బహిరంగ సాక్ష్యం ఇచ్చేందుకు ఒక కొత్త ఏర్పాటు
1. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ విషయంలో చక్కని ఆదర్శం ఉంచారు?
1 మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇంటింటి పరిచర్య మాత్రమే చేయలేదు. వాళ్లు బహిరంగంగా కూడా సాక్ష్యమిచ్చారు. (అపొ. 20:20, 21) ఉదాహరణకు, ఎక్కువమంది సమకూడే దేవాలయంలో వాళ్లు బోధించేవాళ్లు. (అపొ. 5:42) అపొస్తలుడైన పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు ప్రతీరోజు సంతవీధికి వెళ్లి అక్కడి ప్రజలకు ప్రకటించేవాడు. (అపొ. 17:17) మనం సువార్తను వ్యాప్తిచేసే ప్రధానమైన మార్గం ఇప్పటికీ ఇంటింటి పరిచర్యే. అయినప్పటికీ, పార్కింగ్ ప్రదేశాల్లో, వ్యాపార సముదాయాల్లో, పార్కుల్లో, రద్దీగా ఉండే రోడ్లమీద ఇంకా ఇతర ప్రదేశాల్లో కూడా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటిస్తాం. వీలైనప్పుడల్లా బహిరంగంగా సాక్ష్యమిచ్చే పనిలో పాల్గొనాలని ప్రతీ ప్రచారకుణ్ణి ప్రోత్సహిస్తున్నాం, అయితే బహిరంగంగా సాక్ష్యమిచ్చేందుకు చేసిన ఉత్తేజకరమైన ఓ కొత్త ఏర్పాటులో పాల్గొనే అవకాశం చాలామందికి ఉంటుంది.
2. బహిరంగంగా సాక్ష్యమిచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
2 ఈ ఆర్టికల్‌లో, బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమిచ్చే కొన్ని పద్ధతులను చూడబోతున్నాం. అయితే జాగ్రత్తగా ఉండే విషయంలో ఇంతకుముందు మన రాజ్య పరిచర్యలో వచ్చిన నిర్దేశాలను ఇప్పుడు పాటించొద్దని కాదు. ఆ సలహాలు, నిర్దేశాలు ఇప్పటికీ ఆచరించాల్సినవే. క్షేత్రంలో ఎలాంటి గొడవలకూ తావివ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలసభ తమ క్షేత్రంలోని సున్నితమైన పరిస్థితులను మనసులో పెట్టుకుని, అలాంటి బహిరంగ సాక్ష్యపు విధానాలవల్ల తమ ప్రాంతంలోని పరిచర్యకు ఏమైనా ఆటంకం కలుగుతుందేమో ఆలోచించాలి. (మరింత సమాచారం కోసం పెద్దలు, నవంబరు 24, 2012 అలాగే ఫిబ్రవరి 13, 2014 తేదీలతో ఉన్న ఉత్తరాలు చూడవచ్చు.) క్షేత్రంలో ప్రతిస్పందన ఎలావున్నా, ఇంటింటి పరిచర్య, వీధిసాక్ష్యం చేసేటప్పుడు ప్రతీ ప్రచారకుడు, యెహోవాసాక్షులు—పొరుగువారికి సువార్తను తెలియజేసే విషయంలో మనకున్న హక్కులు, బాధ్యతలు అనే T-85 బ్రోషురును తన దగ్గర పెట్టుకున్నట్లే బహిరంగ సాక్ష్యమిచ్చే సమయంలో కూడా దగ్గర పెట్టుకోవాలి.
3. ఏ కొత్త ఏర్పాటును 2011 నవంబరులో పరీక్షించి చూశారు?
