ల గంటలు పూర్తి చేయలేకపోతే, సంఘ సేవా కమిటీలో ఒకర్ని కలిసి మీ సమస్య గురించి చెప్పండి. చేయలేకపోయిన గంటల గురించి మీరు బాధపడకుండా పయినీరు సేవలో కొనసాగడం మంచిదని వాళ్లకు అనిపిస్తే, ఆ విషయం మీకు చెప్తారు. అప్పుడు సంఘ కార్యదర్శి కాంగ్రిగేషన్ పబ్లిషర్ రికార్డ్ కార్డ్‌లో ఆ విషయం రాసిపెడతాడు. దానివల్ల, మీరు వెనకబడిన గంటలు పూర్తిచేయాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఇది సెలవు చీటి లాంటిది కాదుగానీ మీ పరిస్థితుల గురించి ఆలోచించి ప్రేమతో చేసిన ఒక ఏర్పాటు.
17 అనుభవం ఉన్న పయినీర్లు, సేవా సంవత్సరం మొదట్లోనే ఎక్కువ గంటలు చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు పయినీరు సేవే ముఖ్యం కాబట్టి కొన్నిసార్లు, అంత ప్రాముఖ్యంకాని పనులకు వెచ్చించే సమయం తగ్గించాలని గుర్తిస్తారు. ఒక పయినీరు మంచి పట్టిక వేసుకోకపోవడం వల్ల లేదా పట్టిక ప్రకారం పనులు చేయకపోవడం వల్ల గంటల్లో వెనుకబడితే? తనను అర్థం చేసుకొని గంటలు తగ్గించాలని ఆయన ఆశించకూడదు.
18 ఇంకొన్నిసార్లు, పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. అనారోగ్యం, పెరిగిన కుటుంబ బాధ్యతలు లేదా అలాంటివాటి వల్ల ఎక్కువకాలం పాటు చేయాల్సిన గంటలు చేయలేనని ఒక పయినీరుకు అనిపించవచ్చు. అలాంటప్పుడు, ఆయన ప్రచారకునిగా ఉంటూ వీలైనప్పుడల్లా సహాయ పయినీరు సేవ చేయడం మంచిది. పరిస్థితులు మారిపోయి తరచూ గంటలు చేరుకోలేకపోతున్నా, పయినీరు సేవలో అలాగే కొనసాగనిచ్చే ఏర్పాటు ఏదీలేదు.
ప్రశ్న 5: “మంచి పని చేయాలని, అందులో ఆనందం పొందాలని ఉంది. అందుకు పయినీరు సేవ సరిపోతుందా?”
19 యెహోవాతో దగ్గరి సంబంధం, ఆయనకు విశ్వసనీయంగా సేవ చేస్తున్నామనే నమ్మకం ఉన్నప్పుడే మనం నిజంగా సంతోషంగా ఉంటాం. యేసు “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై” హింసాకొయ్యను లేదా తీవ్రమైన వేదనను సహించాడు. (హెబ్రీ. 12:1, 2) దేవుని చిత్తం చేయడమే ఆయనకు ఆనందాన్నిచ్చింది. (కీర్త. 40:8) ఇప్పుడున్న లోకంలో నిజంగా సంతోషంగా ఉండాలంటే, యెహోవా ఆరాధనకు సంబంధించిన వాటిలో ఎక్కువ సమయం గడపాలి. అలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే, మన జీవితానికి ఒక అర్థం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే లోలోపల, మనం సరైనది చేస్తున్నామనే భావన ఉంటుంది. మనం ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో నిత్యజీవం పొందడం గురించి ప్రజలకు నేర్పించడం కన్నా మనం ఇవ్వగల మంచిది ఏదైనా ఉందా?—అపొ. 20:35.
20 మొదటి పేరాలో చూసిన పయినీరు ఇంకా ఇలా అన్నాడు: ‘బైబిలు విద్యార్థి ఉత్సాహంగా యెహోవాను సేవిస్తుంటే చూడడం కన్నా సంతోషకరమైన విషయం ఏదైనా ఉంటుందా? దేవుని వాక్యం ప్రజలను ఎంతో శక్తిమంతంగా ప్రేరేపిస్తుంది. దానివల్ల వాళ్లు యెహోవాను సంతోషపెట్టేలా తమ జీవితాల్లో మార్పులు చేసుకుంటారు. ఇదంతా చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మన విశ్వాసం బలపడుతుంది.’ (కావలికోట అక్టోబరు 15, 1997 సంచికలోని 18-23 పేజీలు చూడండి.) ఇంతకీ, మీకు ఏది సంతోషాన్నిస్తుంది? లోకం ఇచ్చే సంతోషం కొంతకాలమే ఉంటుంది. కానీ పయినీరు సేవవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. దీనికి మీరు విలువిస్తే మంచి పని చేశారనే సంతృప్తి, నిజమైన సంతోషం పొందుతారు.
