ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—మీకా
1. మీకా ఏమని ఆలోచించివుంటాడు? ఆయన చేసిన ప్రకటనా పని ఎందుకు వ్యర్థమైపోలేదు?
1 మీకా ప్రవక్త ఇశ్రాయేలు, యూదా రాజ్యాలకు యెహోవా తీర్పు సందేశాలను ప్రకటిస్తున్నప్పుడు, ‘అవినీతితో నిండిన ఈ వ్యవస్థ ఎప్పుడు అంతమౌతుందో ఏంటో?’ అని తప్పక ఆలోచించివుంటాడు. ఆయన చేసిన ప్రకటనాపని వ్యర్థమైపోలేదు. షోమ్రోను గురించి యెహోవా చెప్పిన మాటలు సా.శ.పూ. 740లో నెరవేరడాన్ని మీకా కళ్లారా చూశాడు. (మీకా 1:6, 7) ఆ తర్వాత, సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనమైంది. (మీకా 3:12) నేడు, యెహోవా తీర్పుల అమలుకోసం ఎదురుచూస్తున్న మనం మీకాను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
2. యెహోవా దినం కోసం ఎదురుచూస్తుండగా మనం ఎలా ఓపిక చూపించాలి? ఎందుకు చూపించాలి?
2 ఓపిక చూపించండి: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును” అని మీకా రాశాడు. (మీకా 7:7) మీకా ఖాళీగా కూర్చొని నాశనం కోసం ఎదురు చూడలేదు. యెహోవా ఇచ్చిన పనిలో మునిగిపోయాడు. యెహోవా దినం కోసం ఎదురుచూస్తుండగా మనం ‘పరిశుద్ధమైన ప్రవర్తనను, భక్తిని’ చూపించడంలో కొనసాగాలి. (2 పేతు. 3:11, 12) ప్రజలు మారుమనస్సు పొందేలా యెహోవా ఓపిక చూపిస్తున్నాడు. (2 పేతు. 3:9) అందుకే, ‘ప్రవక్తలను ఓపికకు మాదిరిగా పెట్టుకోండి’ అని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని మనం పాటిస్తాం.—యాకో. 5:10.
3. యెహోవా పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ఎందుకు వేడుకోవాలి?
3 బలం కోసం యెహోవా మీద ఆధారపడండి: బలం కోసం యెహోవా మీద ఆధారపడడం వల్ల ఎంతో కష్టమైన నియామకాన్ని కూడా మీకా నిర్వర్తించగలిగాడు. (మీకా 3:8) అందుకే, బలం కోసం యెహోవా మీద ఆధారపడమని దేవుని వాక్యం మనకు చెబుతుంది. అలసిన వాళ్లకు, తానిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన శక్తిని ఆయన ధారాళంగా ఇస్తాడు. (కీర్త. 84:5, 7; యెష. 40:28-31) యెహోవా అలా బలాన్ని ఇచ్చినట్లు మీకెప్పుడైనా అనిపించిందా? శక్తిమంతమైన పరిశుద్ధాత్మ సహాయం కోసం మీరు దేవుణ్ణి అడుగుతుంటారా?—లూకా 11:13.
4. మీకా జీవితం నేడు మనకు ఎందుకు చక్కని ఆదర్శంగా ఉంది?
4 మీకా జీవితంలో, యెహోవా చిత్తం చేయడం కన్నా ప్రాముఖ్యమైందేదీ లేదు. తన చుట్టూ ఉన్న లోకం అవినీతితో నిండిపోయినా ఆయన మాత్రం నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. విశ్వసనీయంగా ఉండడానికి మనం కూడా ప్రతీరోజు పోరాడాల్సి ఉంటుంది. అందుకే, “మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును” స్మరిస్తూ నడుచుకోవాలనే మన నిశ్చయాన్ని మరింత బలపర్చుకుందాం.—మీకా 4:5.