3 మన 2013 వార్షిక పుస్తకము (ఇంగ్లీషు) 16, 17 పేజీల్లో నివేదించినట్లుగా, 2011 నవంబరులో న్యూయార్క్ నగరంలో బహిరంగ సాక్ష్యం ఇచ్చే ఓ కొత్త ఏర్పాటును పరీక్షించి చూశారు. టేబుళ్ల మీద, చిన్న కార్ట్ మీద ఆకర్షణీయమైన చిత్రాలు, వేర్వేరు భాషల్లో ప్రచురణలు ఉంచి, ఆ నగరంలో ఎక్కువమంది నడుచుకుంటూ వెళ్లే కొన్ని ముఖ్యమైన రోడ్ల పక్కన ఉంచారు. ప్రతీరోజు వేల సంఖ్యలో పాదచారులు, సాక్షులు వెళ్లలేని అపార్టుమెంటుల్లో నివసించేవాళ్లు, ఇళ్లలో ఎక్కువగా ఉండనివాళ్లు వాటిని చూస్తూ వెళ్లేవాళ్లు. ఆ ప్రయత్నానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. కేవలం ఒక్క నెలలోనే 3,797 పత్రికలనూ 7,986 పుస్తకాలనూ ప్రజలకు అందించారు. చాలామంది బైబిలు అధ్యయనం కోసం అడిగారు. బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి, ఆసక్తి చూపించినవాళ్ల చిరునామాలను వెంటనే వాళ్లకు దగ్గర్లోని సంఘాలకు పంపించి, వాళ్లను మళ్లీ కలిసే ఏర్పాట్లు చేశారు.
4. ఈ ఏర్పాటు ఎలా విస్తరిస్తోంది? ఓ జంట ఎలా ప్రయోజనం పొందింది?
4 ఆ ఏర్పాటు చక్కని ఫలితాలు సాధించడంతో, బహిరంగ సాక్ష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభాగల ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఒక జంట ఇలా రాసింది, “టేబుల్ వద్ద నిలబడి, నడుచుకుంటూ వెళ్లే వేలమందిని చూస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలిసేందుకు జరుగుతున్న గొప్పపని మా హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ఈ జన సమూహాలను చూస్తూ, వాళ్లలో ప్రతీ ఒక్కరి మీద యెహోవా నిజంగా ఎలా శ్రద్ధ తీసుకుంటున్నాడో ఆలోచిస్తుంటే, మా జీవితాల్లో ప్రకటనాపనికి ప్రముఖస్థానం ఇస్తూనే ఉండాలన్న మా నిశ్చయత మరింత బలపడింది. టేబుల్‌ను చూసుకుంటూ వెళ్లే వాళ్లందరి హృదయాలను యెహోవా పరిశీలిస్తూ, యోగ్యులను వెదుకుతున్నట్లుగా మేము ఊహించుకుంటాం. ఈ పనిలో దేవదూతలు కూడా మాతో సన్నిహితంగా పనిచేస్తున్నట్లు మేము భావిస్తాం.”
5. (ఎ) బహిరంగంగా సాక్ష్యమిచ్చేందుకు చాలా సంఘాలు ఏ ఏర్పాటును చేసుకుంటున్నాయి? (బి) బహిరంగ సాక్ష్యంలో పాల్గొనే సంఘాలు ఎలా సహకరించుకోవచ్చు?
5 స్థానికంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సాక్ష్యం: ఈ కొత్త ఏర్పాటును చాలా సంఘాల పెద్దల సభలు తమ స్థానిక క్షేత్రాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏర్పాటులో ప్రచారకులు, తమ సంఘ క్షేత్ర పరిధిలోనే బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో టేబుల్ మీదగానీ కార్ట్ మీదగానీ సాహిత్యం ఉంచుతారు.—“మంచి సహకారం అవసరం” బాక్సు చూడండి.
6. తమ ప్రాంతంలో సాధ్యమైతే, పెద్దలు స్థానికంగా బహిరంగ సాక్ష్యాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చు?