ప్రశ్న 6: “నిత్యజీవం పొందాలంటే తప్పకుండా పయినీరు సేవ చేయాలనే నియమమేదీ లేదు. అలాంటప్పుడు, పయినీరు సేవ చేయాలో లేదో నిర్ణయించుకోవాల్సింది నేనే కాదా?”
21 నిజమే, అది మీ నిర్ణయమే. మీ పరిస్థితుల గురించి యెహోవాకు మాత్రమే పూర్తిగా తెలుసు. (రోమా. 14:4) మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో తనను సేవించాలని ఆయన కోరుతున్నాడు, అది సరైనదే. (మార్కు 12:30; గల. 6:4, 5) ఉత్సాహంగా ఇచ్చేవాళ్లను అంటే, సంతోషంగా తన సేవ చేసేవాళ్లను యెహోవా ప్రేమిస్తాడు. బలవంతంగా లేదా సణుగుకుంటూ చేసేవాళ్లను కాదు. (2 కొరిం. 9:7; కొలొ. 3:23, 24) పూర్తి కాల సేవచేసేవాళ్లు యెహోవా మీద, తమ ప్రాంతంలోని ప్రజల మీద ఉన్న ప్రేమతోనే అలా చేయాలి. (మత్త. 9:36-38; మార్కు 12:30, 31) మీకు అలాంటి ప్రేమ ఉంటే, పయినీరు సేవ గురించి లోతుగా ఆలోచించండి.
ప్రశ్న 7: “పెద్దలు ఎలా సహాయం చేస్తారు?”
22 పెద్దల సభ అంతా ముఖ్యంగా సంఘ సేవా కమిటీ, ఒక్కో పయినీరు పట్ల శ్రద్ధ చూపిస్తుంది. పయినీర్లకు ఏ విషయంలో సహాయం అవసరమో గుర్తించడానికి ఈ ప్రశ్నలు పెద్దలకు ఉపయోగపడతాయి: పరిచర్యకు సంబంధించిన అన్ని అంశాల్లో వాళ్లు నేర్పు సాధించారా లేక పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు చేయడానికి ఏమైనా తర్ఫీదు అవసరమా? ఆత్మ ఫలంలోని లక్షణాలు చూపిస్తూ కలిసికట్టుగా, సమాధానంగా పని చేస్తున్నారా? (రోమా. 14:19) తమకు చక్కగా సరిపోయే పట్టిక వేసుకోవడానికి వాళ్లలో ఎవరికైనా సహాయం అవసరమా? వాళ్లకు మంచి అధ్యయన అలవాట్లు ఉన్నట్లు కనిపిస్తుందా, కూటాల్లో పాల్గొంటున్నారా? పెద్దలు వీలైనంతగా పయినీర్లకు సహాయం చేయాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ల అవసరాలను, పరిస్థితులను కనిపెట్టుకుంటూ వీలైనంత తరచుగా వాళ్లతో మాట్లాడుతుంటారు.
23 పయినీర్లు పాటించాల్సిన ఉన్నత ప్రమాణాల విషయంలో పెద్దలు ఖచ్చితంగా ఉండాలి. అందులో ఒకటి, వాళ్లు పూర్తిచేయాల్సిన గంటలు. చిన్నచిన్న సమస్యల వల్ల ఒక పయినీరు గంటల్లో వెనకపడుతుంటే, శ్రద్ధగల పెద్దలు త్వరగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకానీ మెరుగవ్వకపోతే పయినీరు సేవ నుండి తొలగిస్తామని చెప్పరు. సమస్యలు తలెత్తాక చాలాకాలం చూసి ఆ తర్వాత సహాయం చేయడం సరికాదు. అలాచేస్తే, పయినీరు గంటల విషయంలో బాగా వెనకబడి, నిరుత్సాహంతో ఆ సేవ ఆపేయాలనుకోవచ్చు.
