సేవచేయడానికి “గొప్ప ద్వారము తెరువబడియున్నది”
ఉత్సాహంగా సువార్త ప్రకటించిన పౌలు, అవసరం ఎక్కువ ఉన్న క్షేత్రాల కోసం ఆసక్తిగా వెదికాడు. అందులో ఒకటి ఎఫెసు పట్టణం. ఆయన అక్కడ ప్రకటించడంలో ఎంతో విజయం సాధించాడు. అందుకే, సేవచేయడానికి, “గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది” అని ఆయన తోటి క్రైస్తవులకు రాశాడు. (1 కొరిం. 16:9, అధస్సూచి) పౌలు ఆ క్షేత్రంలోనే సేవచేస్తూ ఎఫెసులోని చాలామంది విశ్వాసులు అయ్యేలా సహాయం చేశాడు. (అపొ. 19:1-20, 26) సేవచేయడానికి గొప్ప ద్వారము నేడు మనకు కూడా తెరిచే ఉంది. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ముఖ్యంగా కొత్త క్షేత్రాల్లో చాలామంది ఆసక్తి చూపించారు. కాబట్టి, అంతగా ప్రకటించని క్షేత్రాల్లో సువార్త వ్యాప్తి చేసేందుకు, అక్కడ ఉన్న ఆసక్తిపరులను మళ్లీ కలిసి సహాయం చేసేందుకు మనకు గొప్ప అవకాశం ఉంది.—2 కొరింథీయులు 8:13-15 పోల్చండి.
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో మీరు సేవచేయగలరా? వేరే ప్రాంతాల్లో సేవచేయడం గురించి మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించారా? కోతపనిలో పూర్తిగా భాగం వహించేలా ఈ మధ్యకాలంలో వేల సంఖ్యలో క్రైస్తవ కుటుంబాలు అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లాయి. అలా వెళ్లిన ఓ జంట ఇలా చెబుతుంది, “మేము మరింత ఫలవంతంగా ఎక్కడ యెహోవాను సేవించగలమో అక్కడికి వెళ్లాలనుకున్నాం.” మీకూ అలాంటి కోరిక ఉండి, ఎక్కడికైనా వెళ్లి సేవ చేయడానికి మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఆ విషయం గురించి మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. తర్వాత, ప్రాంతీయ పర్యవేక్షకునితో మాట్లాడి సలహా తీసుకోండి.
ఎక్కువ అవసరం ఎక్కడ ఉందో మీరు బ్రాంచిని అడిగి తెలుసుకోవాలనుకుంటే, మీ కోరికను తెలియజేస్తూ మీ సంఘ సేవా కమిటీకి ఓ ఉత్తరం రాయండి. వాళ్లు ఆ ఉత్తరంతోపాటు, తాము గమనించిన విషయాలను కూడా రాసి బ్రాంచి కార్యాలయానికి పంపిస్తారు. ఏదేమైనా, సేవ చేయడానికి “గొప్ప ద్వారము” తెరిచి ఉన్నంతకాలం మనం యెహోవా సేవలో ఉత్సాహంగా కొనసాగుతూ ఉందాం.—1 కొరిం. 15:58.