పరిచర్య చేసేలా మనల్ని ఏది కదిలిస్తుంది?
1. ప్రేమకు, మన పరిచర్యకు సంబంధం ఏమిటి?
1 ఈ రోజుల్లో, దేవుని రాజ్యసువార్త ప్రకటించడంకన్నా ప్రయోజనకరమైన పని ఇంకేదీ లేదు. ఈ ఒక్క పనిచేస్తే రెండు అతి ముఖ్యమైన ఆజ్ఞలకు లోబడినవాళ్లమవుతాం. యెహోవాను ప్రేమించాలి, మన పొరుగువాళ్లను ప్రేమించాలి అనేవే ఆ రెండు ఆజ్ఞలు. (మార్కు 12:29-31) ప్రేమ ఉంటే మనం పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటాం.—1 యోహా. 5:3.
2. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని పరిచర్య ద్వారా ఎలా చూపిస్తాం?
2 యెహోవా మీద ప్రేమ: మన ఆప్తమిత్రుడైన యెహోవా మీద మనకున్న ప్రేమ, మనం ఆయన తరఫున మాట్లాడేలా చేస్తుంది. దాదాపు 6,000 సంవత్సరాలుగా సాతాను ఆయన మీద అభాండాలు వేస్తూనే ఉన్నాడు. (2 కొరిం. 4:3, 4) అందుకే, దేవుడు ఎవరికీ అర్థంకాని త్రిత్వమని, పాపుల్ని నరకాగ్నిలో యాతన పెడతాడని, మనుషుల్ని పట్టించుకోడని ప్రజలు నమ్ముతున్నారు. చాలామందైతే, దేవుడు లేడనే నిర్ధారణకు వచ్చేసారు. ప్రజలు మన పరలోక తండ్రి గురించిన సత్యం తెలుసుకోవాలని మనమెంతగా కోరుకుంటున్నామో కదా! దేవుని గురించి సాక్ష్యమిచ్చే పనిలో మనం శ్రద్ధగా కృషి చేసినప్పుడు యెహోవా ఎంతో సంతోషిస్తాడు, కానీ సాతానుకు మాత్రం ఒళ్లుమండిపోతుంది.—సామె. 27:11; హెబ్రీ. 13:15, 16.
3. పొరుగువాళ్లను ప్రేమిస్తున్నామని మనం పరిచర్య ద్వారా ఎలా చూపిస్తాం?
3 పొరుగువాళ్ల మీద ప్రేమ: మనం సాక్ష్యమివ్వడం ద్వారా పొరుగువాళ్ల మీద ప్రేమను చూపిస్తాం. ఈ అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్న ప్రజలందరికీ సువార్త వినాల్సిన అవసరం చాలా ఉంది. నేడు చాలామంది, యోనా కాలంలోని “కుడియెడమలు ఎరుగని” నీనెవె ప్రజల్లా ఉన్నారు. (యోనా 4:11) సంతోషంగా, సంతృప్తిగా జీవించడం ఎలాగో ప్రజలు మన పరిచర్య వల్ల తెలుసుకుంటారు. (యెష. 48:17-19) అది వాళ్లకు భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేస్తుంది. (రోమా. 15:4) వాళ్లు విని, నేర్చుకొన్న దాని ప్రకారం జీవిస్తే ‘రక్షింపబడతారు.’—రోమా. 10:13, 14.
4. యెహోవా దేన్ని ఎప్పటికీ మర్చిపోడు?
4 మంచి పిల్లలు తమ తల్లిదండ్రులతో అప్పడప్పుడు మాత్రమే కాదుగానీ ఎల్లప్పుడూ ప్రేమగా ఉంటారు. అలాగే, దేవుని మీద, పొరుగువాళ్ల మీద మనకున్న ప్రగాఢమైన ప్రేమ వల్ల, పరిచర్య చేస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ అన్ని సమయాల్లో సాక్ష్యమివ్వడానికి మనం అవకాశాల కోసం వెదుకుతాం. మనం మానకుండా ప్రకటిస్తాం. (అపొ. 5:42) అలాంటి ప్రేమను యెహోవా ఎప్పటికీ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.