స్నేహపూర్వక సంభాషణలతో హృదయాన్ని చేరుకోవచ్చు
1 “మాటల ద్వారా ఒకరితో ఒకరు ఆలోచనలను పంచుకోవడమే” సంభాషణ అని చెప్పవచ్చు. ప్రజలకు పనికొచ్చే అంశం తీసుకొని స్నేహపూర్వకంగా సంభాషణ మొదలుపెడితే వాళ్లు ఆసక్తిగా వింటారు, దాంతో వాళ్ల హృదయాన్ని చేరుకునేలా రాజ్య సందేశాన్ని ప్రకటించవచ్చు. నేరుగా సువార్త ప్రకటించే కన్నా ముందుగా అలా స్నేహపూర్వకంగా, ప్రశాంతంగా సంభాషించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అనుభవాలు చూపిస్తున్నాయి.
2 స్నేహపూర్వక సంభాషణను ఎలా మొదలుపెట్టవచ్చు? ఇతరులతో సంభాషించడమంటే వాళ్లను ఆకట్టుకునే కొన్ని విషయాలనో, లేఖనాలనో వరసపెట్టి చెప్పడమని కాదుగానీ వాళ్లను కూడా మనతో మాట్లాడేలా చేయడం. ఉదాహరణకు, మనం పక్కింటివాళ్లతో సంభాషిస్తున్నప్పుడు మామూలుగా, సరదాగా మాట్లాడతాం. వాళ్లు అన్నదానికి ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చోకుండా సహజంగా ఏం అనిపిస్తే అదే చెప్తాం. వాళ్లు చెప్పేది వినడానికి మనం నిజంగా ఆసక్తి చూపిస్తే, మనతో మాట్లాడుతూ ఉండడానికి వాళ్లు ఇష్టపడతారు. ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు కూడా మనం అలాగే చేయాలి.
3 నేరం, యువత ఎదుర్కొనే ఇబ్బందులు, స్థానిక సమస్యలు, ప్రపంచ పరిస్థితులు, వాతావరణం వంటి ఏ అంశంతో అయినా స్నేహపూర్వక సంభాషణ మొదలుపెట్టవచ్చు. ప్రజల జీవితాలతో నేరుగా సంబంధం ఉన్న అంశాల గురించి మాట్లాడితే వాళ్లు ఆసక్తిగా వింటారు. ఒకసారి సంభాషణ మొదలైతే, మెల్లగా రాజ్య సందేశం గురించి మాట్లాడడం ఆరంభించవచ్చు.
4 మామూలుగా సంభాషించడం అంటే, ఎలాంటి సిద్ధపాటూ లేకుండా మాట్లాడడమని కాదు. మనం సిద్ధపడాలి. కానీ ఇలాగే మాట్లాడాలని రాసిపెట్టుకోవాల్సిన లేదా ఉపోద్ఘాతాన్ని బట్టీపట్టాల్సిన అవసరం లేదు. అలాచేస్తే, పరిస్థితులకు తగినట్లు సంభాషణను మార్చుకోవడం చాలా కష్టమైపోతుంది. (1 కొరింథీయులు 9:20-23 పోల్చండి.) సంభాషణ మొదలుపెట్టగలిగేలా ఒకట్రెండు లేఖనాంశాలను ఎంచుకోవడమే చక్కని సిద్ధపాటు.
5 స్నేహపూర్వక సంభాషణకు ఆవశ్యకమైన లక్షణాలు: మనం ఆప్యాయంగా, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. చిరునవ్వు నవ్వుతూ, ఆనందంగా కనిపిస్తే ఆ లక్షణాలు చూపించడం తేలికౌతుంది. మన దగ్గర అత్యంత శ్రేష్ఠమైన సందేశం ఉంది, సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లను అది ఎంతో ఆకట్టుకుంటుంది. ఒక మంచివార్త చెప్పాలనే యథార్థమైన కోరికతో మనం వచ్చామని వాళ్లకు అనిపిస్తే, మనం చెప్పేది వినడానికి వాళ్లు సుముఖత చూపించవచ్చు.—2 కొరిం. 2:17.
6 సంభాషణ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే, రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం దయను, నేర్పును చూపించాలి. (గల. 5:22; కొలొ. 4:6) ఇంటివాళ్లకు మన మీద మంచి అభిప్రాయం ఏర్పడేలా చేయండి. అలాచేస్తే, మొదటిసారి మనం మాట్లాడినప్పుడు వాళ్లు అంతగా ఆసక్తి చూపించకపోయినా, ఈసారి మరో సాక్షి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్లు చక్కగా స్పందించే అవకాశం ఉంది.
7 స్నేహపూర్వక సంభాషణ మొదలుపెట్టడానికి, కష్టమైన ఉపోద్ఘాతాన్ని అవపోసన పట్టాల్సిన అవసరం లేదు. ఇంటివాళ్లకు ఉపయోగపడే ఒక అంశం తీసుకొని దానిపట్ల వాళ్లలో ఆసక్తి కలిగిస్తే చాలు. మనం ముందుగా సిద్ధపడితే, ప్రజలతో స్నేహపూర్వక సంభాషణ మొదలుపెట్టడానికి సంకోచించం. అత్యంత శ్రేష్ఠమైన వార్తను అంటే, దేవుని రాజ్యం తీసుకొచ్చే శాశ్వత ఆశీర్వాదాల గురించిన వార్తను పంచుకొని, మనం కలిసే ప్రజల హృదయాలను చేరుకోవడానికి కృషిచేద్దాం.—2 పేతు. 3:13.