పరిస్థితికి తగినట్లు మారడానికి సిద్ధంగా ఉన్నారా?
1. లోకం ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి మనం ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలి?
1 మొదటి కొరింథీయులు 7:31, లోకాన్ని ఎప్పటికప్పుడు మారిపోయే నాటకరంగంతో పోలుస్తోంది. లోకం మారుతోంది కాబట్టి మనం కూడా ప్రకటించే వేళల్లో, పద్ధతుల్లో, మాట్లాడే విధానాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉండాలి. మరి, పరిస్థితులకు తగినట్లు మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
2. యెహోవా సంస్థతో పాటు మనం ఎప్పటికప్పుడు ఎందుకు మార్పులు చేసుకోవాలి?
2 ప్రకటించే పద్ధతులు: క్రైస్తవ సంఘం మొదటి నుండి పరిస్థితులకు తగినట్లు మారుతూనే ఉంది. మొదట్లో, యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపినప్పుడు, భోజనం-డబ్బులు లాంటివి తీసుకెళ్లొద్దని చెప్పాడు. (మత్త. 10:9, 10) అయితే, ముందుముందు తన శిష్యులు వ్యతిరేకత ఎదుర్కొంటారని, సువార్త ప్రకటనా పని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందని మనసులో ఉంచుకొని యేసు ఆ సూచనల్లో తర్వాత కొన్ని మార్పులు చేశాడు. (లూకా 22:36) గడిచిన శతాబ్దంలో యెహోవా సంస్థ, ఆయా పరిస్థితుల్లోని అవసరాలను బట్టి చాలా రకాలైన ప్రకటనా పద్ధతుల్ని ఉపయోగించింది. ఉదాహరణకు, సాక్ష్యపు కార్డులు, రేడియో ప్రసారాలు, సౌండు-కార్లు ఉపయోగించడం వాటిలో కొన్ని. అలాగే ఈ రోజుల్లో, ప్రజలు ఎక్కువగా ఇళ్ల దగ్గర ఉండడం లేదు కాబట్టి ఇంటింటి పరిచర్యతో పాటు బహిరంగ ప్రదేశాల్లోను, అనియతంగాను సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నించమని సంస్థ మరీమరీ చెబుతోంది. ప్రజలు పగలంతా ఉద్యోగాల్లో ఉండిపోతారు కాబట్టి, సాయంత్రాలు ఇంటింటి పరిచర్య చేయమని కూడా ప్రోత్సహిస్తోంది. యెహోవా పరలోకరథంతో పాటు కలిసి సాగడానికి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్నారా?—యెహె. 1:20, 21.
3. పరిచర్యలో పరిస్థితులకు తగినట్లు మారడం వల్ల మరింత బాగా ఎలా మాట్లాడవచ్చు?
3 మాట్లాడే విధానం: మీ ప్రాంతంలోని ప్రజలు ప్రస్తుతం దేని గురించి ఎక్కువగా ఆందోళన పడుతున్నారు? ఆర్థిక వ్యవస్థ? కుటుంబం? యుద్ధం? మన ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి, పరిస్థితుల గురించి అవగాహన ఉంటే పరిచర్యలో చక్కగా మాట్లాడడానికి సిద్ధపడవచ్చు. (1 కొరిం. 9:20-23) ఇంటివాళ్లు దేని గురించైనా మాట్లాడితే మాటవరసకు అవుననో కాదనో చెప్పేసి, మనం ముందుగా అనుకున్నది మాట్లాడుకుంటూ వెళ్లకుండా, వాళ్లు చింతపడుతున్న విషయాల గురించి మాట్లాడడం చాలా మంచిది.
4. మనం వెంటనే పరిస్థితులకు తగ్గట్లు ఎందుకు మారాలి?
4 త్వరలోనే ఈ లోకం “నటన” ముగిసిపోయి, మహాశ్రమలు మొదలౌతాయి. “కాలము సంకుచితమై యున్నది.” (1 కొరిం. 7:29) కాబట్టి, మిగిలిన ఈ సమయంలో వీలైనంత ఎక్కువ సేవ చేయాలంటే, పరిస్థితులకు తగినట్లు మారడం మన తక్షణ కర్తవ్యం!