24 ఒక పయినీరుతో మాట్లాడిన తర్వాత, సమస్య ఎక్కువకాలం ఉండేది కాదని, సేవా సంవత్సరం ముగిసేలోపు ఆయన గంటలు పూర్తి చేయగలడని పెద్దలకు అనిపించవచ్చు. అలాంటప్పుడు వాళ్లు ఆయనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, ఉపయోగపడే కొన్ని సలహాలను ఇస్తే సరిపోతుంది. కానీ ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తి, సేవా సంవత్సరం కల్లా గంటలు పూర్తిచేయలేనంతగా వెనకబడితే అప్పుడేమిటి? ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని పయినీరు సేవలో కొనసాగనివ్వాలో లేదో పెద్దలు నిర్ణయించాలి. పయినీరు సేవలో కొనసాగనివ్వవచ్చని వాళ్లకు అనిపిస్తే, ఆ విషయం కాంగ్రిగేషన్ పబ్లిషర్ రికార్డ్ కార్డ్‌లో రాసి పెట్టవచ్చు. చేయలేకపోయిన గంటల గురించి బాధపడకుండా అప్పటినుండి చక్కగా గంటలు పూర్తిచేయడానికి కష్టపడమని పయినీరును ప్రోత్సహించవచ్చు. ఒకవేళ సమస్య ఇప్పట్లో తీరేది కాదని, పరిస్థితులను బట్టి ప్రస్తుతానికి ఆయన పయినీరు సేవ ఆపడమే మంచిదని పెద్దలకు అనిపిస్తే, వాళ్లు ఈ విషయాన్ని ఫారమ్‌లో నింపి బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి.
ప్రశ్న 8: “క్రమ పయినీరు అవ్వాలంటే నేనేమి చేయాలి?”
25 ఒకరు క్రమ పయినీరు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకొని కనీసం ఆరు నెలలు అయ్యుండాలి, ఆయన క్రమమైన ప్రచారకుడు అయ్యుండాలి. సంవత్సరానికి 840 గంటలు చేయగలగాలి. మంచి నైతిక విలువలున్న ఆదర్శవంతుడైన క్రైస్తవుడు అయ్యుండాలి. (od 113-14 పేజీలు) అంటే ఏమిటి? పయినీరు సేవకు దరఖాస్తు పెట్టుకునే వాళ్లలో ఎలాంటి లక్షణాలను పెద్దలు చూడాలి?
26 ఆదర్శవంతంగా ఉండడమంటే శరీరం, మనసు పవిత్రంగా ఉండాలి. పయినీరు సేవ చేయడానికి అర్హులైన వాళ్లకు, మంచి క్రైస్తవులుగా నడుచుకుంటున్నారని సంఘంలో-బయట మంచి పేరుండాలి. పూర్ణహృదయంతో, పూర్ణభక్తితో యెహోవా సేవ చేస్తుండాలి. దేవుని ఆత్మ ఫలంలోని లక్షణాలు చూపించాలి. పయినీర్ల శ్రద్ధంతా ప్రకటించి, శిష్యుల్ని చేసే పనిమీదే ఉండాలి. పరిచర్యలో బైబిల్ని చక్కగా ఉపయోగించగలగాలి; ఎవరైనా ఆసక్తి చూపిస్తే పునర్దర్శనాలు చేయగలగాలి; బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టి, వాటిని కొనసాగించగలగాలి. పరిచర్య కోసం, కూటాల కోసం పెద్దలు చేసే ఏర్పాట్లకు పయినీర్లు పూర్తిగా సహకరించాలి.
27 న్యాయపరమైన గద్దింపు పొందినవాళ్లు, బహిష్కారమై మళ్లీ సంఘంలోకి వచ్చినవాళ్లు ఒక సంవత్సరం తర్వాతే సహాయ పయినీరు సేవ గానీ, క్రమ పయినీరు సేవ గానీ చేసే వీలుంటుంది. న్యాయ నిర్ణయ కమిటీ ఏవైనా ఆంక్షలు పెట్టి ఉంటే, అవన్నీ తీసేసే వరకు అలాంటి సేవకు వాళ్లు అర్హులుకారు.
28 క్రమ పయినీరు అవ్వాలంటే ముందుగా కొన్ని నెలలు సహాయ పయినీరు సేవ చేయాలనే నియమం ఏదైనా ఉందా? లేదు. అయితే, ముందుగా సహాయ పయినీరు సేవ చేస్తే క్రమ పయినీరైన తర్వాత పట్టిక ప్రకారం సేవ చేయడం తేలిగ్గా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి ప్రతీనెల 70 గంటలు చేస్తూ సేవా సంవత్సరం ముగిసే సరికి 840 గంటలు చేయగలడని పెద్దలకు నమ్మకం కుదరాలి.