6 తమ సంఘానికి సంబంధించిన క్షేత్రంలో, ప్రజలు ఎక్కువగా నడిచే ప్రాంతాలు ఉన్నాయో లేవో, అలాగే బహిరంగ సాక్ష్యం ఏర్పాటు చేయడం ఎంతవరకు సాధ్యమో పెద్దలు పరిశీలిస్తారు. రవాణా కేంద్రాలు, కూడళ్లు, పార్కులు, రద్దీగా ఉండే వీధులు, షాపింగ్ మాల్స్, కాలేజి ప్రాంగణాలు, విమానాశ్రయాలు, వార్షిక ఉత్సవాలు జరిగే ప్రదేశాల వంటివి బహిరంగ సాక్ష్యానికి అనువుగా ఉంటాయి. అయితే ప్రతీవారం ఫలానా రోజుల్లో ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో టేబుల్ లేదా సాహిత్యపు కార్ట్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఒకే పెద్ద షాపుముందు టేబుల్ లేదా కార్ట్ పెట్టడం వల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడికి ప్రజలు తమకు కావాల్సిన వస్తువు కొనుక్కుని వెళ్లిపోవాలనే ఆలోచనతోనే వస్తారు. బదులుగా షాపింగ్‌మాల్స్‌లో టేబుల్ పెట్టడంవల్ల ప్రయోజనం ఉన్నట్లు చాలామంది తెలుసుకున్నారు. రద్దీగా ఉండే పుట్‌పాత్‌ల వంటివికూడా సాహిత్యపు టేబుల్ లేదా కార్ట్ పెట్టడానికి అనువుగా ఉంటాయి. సంఘ పెద్దలు మన వెబ్సైట్ నుండి కావలికోట, తేజరిల్లు! (ఇంగ్లీషు), బైబిలు బోధిస్తోంది ప్రచురణలకు సంబంధించిన పోస్టర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ప్రత్యేకంగా బహిరంగ సాక్ష్యంలో ఉపయోగించేందుకే తయారుచేశాం. స్థానిక ప్రజల మనోభావాలను గాయపర్చేవి కాకుండా వాళ్లకు నచ్చే పోస్టర్లను ఎంపికచేసుకోండి. ఇందులో పాల్గొనేవాళ్లు సంఘ సేవా పర్యవేక్షకుని నిర్దేశాన్ని తప్పకుండా పాటించాలి. ప్రచారకులు తమ క్షేత్రంలో ఉండని ఆసక్తిపరుల చిరునామాలను వెంటనే, ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌లో నింపి తమ సంఘ కార్యదర్శికి ఇవ్వాలి.
7. బహిరంగ సాక్ష్యమిచ్చే పని ఎలా జరుగుతుంది?
7 ఎలా సాక్ష్యం ఇస్తారంటే . . . ప్రచారకులు సాధారణంగా తమ టేబుల్ లేదా కార్ట్ వద్దే ఉంటారు. ఎవరైనా వాళ్ల దగ్గరకు వస్తే, నచ్చిన సాహిత్యాన్ని తీసుకోమని చెబుతారు. వాళ్లకేమైనా ప్రశ్నలు ఉంటే, పయినీర్లు లేఖనాలు ఉపయోగించి సంతోషంగా జవాబిస్తారు. ఎవరైనా సాహిత్యం తీసుకుంటే, వాళ్ల దగ్గర విరాళాల గురించి ప్రస్తావించరు. అయితే మన పనికి డబ్బులెలా వస్తాయని వాకబు చేస్తేమాత్రం, విరాళాలను సాహిత్యం మీదున్న చిరునామాకు పంపించవచ్చని పయినీర్లు వివరించవచ్చు. వీలైతే వాళ్లు ఇలా అడుగుతారు, “ఎవరైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారా?” లేదా “ఆ ప్రచురణ ఆధారంగా లేఖనాలను చర్చించడానికి మీరు ఇష్టపడతారా?”
8. బహిరంగ సాక్ష్యమిచ్చే ఈ కొత్త ఏర్పాటు ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి?
8 ఈ పద్ధతిలో బహిరంగ సాక్ష్యం ఇవ్వడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇండియాలోని ఒక సంఘం ఈ పద్ధతి పాటించి ఒక్క గంటలోనే 1,000 పత్రికలు అందించి, 200 మంది ఆసక్తిపరుల అడ్రస్‌లు తీసుకుంది. బెంగుళూరులోని ఓ మాల్ దగ్గర పెట్టిన సాహిత్యపు టేబుల్ దగ్గరకు వచ్చిన ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆ పనిని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. కుటుంబ సంతోషం, యువత ఇలా అడుగుతోంది (ఇంగ్లీషు) పుస్తకాలు కూడా తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో, యెహోవాసాక్షులను కలుసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆసక్తిగల ఓ వ్యక్తి బహిరంగ సాక్ష్యం ద్వారా వాళ్లను కలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తూ, కూటాలకు హాజరౌతున్నాడు.
9. బహిరంగ సాక్ష్యం కోసం మీ సంఘం ఏర్పాట్లు చేయకపోయినా, బహిరంగ సాక్ష్యం ఇచ్చేందుకు ఏయే అవకాశాలు ఉన్నాయి?
9 మీ వ్యక్తిగత పరిచర్యలో బహిరంగ సాక్ష్యం: కొన్ని సంఘాల విషయానికొస్తే, వాళ్ల క్షేత్రంలో నడుచుకుంటూ వెళ్లేవాళ్ల సంఖ్య తక్కువగా ఉండవచ్చు, దాంతో సాహిత్యపు టేబుల్ లేదా కార్ట్ పెట్టి బహిరంగ సాక్ష్యం ఇచ్చేందుకు తగిన ప్రదేశాలు ఉండకపోవచ్చు. అయితే అలాంటి సంఘాల్లోని ప్రచారకులు కూడా తమ వ్యక్తిగత పరిచర్యలో బహిరంగ సాక్ష్యమిచ్చే విషయాన్ని పరిశీలించమని ప్రోత్సహిస్తున్నాం. మీ క్షేత్రంలో ఎక్కువగా దుకాణాలు ఉండే ప్రాంతాలు, ప్రజలతో బిజీగా ఉండే షాపులు ఉన్నాయా? ప్రజలు ఎక్కువగా వచ్చే పార్కు ఏదైనా ఉందా? మీ ప్రాంతంలో ప్రజలు పెద్దయెత్తున సమకూడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాగైతే, మీరు కూడా మీ పెద్దలతో మాట్లాడి తగినంత జాగ్రత్త తీసుకుంటూ బహిరంగ సాక్ష్యం ఇవ్వవచ్చు.
10. ప్రజలు ఎక్కడవుంటే అక్కడ ప్రకటించడానికి మనం ఎందుకు ప్రయత్నించాలి?
10 “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:4) కాబట్టి అంతం వచ్చే లోపే సాధ్యమైనంత ఎక్కువమందికి రాజ్య సందేశాన్ని ప్రకటించాలనేదే మన ప్రయత్నం. (మత్త. 24:14) చాలా ప్రాంతాల్లో ప్రజలను వాళ్ల ఇళ్లవద్ద కలుసుకోవడం కష్టమౌతోంది. అయినా, బహిరంగ సాక్ష్యంలో అలాంటివాళ్లను కలుసుకుని మాట్లాడవచ్చు. కొంతమందికి సువార్త వినే అవకాశం బహిరంగ సాక్ష్యం ద్వారా మాత్రమే దొరకవచ్చు. కాబట్టి ప్రజలు ఎక్కడవుంటే అక్కడ ప్రకటించడం ద్వారా మనం మన పరిచర్యను సంపూర్ణంగా చేద్దాం.—2 తిమో. 4:5.
[3వ పేజీలోని బాక్సు]
మంచి సహకారం అవసరం
దగ్గరదగ్గర సంఘాల ప్రచారకులు కొన్నిసార్లు ఒకే వీధిలో, ఒకే పార్కింగ్ ప్రాంతంలో, ఒకే వ్యాపారక్షేత్రంలో లేదా రవాణా కేంద్రంలో బహిరంగ సాక్ష్యం ఇస్తున్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. దానివల్ల, ప్రచారకులు ఒకే సమయంలో ప్రకటించనప్పటికీ వ్యాపారస్థులు, పొరుగువాళ్లు అసహనానికి గురయ్యారు. కాబట్టి బహిరంగ సాక్ష్యం ఇచ్చేటప్పుడు సంఘ నియమిత క్షేత్రంలోనే సేవ చేయడం మంచిది.
ప్రచారకులు ఒకవేళ వేరే సంఘ క్షేత్రంలో సాక్ష్యం ఇవ్వాలనుకుంటే, వాళ్లు తమ సేవా పర్యవేక్షకునితో మాట్లాడాలి. ఆయన ఆ సంఘ సేవా పర్యవేక్షకుణ్ణి సంప్రదించి ముందుగానే ఆయన అనుమతి తీసుకోవాలి. ఒకే క్షేత్రంలో వేర్వేరు భాషల సంఘాలు ప్రకటిస్తుంటే, ఆ సంఘాల సేవా పర్యవేక్షకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, అలా చేస్తే క్షేత్రంలోని ప్రజలకు అనవసరంగా చిరాకు తెప్పించకుండా ఏర్పాట్లు చేయవచ్చు. వేర్వేరు గుంపులకు చెందిన ప్రచారకులు వేర్వేరు క్షేత్రాల్లో పని చేసేలా, లేదా ఒకే క్షేత్రంలోనైతే వేర్వేరు సమయాల్లో పని చేసేలా వాళ్లు చూసుకోవాలి. చక్కగా సహకరించుకోవడం వల్ల “సమస్తమును మర్యాదగాను క్రమముగాను” జరిగేలా చూడవచ్చు.—1 కొరిం. 14:39, 40.