మీరు ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా?
1 పరలోక రాజ్యాన్ని యేసు వెలకట్టలేని ధనసంపదతో పోల్చాడు. (మత్త. 13:44-46) రాజ్యసువార్తను వ్యాప్తిచేసే పని కూడా అంతే విలువైనది. ఆ పనిలో పూర్తిగా పాల్గొనేందుకు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా మన జీవితాల్లో దానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. (మత్త. 6:19-21) మీరు రాజ్య సేవ ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటున్నారా?
2 ముఖ్యమైన విషయాలు: మనం ఎక్కువగా పరిచర్య చేయాలంటే కొన్ని విషయాలు గమనించాలి: (1) రాజ్యసంబంధ విషయాలకు మన జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వాలని తీర్మానించుకోవాలి. (మత్త. 6:33) (2) యెహోవా మీద విశ్వాసముంచి, ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. (2 కొరిం. 4:1-7) (3) యథార్థంగా, పట్టుదలగా ప్రార్థిస్తూ దేవుని సహాయం అడగాలి. (లూకా 11:8-10) (4) మన ప్రార్థనలకు అనుగుణంగా ప్రవర్తించాలి.—యాకో. 2:14-17.
3 ఎక్కువ పరిచర్య చేయడానికి మార్గాలు: ప్రతీ నెల పరిచర్యలో కొంత సమయం గడపాలనే ప్రాథమిక లక్ష్యాన్ని మనలో ప్రతీ ఒక్కరం పెట్టుకోవచ్చు. అయితే, అవకాశం దొరికినప్పుడల్లా సాక్ష్యమివ్వడం, పరిచర్యలోనూ పునర్దర్శనాల్లోనూ చక్కగా మాట్లాడడం, బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించేలా అధ్యయనాలు నిర్వహించడం వంటివాటి గురించి కూడా మీరు ఆలోచించారా? మీరు సహాయ పయినీరు సేవ, క్రమ పయినీరు సేవ చేయగలరా? లేదా అవసరం ఎక్కువ ఉన్న చోటికి వెళ్లి సేవచేయగలరా? మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరుడైతే, పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవ చేసేలా ప్రగతి సాధించగలరా? (1 తిమో. 3:1, 10) మీరు బెతెల్ సేవకు, ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు లేదా క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ పరిచర్య చేయగలరా?—లూకా 10:2.
4 పూర్తికాల ఉద్యోగం చేస్తూ ఎక్కువ సమయం క్రీడల్లో గడిపే ఒక సహోదరుణ్ణి క్రమ పయినీరు సేవ చేయమని ప్రోత్సహించినప్పుడు ఆయన సహాయ పయినీరు సేవ మొదలుపెట్టాడు. తర్వాత తన పరిస్థితులను సర్దుబాటు చేసుకొని పూర్తికాల సేవలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన పరిచర్య శిక్షణా పాఠశాలకు (ఇప్పుడు దాని పేరు, ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల) హాజరయ్యాడు. దానివల్ల ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేయగలుగుతున్నాడు. అప్పట్లో తనకు ఇచ్చిన ప్రోత్సాహానికి తాను సానుకూలంగా స్పందించినందుకు ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. రాజ్య సేవ ఎక్కువ చేయాలనే నిర్ణయం తీసుకున్నందువల్ల ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నానని ఆయన పూర్తి నమ్మకంతో చెబుతున్నాడు.
5 తన సేవ చేయడానికి ముందుకొచ్చే వాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు. (యెష. 6:8) మీరు ఎక్కువగా పరిచర్య చేస్తూ మరింత సంతృప్తిని, ఉత్తేజాన్ని పొందండి. ఈ విషయంలో దేన్నీ మీకు అడ్డురానివ్వకండి.