29 సంఘంలో ఎవరైనా క్రమ పయినీరు సేవకు దరఖాస్తు నింపి పెద్దల సభ సమన్వయకర్తకు ఇస్తే, సంఘ సేవా కమిటీ దాన్ని వెంటనే పరిశీలించాలి. సేవా కమిటీలో ఎవరో ఒకరు ఒకట్రెండు వారాలు ఊరు వెళ్లారని, ఆయన కోసం వేచి చూస్తూ ఆలస్యం చేయకూడదు. ఆయన స్థానంలో ఇంకో పెద్దను ఉపయోగించుకోవచ్చు. సంఘ సేవా కమిటీ దరఖాస్తును ఆమోదిస్తే, ఆ విషయం గురించి పెద్దల సభకు తెలియజేయాలి. అప్పుడు మిగతా పెద్దలు తాము గమనించిన విషయాలు కూడా చెప్తారు. తర్వాత, దరఖాస్తును బ్రాంచి కార్యాలయానికి పంపాలి.
30 క్రమ పయినీరు సేవకు దరఖాస్తు ఫారమ్‌లో, గత ఆరు నెలల్లో ఆ వ్యక్తి చేసిన సేవ వివరాలు పెద్దలు రాయాల్సి ఉంటుంది. ఆయన ప్రతీనెల దాదాపు 70 గంటలు చేయగలడని పెద్దలకు నమ్మకం కుదరాలి. ఆరు నెలల్లో ప్రచారకుడు చేసిన గంటలు చూసినంతమాత్రాన ముందుముందు ఆయన ఎంత సేవ చేయగలడో తెలీదు. ఒకట్రెండు నెలలు బాగా కష్టపడినందువల్ల సగటు గంటలు ఎక్కువగా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, పయినీరు సేవ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆరు నెలల్లో ఎలా సేవ చేశాడో పెద్దలు అంచనా వేయాలి. ఆయన సగటు గంటలు ఎక్కువగా ఉన్నా, పరిచర్యకు సంబంధించిన మిగతా అంశాల్లో వెనకబడి ఉండవచ్చు. అలాంటప్పుడు, ముందుగా వాటిలో మెరుగవ్వమని పెద్దలు సూచించవచ్చు. దరఖాస్తును పెద్దలు ఆమోదించకపోతే, దాన్ని బ్రాంచికి పంపడం లేదనే విషయం ఆయనకు చెప్పాలి. ఎందుకో కూడా వివరించాలి. అర్హుడవ్వడానికి ఏ విషయాల్లో మెరుగవ్వాలో కూడా పెద్దలు వివరంగా చెప్పాలి. కొంతకాలం తర్వాత, దరఖాస్తును ఆమోదించవచ్చని పెద్దలకు అనిపిస్తే, ఆయన ఎప్పటినుండి పయినీరు సేవ మొదలుపెట్టాలని అనుకుంటున్నాడో ఆ తేదీ మార్చి ముందు ఇచ్చిన దరఖాస్తునే బ్రాంచికి పంపించవచ్చు.
31 మీరు పయినీరు సేవ చేయగలరో లేదో తెలుసుకోవడానికి ఈ విషయాలు సహాయం చేస్తాయని అనుకుంటున్నాం. క్రమ పయినీరు సేవ చేయగలిగేలా మీ పరిస్థితులను సర్దుబాటు చేసుకోగలరా? వారానికి 17 గంటలు చేయగలిగేలా మీకు సరిపోయే పట్టిక వేసుకోగలరేమో చూడండి. యెహోవా మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచండి. ఆయన సహాయంతో మీరు తప్పకుండా పయినీరు సేవ చేయగలరు! “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను” అని ఆయన వాగ్దానం చేశాడు.—మలా. 3:10.
32 మరి, మీరు పయినీరు సేవ చేయగలరా? “చేయగలను” అని మీకనిపిస్తే, వీలైనంత త్వరగా మొదలుపెట్టేలా చూసుకోండి, ఎప్పటి నుండో రాసి పెట్టుకోండి. మీ జీవితం సంతోషంగా ఉండేలా యెహోవా తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండండి!