ఆసక్తి చూపించినవాళ్లను వెంటనే కలవండి
1 “ఈ రోజు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయకండి” అని ఒక ప్రసిద్ధ నానుడి చెబుతుంది. అంటే, ముఖ్యమైన పనుల్ని వెంటనే చేయాలని దానర్థం. మన పరిచర్యకు కూడా అది వర్తిస్తుందని కింది అనుభవం చూస్తే తెలుస్తుంది.
2 ఒక సహోదరి, గృహస్థునికి పుస్తకం అందించి, మళ్లీ వస్తానని చెప్పింది. గంట తర్వాత, అనుకోకుండా మరో సహోదరి అదే ఇంటికి వెళ్లింది. ఆయన చేతిలో పుస్తకం పట్టుకొని, గుమ్మం దగ్గరికి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు: “మీరు మళ్లీ వస్తానన్నారు కానీ ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు. అయినా ఫర్లేదు రండి, అధ్యయనానికి నేను రెడీ.” ప్రతీసారి అంత త్వరగా కలవడం వీలుకాకపోయినా, ఆసక్తి చూపించినవాళ్లను ఎక్కువ ఆలస్యం చేయకుండా కలవడం మంచిదని ఈ అనుభవం చూపిస్తుంది.
3 మరింత సహాయం అవసరం: ప్రజలు మన ప్రచురణల్లోని సమాచారాన్ని అర్థం చేసుకుని, అది వాళ్లకు ఇప్పుడూ భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుందని గుర్తించేలా సహాయం చేయాలంటే మనం వాళ్లను మళ్లీ కలవాలి. వీలైతే, కొన్నిరోజుల్లోనే అలా కలిసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు మనం ఏమి చేయవచ్చు? బహుశా, మనం మళ్లీ వస్తామని గృహస్థునికి చెప్పడం వల్ల అతనికి ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోగలుగుతాం.
4 మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి: ఈ రోజుల్లో, ఇతరుల్ని కలవడానికి ఒక సమయం పెట్టుకోవడమే చాలా కష్టమైపోతుంది. అదీకాక, అసలు మనం వస్తామన్న విషయమే ఇంటివాళ్లు మర్చిపోవచ్చు. అయినప్పటికీ మీరు చెప్పిన సమయాన్ని రాసిపెట్టుకొని, వీలైతే కొన్ని రోజుల్లోనే వాళ్లను మళ్లీ కలవండి. అలాచేస్తే, మీ బాధ్యతను మీరు నిర్వర్తించినట్లే. ఎందుకంటే, చెప్పిన సమయానికి వాళ్లను మళ్లీ కలవాల్సిన బాధ్యత మీకుంది. ఒకవేళ వాళ్లు ఇంట్లో లేకపోతే, వాళ్లను కలవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు అలా పట్టుదలగా ప్రయత్నించడం చూసినప్పుడు, వాళ్లు కూడా చెప్పిన సమయానికి ఇంటిదగ్గర ఉండేలా చూసుకుంటారు.
5 మొదటిసారి కలిసినప్పుడే ఇంటివాళ్లకు ఎంత ఆసక్తి ఉందో గ్రహించడం కష్టం, అందుకే వాళ్లు ఏ కాస్త ఆసక్తి చూపించినా వాళ్లను మళ్లీ కలవడానికి ప్రయత్నించండి. అలాంటివాళ్లను వీలైనంత త్వరగా కలవడం వల్ల చక్కని ఫలితాలు వస్తాయి. బహుశా, అప్పటికే మీరు వాళ్లలో ఆసక్తి కలిగించివుంటే, మళ్లీ వాళ్లను కలిసినప్పుడు వాళ్లు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆసక్తి చూపించినవాళ్లను వెంటనే కలవండి!